దేవుడు ఏమీ చెయ్యలేకపోవటం ఏంటి?

“సమస్త సృష్టీ, సృష్టిరాసులూ సృష్టించబడిన తరువాతే సైంటిస్టులూ, సైన్సూ పుట్టటం జరిగింది, తప్పితే సైంటిస్టులు ముందు పుట్టి ఆ తరువాత సృష్టి ఉనికిలోకి రాలేదు! ఇది సైంటిస్టులే ఒప్పుకునే విషయం, సైన్సూ, సైంటిస్టులే సర్వస్వం అనుకునేవారికి తెలీని పచ్చి నిజం”

సంవత్సరంలో పెద్ద పండక్కి వ్యాపారస్తులకు సీజన్ వచ్చినట్టు కలరానో, కరోనానో, సునామీ వచ్చినప్పుడో, సముద్రం ఉప్పొంగినప్పుడో కొందరు విమర్శకులకు, హేతువాదులకు మతపరమైన విమర్శలు చేయటానికి మంచి సీజన్ లాంటిది.

అదేంటి కరోనా ఓ ప్రక్క హిందూ, ముస్లిములని చూడకుండా అందర్నీ రేవెట్టేస్తుంటే నిజంగా దేవుడు అనేవాడే ఉంటే మరి దేవుడు ఏమీ చెయ్యలేకపోవటం ఏంటి? దేవుడే ఉంటే కరోనా కంట్రోల్ చేసేయ్యగలడు కదా! మీరేమో గుళ్లూ, గోపురాలు, చర్చీలు మూసుకుని కూర్చున్నారు మా సైంటిస్టులేమో కష్టపడుతున్నారు. కాబట్టి దేవుడి కంటే సైంటిస్టులనూ, సైన్సును నమ్ముకుంటేనే గండం నుండి గట్టెక్కగలం!” ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు చాలామంది అభినవ హేతువాదుల వాదన.

అలాంటప్పుడు విపత్కర పరిస్థితుల్లో సైన్స్ చెయ్యగలుగుతుంది ఏమిటి?

అకస్మాత్తుగా భూకంపాలు వచ్చిపడి కొన్ని సెకన్ల వ్యవధిలోనే వేల మంది చనిపోతున్నప్పుడు, అకస్మాత్తుగా సునామీలాంటి విపత్తులు వచ్చిపడి కొన్ని నిముషాల వ్యవధిలో లక్షల మంది చనిపోతున్నప్పుడు, అకస్మాత్తుగా ఏ సముద్రమో, నదులో ఉప్పొంగి కొన్ని గంటల వ్యవధిలో ఉళ్లకు ఊళ్లే కొట్టుకుపోతున్నప్పుడు, అకస్మాత్తుగా వచ్చిపడే తుఫాన్లకో, హరికేన్లకో వేల మంది గల్లంతైపోతున్నప్పుడు మరి సైంటిస్టులు ప్రకృతిని తమ కంట్రోల్లో తెచ్చుకుని’ తమ సైన్స్ ద్వారా పోతున్న లక్షల మంది ప్రాణాలను ఎందుకు కాపాడలేకపోతున్నారు?

కాబట్టి సైన్సూ, సైంటిస్టులు వేస్టని అనుకోవచ్చా?

తన గ్రహణ పరిధిలో వచ్చిన దానిని, ప్రకృతిలో ఉన్న దానిని, దొరికిన వనరుతో క్రొత్త ప్రయోగాలు చేసి నూతన ఆవిష్కరణలు చెయ్యటాన్నే సైన్స్ అంటారు! తప్పితే అసలు ఉనికిలోని లేని క్రొత్త పదార్థాన్ని సృష్టించి, నూతన ఆవిష్కరణ చెయ్యటం స్వయంగా సైంటిస్టుల చేతిలో కూడా లేని విషయం. కాబట్టి భౌతిక ప్రపంచంలో సైన్స్ తాలూకు ఆవిష్కరణల ఉపయోగం నిత్యజీవితంలో మెరుగైన మానవ ప్రశాంత మనుగడ సాగించటం వరకూ అత్యంత ఆవశ్యకం కూడా.

కానీ, అసలు సృష్టికర్త అయిన దేవుడు ఎవరో పరిశీలించి తెలుసుకోకుండా ప్రజల ద్వారా దేవుళ్లుగా భావించబడుతూ పూజించబడుతున్న మిధ్యా దైవాలనే దైవత్వం కలిగిన వారన్న అపార్థానికి గురై, నేడు మతం పేరు సమాజంలో చలామణీ అవుతున్న ముఢాచారాలనే నిజ ధర్మం అన్న అపోహకు గురై, తిరిగి “చూసారా మీ దేవుళ్లు కంట్రోల్ చేయలేని అంటురోగాల్ని మా సైన్స్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి మీ దేవుళ్లందరి కంటే సైన్సే గొప్పోచ్” అంటూ చంకలు గుద్దుకుంటూ కొందరు అర్థ మెదడుతో చేసే వాదనలు అత్యంత అర్థరహితమైన పనికిమాలిన వాదనలు మాత్రమే!

ఈ వాదనలకు పూర్తి భిన్నంగా ధార్మిక గ్రంథాలు తెలియజేస్తున్న వాస్తవం…

ప్రపంచంలో ఇన్నేసి విపత్తులు జరుగుతుంటే దేవుడనేవాడే ఉంటే వచ్చి కాపాడాలి కదా? లేనప్పుడు ఇక దేవుడెందుకు? మీ గుళ్లూ గోపురాలలో ఉన్న దేవుళ్ల కంటే మా సైంటిస్టులే నయం అంటూ విమర్శిస్తున్న విమర్శకుల వాదనలకు పూర్తి భిన్నంగా… ధార్మిక గ్రంధాలు చదివితే అవగతమయ్యే వాస్తవాలు

1. ఈనాడు మతం పేరుతో ఏ ముఢాచారాలైతే సమాజంలో కనపడుతున్నాయో వాటికీ ధార్మిక గ్రంధాలు (వేదోపనిషత్తులు, గీత, బైబిల్, ఖురాన్) ప్రతిపాదిస్తున్న “ధర్మానికీ” కించిత్తు పొంతనలేదన్నది! చాలామంది విధ్యావేత్తలు సమాజంలో మతం పేరుతో చలామణిలో ఉన్న ముఢాచారాలే ధార్మిక గ్రంధాలు చెబుతున్న అసలు ధర్మం అన్న అపోహకులోనై మొత్తానికి నాస్తికులుగా మారిపోయారు.

2. గుళ్లు, గోపురాలలో దైవాలుగా భావించబడి ఆరాధించబడుతున్న మహా పురుషులు, విగ్రహాలు, చెట్లు, పుట్టలు వగైరా ఏవీ నిజ దైవాలు కావు. రాముడు, కృష్ణుడు, యేసు, ముహమ్మద్ వగైరా వీరంతా నిజ దైవాన్ని పరిచయం చేయటానికి వచ్చిన మహనీయులు తప్ప దేవుళ్లు కారు.

3. హిందువులకైనా, ముస్లిములకైనా, క్రైస్తవులకైనా అసలు సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆయన సర్వేశ్వరుడిగా, యెహోవాగా, అల్లాహ్ గా ఇంకా అనేక పేర్లతో ధార్మిక గ్రంధాల్లో పరిచయమయ్యాడు. ఆయనకూ నేడు దైవాలుగా భావించబడి పూజించబడుతున్న వాటికి/వారికీ సంబంధం లేదు.

4. ఏ జీవికీ ఇవ్వబడని ఒక్క మనిషికి మాత్రమే ఇవ్వబడిన మంచి-చెడుల విచక్షణ చేయగలిగే తెలివితో ఈ మహత్తర సృష్టిని పరిశీలించి అసలు సృష్టికర్తను గుర్తించి, ఆయన ఆజ్ఞల ప్రకారం మనిషి నడుచుకుంటాడా? లేదా? అన్నది పరీక్షించే నిమిత్తమే మనిషిని ఈ లోకంలో పుట్టించాడు.

5. సుఖము X దుఃఖము, పుట్టుక X మరణము, కీర్తి X అపకీర్తి, భయము X భయరాహిత్యము, నవ్వించటం X ఏడిపించటం, లాభమూ X నష్టమూ, మేలూ X కీడు ఇవన్నీ కలగజేసే శక్తి ఒక్క సృష్టికర్తకు తప్ప ఈ సృష్టిలో దేనికీ లేదు అన్నవి.

కాబట్టి ఎంత పెద్ద మెడికల్ సైంటిస్టులైనా ఓ మనిషి ప్రాణం కాపాడటానికి చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేశాక “మా ప్రయత్నం మేము చేశామండీ ఇక అంతా పైవాడి దయ” అంటూ నిట్టూర్పుతో ఎవర్నైతే “ఆ పైవాడు” అంటున్నారో…

సముద్రాలలో భయంకర తుఫానులలో, తీవ్రమైన కష్టాలలో చిక్కుకుపోయినప్పుడు అప్రయత్నంగా హృదయాలు ఏ పైవాడిపై మళ్లుతాయో “ఆ పైవాడే” అసలు సృష్టికర్త అయిన దేవుడు.

ఏ సమాజంలో అయితే మానవులు తమ జీవిత లక్ష్యం మరచిపోయి, నిజ దైవాన్ని గుర్తించకుండా ఇష్టానుసారంగా నడుచుకుంటూ హద్దులు మీరు ప్రవర్తిస్తూ పోతారో, ఎప్పుడైతే మానవులలో నైతిక విలువలు కనుమరుగైపోతూ అత్యాచారాలు పెరిగి పేట్రేగిపోతాయో అలాంటి సందర్భాలలో మానవ జాతులపై విపత్తులు అవతరింపజేసేది ఆ సృష్టికర్త అయిన దేవుడే తిరిగి వాటి నుండి కాపాడగలిగేదీ ఆయనే. ఇదే సకల ధార్మిక గ్రంధాల సందేశం.

కాబట్టి లాభ-నష్టాలకు, మేలూ-కీడు, విపత్తులకు కారణమే స్వయంగా సృష్టికర్త అన్న విషయం గమనించకుండా, ప్రజలు తమకు దైవాలుగా చేసుకుని ఆరాధిస్తున్న మిధ్యా దైవాలకూ నిజ సృష్టికర్తకూ తేడా తెలుసుకోకుండా ఇక్కడ ప్రజలు చేసుకున్న మిధ్యా దైవాలనే దైవత్వం కలవారిగా భ్రమించి, “అదేంటీ! దేవుడు ఏమీ చెయ్యలేకపోవటం ఏంటి? దేవుడు చేయలేనిది సైన్స్ చేస్తుంది కాబట్టి దేవుడి కంటే సైన్సే బెటర్ కదా!” అంటూ చిలక పలుకులు వల్లిస్తున్న అర మెదడు మేధావులు పరిశీలించి తెలుసుకోవలసిన వాస్తవాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *