దేవుడు ఉన్నాడని నమ్మేవారంతా ‘ఆస్తికులు’, దేవుడు లేడని నమ్మేవారంతా ‘నాస్తికులు’ అన్నది సామాన్యంగా చాలా మంది చేసే విశ్లేషణ (Classification). కానీ ఇది నూటికి నూరుశాతం తప్పుడు విశ్లేషణ! కాస్త ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. అది ఎలా అన్నది గమనించే ముందు…
ఆస్తికులని పిలవబడుతున్న వారిని క్షుణ్ణంగా విశ్లేషిస్తే వారిలోనే రెండు రకాల ఆస్తికులను మనం చూడవచ్చు.
1. ధార్మిక గ్రంథాలను పరిశీలించి దానిలో చెప్పబడ్డ ‘శాస్త్రీయ ధర్మం’ అవగాహన చేసుకుని, ఈ సృష్టిని ఉనికి లోకి తెచ్చి దానిని ఒక సర్వశక్తిమంతుడు నియంత్రిస్తున్నాడు అని తెసుకున్న ‘యథార్థ ఆస్తికులు’ ఒక రకమైతే…
2. ధార్మిక గ్రంథాల ‘శాస్త్రీయ ధర్మం’తో పొంతనలేని మూఢ విశ్వాసాలు, గుడ్డి నమ్మకాలు మూఢాచారాలతో నిండిన ‘మూఢ మత వ్యవస్థను’ నిర్మించుకుని కల్పిత దైవాలను ఆరాధించే ‘నకిలీ ఆస్తికులు’ రెండవ రకం.
సమాజంలో ఆధ్యాత్మికులు అని ఎవరైతే పిలువబడుతున్నారో వారిని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే… పై రెండు రకాల ఆస్తికుల్లో రెండవ రకం ఆస్తికులే అత్యధికంగా ఆధ్యాత్మికుల వేషంలో చలామణీ అవుతున్నారనటం అతిశయోక్తి కాదు.
బాధాకరమైన విషయం ఏమిటంటే- హేతుబద్ధంగా ఆలోచన చేసే ఆధునిక విధ్యావేత్తలు మతం పేరు మీద, దేవుడు పేరు మీద ఈ నకిలీ ఆస్తికులు అనుసరించే గుడ్డి నమ్మకాలు, మూఢాచారాలతో నిండిన హేతువిరుద్ధమైన ‘మూఢ మత వ్యవస్థే’ అసలు ధార్మిక గ్రంథాలలో చెప్పబడ్డ ‘శాస్త్రీయ ధర్మం’ అన్న అపార్థానికి గురై మొత్తానికి అసలు శాస్త్రీయ ధర్మానికే దూరమైపోయారు. వారే చివరికు నాస్తికులుగా మిగిలిపోయారు.
ఈ విధంగా ‘నాస్తికులు’ లేక ‘నాస్తిక వాదం’ అన్నది ఒకటి ఉనికి లోనికి రావటానికి మౌలిక కారణం- ఆస్తికులలో ధార్మిక గ్రంథాల ‘శాస్త్రీయ ధర్మాన్ని’ పెడచెవిన పెట్టి, మూఢత్వపు మత వ్యవస్థను అనుసరించే ‘నకిలీ ఆస్తికులు’ మాత్రమే.
ఇక ఏ నాస్తికుడైనా దేవుడు లేడు అని చెప్పటానికి ఈ క్రింది రెండు కారణాల్లో ఏ కారణం చెబుతాడు? అన్నది గమనిస్తే…
1. సమాజంలో దేవుడు పేరు మీద, మతం పేరు మీద అనేక వెధవ పనులు జరుగుతున్నాయి. దేవుడు/మతం పేరు మీద అనేక మారణహోమాలు జరిగాయి. దేవుడు పేరు మీదే అనేక గుడ్డి నమ్మకాలు, ముఢాచారాలు ఏర్పడాయి కాబట్టి దేవుడు లేడు అన్న కారణం చెబుతాడా? (లేక)
2. నేను సృష్టి అంతా పరిశీలన చేశాను సృష్టి మొత్తం వెతికి చూశాను నాకు ఎక్కడా దేవుడు కనపడలేదు కనుక దేవుడు లేడు అన్న కారణం చెబుతాడా?
ఏ నాస్తికుడైనా పై రెండు కారణాల్లో మొదటిదే చెబుతాడు తప్ప రెండవది చెప్పటానికి సాహసించడు. ఒకవేళ సృష్టి అంతా వెతికి చూశాను పరిశీలన చేశాను కాబట్టి నా సర్వే లో దేవుడు లేడని తేలింది అని చెబితే అతి పెద్ద బూతు అవుతుంది. ఎందుకంటే విశ్వం/సృష్టి మొత్తం పరిశీలన చెయ్యటం అన్నది సైన్స్ కే సాధ్యపడని విషయం కాబట్టి
పోనీ దేవుడు ఉన్నాడు అని చెప్పేవారు సృష్టి అంతా పరిశీలన చేసి, దేవుణ్ణి ప్రత్యక్షంగా కళ్ళతో చూసి చెబుతున్నారా? అన్న ప్రశ్న ఒకటి ఉత్పన్నమవ్వొచ్చు.
ఆధునిక భౌతిక శాస్త్రం చెప్పే ‘కారణం’ మరియు ‘ప్రభావం (Cause and Effect)’ సిద్ధాంతాన్ని పరిగణలోకి తీసుకుని సమస్త విశ్వాన్ని పరిశీలిస్తే… విశ్వం ‘ప్రభావం (Effect)’ అయితే దాని ‘కారణం (Cause)’ ఏదో ఒకటి ఉండాలి కదా? అన్న ప్రశ్న దగ్గర ఆగుతుంది
సైన్స్ శూన్యంలో ఒక ఒక మహా విస్పోటనం (Big bang) ద్వారా విశ్వం ఉనికి లోనికి వచ్చింది అని చెబుతుంది. ఆ విస్పోటనం ఎలా జరిగింది? అంటే… శూన్యంలో ఎనర్జీ వల్ల అని చెబితే… ఆ ఎనర్జీ పుట్టటం వెనుక కారణం ఎవరు? అన్న ప్రశ్న ఉత్పన్నమౌతుంది. పోనీ ఆ ఎనర్జీ శూన్యంలో ఏవో కొన్ని పదార్థాల (Elements) కలయిక వల్ల ఏర్పడింది అంటే అవి ఏర్పడటానికి కారణం ఏమిటి? అన్న మరో ప్రశ్న ఉత్పన్నమౌతుంది. సైన్స్ ముంగిట ఇలాంటి అంతుచిక్కని అనేక ప్రశ్నలకు నిర్ధిష్టమైన జవాబులు ఉండదు.
కానీ సృష్టి మొత్తం పరిశీలిస్తే …
1. సృష్టిలో అద్భుతమైన ‘క్రమబద్ధత (Order)’ కనపడుతుంది.
2. సృష్టి వెనుక ఒక ‘అసాధారణమైన మేధస్సు (Supernatural Intelligence)’ పని చేస్తున్నట్టు కనపడుతుంది.
3. ఆ అసాధారణమైన మేధస్సు ఈ సృష్టిని నడుపుతున్నట్టు కనపడుతుంది.
4. అలాగే సృష్టిలో అద్భుతమైన సమతుల్యత (Balance) కనపడుతుంది.
5. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సృష్టి సమస్తం ఏదో లక్ష్య రహితంగా కాక ఒక అద్భుత లక్ష్యం కోసం సృష్టించబడినట్టు, అలాగే సమస్త సృష్టిని మనిషి సేవకొరకు సృష్టించనబడినట్టు కూడా కనపడుతుంది.
ఈ రకమైన పరిశీలన ఆధారంగా సమస్త విశ్వం/సృష్టి ఉనికి లోనికి రావటం ‘ప్రభావం (Effect)’ అయితే… అది ఉనికి లోనికి రావటానికి… ఎంతో క్రమబద్ధంగా నడుపబడటం వెనుక మూల ‘కారణం (Cause) ఒక అసాధారణమైన మేధస్సు (Supernatural intelligence) ఒకటి ఉండి తీరాలి అన్న విషయం బయటపడుతుంది.
ఆ అసాధారణమైన మేధస్సు ను సృష్టికర్త అని పిలవాలా? దేవుడు అని పిలవాలా? అన్నది ఇక్కడ సమస్య కాదు. మొత్తానికి ఒక అసాధారణమైన మేధస్సు (Supernatural intelligence) ఈ సృష్టిని ఉనికి లోనికి తెచ్చి, దానిని క్రమబద్ధంగా నడుపుతుందన్న విషయం మటుకు నిర్థారణ అవుతుంది.
ఇప్పుడు మనం ధార్మిక గ్రంథాల దగ్గరకు వద్దాం. ఇవి మనిషిని గుడ్డి నమ్మకాలు, మూఢ విశ్వాసాల ఆధారంగా కాకుండా… సృష్టిని శాస్త్రీయ పరిశీలన చేసి హేతుబద్ధమైన ఆలోచన ఆధారంగా ఈ సృష్టిని ఉనికిలోకి తెచ్చి, క్రమబద్ధంగా నడుపుతున్న ఆ అసాధారణమైన మేధస్సు (Supernatural intelligence) ను తెలుసుకొమంటున్నాయి.
ఉదాహరణకు ఖురాన్- మీరు దేవుణ్ణి కచ్చితంగా నమ్మాల్సిందే అని ఓ గుడ్డి విశ్వాసం వైపు ఆహ్వానించటం లేదు. ఖురాన్ ను చదివితే…
“అయితే వీరు ఒంటెలను చూడరా అవి ఎలా సృష్టించబడ్డాయో? ఆకాశాన్ని చూడరా అది పైకి ఎలా ఎత్తబడిందో? కొండలను చూడరా అవి ఎలా పాతిపెట్టబడ్డాయో? భూమిని చూడరా అది ఎలా పరచబడిందో?” – 88:17-20
“మేము మానవుడిని వీర్య బిందువుతో సృజించిన విషయం అతను చూడటం లేదా?” – 36:77
“భూమీ ఆకాశాల నిర్మాణం గురించి చింతన చేసే వివేకవంతులకు ఎన్నో సూచనాలున్నాయి” – 3:190
అంటూ సృష్టి పరిశీలన వైపు ఆహ్వానం పలుకటాన్ని అనేక వందల వాక్యాల్లో గమనించగలం. అంతేకాదు… “ఊహలు, అనుమానాల ఆధారంగా నిర్ణయం చేసేవారు అజ్ఞానంలో కూరుకుపోయారు” (51:10) అని చెప్పి ఊహల ఆధారంగా గుడ్డి విశ్వాసాలను నమ్మే వారు అజ్ఞానంలో పడి ఉన్నారన్న విషయం చెబుతుంది.
ఈ విధంగా ధార్మిక గ్రంథాల ‘శాస్త్రీయ ధర్మం’ పూర్తి ‘హేతుబద్ధమైన (Logical)’ ఆలోచనా విధానాన్ని ప్రతిపాదిస్తుంటే… మూఢ విశ్వాసాలు, గుడ్డి నమ్మకాలు మూఢాచారాలతో నిండిన ‘మత వ్యవస్థ’ నిర్మించుకుని కల్పిత దైవాలను ఆరాధించే ‘నకిలీ ఆస్తికులు’ పూర్తి ‘హేతు విరుద్ధమైన (Illogical)’ ఆలోచనా విధానాన్ని ప్రతిపాదిస్తున్నారు.
ఈ ఒక్క స్వల్ప తేడాను కనుగొనక నేడు చాలామణిలో ‘మూఢ విశ్వాసాలతో నిండిన మత వ్యవస్థే’ ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మమ’ని అపార్థానికి గురవ్వటమే నేటి అధికశాతం ‘నాస్తికవాదులు’ చేస్తున్న పొరపాటు అయితే… ఈ విషయాన్ని హేతుబద్ధమైన రీతిలో వారికి వివరించకపోవటం ‘ఆస్తికులు’ చేస్తున్న అతి పెద్ద పొరపాటు.
నాస్తికులు – ఆస్తికులు & నకిలీ ఆస్తికులు
