ఉత్తరాఖండ్ మతోన్మాదం /-

“ఈ దేశంలో హిందువులను మైనార్టీలుగా మార్చేసేందుకు కుట్ర జరిగిపోతుంది. ముస్లిం యువకులు, హిందూ యువతులను ప్రలోభ పెట్టి, మాయమాటలు చెప్పి వారిని వివాహం చేసుకునో, వారిని మోసం చేసో తమ జనాభాను పెంచేసుకుంటున్నారు. ఈ కుట్రనే “లవ్ జిహాద్” అంటారన్నది హిందుత్వ అతివాద సంఘాలు అల్లిన ‘కట్టుకథ’.

ముస్లిం మైనార్టీలపై తమ మతోన్మాదాన్ని ప్రదర్శించటానికి దేశవ్యాప్తంగా ముస్లిములు లవ్ జిహాద్ చేస్తున్నారని దీనికి పాపం అమాయక హిందూ మహిళలు బలైపోతున్నారన్నది సోషల్ మీడియాలో ఈ హిందుత్వ అతివాద సంఘాల ప్రచారం.

ఈ ప్రచారాల నేపథ్యంలో మరుగున పడిపోయిన కొన్ని సంఘటనలను గుర్తుకు తెచ్చుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం అంటే 2013 సం.లో రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ సోమనాథ్ పరిదా అనే వ్యక్తి ఆవేశంతో తన భార్య ఉషశ్రీ సమల్ ను హత్య చెయ్యటమే కాక, ఆమెను 300 ముక్కలు చేసి టిఫిన్ బాక్సుల్లో పెట్టి విసిరి పరేసి పోలీసులకు దొరికి పోయాడు.

అలాగే డెహ్రాడూన్ లో రాజేష్ గులాటీ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన భార్య అనుపమను హత్య చేసి ఆమె శరీరాన్ని 72 ముక్కలు చేసి ఫ్రీజర్ లో దాచిపెట్టాడు.

జూన్ 2004 లో వర్జీనియాలో ప్రవీణ్ నందనపు అనే అచ్చ తెలుగు యువకుడు తన 28 ఏళ్ల భార్య దివ్యను హత్య చేసి ముక్కముక్కలుగా నరికి బ్యాగుల్లో పెట్టి డంప్ యార్డుల్లో విసిరి పారేశాడు.

మధ్యప్రదేశ్ జబల్ పూర్ లో అభిజిత్ పాటిదార్ హోటల్ గదిలో తన ప్రియురాలి గొంతు కోసి చంపి పైగా ఆ హత్యను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

మొన్నామధ్యే సాహిల్ గెహ్లాట్ అనే వ్యక్తి తన ప్రియురాలు నిక్కీ యాదవ్ ను చంపి ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో దాచిపెట్టాడు.

ఛత్తీస్ గడ్ లో ఆశిష్ సాహు అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసగించి తన ప్రియురాలైన ప్రియాంక సింగ్ ను చంపి శవాన్ని తమ మెడికల్ షాప్ లోనే నాలుగు రోజులు దాచిపెట్టి పోలీసులకు దొరికిపోయాడు.

ముంబై లో ఈ మధ్యే సరస్వతీ వైద్య అనే మహిళను ‘మనోజ్ సేన్’ అనే వ్యక్తి మోసం చేసి హత్యచేసి ఆమెను ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో వండేసిన దారుణమైన నేరానికి దేశమంతా ఉలిక్కిపడింది.

హైదారాబాద్ లో సాయికృష్ణ అనే ఓ గుడి పూజారి అప్సర అనే మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉంటూ ఆ మహిళను చంపేసి సెప్టిక్ ట్యాంకులో కుక్కేసిన క్రూరమైన సంఘటన వెలుగులోకొచ్చి తెలుగు రాష్ట్రాలను ఉలిక్కి పడేలా చేసింది.

ఇవి మచ్చుక్కు కొన్ని సంఘటనలు మాత్రమే!

నిజానికి దేశం మొత్తం మీద ప్రతీ రోజు భారతదేశంలో అత్యాచారానికి గురవుతున్న స్త్రీల సంఖ్య 87 మంది, ప్రతీ రోజు భారతదేశంలో హత్య చెయ్యబడుతున్నవారి సంఖ్య 82 మంది, వరకట్నం పేరుతో చంపబడుతున్న మహిళల సంఖ్య 19 మంది అని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోనే చెబుతుంది.

మరి ఈ నేరాలన్నీ “లవ్ జిహాద్” కేసులేనా?

అబ్బే కాదండీ! ఎందుకంటే హత్య చేసిందీ, హత్య చెయ్యబడినబడిన వారంతా హిందు పేర్లు ఉన్న వ్యక్తులే కాబట్టి “లవ్ జిహాద్” కేసులు కావు. అంతేకాదా!!

దీనిని బట్టి దేశంలో జరిగే వేల కొద్దీ నేరాల్లో ఏ ఒక్క ముస్లిం పేరో ఉంటే అది మాత్రం లవ్ జిహాద్ గా గుర్తించబడుతుంది. మిగతా అన్ని హత్యల్లో చంపిన, చంపబడిన వారిలో హిందూ పేర్లు ఉంటే అవి సామాన్య నేరాలుగా పరిగణించబడుతుంటాయి

కాబట్టే భారతదేశంలో వేల కొద్దీ నేరాలు జరుగుతున్నా ఎవరికీ తెలీకుండా అవి మరుగున పడిపోతుంటాయి.

ఖర్మకాలి ఆ నేరాల్లో ఏ ఒక్కడో ముస్లిం అయి ఉంటేనే ఆ సంఘటన “లవ్ జిహాద్”గా మారిపోయి కాంట్రవర్షియల్ అయిపోతుంది.

……

ఇప్పుడు కాస్త ఉత్తరాఖండ్ లో ఏమి జరుగుతుందో గమనిద్దాం!

గత నెల మే 28 న ఉత్తరాఖండ్ పురోలా అనే గ్రామంలో ఓ హిందూ మైనర్ బాలికను ఇద్దరు యువకులతో పాటు పట్టుకోవటం జరిగింది. ఆ ఇద్దరు యువకుల్లో ఒకతను ఒబైద్ అనే ముస్లిం, జితేందర్ సైనే అనే మరొక హిందూ యువకుడు. ఆ ఇద్దరు యువకుల్ని పోలీసులు కిడ్నాప్ కేసుగా కేస్ ఫైల్ చేసి అరెస్టు చేశారు.

కానీ అక్కడి స్థానిక హిందుత్వ అతివాద గ్రూపులు ఆ ఇదరికీ శిక్ష పడేలా డిమాండ్ చెయ్యాల్సిందిపోయి ఈ సంఘటనకు కూడా “లవ్ జిహాద్” రంగును పులిమారు.

ఈ మైనర్ బాలిక దొరికినప్పుడు ఆ బాలికతో పాటు ఇద్దరు యువకుల్లో ఒక హిందూ యువకుడు ఉన్నప్పటికీ.. ఆ ఇద్దర్లో ఓ ముస్లిం యువకుడు ఉండటాన్ని బట్టి ముస్లిములు లవ్ జిహాద్ చేస్తున్నారన్నట్టు నా నా హంగామా చెయ్యాటమే కాక, ఆ ఒక్కడి నేరానికి ఆ ఊరి ముస్లిములందర్నీ బాధ్యులుగా చేసేసి, అక్కడి ముస్లిముల ఇళ్లపై, అంగళ్లపై బహిరంగంగా దాడికి తెగబడటం మొదలెట్టారు.

వారి అనాగరికతకు పారాకాష్ట ఏమిటంటే పోలీసులు ఒకప్రక్క ఆ ఇద్దర్నీ అరెస్టు చేసి ఎఫ్. ఐ. ఆర్ బుక్ చేసినప్పటికి ఈ హిందూ అతివాద సంఘాలు ముస్లిముల ఇళ్లపై, షాపులపై దాడులు చెయ్యాటమే కాక, జూన్ 15 వరకు స్థానిక ముస్లిములకు టైమిచ్చి ఊరు విడిచి ఖాళీ చెయ్యాల్సిందిగా వారి ఇళ్ల ముందు పోస్టర్లు అతికించటం జరిగింది. పాపం ఇప్పటికే ఆ సంఘటనతో ఏ మాత్రం సంబంధం లేని కొందరు ముస్లిం ఫ్యామిలీలు కట్టు బట్టలతో ఊరు విడిచి వెళ్లిపోతున్నారు.

హిందువైన, ముస్లిమైనా లేక ఏ మతానికి చెందిన వాడైనా నేరం చేసినవాడు నేరస్తుడే అవుతాడు. వాడికి మతం అంతగట్టటమే మూర్ఖత్వం.

కానీ చిత్రం ఏమిటంటే హిందూ పేర్లు కలిగిన నేరస్తుల చేతిలో ఎంతమంది తోటి హిందూ మహిళలు అత్యాచారాలు, హత్యలు చెయ్యబడినప్పటికి ఆ ఘోరాలకు వ్యతిరేకంగా ఆయా నేరస్తులకు శిక్ష పడాలని గళం ఎత్తినట్టు ఈ హిందుత్వ అతివాద సంఘాల చరిత్రలో చూడలేము… కానీ ఆ నేరస్తుల్లో కేవలం ముస్లిం పేర్లు ఉంటేనే లవ్ జిహాద్ కాన్సెప్ట్ అంటగట్టేసి దౌర్జన్యాలకు పాల్పడటాన్ని చూడగలం.

ఈ మతోన్మాద వాతావరణం నుండి దేశాన్ని రక్షించేది ఎవరు? బాధ్యతగల ఆలోచనాపరులైన భారతీయులైన హిందూ, ముస్లిములే రక్షించుకోవాలి.

“లవ్ జిహాద్” అన్నది హిందూ, ముస్లిముల మధ్య మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టటానికి హిందూ అతివాద సంఘాలు సృష్టించిన “కట్టు కథ” అన్నది తెలుసుకోవాలి.

నేడు హిందుత్వ అతివాదులు చెబుతున్నట్టు నిజంగా లవ్ జిహాద్ చేసి భారతదేశంలో హిందువులను మైనార్టీలుగా మార్చివేయటం ముస్లిములు పన్నుతున్న కుట్ర అయితే.. ముస్లిములు ఈ కుట్ర గత 10 ఏళ్ల నుండే మొదలెట్టారా? గత పదేళ్ల నుండే ఈ “లవ్ జిహాద్” అనే పదం ఎందుకు వినపడుతుంది?

దాదాపు వెయ్యేళ్లు భారతదేశాన్ని ముస్లిములు పరిపాలించారు నిజంగా లవ్ జిహాద్ చెయ్యటం ముస్లిముల కుట్ర అయితే భారతదేశంలో హిందువులు మెజార్టీ స్థాయిలో ముస్లిములు మైనార్టీలుగా ఎందుకుంటారు?

చివరిగా “జిహాద్” అన్న పదానికి అరబ్బీ భాషలో అర్థం- చెడు ఆలోచనలతో, చెడు తలంపులతో పోరాడటం, దౌర్జన్యాన్ని అణచి శాంతిని స్థాపించటం, అన్యాయానికి, అణచివేతకు వ్యతిరేకంగా చేసే “ధర్మ పోరాటం” అని అర్థం.

ఈ అర్థం కలిగిన పదాన్ని “లవ్” అన్న పదంతో ముడి పెట్టి “లవ్ జిహాద్” అనే పదం కనిపెట్టిన వారు ఎంత పెద్ద మూర్ఖులో ఏకాస్త కామన్ సెన్స్ ఉన్నోళ్లయినా అర్థం చేసుకోవచ్చు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *