సరస్వతీ వైద్య అనే మహిళను హత్యచేసి ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో వండేసిన దారుణమైన నేరానికి పాల్పడింది ‘మనోజ్ సేన్’ కాబట్టి అది అతను చేసిన నేరంగా మాత్రమే పరిగణించబడింది. అదే ఒకవేళ ఆ మనోజ్ సేన్ కు బదులు ఏ ముహమ్మద్ మగ్బూలో అయి ఉంటే ఈ పాటికే ఆ నేరం సార్వత్రిక ముస్లిం సమాజం చేసిన నేరంగా చిత్రీకరించబడి ఉండేది.
ముస్లిం సమాజం మొత్తం కలిసి అతనితో ఆ నేరాన్ని దగ్గరుండి చేయించినట్టు, ఆ నేరానికి ముస్లిం సమాజం మొత్తం బాధ్యులైనట్టు ఈ పాటికే వందల కొద్దీ పోస్టులు, ముస్లిములు ‘లవ్ జిహాద్’ చేసి మన హిందూ సమాజంలో అమాయక స్త్రీలను హత్యలు చేసి మైనార్టీలుగా మార్చటానికి పన్నుతున్న కుట్రని వేల కొద్దీ వ్యాసాలతో సోషల్ మీడియా దద్దరిల్లిపోయేది.
ఈ సంఘటన జరిగేలోపే హైదారాబాద్ లో ఓ పూజారి వివాహేతర సంబంధం కలిగి ఉంటూ ఓ మహిళను చంపేసిన సంఘటన వెలుగులోకొచ్చింది. అదృష్ట వశాత్తు చంపింది, చంపబడింది అచ్చ తెలుగు వారే కాబట్టి సరిపోయింది లేదంటే అది ‘లవ్ జిహాద్’గా ఈ పాటికే రూపాంతరం చెంది ఉండేది.
నిజానికి దేశంలో ఇలాంటి నేరాలు రోజుకు చాలా జరుగుతూ ఆ వార్తలు న్యూస్ పేపర్లలో అనాధ వార్తల్లా మిగిలిపోతుంటాయి. కానీ వాటిలో ముస్లిం పేర్లు ఉంటేనే కాంట్రవర్షియల్ గా మారిపోతుంటాయి. కాదు మార్చబడతాయి. మొత్తం ముస్లిం సమాజం చేస్తున్న కుట్రపూరిత హత్యల మాదిరిగా విపరీత ప్రచారం చెయ్యబడతాయి. ఈ కుట్రల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని, ఉగ్రవాదుల కుట్ర దాగుందని కూడా తలా తోకా లేని వేల పోస్టులు వాట్స్ యాప్పుల్లో చక్కర్లు కొడతాయి.
దీనిని బట్టి ఈ దేశంలో మైనార్టీ వర్గాన్ని శత్రువులుగా చిత్రీకరిస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రక్రియ ఎంత బహిరంగంగా సాగుతుందో అంచనా వెయ్యవచ్చు. దీనినే ‘మతోన్మాదం’ అంటారు.
ఒకవేళ పై నేరాల్లో చంపడిన వారు ముస్లిం స్త్రీలైనప్పటికీ… హిందువులంతా ప్రమాదకారులని, హిందువుల వల్ల ముస్లిములు ప్రమాదంలో ఉన్నారని ఏ ముస్లిమూ ఒక్క పోస్టు పెట్టడు. ఎందుకంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు కాబట్టి.
నిజంగా అలాంటి పోస్టులే పెడితే ఒకడు చేసిన నేరానికి ఆ మొత్తం మత వర్గపు ప్రజలు బాధ్యులెలా అవుతారు? అందరూ ఒకలాంటి వారు కారు కదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అంటూ అందరూ మాట్లాడటం మొదలెడతారు.
కానీ, ఆర్ ఎస్ ఎస్, సంఘ్ పరివార్ సభ్యులు మాత్రం నేరస్తుల పేర్లు ఏ ఉర్దూ/అరబిక్ భాషకో చెందినదైతే వారి నేరానికి మొత్తం ముస్లిం సమాజాన్ని బాధ్యులుగా చేసేసి, వారి ద్వారా ‘హిందువులంతా ప్రమాదంలో ఉన్నార’ని నిస్సిగ్గుగా మాట్లాడటానికి ఏ మాత్రం సంకోచించరు.
నిజానికి దేశంలో ప్రతీరోజు పది నేరాలు జరిగితే ఆ పదిలో ఐదుగురు హిందూ పేర్లు పెట్టుకున్న నేరస్తులు, ముగ్గురు ముస్లిం పేర్లు పెట్టుకున్న నేరస్తులు, ఇద్దరు క్రైస్తవ పేర్లు పెట్టుకున్న నేరస్తులు కచ్చితంగా ఉంటారు.
తప్పితే నేరాలూ, ఘోరాలూ ఏ ఒక ప్రత్యేక మత వర్గమో కాంట్రాక్టు తీసుకుని చెయ్యదు. నేరాలు చేసే దుర్మార్గుల్లో హిందూ/క్రైస్తవ/ముస్లిం పేర్లు ఉన్నంత మాత్రానా ఆయా మతాలకు చెందిన ప్రజలందరూ వారి నేరాలకు బాధ్యులైపోరు.
కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ విషయం తెలిసినప్పటికీ.. సంఘ్ పరివార్ శక్తులు వాట్స్ యాప్పులో చేసే అర్థం పర్థం లేని మూర్ఖపు ప్రచారాలను కొందరు చదువుకున్న విద్యావంతులు సైతం కనీస ఇంగిత జ్ఞానం ఉపయోగించకుండా గుడ్డిగా నమ్మేయటమే.
ఇలాంటి ప్రమాదకర మతోన్మాద వాతావరణం నుండి దేశాన్ని అందరూ కలిసి రక్షించుకోవాలి.
