జరిగిపోయిన నష్టాన్ని “కోర్టు” పూడ్చగలదా?

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేరళ నుండి ఇస్లాంలోకి కన్వర్ట్ చెయ్యబడి 32000 మంది అమ్మాయిలు ఐసిస్ ఉగ్రవాద సంస్థకు బంధీలుగా తరలించబడ్డారని చెప్పిస్తూ “ది కేరళ స్టోరీ” సినిమా టీజర్ 3 నవంబర్ 2022 న యూట్యూబ్ లో రిలీజ్ అయ్యాక, పైగా ఆ సినిమా విడుదలై సుమారు వంద కోట్ల లాభాలు తెచ్చిపెట్టిన 15 రోజులకు గానీ సుప్రీం కోర్టుకు ఆ సినిమాలో చెప్పబడినవి కల్పితాలన్న విషయం తెలియకపోవటం.

ఈ లోపల “మా సినిమాను వాస్తవ ఘటనల ద్వారానే తీశాం” అని డప్పు వాయించుకుంటూ ఆ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్లు కోట్ల కొద్దీ లాభాలు సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఆర్.ఎస్.ఎస్, భజరంగ్ దళ్ లాంటి హిందుత్వ అతివాద సంస్థలైతే ఈ సినిమాలో చెప్పబడింది నిజం అని విపరీతమైన ప్రచారం చేశారు. దౌర్భాగ్యం ఏమిటంటే దేశ ప్రధాని సైతం రాజకీయ లబ్ది కోసం “ది కేరళ స్టోరీ” ఫిల్మ్ వాస్తవమని ప్రచారం చెయ్యటం.

ఇదంతా జరిగిపోయిన తరువాత ఇప్పుడు సుప్రీం కోర్టు సడన్ గా నిద్ర నుండి మేల్కొన్నట్టు ఆ సినిమా ప్రొడ్యూసర్లకు “ఈ సినిమా కేవలం కల్పిత కథ ఆధారంగా తీసిందని, 32000” గానీ లేదా ఏ కొందరైనా గానీ కన్వర్ట్ అయి తరలించబడ్డారని చెప్పటానికి మా దగ్గర ఎటువంటి ప్రామాణిక ఆధారాలు లేవు” అని డిస్క్లైమర్ లో మీరు అర్జెంటుగా చేర్చాలని ఆదేశించటం జరిగింది.

మరి గత ఆరు నెలలుగా ఈ సినిమా ద్వారా ముస్లిం సమాజానికి జరిగిన డ్యామేజ్ ను అత్యున్నత న్యాయస్థానం ఏ విధంగా పూడ్చగలుగుతుంది? మరొక చిత్రం ఏమిటంటే ఈ రోజుకు కూడా ఆ సినిమా టీజర్ తాలూకు రీల్స్ ను యూట్యూబ్ నుండి పూర్తిగా తొలగించబడకపోవటం!

ఆ సినిమా డైరెక్టర్ సుదీప్తో సేన్ కు మీరు చెబుతున్న లెక్కలకు ఆధారాలు చూపమన్నప్పుడు అబద్ధాన్ని నిజమని నిరూపించలేక ట్రైలర్ డిస్క్రిప్షన్లో ‘32 వేల స్త్రీల కథ’ అన్నదాన్ని తొలగించి ‘ముగ్గురు స్త్రీల కథ’ అని మార్చాడంతే!

కానీ, ఆ సినిమా టీజర్ ద్వారా 32 వేల మంది అమ్మాయిలు ట్రాప్ చెయ్యబడి కేరళ నుండి ఉగ్రవాదులుగా సిరియకు తరలించబడ్డారంటూ ఆ సినిమా హీరోయిన్ తో మాట్లాడించిన కల్పిత సమాచారం వల్ల జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది.

ఈ సినిమా పూర్తి లక్ష్యం ఏమిటన్నది ఒక్క ముక్కలో చెప్పాలంటే మొత్తం ముస్లిం సమాజాన్ని దుర్మార్గులుగా, హిందూ వ్యతిరేకులుగా చూపటమే! ఆ సినిమాలో క్యారక్టర్లను గమనిస్తే ముస్లిం క్యారక్టర్స్ ను నెగెటివ్ గా, హిందూ క్యారక్టర్లను అమాయకులుగా ముస్లిముల చేతిలో మోసపోయేవారిగా చూపుతూ.. ఆ సినిమా చూసే వారికి ముస్లిముల పట్ల ఒకరకమైన ద్వేషాన్ని, భయాన్ని కలిగించాలన్న ఉద్దేశంతో సినిమా తీస్తే తయారయిందే “ది కేరళ స్టోరీ”.

మొత్తానికి ముస్లిముల లక్ష్యమే కుట్రపూరితంగా హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో బ్రేయిన్ వాష్ చేసి, వారిని ట్రాప్ చేసి ఉగ్రవాదులుగా మార్చేసి వారిని ఐసిస్ ఉగ్రవాద సంస్థకు తరలించేయటమే తప్ప వారికి పొద్దున లేస్తే మరొక పనుండదన్నట్టుగా జనాల్లో ఓ ఫాల్స్ ఇంప్రెషన్ ను క్రియేట్ చెయ్యటంలో ఆ సినిమా డైరెక్టర్ విజయం సాధించాడనే చెప్పవచ్చు. ఈ విషయాన్ని సినిమా చూసి బయటకు వచ్చి మాట్లాడుతున్న కొందరు ఆడియన్స్ యొక్క రియాక్షన్ ను బట్టి గమనించవచ్చు. అలాగని ఆ సినిమాలో చెప్పబడిన అబద్ధాలను ప్రజలందరూ గుడ్డిగా నమ్మేశారని కూడా అనకూడదు. ఆ సినిమా అబద్ధమని వ్యతిరేకించిన వారిలో అధికశాతం మంది ముస్లిమేతరులు, సామాజిక కార్యకర్తలు కూడా ఉన్నారు.

కానీ, ఇక్కడ ప్రశ్నేమిటంటే 32 వేల మంది హిందూ అమ్మాయిలు ISIS కు అక్రమ రవాణా చెయ్యబడుతుంటే ఈ దేశ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రక్షణ వ్యవస్థలు ఏమి చేతకాని స్థితిలో నిద్రపోతున్నాయా? అన్నట్టుగా చిత్రీకరించిన చిల్లర సినిమాను దేశ ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి నిస్సిగ్గుగా పబ్లిక్ లో నిలబడి నిజమని ఎలా ప్రమోట్ చెయ్యగలిగాడన్నదే?

దీనిని బట్టి ప్రస్తుత మతతత్వ పార్టీలకు కావలసింది కేవలం పోలిటికల్ మైలేజ్ తప్ప దేశాభివృద్ది ఎంత మాత్రం కాదని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దాని కోసం హిందూ, ముస్లిం పోలరైజేషన్ తీసుకురావటమే వారి లక్ష్యం. దానిని నెరవేర్చుకోటానికి మొన్న కాశ్మీర్ ఫైల్స్, నేడు కేరళ స్టోరీ, రేపు అలాంటిదే మరొకటేదో సినిమా. పైగా విద్వేషాలను రెచ్చగొట్టే ఇలాంటి పనికిమాలిన సినిమాలకు దేశభక్తి సినిమాలన్నట్టు ‘ట్యాక్స్ ఫ్రీ’ ప్రకటించటం మరొక భరించరాని దరిద్రం.

మరి సుప్రీం కోర్టు ఏం చేసి ఉండాల్సింది?

కేరళ నుండి ఇస్లాంలోకి కన్వర్ట్ చెయ్యబడి 32 వేల మంది అమ్మాయిలు ఐసిస్ ఉగ్రవాద సంస్థకు బంధీలుగా తరలించబడ్డారని చెప్పిస్తూ ఈ సినిమా టీజర్ విడులైన రోజే దానికి తగ్గ ఆధారాలు చూపాల్సిందిగా ఆ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్లను ఆదేశించాల్సింది.

ఎందుకంటే ఈ సమస్య ఆ సినిమా హిట్టు, ప్లాపులకు సంబంధించినది కాదు ఈ దేశ ప్రభుత్వ, రక్షణ రంగాల పరువుకు సంబంధించిన విషయం. ఈ దేశపు అతి పెద్ద వర్గాలైన హిందూ, ముస్లిముల సోదర భావానికి సంబంధించిన విషయం. అన్ని వేల అమ్మాయిల హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిపోతూ వారంతా ఇండియన్ బోర్డర్స్ అవతల అలవోకగా ఓ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కు తరలించబడుతున్నారంటే అది ఈ దేశ రక్షణ వ్యవస్థల చేతకాని తనం అన్నట్టు వెక్కిరించటమే అవుతుంది.

కాబట్టి ఒకవేళ ఆ సినిమా డైరెక్టర్ తగిన ఆధారాలు చూపలేని పక్షంలో ఆ సినిమా టీజర్ ను సోషల్ మీడియా నుండి తొలగించటమే కాక, ఈ సినిమాను ధియేటర్స్ లో రిలీజ్ కాకుండా చెయ్యాల్సింది.

ఈ కనీస సమాచారం న్యాయస్థాల దగ్గర లేదా?

యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ కేరళలో ఎలాంటి లవ్ జిహాద్ కేసులు నమోదు కాలేదని అసలు ప్రస్తుత చట్టాల ప్రకారం “లవ్ జిహాద్” అనే పదమే నిర్వచించటానికి అవకాశం లేని అర్థం లేని పదమని కొట్టి పరేసింది.

“యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ టెర్రరిజం” 2020 నివేదికల ప్రకారం నవంబర్, 2020 నాటికి ISISతో 66 మంది భారతీయులు మాత్రమే జతకట్టినట్టు ఆధారాలున్నాయి. “2018 స్టార్ట్ న్యూస్ గ్లోబల్ రిపోర్ట్” సైతం ISIS తో జతకట్టిన భారతీయులు సంఖ్య 60 మంది అని తెలపటం జరిగింది. ఆ 60 మంది భారతీయుల్లో 13 మంది స్త్రీలుంటే వారిలో 6 స్త్రీలు మాత్రమే కేరళ నుండి ఉన్నారు. అందులో ఇస్లాంలో కన్వర్ట్ అయిన వారు ముగ్గురు స్త్రీలైతే ఆ ముగ్గురిలో ఒకామే మాత్రమే హిందూ మిగతా ఇద్దరూ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వారు.

వాస్తవం ఇదైనప్పుడు 32 వేల మంది అమ్మాయిలు కన్వర్ట్ అయి కుట్రాపూరితంగా సిరియాలో ఐసీస్ కు తరలించబడుతున్నారని ముస్లిములను విలన్లు గా చిత్రీకరిస్తూ సినిమా తీయటం ఎంత దారుణం? ఈ మాత్రం కనీస సమాచారం ఉన్నత న్యాయస్థానం ఎందుకు పరిశీలించలేదు? సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ఇలాంటి సినిమాలను ఎందుకు నిషేధించలేదు? అన్నదే అర్థం కాని విషయం.

సరే, “ఈ సినిమా కేవలం కల్పితం మాత్రమే” అని డిస్క్లైమర్ లో రాసుకుని ఎలాంటి సినిమా అయినా తీసుకునే స్వేచ్చ ఉంటే… “ఈ సినిమా కేవలం కల్పితం” అన్న డిస్క్లైమర్ తో గుజరాత్ లో జరిగిన మారణ హోమాన్ని ఆధారం చేసుకుని “గుజరాత్ ఫైల్స్” పేరుతో ఒక సినిమా, అలాగే గుజరాత్ నుండి జాడ తెలియకుండా పోయిన 40 వేల స్త్రీల సమాచారంతో “ది గుజరాత్ స్టోరీ” అని ఒక సినిమా తీస్తామని ఎవరైనా ముందుకొస్తే అదే సుప్రీం కోర్టు పర్మిషన్ ఇస్తుందా?

ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచిస్తే ఈ దేశ రాజకీయాలు ఏ దిశగా వెళుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *