ఆ “కోటి రూపాయల రివార్డ్” కొట్టేయొచ్చుగా!

కష్టపడకుండా కోటి రూపాయల రివార్డ్ కొట్టేసే అద్భుతమైన అవకాశాన్ని “కేరళ స్టేట్ కమిటీ ఆఫ్ ముస్లిం యూత్ లీగ్” కల్పిస్తుంది.

చెయ్యల్సిందల్లా వాట్స్ యూనివర్సిటీ సిలబస్ ఆధారంగా తీసిన “ది కేరళ స్టోరీ” సినిమా టీజర్ లో చెప్పినట్టుగ్గా కేరళ నుండి లవ్ జిహాద్ ద్వారా 32 వేల హిందూ అమ్మాయిలు ట్రాప్ చెయ్యబడి సిరియా టెర్రరిస్ట్ క్యాంపులకు తరలించబడ్డారని ఆధారాలు చూపి నిరూపించటమే అంతే సింపుల్.

32 వేల మంది అవసరం లేదు పోనీ ఓ ముప్పై రెండు మంది హిందూ అమ్మాయిలు ట్రాప్ చెయ్యబడి ఇసిస్ కు ఖైదు చెయ్యబడినట్లు నిరూపించి పది లక్షలు రివార్డ్ స్వంత చేసుకోమని ప్రకటించాడు సి.షుక్కూర్ అనే ఓ లాయర్.

అలా చూసుకున్నా 1 కోటి 10 లక్షలు కూర్చుని సంపాదించే గొప్ప అవకాశం. ఇప్పుడు చెయ్యాల్సిందల్లా వాట్స్ యాప్పుల్లో, సోషల్ మీడియాలో “ది కేరళ స్టోరీ” సినిమా “నిజ సంఘటనల ఆధారంగా తీసిందే అబద్ధం కాదు” అని ఎవరితే మిమ్మల్ని మోటివేట్ చేస్తూ పంపుతున్నారో వాళ్లను గుడ్డిగా నమ్మేసి ఇతర గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసెయ్యటం కాదు ఆ మేటర్ పంపేవాళ్లను “మీరు చెబుతున్న దానికి తగిన ఆధారాలు కూడా ప్రొడ్యూస్ చెయ్యండి” అని అడిగితే చాలు.
కోటి రూపాయలు ఇట్టే కొట్టేయవచ్చన్న మాట!

పైగా తాము తీసిన సినిమా నిజమే అయితే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ సైతం పై 1 కోటి 10 లక్షల రివార్డ్ స్వంత చేసుకోవచ్చు!? కానీ వాళ్లు చేసుకోలేరు. ఎందుకంటే వాళ్లకు బాగా తెలుసు తాము తీసింది అబద్ధమని.

కానీ, ఇక్కడ కావలసింది ఈ అబద్ధాన్ని నిజమని నిరూపించి కోటి రూపాయలు కొట్టేయటం కాదు… అబద్ధాల్ని సినిమా, మీడియా మాధ్యమాల ద్వారానైనా ప్రచారం చేసి హిందూ-ముస్లిముల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టటం.

ఇప్పుడు దక్షిణ భారత దేశంలో ఆ మతతత్వ పార్టీకి ఎలక్షన్లలో నెగ్గటం కోసం పచ్చి అబద్ధలతో కూడిన ఈ సినిమా చాలా అవసరం. అందులోనూ కేరళ, ప్రక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణాలలో తమ పార్టీ జండా ఎగురవెయ్యాలంటే అభివృద్ధి చూపి ఓట్లు అడిగే అవకాశం ఎలాగూ లేదు. ఉన్నదల్లా “హిందూ-ముస్లిం” విభజన విద్వేష రాజకీయ ఫార్ములానే శరణ్యం.

అందుకే గతిలేక అబద్ధాల ఆధారంగా నిర్మితమైన “ది కేరళ స్టోరీ సినిమా ఓ చేదు నిజం” అంటూ ఆ పార్టీ పెద్దాయన కూడా ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు పాపం! అంటే “అన్నివేల మంది హిందూ అమ్మాయిలు ఈ దేశం దాటి వెళ్లిపోతుంటే నేనేమీ చెయ్యలేకపోయాను, ఇంటెలిజెన్స్, స్టేట్ గవర్నమెంట్, రక్షణ శాఖలన్నీ నిద్రపోతున్నాయని” పరోక్షంగా చెప్పి హేళన చెయ్యటం హిందువుల రక్షకుడని చెప్పుకునే ఆ పెద్దాయన ఉద్దేశమా?

కాబట్టి ఈ సినిమా చూసి అదంతా నిజమే అని అమాయకంగా నమ్మేసి చప్పట్లు కొట్టేసే ముందు ఇలాంటి ప్రభుత్వాన్ని నెగ్గిస్తే భవిష్యత్తు ఇంకెంత ప్రమాదకరంగా మారుతుందో అన్నది సామాన్య హిందూ ప్రజానీకం గ్రహించాల్సి ఉంటుంది.

వాట్స్ యాప్ యూనివర్సిటీ సిలబస్ ఆధారంగా తీయబడిన ఆ సినిమా టీజర్ లో 32 వేల అమ్మాయిల “కేరళ “ఫేక్” స్టోరీ” కాస్త… ట్రైలర్ కు వచ్చేసరికి “3 అమ్మాయిల స్టోరీ”గా మారిపోయింది. అంటే మిగతా 31997 మంది అమ్మాయిల కథ “ఫేక్ స్టోరీ” అనే కదా అర్థం!

చిన్న పిల్లలకు ట్రోఫీ ఇచ్చి లొంగదీసుకున్నంత ఈజీగా హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్ ద్వారా బ్రేయిన్ వాష్ చెయ్యబడతారని వారి కంటూ బుర్రలో స్వంత మెదడు, ఆలోచన ఉండదని వెక్కిరిస్తూ తీసిన ఈ సినిమాను కొన్ని హిందూ అతివాద సంఘాలు తమ భుజాన మోయటమే భయంకరమైన కామెడీ.

“మీ హిందూ దైవాలు కాపాడే శక్తిలేని వారు మిమ్మల్ని ఎలా ఆదుకుంటారు?” “మీ దేవుళ్లలో ఒకడైతే ఆడోళ్లతో రాసలీలలు నడుపుతుంటాడు, మరొకడేమో తన స్వంత భార్యనే కాపాడుకోలేకపోయాడు” అంటూ ఈ సినిమాలోని క్యారెక్టర్స్ తో ఆ సినిమా డైరెక్టరు చెప్పించిన డైలాగులు హిందూ ధర్మాన్ని బహిరంగంగా హేళన చెయ్యటమే అన్న విషయాన్ని సైతం గమనించకుండా ఇస్లామోఫోబియా హడావిడిలో పడి కొందరు మత ఉన్మాదులు “ఈ సినిమాలో చెప్పబడిందంతా నిజం” అంటూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవటం ఇంకా కామెడీ!

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *