ఆర్గనైజ్డ్ వైలెన్స్ /-

శోభాయాత్ర చెయ్యాలనుకున్నప్పుడు…

మసీదులు మదర్శాలు తగలేట్టేయటం దేనికి?

మసీదు మీనార్లెక్కి కాషాయ జండాలు పాతటం దేనికి?

పనికట్టుకుని మసీదులపై రాళ్ల దాడులు దేనికి?

మసీదుల ముందు లౌడ్ మ్యూజిక్కులతో భీబత్సమైన కేకలు, కేరింతలు దేనికి?

హాకీ బ్యాట్లు,పొడవాటి కత్తులు, కాషాయ జండాలతో డీజేలు పెట్టుకుని మసీదుల ముందు క్యాబరే డ్యాన్సులు దేనికి?

శోభాయాత్ర అన్న పేరు మీద రకమైన ఉన్మాదం ప్రదర్శించటాన్ని ఏమనాలి?

దేశంలో అనేకచోట్ల శ్రీ రామ నవమినాడు శాంతియుతంగా జరిగాయని చెబుతున్న శోభయాత్రలు పై విధమైన కార్యక్రమాలతోనే చక్కగా నిర్వహించబడ్డాయి!

అన్నిటికంటే ముఖ్యంగా బీహార్ లోని నలంద డిస్ట్రిక్ట్ లో పురాతన మసీదు మరియు మదర్శా మీదుగా శోభాయాత్ర చేసుకుంటూ ఊరేగింపుగా వెళుతున్న ఓ మతోన్మాద గుంపు ఆ మసీదును అందులో మదర్శాను తగలబట్టేసి అందులో ఉన్న 4500 పుస్తకాలను, ఖురాన్ లను కాల్చేసి కరాళ నృత్యం చేసేసింది.

శ్రీ రామ నవమిని పురస్కరించుకుని ఈ రకంగా శోభాయాత్ర చెయ్యటం వల్ల శ్రీరాముని ఆత్మ శాంతిస్తుందా? గతంలో ఎన్నడూ లేని ఈ ఉన్మాదాన్ని ప్రజల మెదళ్లలో నూరిపోస్తుంది ఎవరు?
పర్మిషన్లు లేనప్పటికీ సంఘ్ పరివార్ గుంపులు ముస్లిములు అధికంగా నివసించే ప్రాంతాల్లో, మసీదులు, మదర్సాల ముందు బలవంతంగా శోభాయాత్రలు నిర్వహించే సందర్భాల్లో అక్కడి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? అనేక చోట్ల దర్గాలు, మసీదుల ముందు కాషాయ జండాలతో ఊగిపోతూ మసీదులపై రాళ్ల దాడులు సైతం చెయ్యటం జరిగింది.

అనేక చోట్ల ముస్లిములను దేశం నుండి వెళ్లగొట్టాలన్న ప్రసంగాలే కాక, ముస్లిం యువకులను బూతులు, దుర్భాషలతో రెచ్చగొట్టటంతో రాళ్ల దాడులు జరిగాయి. ఇంకా అనేక ప్రాంతాల్లో మసీదులతో పాటు ముస్లిముల ఇళ్లను వారి వ్యాపార సంస్థలను కూడా టార్గెట్ చెయ్యటం జరిగింది.

అయితే వారి ఉన్మాదానికి రియాక్షన్ గా కొన్ని చోట్ల ముస్లిం యువకులు రాళ్లతో ఎదురుదాడికి దిగినప్పుడు మటుకు “చూసారా పాపం హిందువులు శాంతియుతంగా శోభాయాత్ర చేసుకుంటూ ఉంటే ముస్లిం మూకలు చూశారా ఎలా రాళ్ల దాడులు చేస్తున్నారో” అంటూ సోషల్ మీడియాలో సగం సినిమా చూపిస్తూ సామాన్య హిందూ ప్రజానీకం దృష్టిలో ముస్లిములు హిందూ వ్యతిరేకులన్నట్టు చిత్రీకరించే ప్రయత్నాలు యదేచ్చగా సాగిపోతున్నాయి.

శోభాయాత్రల పేరుమీద ఇంత ఆర్గనైజ్డ్ వైలెన్స్ జరుగుతున్నప్పటికీ మేయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా చర్చే లేదు! ఎంతో చక్కగా సోదరుల్లా కలిసుండే హిందూ-ముస్లిముల మధ్య ఇప్పుడు విద్వేషపూరిత వాతావరణం సృష్టించబడుతుంది.

ఒకప్రక్క ఇతర దేశాలు విద్య, వైజ్ఞానిక, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతుంటే.. మరోఒక్క భారతదేశంలో ప్రజలను శోభాయాత్ర పేరు మీద మసీదులు, మదర్శాలను తగలబెట్టేసే మతోన్మాదులుగా, ముస్లిం మైనార్టీలపై కారణం లేని కోపంతో రగిలిపోయే రాతియుగాల నాటి ఆటవికులుగా, అర్థం లేని శత్రుత్వంతో ఊగిపోతూ ఎందుకూ పనికిరాని ఐటం గాళ్ల మాదిరిగా మార్చిపరేసే ప్రయత్నాలు జరిగిపోతున్నాయి.

ఫాసిస్టు ఏజండాతో నడుపబడే ప్రభూత్వాల ద్వారా పాలించబడే ప్రజలు ఇలా కాక మరి ఇంకెలా తయారవుతారు? ఈ ఏజండా వలన దేశం మొత్తం ప్రమాదంలో పడుతుంది.

కాబట్టి సామాన్య హిందూ-ముస్లిం ప్రజానీకం మేల్కొనాలి. హిందూ-ముస్లిం సోదర భావం ఆధారంగా నిర్మాణమైన ఈ స్వంతంత్ర భారతదేశాన్ని మతోన్మాద శక్తుల విషపు కోరల నుండి రక్షించుకోవాలి. తమ భవిష్యత్ తరాల వారిని ఈ ఉన్మాదపు ప్రవాహంలో కొట్టుకుపోకుండా తక్షణమే కాపాడుకోవాలి.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *