ఇవన్నీ లవ్ జిహాద్ కేసులేనా?

“తన ప్రియురాలు నిక్కీ యాదవ్ ను చంపి ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో దాచిపెట్టిన ఆమె ప్రియుడు సాహిల్ గెహ్లాట్”…

“వరంగల్ లో రాహుల్ అనే వ్యక్తి ప్రేమ వేధింపులతో రక్షిత అనే అమ్మాయి ఆత్మహత్య”…

“మాట్లాడాలంటూనే లీలా పవిత్ర అనే అమ్మాయిని రోడ్డు మీదే 16 సార్లు కత్తితో పొడిచి చంపిన ఆమె ప్రియుడు దినకర్”…

“ఛత్తీస్ గడ్ లో తన ప్రియురాలైన ప్రియాంక సింగ్ ను చంపి శవాన్ని తమ మెడికల్ షాప్ లోనే నాలుగు రోజులు దాచిపెట్టిన ఆమె ప్రియుడు ఆశిష్ సాహు”…

“భర్త, అత్తలను చంపి వారి శవాలను ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో దాచిపెట్టిన హంతకురాలు వందన”…

ఈ క్రైమ్ స్టోరీలన్నీ ఈ మధ్య ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నా కంట పడినవే. ఇవి నా కంట పడ్డ అనేక క్రైమ్స్ లో గుర్తున్నవరకు కొన్ని మాత్రమే. ఇవి కాక దేశం మొత్తం మీద ప్రతీ రోజు భారతదేశంలో అత్యాచారానికి గురవుతున్న స్త్రీల సంఖ్య 87 మంది, ప్రతీ రోజు భారతదేశంలో హత్య చెయ్యబడుతున్నవారి సంఖ్య 82 మంది, వరకట్నం పేరుతో చంపబడుతున్న మహిళల సంఖ్య 19 మంది అని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NRCB) నే చెబుతుంది.

ఇవన్నీ లవ్ జిహాద్ కేసులేనా? ఈ నేరాలు చేస్తున్న వారంతా ముస్లిములేనా?

ఈ క్రైమ్ వార్తలన్నీ సోషల్ మీడియాలో ఊరి చివర పాడుబడ్డ సినిమా హాల్లో ఎవరూ పెద్దగా పట్టించుకోని రెండ్రోజుల్లో ఆడేసెల్లిపోయే అట్టర్ ప్లాప్ సినిమాల్లాగా అలా వచ్చి వెళ్లిపోయాయంతే.

ఈ క్రైమ్ వార్తల తాలూకు పోస్టులపై ఏవో కొన్ని ఎమోజీలు, ‘రెస్ట్ ఇన్ పీస్’ అంటూ కొందరి చప్పటి కామెంట్లు తప్ప ఆ సంఘటనలపై మామూలు సమయాల్లో “లవ్ జిహాద్ చేసి మా హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో చంపేస్తున్నవారంతా ముస్లిములేనని, దేశంలో జరిగే నేరాలన్నీ ముస్లిములే చేస్తున్నారని, ప్రతీ నేరమూ లవ్ జిహాదే” అని సోషల్ మీడియా/వాట్స్ యాపుల్లో గగ్గోలు పెట్టే కాషాయ సంఘీయులు కూడా అస్సలు పట్టించుకున్నట్లు నాకు కనపడలేదు.

కనీసం ఫేస్బుక్ నాస్తిక సెక్యులర్ అభ్యుదయ వాదులు సైతం సైలెంటైపోవటం జరిగింది.

ఆ ఇద్దరూ స్పందించకపోవటానికి కారణం ఇన్నేసి క్రైమ్స్ జరుగుతున్నా చంపిన మరియు చంపబడిన వారి పేర్లన్నీ హిందీ/తెలుగు పేర్లు అయి ఉండటం వల్ల అవేవీ “లవ్ జిహాద్”గా రూపాంతరం చెందలేదు కాబట్టి.

కానీ, ఇన్ని నేరాల్లో సోషల్ మీడియాలో బాగా ఫేమస్సైపోయిన ఒక వార్త ఈ మధ్య మెడికో విద్యార్థి ప్రీతి చనిపోవటం. ఎందుకంటే ఆమె మరణానికి సైఫ్ అనే తోటి విద్యార్థి అనుమానితుడవ్వటం. అతను ముస్లిం అవ్వటం వల్ల కాంట్రవర్షియల్ అయిందే తప్ప లేదంటే ఆమె చావు కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోని అనేక క్రైమ్ స్టోరీస్ లో ఒకటై ఉండేదంతే. ఈ సంఘటనను కాషాయ వేర్పాటువాదులు “లవ్ జిహాద్”గా మలుపు తిప్పేయటమే అసలు మ్యాజిక్. దానితో మేయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా మంది మసాలా వార్త దొరికినట్టైంది.

నేరాలు ఘోరాలు ఏ ఒక్క మతవర్గమో కాంట్రాక్ట్ తీసుకుని చెయ్యదు. నేరాలు చేసే దుర్మార్గుల పేర్లలో హిందూ/ముస్లిం/క్రైస్తవ పేర్లూ ఉండవచ్చు. దాన్ని బట్టి ఆయా మతాలకు చెందిన ప్రజలంతా నేరస్తులైపోరు!

దుర్మార్గులు ప్రతీ మత వర్గంలోనూ ఉంటారు. నేరం చేసిన వాడు ఏ మతానికి చెందిన వాడైనా వాణ్ణి నేరస్తునిగానే చూడాలి వాడికి శిక్ష పడాలని నినదించాలి.

ఏ నేరస్తుడికీ మతం ఉండదు. మతం తాలూకు స్పృహ ఉన్నవాడెవడూ నేరం చెయ్యడు. ఏ నేరస్తుడైననా అతను చేసే నేరాలను బట్టి వాడికి మతం అంటగట్టటం, ఆ ఒక్కణ్ణి బట్టి మొత్తం మతవర్గ ప్రజలందర్నీ బాధ్యులుగా చేసెయ్యటం కంటే పెద్ద మూర్ఖత్వం మరొకటి ఉండదు.

ఈ మూర్ఖత్వాన్నే ఆరెంజ్ బ్రదర్స్ మాటిమాటికీ వాట్స్ యాపుల్లో, ఫేస్బుక్కుల్లో ప్రదర్శిస్తుంటారు.

దేశంలో జరిగే అనేక నేరాల్లో ఎక్కడో ఒక ముస్లిం పేరు ఉంటే “మా మతం అమ్మాయిల్ని ముస్లిములు ట్రాప్ చేసి చంపేస్తున్నారని, లవ్ జిహాద్ తో మా జాతిని నాశనం చేసే ప్రాజెక్ట్ లో భాగంగా ఇదంతా జరుగుతుందని ఆ హత్య వెనుకాల పాకిస్తాన్ కుట్ర కూడా ఉండి ఉంటుందని ఈ ముస్లిముల కుట్ర నుండి దేశాన్ని కాపాడుకోటానికి మన కాషాయ సామ్రాట్ ను గెలిపించుకుంటేనే గానీ బతికిబట్ట కట్టలేమని తలాతోకా లేని పనికిమాలిన గాలి వార్తలన్నీ వాట్స్ యాపుల్లో కొన్ని రోజుల పాటు షేర్లు చేసుకుంటూ కూర్చునే లోపు కొన్ని వందల హత్యలు, హత్యాచారాలు దేశంలో జరిగిపోతుంటాయి. కాకపోతే ఆ నేరాల్లో నేరస్తుల పేర్లు హిందీ, తెలుగు భాషలకు చెందినవై ఉంటే మటుకు ఆ వార్తలు ఎవరూ పట్టించుకోని అనాధ వార్తల్లా మిగిలిపోతుంటాయి.

హిందూ-ముస్లిం పోలరైజేషన్ ఆధారంగా మతతత్వ రాజకీయాలు నడపటం వల్ల దేశం ఎలాంటి ప్రమాదకర దశలోకి వెళ్లిపోతుందో ఏ కాస్త ఆలోచన ఉన్నవారెవరైనా పై సంఘటనలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *