నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NRCB) గణాంకాల ప్రకారం ప్రతీ రోజు భారతదేశంలో వరకట్నం పేరుతో చంపబడుతున్న మహిళల సంఖ్య 19 మంది.. అంటే సంవత్సరానికి సుమారుగా 7000 మంది మహిళలు వరకట్నం పేరుతో చంపబడుతున్నారు!
అదే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NRCB) ప్రకారం ప్రతీ రోజు భారతదేశంలో అత్యాచారానికి గురవుతున్న స్త్రీల సంఖ్య 87 మంది. అంటే సంవత్సరానికి సుమారుగా 32000 మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. ఈ సంఖ్య సంవత్సరానికోసారి 20% పెరుగుతుంది కూడా.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NRCB) ప్రకారమే ప్రతీ రోజు భారతదేశంలో హత్య చెయ్యబడుతున్నవారి సంఖ్య 82 మంది. ప్రతిరోజు కిడ్నాప్ కు గురవుతున్నవారు 11 మంది. ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో అత్యధికంగా హత్యలు, క్రైమ్స్ జరుతున్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి.
దీనిని బట్టి భారతదేశంలో సుమారుగా ప్రతీ 5 నిముషాలకోసారి ఏదో ఒక నేరం జరుగుతుందన్నమాట!
ఎవరీ నేరస్తులంతా?
ప్రతీ సంవత్సరం లక్షల్లో రికార్డవుతున్న క్రైమ్ కేసుల్లో నేరస్తులంతా ఎవరు? హిందువులా? ముస్లిములా? క్రైస్తవులా?
ఒకవేళ ఈ నేరస్తుల్లో ఎవడిపేరైనా అబ్దుల్లా అనో ఆఫ్తాబ్ అనో ఏదో ఒక ఉర్దూ పేరుంటే వాడిని ముస్లింగా జమకట్టి వాడిని ఇస్లాం నేరాలు చెయ్యమని ప్రోత్సహిస్తుంది కాబట్టే వాడు ఆ నేరం చేసుంటాడని భావించవచ్చా?
ఒకవేళ ఈ నేరస్తుల్లో ఎవడిపేరైనా రామ్ అనో, రాజేష్ అనో ఏదో ఒక హిందూ పేరుంటే వాడిని హిందువుగా జమకట్టి వాడిని హిందూత్వం అలాంటి నేరం చెయ్యమని ప్రోత్సహిస్తుంది కాబట్టే వాడు ఆ నేరం చేసుంటాడని భావించవచ్చా?
ఒకవేళ ఈ నేరస్తుల్లో ఎవడిపేరైనా రాబర్ట్ అనో, డేవిడ్ అనో ఏదో ఒక క్రైస్తవ పేరుంటే వాడిని క్రైస్తవుడిగా జమకట్టి వాడిని క్రైస్తవ్యం అలాంటి నేరం చెయ్యమని ప్రోత్సహిస్తుంది కాబట్టే వాడు ఆ నేరం చేసుంటాడని భావించవచ్చా?
ఈ నేరస్తులకు మతం అంటగట్టటమే పెద్ద నేరం, వారిని హిందూ-ముస్లిం-క్రైస్తవులనే ఐడెంటిటీతో కాక వారిని నేరస్తులుగానే పరిగణించటం కరెక్టని కనీస మానవత్వం ఉన్నోలెవరైనా చెప్పేమాటే!
కానీ, చాలా ఆశ్చర్యంగా ఇన్ని లక్షల క్రైమ్స్ లో ఖర్మకాలి ఆ నేరస్తుల్లో ఎవడి పేరైనా ఏ అబ్దుల్లా అనో, ఆఫ్తాబ్ అనో ఉంటే అది దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అయి కూర్చుంటుంది. కాంతార క్లైమాక్స్ లో హీరో పూనకం వచ్చి ఊగిపోయినట్టు సోషల్ మీడియాలో కొందరు ఇస్లామోఫోబియాతో ఒక్కసారిగా పూనకం వచ్చినట్టు రెచ్చిపోవటం మొదలెడతారు. వారి ఫేక్ మెసేజులతో వాట్స్ యాప్ యూనివర్సిటీ దద్దరిల్లిపోతుంది.
ఆ నేరస్తుడు చేసే నేరానికి మొత్తం ముస్లిం సమాజాన్ని నేరస్తులుగా బోనులో నిలబెట్టేయటం జరుగుతుంది. “హిందూ ఖత్రేమే హై” అనే స్లోగన్స్ తో ఈ దేశానికి ముస్లిములు ఎంతో ప్రమాదకారులు అంటూ మత ఉన్మాదులు ఇష్టమొచ్చిన విమర్శలతో రెచ్చిపోవటం మొదలెడతారు.
ఆఫ్తాబ్ పునావాలా అనే ఒకడు తనతో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధావాల్కర్ అనే అమ్మాయిని చంపి ముప్ఫై అయిదు ముక్కలు చేశాడన్న వార్త వెలువడినప్పుడు సోషల్ మీడియాలో అతను ముస్లిమా? ఫార్సీనా? అన్న చర్చ మొదలైపోయింది.
అచ్చం వీడికిలానే డెహ్రాడూన్ లో రాజేష్ గులాటీ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన భార్య అనుపమను హత్య చేసి ఆమె శరీరాన్ని 72 ముక్కలు చేసి ఫ్రీజర్ లో దాచిపెట్టాడు. వర్జీనియాలో జూన్ 2004 న ప్రవీణ్ నందనపు అనే అచ్చ తెలుగు అబ్బాయి తన 28 ఏళ్ల భార్య దివ్యను హత్య చేసి ముక్కముక్కలుగా నరికి బ్యాగుల్లో పెట్టి డంప్ యార్డుల్లో విసిరి పారేశాడు.
కానీ ఆయా నేరాలు జరిగినప్పుడు వారిని మీడియా నేరస్తులుగానే పరిగణించటం జరిగింది తప్ప వారి పేర్లను బట్టి వారిని హిందువులని చెప్పి హిందూత్వాన్ని మధ్యలో తేలేదు. భారత దేశంలో 80% హిందువులు, 14% ముస్లిములు, 5% క్రైస్తవులు ఉంటే లక్షల్లో నమోదవుతున్న నేరాల్లో అదే నిష్పత్తిలో నేరస్తులు కూడా ఉంటారు! తప్పితే క్రిమినల్స్ అంతా ఒక మతవర్గంలో మంచోళ్లంతా ఒక మతవర్గంలో ప్లాన్ చేసుకుని పుట్టరు. కానీ నేడు ముస్లిములంతా దురాక్రమణ దారులు, నేరస్తులు, హిందూ వ్యతిరేకులన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నాలు బాహాటంగా జరుగుతున్నాయి. ఈ రకమైన భావజాలాన్నే నేడు కొందరు దేశ భక్తి అని భావిస్తూ భ్రమల్లో బ్రతుకుతున్నారు.
ఎనిమిదేళ్ల ఆసిఫా అనే పాపను గుళ్లో పెట్టి రేప్ చేసి చంపినప్పుడు గానీ, బిల్కిస్ బానోను ఆమె కళ్ల ముందే ఆమె కుటుంబాన్ని చంపి ఆమెను అత్యాచారం చేసినప్పుడు గానీ ఈ దేశ ముస్లిములు ఆ ఘోరాలను ఖండించారే తప్ప ఆయా నేరస్తులను బట్టి హిందూత్వాన్ని ఎప్పుడూ దూషించలేదు. కానీ సంఘ్ పరివార్ సభ్యులైతే ఆయా నేరస్తులను విడుదల చెయ్యాలని రోడ్లపై ర్యాలీలు తీశారు వారిని జైళ్ల నుండి విడుదల చేసినప్పుడు పండుగ చేసుకున్నారు.
అస్సాం సీ.యం హేమంత బిశ్వ శర్మ “దేశంలో బలమైన నాయకుడు లేకపోతే ఆఫ్తాబ్ పునావాలా లాంటి వారు ఊరుకొకరు పుట్టుకొస్తారని” బహిరంగంగా చెప్పటాన్ని బట్టి మతతత్వ పార్టీల లక్ష్యం ఏమిటో స్పష్టంగా కనిపెట్టవచ్చు. అంటే దేశంలో జరుగుతున్న నేరాలన్నీ చేస్తుంది ఒక్క ముస్లిములే అన్నది అతని ఉద్దేశమా?
నేరం చెయ్యాలన్న ఆలోచన వచ్చినప్పుడే మనిషి తన మానవత్వాన్ని వదులుకుని మృగంగా మారిపోతాడు అలాంటి వాడి పేరును బట్టి మతం అంటగట్టటం, వాడిని బట్టి ఆ మత వర్గాన్నంతటినీ విమర్శించటానికి మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు.
నిజంగా ఆ సోకాల్డ్ ముస్లిమైన ఆఫ్తాబ్ పునావాలా ఇస్లాంను అనుసరించేవాడే అయితే “పరాయి స్త్రీని కనీసం కన్నెత్తి కూడా చూడవద్దని” వారిస్తున్న ఖురాన్ ఆదేశాన్ని బట్టి ముందుగా ఓ మహిళతో పెళ్లికాకుండా లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ లోనే ఉండేవాడు కాదు. “ఒక మానవుణ్ణి చంపితే సమస్త మానవాళిని చంపినట్టే” అన్న ఖురాన్ ఆదేశం ప్రకారం ఆ అమ్మాయికి ఎటువంటి హానీ తలపెట్టి ఉండేవాడు కాదు. కానీ వాడు ముస్లిం కాదు వాడొక ఉన్మాది. కొందరు మతోన్మాదులు వాడికి మతాన్ని అంటగట్టే ప్రయత్నంలో ఉన్నారు.
అలాగే తమ భార్యల్ని ముక్కలుముక్కలుగా చేసి చంపేసిన రాజేష్, ప్రవీణ్ లు హిందూ పేర్లు పెట్టుకున్న సోకాల్డ్ హిందువులని చెప్పాలి. నిజంగా వారు హిందూ శాస్త్రాల్ని అనుసరించి ఉంటే తమ స్త్రీలను అత్యుత్తమంగా గౌరవించి ఉండేవారు. కానీ వారు హిందువులు కారు కేవలం ఉన్మాదులు.
తమ రాజకీయ అధికారాన్ని కాపాడుకోటానికి ఒక మైనారిటీ వర్గాన్ని శత్రువుగా చూపిస్తూ మెజారిటీ వర్గ ప్రజల భావోద్వేగాలను మతపరంగా రెచ్చగొట్టే రాజకీయ నాయకుల కుట్రల్ని కనిపెట్టకుండా అనవరమైన బావోద్రేగాలకు గురైపోయి పరమత ద్వేషాన్ని పెంచుకుంటూ పోతే దేశం అత్యంత ప్రమాదకరమైన స్థితిలోకి జారిపోతుందనటంలో ఎటువంటి సందేహమూ లేదు.
ఈ నేరస్తులంతా ముస్లిములా? /-
