ఆల్ రేప్స్ ఆర్ నాట్ సేమ్!

ఆ రోజు రాత్రి బిల్కిస్ బానో బంధువుల్ని అత్యాచారం చేసి చంపేసి, ఆమె కళ్ల ముందే మూడేళ్ల కూతుర్ని హత్య చేసి ఆపై ఆమెను కూడా గ్యాంగ్ రేప్ చేసి తీవ్ర రక్త స్రావం అవుతున్న స్థితిలో నగ్నంగా రోడ్డు మీద పడేసి ఆమె చనిపోయుంటుందని అనుకుని వదిలేసి పారిపోయిన ఆ 11 మంది నేరస్తులు ఎంతో విలువలు, సంస్కారమున్నవారు పైగా బ్రాహ్మణోత్తములు కాబట్టి వారికి జైల్లో స్వల్పమైన శిక్ష విధించి వదిలేయటమే న్యాయమని అధికార కాషాయ పార్టీ నాయకులే క్లారిటీ ఇవ్వటం, అలాంటి తీవ్ర నేరస్తుల్ని ఆగస్టు 15 నాడే దేశ న్యాయస్థానం విడుదల చెయ్యటం ఒక ఎత్తైతే ఈ సంఘటనపై దేశంలో ఏ కొద్ది మందో తప్ప మొత్తమందరూ మాట్లాడకుండా మౌనం వహించటం మరింత ఆశ్చర్యకరమైన విషయం.

నిర్భయ సంఘటన జరిగినప్పుడు దేశం మొత్తం కదిలిపోయింది. సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు ఆ నేరస్తులకు తగిన కఠిన శిక్ష పడాలని ఎంతైతే నినాదాలు చేశారో ఇప్పుడంత సైంలెంటైపోయారు. బిల్కిస్ బానో 15 ఏళ్ల తీవ్ర పోరాటం సాగించిన తరువాత ఆ నేరస్తులకు ఎలాగోలా శిక్ష పడింది. అన్నాళ్లు ఆమె న్యాయపోరాటం చెయ్యటానికి కారణం దేశ న్యాయస్థానాలపై వాటి చట్టాలపై ఆమెకున్న నమ్మకం కాబోలు.

నిర్భయ సంఘటన జరిగినప్పుడు దేశంలో సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు, అధికారుల నుండి అభ్యుదయవాదుల వరకు నోరు మెదపటానికి కారణం ఆమె ముస్లిం కాకపోవటం, బిల్కిస్ బానో ముస్లిం అవ్వటం, పైగా నిర్భయ సంఘటనలో న్యాయస్థానం నేరస్తులకు 5 యేళ్లకే మరణ శిక్ష విధించటం, బిల్కిస్ బానోను రేప్ చేసిన నేరస్తులను 15 ఏళ్ల తరువాత అదే న్యాయస్థానం స్వల్ప శిక్ష విధించి చివరకు ఆమెను రేప్ చేసినవారు ఎంతో సంస్కారవంతులని తీర్మానించి వారిని ఊరిమీదకొదిలేసి ఆమెకో న్యాయం ఈమెకో న్యాయం చేసినప్పుడు దేశంలో జరిగే “ఆల్ రేప్స్ ఆర్ నాట్ సేమ్” అని చెప్పటం అతిశయోక్తి కాదు.

“ఆ నేరస్తులను నేరాన్ని రద్దు చేసి వదిలేయటం కరక్టే అయితే నా పై జరిగిన దౌర్జన్యాన్ని కూడా రద్దు (undo) చేసి నన్ను మొదటి స్థితికి తీసుకురాగలరా?” అంటూ బిల్కిస్ బానో సంధించిన ప్రశ్నకు బహుశా న్యాయస్థానాల దగ్గర కూడా సమాధానం ఉండదు కాబోలు. అలా జరగాలంటే కాలాన్ని ఓ 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లగలగాలి.

ఖాళీ సమయాల్లో హిజాబ్ బుర్ఖాల గురించి మాట్లాడే సోకాల్డ్ ఫెమినిస్టులు, హిజాబ్ వల్ల ముస్లిం మహిళలు అణచివెయ్యబడుతున్నారని తెగబాధ పడిపోయి పొడవాటి వ్యాసాలు రాసిపడేసే ఫేస్బుక్ అభ్యుదయవాదులు సైతం ఇప్పుడు నోరు మెదపకుండా సైలెంటైపోవటం కూడా ఒక రకంగా ఆశ్చర్యకరమైన విషయమే.

జస్ట్ అధికార కాషాయ పార్టీని సమర్ధిస్తే చాలు గ్యాంగ్ రేప్ చేసినోళ్లైనా ఈజీగా బయటపడిపోవచ్చంటే దేశంలో స్త్రీల భవిష్యత్తు ఎంత ప్రమాదకరంగా మారబోతుందో అంచనా వెయ్యటానికి ఆ రేపిస్టులు జైలు నుండి ఘన స్వాగత సత్కారాలతో విడుదల కాబడటమే గొప్ప ఉదాహరణ అని చెప్పటంలో సందేహం లేదు.

ముస్లిం దేశాల్లో విధించే కఠిన శిక్షలను ఆటవిక చట్టాలంటూ విమర్శించిన వారు సైతం నిర్భయ సంఘటన జరిగినప్పుడు రేపిస్టులకు అలాంటి కఠిన శిక్షలు భారత దేశంలో లేకపోవటం వలనే ఇక్కడ రేపులు పెరిగిపోతున్నాయని అలాంటి కఠిన శిక్షలు ఈ దేశంలో సైతం అమలు చెయ్యాలంటూ నినాదాలు లేవనెత్తారు.

కచ్చితంగా శిక్షలు కఠినంగా ఉన్నప్పుడు అవి కులమతాల కతీతంగా సమన్యాయంతో అమలు కాబడినప్పుడే నేరాలు నియంత్రించబడతాయి. ఇది వాస్తవం. “అయినా రేప్ చేసినంత మాత్రాన మరణ శిక్ష విధించటం ఎంతవరకు న్యాయం” అంటూ సోది చెప్పే కొందరు అభ్యుదయవాదులకు ఒక స్త్రీని రేప్ చేసి అవసరమైతే చంపేసేంత కఠిన నిర్ణయం తీసుకునే మానవ మృగానికి శిక్ష కూడా అంతే కఠినంగా ఎందుకుండకూడదు? అన్న ఆలోచన ఎందుకు రాదన్నదే అర్థం కాని విషయం.

నిర్భయ సంఘటన జరిగినప్పుడు రేపిస్టులకు శిక్ష పడాలని ప్రజలు క్యాండిల్ మార్చులు చేసిన స్థితి నుండి.. నేడు జైలు నుండి విడుదలైన రేపిస్టులు పూల హారాలతో సత్కరించబడే స్థితికి చేరుకున్న నేపథ్యంలో దేశంలో విద్యావంతులు, ఆలోచనాపరులు, ప్రముఖులు సైతం మాట్లాడకుండా మౌనం వహిస్తే దేశం మరింత ప్రమాదకమైన పరిస్థితిలోకి జారిపోతుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *