వందలాది ముస్లిమేతర ఇస్లాం విమర్శకుల కంటే ఇస్లాం అవగాహన లేని ఒక్క నామమాత్ర ముస్లిమే నిజానికి ముస్లిం సమాజానికి అత్యంత ప్రమాదకరం.
****
సల్మాన్ రష్దీ’ తాను రాసిన ‘సటానిక్ వర్సెస్’ పుస్తకం ద్వారా ప్రపంచం మొత్తానికి సుపరిచితుడైన కాంట్రవర్షియల్ రచయిత. న్యూయార్క్ నగరంలో అతనిపై జరిగిన ఆకస్మిక దాడి వలన మరలా ఇతని పేరు తెరమీద కొచ్చింది. కాదు, తెరమీదకు తీసుకురాబడింది.
బహుశా సల్మాన్ రష్దీ 1988 లో ‘సటానిక్ వర్సెస్’ పుస్తకం రాసిన తరువాత 1989 లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఆయతుల్లా ఖుమైనీ అతన్ని చంపాల్సిందిగా ఫత్వా జారీ చేసి ఉండి ఉండకపోతే బహుశా సల్మాన్ రష్దీ ప్రపంచానికి ఇంతగా పరిచయం అయి ఉండేవాడు కాదేమో
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 16, ఏప్రిల్ 1979 లో టైమ్ మేగజైన్ ఒక సర్వే నిర్వహించి 1800 సం. నుండి 1950 మధ్య కాలంలో ఇస్లాంకు వ్యతిరేకంగా అక్షరాలా 60,000 పుస్తకాలు రాయబడ్డాయన్న విషయాన్ని ప్రచురించింది. అంటే సుమారుగా రోజుకు 1 యాంటీ ఇస్లామిక్ పుస్తకం రాయబడిందన్న మాట.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే నిజానికి సల్మాన్ రష్దీ ఇస్లాంకు, ప్రవక్త ముహమ్మద్(స) వారిని విమర్శిస్తూ పుస్తకం రాసి ఎవరూ చెయ్యలేని పెద్ద ఘనకార్యం ఏమీ చెయ్యలేదు. అరవై వేల యాంటీ ఇస్లామిక్ పుస్తకాలో ఒకానొక పుస్తకం సల్మాన్ రష్దీ రాసిందని చెప్పవచ్చు. అన్ని వేల పుస్తకాలు రాయబడినా, ఇస్లాంకు వ్యతిరేకంగా ఎన్ని సినిమాలు తీసినా ఇస్లాంకు డ్యామేజ్ జరగటం మాట ప్రక్కన పెడితే ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం అతివేగంగా వ్యాపి చెందటం ఆగలేదు. యూరప్, అమెరికా, బ్రిటన్ వగైరా దేశాల్లో ఇస్లాంను పరిశీలించి తెలుసుకుని దానిని స్వీకరించే వారి సంఖ్య కూడా అరవై వేల యాంటీ ఇస్లామిక్ పుస్తకాలకు పదిరేట్లు పెరుగుతూ పోయింది.
నిజానికి ఆయా అరవై వేల ఇస్లాం వ్యతిరేక రచయితల పేర్లేవీ ప్రపంచానికి పెద్దగా తెలీదు. బహుశా ఆయతుల్లా ఖుమైనీ ఆనాడు తీవ్రమైన ఫత్వా జారీ చేసి ఉండకపోతే ‘సతానిక్ వర్సస్’ పుస్తకం ద్వారా సల్మాన్ రష్దీ కూడా పెద్దగా ఫేమస్ అయి ఉండేవాడు కాదు.
ఇక్కడ ఆలోచించాల్సింది సల్మాన్ రష్దీని చంపేయాల్సిందిగా ఫత్వా జారీ చేసినంత మాత్రానా లేక అతనిపై దాడి చేసినంత మాత్రానా ప్రవక్త ముహమ్మద్ (స) వారి గౌరవం కాపాడబడుతుందా? అన్నది.
నిజంగా ప్రవక్త ముహమ్మద్(స) వారిపై అంత వల్లమాలిన అభిమానం ఉన్నప్పుడు ఆనాడు ఆయతుల్లా ఖుమైనీ సల్మాన్ రష్దీని పిలిపించి అతను రాసిన పుస్తకంపై బహిరంగ డిబేట్ ఏర్పాటు చేసి అతను రాసిన అసత్యాలను ప్రజల ముందే పబ్లిగ్గా ఎండగట్టి ఉండాల్సింది. లేదా అతను రాసిన ‘సటానిక్ వెర్సస్’ పుస్తకాని సమాధానంగా ‘ది ఆన్సర్ ఆఫ్ సటానిక్ వర్సర్’ అనే పుస్తకం రాయించి విడుదల చెయ్యాల్సింది.
అదే అతను రాసిన పుస్తకంపై అతనిపై చేసే నిజమైన ఎటాక్ అయ్యుండేది తప్ప వాస్తవానికి అతన్ని చంపేసినంత మాత్రానా ఇంకా అరవై వేల యాంటీ ఇస్లామిక్ పుస్తకాలు రాసిన మిగతా సల్మాన్ రష్దీ లాంటోల్ల సంగతేంటి?
న్యూయార్క్ నగరంలో సల్మాన్ రష్దీపై దాడి చేసిన ఆ బుర్ర తక్కువ వెధవకు ఇంత ఆలోచన గానీ జ్ఞానం గానీ లేదు. వాడు చేసిన వెధవ పనికి “ఇది ఫ్రీడం ఆఫ్ స్పీచ్ పై జరిగిన దాడి”గా మీడియా ప్రచారం చేసుకుంటుంది. తిరిగి ‘సటానిక్ వర్సర్’ పుస్తాకాల అమ్మకాలు ఊపందుకున్నాయి.
పైగా ఇది ఇక్కడితో ఆగదు. ఇస్లామోఫోబియా మరింత పెరగటానికి దోహదపడుతుంది. అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని మాటువేసుకుని కూర్చునే ఇస్లామోఫోబులు సల్మాన్ రష్దీపై సానుభూతి చూపెట్టటం మొదలెడతారు. మరోప్రక్క సోషల్ మీడియా అభ్యుదవాదుల సంఘం సల్మాన్ రష్దీని అడ్డం పెట్టుకుని అసలు ప్రవక్త ముహమ్మద్(స) బహుభార్యత్వం కలిగి ఉండటమేంటి అన్న పాయింటు నుండి మొదలెట్టి బురఖా వరకు సంబంధంలేని పనికిమాలిన వ్యాసాల్ని రాసిపడేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
నిజంగా ఇస్లాంను అనుసరించే, ప్రవక్త ముహమ్మద్ (స) వారిని ప్రేమించే నిజమైన ముస్లిములు చెయ్యాల్సింది ఇస్లాం విమర్శకులపై దాడి చెయ్యటం కాదు.. చెయ్యాల్సిన పని ఆయా విమర్శలకు తగ్గటు సరైన సమాధానాలు యుక్తిగా, సంస్కారవంతంగా చెప్పటం. ఇది స్వయంగా ప్రవక్త ముహమ్మద్(స) ఆయన శిష్యులు అవలంబించిన విధానం కూడా.
ఈ విధానం ద్వారానే ప్రవక్త ముహమ్మద్(స) పై చెయ్యబడే విమర్శల నుండి ఆయన గౌరవం కాపాడబడుతుంది తప్ప విమర్శకులపై భౌతిక దాడులకు దిగటం వల్ల ఆయన గౌరవం కాపాడబడటం ప్రక్కన పెడితే పనికట్టుకుని ఆయన గౌరవం దిగజార్చటమే అవుతుంది.
ఇస్లాం అవగాహన లేని కొందరు నామమాత్ర ముస్లిములు చేస్తుంది అదే.
