ముస్లిములను అణచాలని, వారిని హింసించాలన్న ఉన్మాదంతో ఊగిపోతూ ‘హలాల్ సర్టిఫికేషన్’పై నేడు కొన్ని హిందుత్వ సంస్థలు చేస్తున్న దాడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో భారతదేశ వ్యాపార సంస్థలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందో వారికి ఏమాత్రం అవగహాన లేదు.
ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అంశమా?
మెళ్లో కాషాయ కండువాలు వేసుకుని వాట్స్ యాపుల్లో వచ్చే పావలా మెస్సెజులు చదివేసి హలాల్ అంటే ఏమిటో కనీస అవగాహన లేకుండానే ‘హలాల్ ను బ్యాన్’ చెయ్యాలని పూనకం వచ్చినట్లు డ్యాన్స్ చేస్తున్నవారు కనీస లోక జ్ఞానం లేని అమాయకులని చెప్పాలి.
వీరు ముస్లిములంటే ఒక్క భారతదేశంలో మాత్రమే ఉన్నారనుకుంటూ ఉంటారు.
ప్రపంచంలో యాభై కి పైగా ముస్లిం దేశాలున్నాయని గానీ, అంతర్జాతీయంగా ‘హలాల్’ ప్రొడక్ట్స్ కు 42.5% మార్కెట్ షేర్ ఉంది అని గానీ, ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.6 ట్రిలియన్ డాలర్ల హలాల్ ప్రొడక్ట్స్ టర్నోవర్ జరుగుతుంటాయని వీరికి తెలీదు.
అంతేకాదు, ‘వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ’ ప్రకారం భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి అయ్యే ఆహార ఉత్పత్తులలో హలాల్ ఆవు, గేదె మాంసాలు మూడవ స్థానంలో ఉన్నాయన్న విషయం వీరికి అస్సలు తెలీదు. ఒక్క 21-22 సం.లో హాంకాంగ్, వియత్నాం, మలేషియా, ఈజిప్ట్ మరియు ఇండోనేషియా వంటి ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశాలకు భారతదేశం నుండి ఎగుమతైన గేదె మాంసం ఎగుమతుల విలువ రూ. 23,460 కోట్లు! ఇది ఎంత మందికి తెలుసు?
‘హలాల్ సర్టిఫికేషన్’ ఎందుకు?
‘హలాల్ సర్టిఫికేషన్’ వల్ల ముస్లిం సమాజం ‘ఏకనమికల్ జిహాద్’ చేస్తుందని, దాని వల్ల వచ్చే డబ్బుతో టెర్రరిస్ట్ గ్రూపులకు ఆర్థిక సహాయం అందుతుందని వాట్స్ యాపుల్లో వచ్చే చిల్లర మెసేజులు చదివి నిజమే అని నమ్మేసి ముస్లిం సమాజాన్ని దెబ్బతీయాలన్న ఉన్మాదంతో హలాల్ బ్యాన్ చెయ్యాలంటూ తమ కాళ్లపై తామే గొడ్డలితో నరుక్కోబోతున్నారన్న సంగతి వీరికి తెలీదు.
భారతదేశం నుండి ఎగుమతయ్యే “కాస్మోటిక్స్, లిప్ స్టిక్స్, మాయిశ్చరైజర్స్, బిస్కెట్లు, కేకులు, ఐస్ క్రీమ్స్, పిజ్జాలు, అనేక ఆహారపదార్థాలు, కొన్ని రకాల మెడిసిన్స్ వంటి వాటిలో పంది, కుక్కల కొవ్వులు కలపలేదని, అంతేకాక వాటిలో ‘ఆల్కహాల్’ను కలుపలేదని ఇంకా ‘గ్లిసరిన్’ ‘జిలాటిన్’ లాంటి పదార్థాలు హానికరమైన ‘పంది కొవ్వు’ నుండి సేకరించినవి కాదని నిర్ధారించటానికి మాత్రమే ‘హలాల్’ సర్టిఫికేషన్ తీసుకోవటం జరుగుతుంది.
ఈ పదార్థాల వల్ల ఆరోగ్యానికి ఎంత హాని ఉందో తెలుసుకుంటే ఎవరైనా హలాల్ ప్రొడక్ట్స్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు.
ఇండియాతో సహా అంతర్జాతీయంగా మార్కెట్లో “హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్“ కు వేల కోట్ల రూపాయల డిమాండ్ ఉండటం వలన ఇండియాలోనే కాక ఫారిన్ కంట్రీస్ కు తమ ప్రొడక్ట్స్ ఎగుమతి చేసే అతిపెద్ద కంపెనీలన్నీ హలాల్ సర్టిఫికేషన్ అదనంగా తీసుకుంటూ ఉంటాయి.
హలాల్ సర్టిఫికేషన్ బ్యాన్ వల్ల ముస్లిములు నష్టపోతారా?
హలాల్ సర్టిఫికేషన్ బ్యాన్ చెయ్యటం వల్ల ముస్లిములు నష్టపోతారని అనుకోటానికి మించిన పరమ మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఎందుకంటే ‘హలాల్’ సర్టిఫైడ్ ఫుడ్స్ అమ్ముతున్న లేక ఎగుమతి చేస్తున్న కంపెనీలు కేవలం ముస్లిములకు చెందినవి మాత్రమే కావు.
అంతర్జాతీయంగా ప్రొడక్ట్స్ ను ఎగుమతి చేసే కంపెనీల్లో కొన్ని- ‘ఆదానీ విల్మర్’ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ ‘టాటా కన్స్యూమర్ & కెమికల్ ’ ‘పార్లే’ ‘హిందుస్తాన్ యూనీలివర్ లిమిటెడ్’ ‘కృష్ణ ఇండస్ట్రీస్’ ‘క్వాలిటీ ఫుడ్స్’ ‘అమూల్’ ‘డాబర్’ ‘మిల్క్ డైరీ’ ‘నెస్ట్లే’ లాంటి ప్రముఖ కంపెనీలు మాత్రమే కాదు చివరకు ‘పతాంజలి’ సైతం హలాల్ సర్టిఫికేషన్ తో తమ ప్రొడక్స్ ను ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్ముతుందని చాలా మందికి తెలీదు. చివరకు ITC, Mc Donald’s, KFC లాంటి కాంపెనీలు కూడా ముస్లిం సంస్థలు కావు.
ఇవేమీ ముస్లిముల కంపెనీలు కావు. అలాంటప్పుడు వీరంతా హలాల్ సర్టిఫికేషన్ తీసుకుని హలాల్ మాఫియా నడుపుతున్నారని అనుకోవచ్చా?
హలాల్ బ్యాన్ చెయ్యటమంటే మార్కెట్లో కనపడే ఓ నాలుగైదు ముస్లిముల చికెన్, మటన్ షాపుల్ని మూయించేయటం కాదు.. వేల కోట్ల రూపాయల ఎగుమతి చేస్తున్న పై భారతదేశ వ్యాపార సంస్థలన్నిటినీ మూయించేయటం అవుతుంది. భారతదేశపు వేల కోట్ల రూపాయల టర్నోవర్ ను కుప్పకూల్చటం అవుతుంది.
ఈ విషయాన్ని హలాల్ బ్యాన్ చెయ్యాలని చెయ్యెత్తే ముందు కొద్దిగా ఆలోచించుకోవాలి.
‘హలాల్’పై దాడి – భారతీయ వ్యాపారాలపై ప్రభావం /-
