



123 ఊళ్లు వేలకొద్దీ ఇళ్ల సమూల నాశనం…
రెండు నెలల పాటు సాగిన మారణ హోమం…
2 లక్షలకు పైగా ముస్లిముల సామూహిక జనహననం…
అనేక మంది ముస్లిం మహిళల అపహరణలు, అత్యాచారాలు…
లక్షల కొద్దీ జమ్మూ ముస్లిముల బలవంతపు తరలింపులు…
ఇదీ జమ్మూ-కాశ్మీర్ లో హిందూ పాలకులు అధికారంలో, ముస్లిములు పాలితులుగా ఉన్నప్పుడు సాగిన అతి దారుణమైన మారణకాండ. 2002 వ సం.లో గుజరాత్ లో హిందుత్వవాదులు సాగించిన నరమేధం గురించి మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ, అంతకంటే ఘోరమైన మారణకాండ 1947 అక్టోబర్-నవంబర్ మధ్య జమ్మూలో జరిగింది. అది రాజా హరి సింగ్ ఆధ్వర్యంలో తీవ్రవాద డోగ్రా సైన్యాలు మరియు ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు కలిసికట్టుగా జమ్మూ ముస్లిములపై సాగించిన దారుణ హత్యాకాండ. ఈనాటికీ అది “జమ్మూ ఊచకోత (Jammu massacre)” పేరుతో చరిత్రలో మరుగున పడి ఉంది.
కాశ్మీర్ లోయ నుండి కాశ్మీరీ పండిట్ల వలసలు, వారిలో కొందరి హత్యలను ఆధారం చేసుకుని ఒకవైపు హిందూ-ముస్లిం వేర్పాటువాద రాజకీయాలు, మరోవైపు మత విధ్వేషాలు ప్రణాళికాబద్దంగా నడుపబడుతున్న ప్రస్తుత నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన వాస్తవ సంఘటన ఇది.
భారతదేశ విభజన తర్వాత, 1947 అక్టోబర్-నవంబర్ నెలల్లో జమ్మూ మరియు కాశ్మీర్ రాచరిక రాష్ట్రంలోని హరి సింగ్ ఆధ్వర్యంలో జమ్మూ ప్రాంతంలో లక్షల కొద్దీ ముస్లింలు చంపబడ్డారు, వారి ఇళ్లు దోచుకోబడ్డాయి, తగలెట్టబడ్డాయి, వారి స్త్రీలు అపహరణలకు అత్యాచారాలకు గురయ్యారు. ఈ హత్యలన్నీ అతివాద హిందుత్వ గ్రూపులు మరియు సిక్కులచే నిర్వహించబడ్డాయి. హరి సింగ్ తన సైన్యాలు మరియు ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ (RSS) కార్యకర్తల మద్దతుతో అల్లర్లను ప్లాన్ చేయడంలో మరియు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దాదాపుగా 2 లక్షల మందికి పైగా ముస్లింలు ఊచకోత కోయబడ్డారు.
ఇవన్నీ నేడు హిందూ-ముస్లిముల మధ్య ధ్వేషాన్ని రగిలించటానికి అబద్ధాలతో అల్లబడ్డ “కాశ్మీరీ ఫైల్స్” సినిమాను చూసి ముసలి కన్నీళ్లు కార్చుతున్న వారికి బహుశా తెలీని వాస్తవాలు. అవాస్తవాలతో అల్లబడిన ఈ సినిమాను “బాలీవుడ్” సైతం ఇప్పుడు “గోదీవుడ్” గా మారిపోయి ప్రమోట్ చేస్తుంది.
ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో దేశ విభజన తరువాత పక్కా ఫాసిస్ట్ భావాలున్న రాజా హరిసింగ్ ఆర్.ఎస్.ఎస్ మద్దతుతో మారణ హోమాన్ని సృష్టించటానికి ప్రణాళికలు వేశాడు. దానికి కారణం అప్పటికే జమ్మూ-కాశ్మీరులో ముస్లిములు మెజారిటీ స్థానంలో ఉండటం. ఒక్క జమ్మూలోనే ముస్లిముల సంఖ్య 63% ఉండేది, కాశ్మీర్ లో 90% ముస్లిములుండేవారు. వారి జన సంఖ్యను తగ్గించాలంటే వారిని నిర్దాక్షనీయంగా చంపేయాలనే దుర్మార్గపు మార్గాన్ని ఎన్నుకున్నాడు.
అక్టోబర్ 14 నుండి హరిసింగ్ సైన్యాలు, ఆర్.ఎస్.ఎస్ సభ్యుల గుంపులుగా జమ్మూలోని వివిధ జిల్లాలపై దాడి చెయ్యటం మొదలెట్టారు. జమ్మూ నగరం మరియు చుట్టుపక్కల ముస్లింల సామూహిక హత్యలు మొదలయ్యాయి.
ముస్లిములను చంపిన తర్వాత, వారి ఆస్తులను దోచుకున్నారు మరియు వారి ఇళ్లకు నిప్పు పెట్టారు. ఆ విధంగా జమ్మూలో 63% ఉన్న ముస్లిములు లక్షల్లో చంపబడి, తరిమివెయ్యబడిన అనంతరం 36% శాతానికి వారి జన సంఖ్య పడిపోయిందంటే అది ఏ స్థాయిలో సాగిన జనహననమో అంచనాకట్టవచ్చు.
ఉదంపూర్ జిల్లా, చెనాని , రాంనగర్, భదర్వా మరియు రియాసి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ముస్లింల ఊచకోతలు జరిగాయి. కథువ, బిల్లావర్, అమ్రే, చీక్, ఆత్మపూర్ మరియు కోచ్‌పురా ఛంబ్, దేవా బటాలా, మనవ్సర్, రాంనగర్ మరియు అఖ్నూర్‌లోని ఇతర అనేక ప్రాంతాలలో భారీ స్థాయిలో ముస్లిములను చంపటం, వారి ఇళ్లను తగలెట్టటం, స్త్రీలపై అత్యాచారాలు చెయ్యటం జరిగింది. ఈ ఊళ్లల్లో ప్రశాంతమైన వీధులన్నీ ముస్లిముల మృతదేహాలతో నిండిపోయాయి. ఎటు చూసినా శవాల గుట్టలు, వారి రక్తంతో ఏరులైపారే వీధులు, ఆర్తనాదలతో జమ్మూ మొత్తం అతి భయానకంగా మారిపోయింది.
వీధుల్లో పడి ఉన్న ముస్లిముల కుళ్లిన శవాలను రాబందులు పీక్కుతినేవి.
మరింత దారుణమైన సంఘటన- సియాల్‌కోట్‌కు వెళ్లాలనుకున్న ముస్లిములను వేల సంఖ్యలో అనేక ట్రక్కుల్లో ఎక్కించుకుని, నవంబర్ మొదటి వారంలో సైనిక బలగాలు తమ వెంట తీసుకెళ్లారు. కానీ, వారిని గమ్యానికి చేర్చకుండానే వారిని నగర శివార్లకు తీసుకెళ్లి ఆ ట్రక్కుల్లోని పురుషులను బయటకు లాగి దారుణంగా చంపారు. అందులో మహిళలను అపహరించి సాయుధ సిక్కులు మరియు ఆర్.ఎస్.ఎస్ సభ్యులు సామూహిక అత్యాచారాలు చేసి చంపేశారు. బహుశా ఇంతకన్నా దారుణం బహుశా మరెక్కాడా ఉండదేమో.
1948 ఆగస్టు 10న ప్రచురించబడిన టైమ్స్ పత్రిక, లండన్ మొత్తం 237,000 మంది ముస్లింలు చంపబడ్డారని అనేకమంది పాకిస్తాన్‌కు వలసవెళ్లారని పేర్కొనటం జరిగింది. 20 నవంబర్ 1947 నాటికి లక్ష కంటే ఎక్కువమంది జమ్మూ శరణార్థులు సియాల్ కోట్ కు చేరుకున్నారని పాకిస్తాన్ వారపత్రిక ‘నవా-ఇ-వక్త్’ పేర్కొనటం జరిగింది. ఈ విధంగా ఒక్క జమ్మూలోనే లక్షల్లో సాగిన నరమేధం చరిత్రలో మరుగున పడిపోయింది. ఇది పూర్తిగా ముస్లిముల సంఖ్యను తగ్గించటానికి ప్రణాళికాబద్దంగా మత ఉన్మాదంతో జరుపబడిన మారణకాండ.
ఇక 1989, 90 ప్రాంతాల్లో కాశ్మీరీ పండిట్లు మరియు ముస్లిముల హత్యలు, వారి వలసలు అన్నవి పాకిస్తాన్ మిలిటెంట్లు మరియు కాశ్మీర్ లోని రాజకీయ వ్యవస్థకు మధ్య తలెత్తిన గొడవలు, రాజకీయ పరిణామాల ఫలితం మాత్రమే! దానికి నిలువెత్తు సాక్ష్యం నాటి మిలిటెంట్ల చేతిలో కాశ్మీరీ పండిట్ల కంటే ముస్లిములే అధికంగా చనిపోవటం.
అధికారిక గణాంకాల ప్రకారం 1990 తరువాత మిలిటెంట్ల చేతిలో చనిపోయిన 1724 మందిలో కాశ్మీరీ పండిట్లు 89 మందితో పాటు 1000 కి పైగా ముస్లిములు కూడా ఉన్నారు. ఇన్ని వాస్తవాలను మరుగుపరచి ముస్లిములను తీవ్రవాదులుగా, హిందూ వ్యతిరేకులుగా, ప్రమాదకారులుగా చిత్రీకరిస్తూ “కాశ్మీరీ ఫైల్స్” ను తెరకెక్కించటం కేవలం పోలిటికల్ స్టంట్ లో భాగంగా హిందూ-ముస్లిముల మధ్య విద్వేష పూరిత వాతావరణాన్ని సృష్టించి “హిందుత్వ” దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం మాత్రమే అన్న విషయం సామాజిక విశ్లేషకులకు తెలిసిన విషయమే.
నిజానికి జమ్మూ-కాశ్మీర్ లో మారణకాండ మొదలెట్టిందే ఒకప్పటి అతివాద ఆర్.ఎస్.ఎస్, సిక్కుల సమూహాలు. జమ్మూ-కాశ్మీర్ లో లక్షలాది ముస్లిములను చంపి వారి జనాభా శాతాన్ని తగ్గించి హిందూత్వాన్ని స్థాపించాలన్న ఉద్దేశంతో నాడు మత ఉన్మాదాన్ని ప్రదర్శించిన హరి సింగ్ లక్షలాది యూదులను చంపిన హిట్లర్ కంటే తక్కువవాడేమీ కాదు.
ఒకవేళ “కాశ్మీరీ ఫైల్స్” చూసి కన్నీళ్లాగకపోతే అంతకంటే భయానకమైన కథ “జమ్మూ ఫైల్స్” అని చెప్పాలి. కాశ్మీర్ లో కేవలం వందకూడా దాటని కాశ్మీర్ పండిట్ల మరణాల విషయంలో నేడు ముస్లిములను తీవ్రవాదులుగా, హిందూ వ్యతిరేకులుగా, దేశ ద్రోహులన్నట్టుగా ముద్ర వేస్తూ కాశ్మీర్ ఫైల్స్ ను తెరకెక్కించి సామాన్య హిందూ ప్రజానీకం దృష్టిలో ముస్లిముల పట్ల ధ్వేషాన్ని రగిలించే ప్రయత్నాలు జోరందుకున్నాయి.
అదే జమ్మూ లో ఒకప్పుడు తీవ్రవాద హిందుత్వ గ్రూపులు లక్షల్లో ముస్లిముల సామూహిక జనహననాల చేసిన వాస్తవాలు మరుగుపరచబడ్డాయి. హిందూ పండిట్ల కంటే పదిరెట్లు అధికంగా ముస్లిములు మిలిటెంట్ల చేతిలో చంపబడ్డారు. కానీ నేడు ఒక్క హిందూ పండిట్లు మాత్రమే ముస్లిముల చేతిలో చంపబడ్డారన్న ప్రచారం జరుగుతుంది. లక్షల కొద్దీ ముస్లిముల చావులు అనాథల చావుల్లా మిగిలిపోయాయి.
“కాశ్మీర్ ఫైల్స్” సినిమా సైతం కాశ్మీర్ పండిట్ల పట్ల ప్రేమతోనో వారిని ఆర్థికంగా ఆదుకోటానికో తీసింది కాదు కేవలం కోట్ల రూపాయలు వెనకేసుకోటానికే! హిందూ-ముస్లిం వేర్పాటువాద రాజకీయాలు నడుపుతూ తమ రాజకీయ ఉనికిని కాపాడుకునే రాజకీయ నాయకుల ద్వారా “కాశ్మీరీ పండిట్లు” అన్న పేరు వాడుకోబడుతుందంటే. నేడు కాశ్మీరీ పండిట్ల పేరుమీద రాజకీయాలు, సినిమాలు నడుపబడుతున్నాయి తప్పితే వారిని ఆదుకోవాలనే ఉద్దేశం సైతం ఈనాటి ఫాసిస్ట్ రాజకీయ నాయకులకు ఏ కోశానా లేదు.
చివరిగా చెప్పొచ్చేదేమిటంటే మంచీ-మానవత్వాలు కలిగిన మనుషులతో పాటు దుర్మార్గులు, దుష్టులు, తీవ్రవాదులు, అతివాదులు ప్రతీ మతవర్గంలోనూ ఉంటారు. తప్పితే దుర్మార్గులందరూ ఏదో ఒక ప్రత్యేక మతంలోనో పోగై ఉండరు. అలాగే ఏదైనా మత వర్గంలో కొందరు దుర్మార్గం చేస్తే ఆ మతవర్గంలో అందరూ దుర్మార్గులని కూడా కాదు.
వీలైతే మనుషుల్లో మానవత్వాన్ని పెంపొందించి, చెడును రూపు మాపటానికి ప్రయత్నించాలి. ప్రజల్లో నైతికత-ఐక్యతలు పెంపొందించాలి. తప్పితే రాజకీయ అవసరాల కోసం ఒక వర్గం ప్రజలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యటం, మతాల పేరుతో ప్రజలను విడగొట్టి రాజకీయాలు చెయ్యటానికి మించిన ఉగ్రవాదం మరొకటి ఉండదు.
