స్కూల్ యూనిఫాం

స్కూల్ యూనిఫాం పాటించటం అంటే విద్యార్థినీ, విద్యార్థులంతా ఒకే రకమైన రంగుబట్టల్ని ధరించి స్కూలుకు రావటం! దానికి కారణం అందరిలో ఎక్కువా, తక్కువా అనే భావాలు లేకుండా ‘సమానత్వం’ జనింపజేయటమే. తప్పితే “మతపరమైన సమానత్వం” రావాలని కాదు.

కాబట్టి స్కూల్ యూనిఫాం తాలూకు పరిధి విద్యార్థినీ, విద్యార్థులంతా ఒకే రంగు బట్టలు వేసుకు రావటం వరకే!

ఆ భిన్న మతాలకు చెందిన విద్యార్థుల్లో ఒకవేళ క్రైస్తవులైతే మెళ్లో ఏ శిలువ లాకెట్టో యేసు బొమ్మో, హిందువులైతే వారి ఇష్టప్రకారం తిలకాలు, నామాలు, బొట్లు పెట్టుకు రావొచ్చు జంధ్యం వేసుకుని రావొచ్చు, సిక్కులైతే తలకు టర్బన్ చుట్టుకు రావొచ్చు, ముస్లిం అమ్మాయిలతే ఏ హిజాబో తొడుక్కుని రావొచ్చు. వారి మతాల్ని బట్టి వారి పేర్లు, భాషలు కూడా వేర్వేరుగా ఉండవచ్చు.

మొత్తానికి భిన్న మతాల, సంస్కృతులకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఒక చోట చదివేటప్పుడు వారిలో యూనిఫార్మిటీ తేవటానికి ఒకే రంగు యూనిఫాంతో రావాలని రూల్ పెట్టటం వరకే తప్ప వారి మతాలకు చెందిన చిహ్నాలనో, సంస్కృతినో రూపుమాపేసుకుని రావాలని కాదు కదా.

అలాంటప్పుడు “అమ్మాయిలైన మీరు మెళ్లో వేసుకుంటున్న దుపట్టాను తలపై నుండి భుజాలు కప్పబడేలా హెడ్ స్కాఫ్ లాగ (దాన్నే హిజాబ్ అంటారు) చుట్టుకుని వస్తే మేము మెళ్లో కాషాయి కండువాలు వేసుకొస్తాము” అంటూ దిగజారుడు నినాదాలు చెయ్యటం చాలా కామెడీ.

పైగా “హిజాబ్ వద్ధు, కాషాయ కండువాలు వద్దు అందరూ ఒకే యూనిఫాం పాటించాలి” అంటూ చిత్రమైన డిక్లరేషన్లు ఇస్తున్నవారు కూడా నిజానికి ఖండించాల్సింది హిజాబ్ నో ఇతర మతాలవారి మత చిహ్నాలనో కాదు. అసలా విద్యార్థులంతా ఆ స్కూలు తాలూకు “యూనిఫాం”ను పాటిస్తున్నారా? లేదా? అన్నది.

అంటే.. ఆ స్కూల్ విద్యార్థులు బొట్లు, తిలకాలు, నామాలు పెట్టుకొచ్చినా, లాకెట్లు వేసుకొచ్చినా, జంధ్యం వేసుకొచ్చినా, టర్బన్ చుట్టుకొచ్చినా అమ్మాయిలైతే సల్వార్ కమిజ్ తో పాటు హిజాబ్ ధరించి వచ్చినా ఆ స్కూల్ యూనిఫాం తాలూకు రంగులోనే అందరూ స్కూల్ కు వస్తున్నారా? లేదా? అన్నదే ముఖ్యం.

ఒకవేళ వస్తుంటే వారు యూనిఫాం పాటిస్తున్నట్టే లెక్క. మల్లా హిజాబ్ ధరించకూడదు అందరూ స్కూల్ యూని ఫామ్ లోనే రావాలని చెప్పటంలో లాజిక్కేమిటో అర్థం కావటం లేదు.

కాబట్టి కంపల్సరీ రూల్ తేవాల్సింది అమ్మాయిలైనా, అబ్బాయిలైనా యూనిఫాంగా ఒకే రంగు బట్టల్ని ధరించి రావాలన్నది. ఒకవేళ అమ్మాయిలైతే ఆ స్కూల్ యూనిఫాం కలర్ లోనే వారి దుపట్టానో లేక హెడ్ స్కాఫో ఉండాలని రూల్ తేవాలి.

ఆ రూల్ కొత్తగా తేవటం ఏంటి? ఆల్రెడీ కర్నాటకలో ఆ స్కూల్ రూల్ బుక్ లోనే రాసుంది. దాన్నే ఆ స్కూల్ విద్యార్థినులు ఎప్పటి నుండో పాటిస్తున్నారు కూడా.

మరి కొత్తగా ఇన్నాళ్లూ లేని ఈ వివాదం సడన్ గా ఎలా తెర మీదకొచ్చింది?

ఆ రూల్ బుక్ తయారు చేసిన స్కూల్ యాజమాన్యమే రూల్ కు విరుద్ధంగా ఆ అమ్మాయిల్ని బయట నిలబెట్టేసి గేట్లు ఎలా మూసేశారు?

ఇదంతా పొలిటికల్ స్టంట్ లో భాగంగా ఉద్దేశపూర్వకంగా మత విధ్వేషాలు రెచ్చగొట్టబడుతున్నాయని అర్థం కావటం లేదా? అర్థమైనప్పటికీ కొందరు అర్థం కానట్టు నటిస్తున్నారా? అన్నదే అర్థం కావటం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *