ఒకప్రక్క దేశ ప్రధాని కాషాయ వస్త్రాలు చుట్టుకుని వెయ్యి కోట్లతో తయారు చేయబడిన “స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీ” అంటే “సమానత్వ విగ్రహం” ప్రతిష్టాపన చేస్తూ ఉండగానే మరోప్రక్క..
కొందరు ముస్లిం అమ్మాయిలు తలకు వస్త్రాన్ని చుట్టుకొచ్చారన్నా నెపంతో వారి పట్ల దారుణమైన “వివక్ష”ను చూపుతూ స్కూలు గేటు బయటే నిలబెట్టేయటం అన్న రెండు అరుదైన సంఘటనలనూ ఒకేసారి చూసే భాగ్యం దేశ ప్రజలందరికీ కలిగింది.
కొన్ని రోజుల క్రితం ఒకవైపు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి “స్టాచ్యూ ఆఫ్ యూనిటీ” అంటే “ఐక్యత విగ్రహం” ప్రతిష్టాపన చేస్తూనే.. మరోవైపు సిఏఏ, ఎన్‌ఆర్‌సి చట్టాలు తీసుకొచ్చి ముస్లిముల పట్ల, ముస్లిం విద్యార్థినీ, విద్యార్థుల పట్ల దారుణమైన దౌర్జన్యాలు చెయ్యటం అన్న రెండు అరుదైన సంఘటనలను కూడా దేశ ప్రజలందరికీ చూసే భాగ్యం కలిగింది.
ఒకవైపు హిందూ-ముస్లిం వేర్పాటువాద రాజకీయాలు, మత విధ్వేషలను రగిలించే కుట్రలు, ధర్మ సంసద్ లలో బహిరంగ జనహననాల పిలుపులు, మైనారిటీ ప్రజల పట్ల దారుణమైన వివక్షలు, కులాల పేరుతో హింసలు, దళితుల పట్ల దౌర్జన్యాలు..
మరోవైపు అదే ప్రజల జేబుల్లోని వేల కోట్ల రూపాయల డబ్బుతో సమతా, ఐక్యతా విగ్రహాల ప్రతిష్టాపనలు జరుపబడే అరుదైన ఘనత కలిగిన దేశం సైతం బహుశా మనదే అయి ఉంటుందేమో.
అక్షరాలా నాలుగు వేల కోట్ల రూపాయలతో ఎన్ని యూనివర్సిటీలు, ఎన్ని హాస్పటళ్లు, ఎన్ని ఇండస్త్రీలు కట్టవచ్చు, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్ చెయ్యవచ్చన్నది ప్రక్కన పెడితే.. పోనీ, “సమానత్వం (Equality)” మరియు “ఐక్యత” (Unity) లను అభిలషిస్తూ భారీ విగ్రహాలు ప్రతిష్టించటం అన్నది కులమతాలకతీతంగా దేశ ప్రజలందరిలో “సమానత్వం” మరియు “ఐక్యత”లను నిజంగా తీసుకురావటం కోసమా? లేక కేవలం ఒక మత వర్గానికి చెందిన మెజారిటీ ప్రజలను సంతృప్తి పరచటం కోసం చేస్తున్న పోలిటికల్ స్టంట్ లో భాగామా? అన్నదే నాగులువేల కోట్ల రూపాయల ప్రశ్న.
మూడు వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రతిష్టించిన ఆ “ఐక్యతా విగ్రహం” మత విధ్వేష రాజకీయాలతో ప్రజల్లో ఐక్యత కోల్పోతున్న దేశం వైపు చూస్తూ దీనంగా నిలబడి ఉంది.
కులమతాలకతీతంగా సమానత్వం చూపబడని దేశం వైపు చూస్తూ ఆ “సమానత్వ విగ్రహం” సైతం స్తబ్దుగా కూర్చొని ఉంది.
ఎందుకంటే అవి కేవలం విగ్రహాలు మాత్రమే కాబట్టి! అలాంటి మరో వంద విగ్రహాలు నిలబెట్టినా వాటి వల్ల ప్రజల్లో సమానత్వం, ఐక్యతలన్నవి వాటంతట అవే ఎప్పటికీ రావు కాబట్టి.
ఆ విగ్రహాల్ని నిలబెట్టిన నాయకులకే ప్రజలను కులమతాలకతీతంగా సమానత-ఐక్యతతో పాలించాలన్న ఉద్దేశం లేనప్పుడు నామమాత్రంగా విగ్రహాలు నిలబెట్టినంత మాత్రానా వాటి వల్ల ఒరిగేదేమిటి దుబారా ఖర్చు తప్ప? మహా లేదంటే వాటిని సందర్శించేవారు సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవటానికి తప్ప అవి ఎందుకూ ఉపయోగపడవన్న సంగతి ఆలోచనా పరులందరికీ తెలిసిన విషయమే!
మత విధ్వేషం, వేర్పాటువాదమే పునాదిగా చేసుకుని రాజకీయాలు నడుపుతూనే మరోవైపు ఎన్ని ‘యూనిటీ’, ‘ఈక్వాలిటీ’ విగ్రహాలు ప్రతిష్టించినా ఆ విగ్రహాల ద్వారా కాంట్రాక్టర్లు బాగుపడొచ్చేమో గానీ వాటి వల్ల ప్రజలకు కలిగే లాభమేమీ ఉండదన్నది నిర్వివాదం.
కాబట్టి నిజంగా దేశ ప్రజల్లో ఐక్యత-సమానత్వం తీసుకురావాలన్న ఉద్దేశమే ఉంటే వేల కోట్లు తగలెట్టి విగ్రహాలు నిలబెట్టే బదులు… కుల-మతాల కతీతంగా అందరినీ, అందరి మతాచారాలను సమానంగా గౌరవిస్తూ, మత విధ్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలు చెయ్యకుండా, చెయ్యనీయకుండా ఉంటే చాలు.
అదెలాగూ ప్రస్తుత నాయకులకు సాధ్యం కాదు కాబట్టి ప్రజలే వారి కుట్రల్ని కనిపెట్టి స్వతహాగా ఐక్యతను కోల్పోకుండా తమను తాము కాపాడుకోవాలి. లేదంటే వారి రాజకీయ కుట్రలను ప్రత్యక్షంగా గెలిపించటమే అవుతుంది.
“ఈక్వాలిటీ” – “యూనిటీ” విగ్రహాలు మరి దేనికి?
