ఒకప్పుడు ఎక్కడో మూర్ఖుల్లో మాత్రమే ఉండే మతోన్మాదం ఇప్పుడు దాని పరిధి పెంచుకుంటుంది. కాలేజీ గేట్లు దాటుకుని కాలేజ్ విద్యార్థుల వరకు చేరుతుంది. దీనిని బట్టి భారతదేశం ఎటువంటి ప్రమాదకర మలుపు తీసుకుంటుందో ఊహించవచ్చు.
ధర్మం ఇచ్చే ఆదేశాలన్నీ మనిషికి అతని వ్యక్తిగత, సామాజిక జీవనంలో “మేలు” చేసేవి మాత్రమే! వాటిలో ఒకటి స్త్రీ తలపై నుండి శరీరం కప్పబడేలా నిండుగా వస్త్రాన్ని కప్పుకోవటం అన్నది ఒకటి. ఈ విషయాన్ని కాస్త ప్రక్కన పెడితే…
“కర్నాటకలో ఆ ముస్లిం అమ్మాయిలు కాలేజీకి హిజాబ్ (Head scarf) ధరించి రావటానికి వీల్లేదు మేం ఒప్పుకోమని కాలేజీలో హిజాబ్ బ్యాన్ చెయ్యాలని కాషాయం కండువాలు మెళ్లో వ్రేలాడదీసుకుని మరీ ధర్నాకు దిగిన అక్కడి కాలేజీ కాషాయ బాల భక్తుల నుండి వారికి సపోర్టుగా నిలబడి హిజాబ్ పై స్వంత విశ్లేషణలు చేస్తున్నవారి వరకు తమను తాము సమర్ధించుకోటానికి చెబుతుంది ఒక్కటే- “మీరు మీ మతచారాలు ఉంటే అది మీరు మీ వ్యక్తిగతంగా మీ ఇళ్లల్లో పాటించుకోండి తప్పితే వాటిని కాలేజీల వరకు తీసుకు రావద్దు” అన్నది.
ఈ విధంగా మొత్తానికి హిజాబ్ అన్నది ఇస్లాం మతాచారాల్లో ఒకటిగా జమకట్టేసి హిజాబ్ బ్యాన్ చెయ్యాలని నినాదాలు చేస్తున్న ఆ కాలేజీ కాషాయ మూకల నుండి బయట హిందుత్వ వేర్పాటువాదుల వరకు ఎవరికీ అసలు సనాతన ధర్మం యొక్క కనీస మౌలిక (Basic) జ్ఞానం కూడా లేదని చెప్పాలి. పైగా వీరంతా మేము సనాతన ధర్మ రక్షకులని చెప్పుకోవటం కొసమెరుపు.
నిజానికి ఏ హిజాబ్ నైతే అది ఇస్లాం మతాచారమని భావించి కాలేజీల్లో బ్యాన్ చెయ్యాలని కొందరు హిందుత్వ మతతత్వ వాదులు డిమాండ్ చేస్తున్నారో ఆ ఆదేశం ఒకప్పటి సనాతన వైదిక ధర్మం ఇచ్చి ఉన్న ఆదేశమే. ఆ తరువాత బైబిల్లో సైతం అది ప్రస్తావించబడింది. ఆ పాత ఆదేశమే ప్రవక్త ముహమ్మద్ (స) ద్వారా బోధించబడింది. తప్పితే చాలా మంది అనుకుంటున్నట్లు హిజాబ్ అన్నది ఇస్లాం మొట్టమొదట ఇచ్చిన ఆదేశమో, ముస్లిముల ప్రత్యేక మతాచారమో కాదు. ఎందుకంటే ఆది నుండీ ఒక్కటే ధర్మం పరంపరగా బోధించబడుతూ వచ్చింది కనుక.
మరీ ముఖ్యంగా రాజ్యాంగం సైతం ఆర్టికల్ 14&25 ప్రకారం విద్యాసంస్థల్లో సైతం విద్యార్థినులు హిజాబ్ ధరించే హక్కు కలిగి ఉన్నారని ఆ విషయంలో ఎటువంటి నిర్బంధం కలగజేయకూడదని చెబుతుంది.
అంతకంటే ముందు సంక్షిప్తంగా తెలుసుకోవలసింది- ధర్మం ఇచ్చే ఆదేశాలు ముఖ్యంగా మూడు విధాలుగా ఉంటాయి. 1. విశ్వాసాలు 2. ఆరాధనలకు సంబంధించిన ఆదేశాలు 3. వ్యవహారాలకు సంబంధించిన ఆదేశాలు.
ఈ మూడవ కోవకు సంబంధించిన ఆదేశాల్లోనే మనిషి వ్యక్తిగత, నైతిక, సామాజిక వ్యవహారాలకు సంబంధించిన ఆదేశాలన్నీ ఉంటాయి. ఉదాహరణకు: తలిదండ్రులు, ఇరుగుపొరుగు వారితో మర్యాదగా మెలగాలి, బీదసాదల హక్కులు చెల్లించాలి, మత్తుపానీయాలు సేవించకూడదు, వ్యభిచారం చెయ్యకూడదు, పరిశుభ్రమైన ఆహార పదార్థాలను తినాలి, హుందాతనంతో కూడిన వస్త్రాలు ధరించాలి, అశ్లీల్లత దరిదాపులకు కూడా పోకూడదు, పురుషులు పరాయి స్త్రీల విషయంలో తమ చూపులను కాపాడుకోవాలి, స్త్రీలు సైతం పరాయి పురుషుల పట్ల తమ చూపులను కాపాడుకోవాలి, స్త్రీలు బయట వారు వేధించబడకుండా ఉండేందుకు తలపై నుండి వక్షభాగం వరకు అదనంగా వస్త్రాన్ని కప్పుకుని, నిండైన బట్టలతో తిరగాలి… వగైరా ఆదేశాలన్నీ ఖురాన్, బైబిల్, హిందూ శాస్త్రాలన్నిటిలో చూడగలం.
వీటిని ఎవరు చెప్పినా లేదా ధార్మిక గ్రంథాల్లో చెప్పబడినా వాటిని పాటించటంలో మనిషికి వ్యక్తిగతంగా, సామాజికంగా “మేలు” మాత్రమే జరుగుతుంది. ఈ ఆదేశాలన్నీ ఒక్క హిందూ, ముస్లిములే కాదు ఏ మతానికి చెందినవారైనా చివరకు నాస్తికులు సైతం పాటించటం వల్ల ఒక్క మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు.
ఉదాహరణకు: ఋగ్వేదం 8:33 లో గమనిస్తే స్త్రీలకు ఇవ్వబడిన ఆదేశం “ప్రతీ స్త్రీ తన చూపులను క్రిందకు దించుకోవాలి, పాదాలను దగ్గరగా ఉంచుకోవాలి, శరీర భాగాలు కనపడకుండా పూర్తిగా కప్పుకోవాలి” అని చూడగలం. అచ్చం ఇలాంటి ఆదేశమే బైబిల్లో “స్త్రీ తప్పనిసరిగా ముసుగు వేసుకొనవలెను (1 కొరింథీ 11:6)” అని చూడగలం. ఈ సనాతన ఆదేశాన్నే ఖురాన్ “విశ్వాసులైన స్త్రీలు తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడదీసుకోవాలి (33:59)” అంటూ ఆదేశిస్తుంది.
అయితే ధర్మం ఆదేశిస్తున్న ఈ ఆదేశాన్ని ఒక్క ముస్లిం స్త్రీలే కాదు ఏ మతానికి చెందిన స్త్రీలు పాటించినా దానివల్ల వారికి మరింత మేలు జరుగుతుంది. అయితే ముస్లిం స్త్రీలు నిష్టగా పాటించటం వల్ల కొందరికి ఇది కేవలం ఇస్లాం మతాచారం అనే అపార్థం ఏర్పడిపోయింది. నిజానికి హిజాబ్ (Head scarf) ధరించే ముస్లిం స్త్రీలు సైతం అది మా మతాచారం పాటించకపోతే పాపం కలుగుతుందనో, కళ్లుపోతాయనో ఫీలైపోయి సెంటిమెంటుగా ఎవరూ ధరించరు కేవలం నిండైన వస్త్రాధారణతో బయటకు రావటం అన్ని విధాలుగా సురక్షితం అన్న ఉద్దేశంతో తప్ప. ఈ ఆదేశం ఇవ్వటంలో ఖురాన్ ఉద్దేశం కూడా అదే! అయితే సనాతన ధర్మం చెప్పే ఇలాంటి అనేక అంశాలు నేడు సనాతన ధర్మాన్ని రక్షించాలని నినాదాలు చేస్తున్న వారికి ఏ మాత్రం తెలీవు చెప్పినా బుర్రకెక్కవు కేవలం వాట్స్ యాపుల్లో ఫార్వర్డ్ చెయ్యబడే అడ్డమైన చెత్తా పనికిరాని ఫిలాసఫీ తప్ప.
