దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెయ్యటం సాధ్యం కానప్పుడు ప్రజల దృష్టిని మతం వైపుకు మళ్లించాలన్నది ఫాసిస్ట్ రాజకీయం నడిపే నాయకులు పాటించే రాజకీయ సూత్రం. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే భిన్నత్వంలో ఏకత్వానికి, ఆధ్యాత్మికతకు, పరమత సహనానికి నిలయమైన భారతదేశం ప్రస్తుతం మతోన్మాదపు విషపు కోరల్లో చిక్కుకుని ప్రమాదంలో పడబోతుందా? అని ప్రశ్నించుకుంటే అయోధ్యలో బాబ్రీ మసీదు నుండి గుంటూరు జిన్నా టవర్ వరకు ఏదో ఒక అంశాన్ని తెరమీదకు తెచ్చి హిందూ, ముస్లిముల మనోభావాలను పనికట్టుకుని ఎదోలా రెచ్చగొట్టటానికి అన్ని రకాల దారులను వెదుకుతున్న కొందరు వేర్పాటువాదులు చేస్తున్న మతోన్మాద రాజకీయాలు చూస్తుంటే కచ్చితంగా అవుననే చెప్పాలి.
“హిందువులు ప్రమాదంలో ఉన్నారు, ముస్లిముల నుండి హిందూత్వాన్ని రక్షించుకోవాలి” అంటూ కొన్ని భయాలను సృష్టించి, మీడియా ద్వారా హిందువులను రెచ్చగొడుతూ “హిందుత్వాన్ని రక్షించే ఏకైక హిందూ జనోద్ధారకుణ్ణి ఓట్లేసి గెలిపించుకోవటం ఒక్కటే మార్గం” అనే ఎమోషన్ తో వారి ఓట్లను సంపాదించటం కోసం ముస్లిముల పట్ల ధ్వేషాన్ని రగిలించటమన్న మార్గాన్ని ఫాసిస్టు ఏజండాతో పని చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీ, దాని అభ్యుర్ధులూ, సపోర్టర్లే ఎంచుకున్నప్పుడు దేశ భవిష్యత్తు ఎంత ప్రమాదకరంగా మారబోతుందో అంచనా వెయ్యవచ్చు.
1893 లో స్వామీవివేకానంద చికాగోలో భారతదేశం తరఫున మాట్లాడుతూ “నేను ప్రపంచానికి సహనాన్ని నేర్పే హిందుత్వ ధర్మానికి చెందిన వాడిగా గర్వపడుతున్నాను. ప్రపంచంలో ఉన్న సకల మతాలూ సత్యమని నేను నమ్ముతున్నాను” అంటూ ప్రసంగించారు. దీనికి పూర్తి భిన్నంగా హరిద్వార్ ధర్మ సన్సద్ వేదికగా హిందుత్వ మతవాదులు ముస్లిం సమాజంపై సామూహిక జనహననానికి సిద్ధమవ్వాలంటూ బహిరంగంగానే పిలుపునివ్వటం మతోన్మాదానికి పరాకాష్ట అని చెప్పవచ్చు.
ఇదికాక “సుల్లీ డీల్స్” “బుల్లిబాయ్” అనే జుగుప్సాకరమైన పేర్లతో యాప్ లు తయారు చేసి వాటిలో సోషల్ యాక్టివిస్టులు, జర్నలిస్టులు, లాయర్లు వగైరా ముస్లిం స్త్రీల ఫోటోలను మార్ఫింగ్ చేసి వేలానికి పెట్టి పైశాచికానందం పొందటాన్ని బట్టి మతోన్మాదులు ఏ స్థాయి వరకు వెళ్లిపోయారో అంచనా వెయ్యవచ్చు.
మతం పేరుతో ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి మతోన్మాద రాజకీయాలు నడిపే ఎజండాతో పనిచేసే ఏ ఫాసిస్టు రాజకీయ పార్టీకైనా దేశాభివృద్ధి, ఆర్ధికాభివృద్ది, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి వగైరా వంటి అదనపు బరువులు మోయాల్సిన పని ఉండదు.
ఒక ప్రక్క నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులు నలిగిపోతున్నప్పటికీ దేశం ఆర్థికంగా వెనుకబడిపోతున్నప్పటికీ, కేవలం మీడియాలో దేవాలయాల మీద, ఊళ్ల పేర్లు మార్చటం మీద, ఆవుల మీద సీరియస్ డిస్కషన్లు జరిగేలా చూసుకుంటూ, “లవ్ జిహాద్” లాంటి అర్థం లేని ఊహాజనిత పదాలు కనిపెట్టి, రామజన్మ భూమి, కృష్ణ జన్మ భూములపై సీరియస్ డిబేట్లు నిర్వహించి ప్రజల్ని కొన్ని పనికిమాలిన అంశాల్లో బిజీగా ఉంచగలిగే కళ పుష్కలంగా ఉంటే చాలు సరిపోతుంది.
ఉదాహరణకు హిందూ, ముస్లిముల మనోభావాలను రెచ్చగొట్టటానికి గుంటూరులో జిన్నా టవర్ కూల్చేయాలని ఎవరో ఎక్కడో ఒక స్టేట్మెంట్ వదిలితే దేశంలో అదో పెద్ద సమస్య అయి మీడియాలో భయంకరమైన డిబేట్లు జరిగిపోతుంటాయి. సామాన్యుడు ఎదుర్కునే ఆర్ధిక సమస్యలపై గానీ, దేశ సమస్యలపై గానీ, ప్రభుత్వ విధానాలపై గానీ మీడియాలో డిబేటు పెట్టి ధైర్యంగా మాట్లాడే నాధుడే ఉండడు.
దేశం అప్పుల్లో కూరుకుపోయి ఆర్ధిక వ్యవస్థ కుప్పకూల్పోతున్న ప్పుడల్లా, డీజిల్, పెట్రోల్ నుండి నిత్యావసారాల ధరలు పెరిగిపోయి ప్రజల నడ్డి విరిగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడల్లా రామజన్మ భూమి, బాబ్రీ మసీదు, లవ్ జిహాద్ వగైరా అంశాలు ఆటోమేటిగ్గా తెరమీదికి వచ్చేస్తాయి.
ఎప్పుడో మధ్య యుగాల్లో ముస్లిం పాలకులు దండయాత్రలు చేసి ఆలయాలు కూల్చేశారని, మసీదులు కట్టి హిందువులను బలవంతంగా మత మార్పిళ్లు చేసేశారని చెబుతూ ఆయా సంఘటనలతో సంబంధం లేని ఇక్కడి సామాన్య ముస్లిములను బాధ్యులుగా చేసేసి “ఇప్పుడు మన ముందు ఉన్న లక్ష్యం ముస్లిముల నుండి హిందూత్వాన్ని కాపాడుకోవటమే లేదంటే ప్రమాదంలో పడిపోతాం” అన్న కల్పిత భయాల్ని సృష్టిస్తూ ప్రజల దృష్టి మళ్లించటానికి మీడియాలో ఫేక్ న్యూసుల్ని ప్రచారం చేసే “ఐ.టి సెల్” అనే ఒక వ్యవస్థే అహోరాత్రులూ పని చేస్తుంటుంది.
“ముస్లిముల వల్ల హిందూత్వం ప్రమాదంలో ఉంది” అన్న ఒక ఫేక్ భావజాలాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లటమే ఈ ఐ.టి సెల్ లక్ష్యం. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో హిందుత్వ గ్రూపుల ద్వారా, వాట్స్ యాపుల ద్వారా హిందూ, ముస్లిం ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే బృహత్తరమైన బాధ్యత ఈ వ్యవస్థ నిర్వహిస్తూ ఉంటుంది.
దాని కోసం ఫోటో షాప్, ఫేక్ వార్తలు సృష్టించటం అనే రెండు పరికరాలను ఈ ఐ.టి సెల్ నిత్యం ఉపయోగిస్తుంది. ప్రజలకు అబద్ధాలను నిజాలుగా చూపటానికి ఫేక్ వీడియోలు తయారు చెయ్యటం, ట్విట్టర్ లో ఒక్కో ఫేక్ ట్వీట్ కు ఇంత అని డబ్బులివ్వటం జరుగుతుంది. ఈ ఐ.టి సెల్ లో పని చేసే వారిని ‘ఇన్ఫ్లూయెన్సర్స్’ అంటారు. వీరిపై “సూపర్ 150” అనే ప్రధాన టీం కంట్రోల్ చేస్తుంటుంది. వీరంతా ఒక ఏజన్సీలా ఐ.టి సెల్ కోసం జీతానికి పని చేస్తుంటారు. వీరి పని కేవలం ఐ.టి సెల్ విడుదల చేసే ఫేక్ వార్తలను వాట్స్ యాప్, ఫేస్బుక్కుల్లో సర్వసామాన్యం చెయ్యటం అంతే.
“అబద్ధాలనైనా మీరు ప్రచారం చెయ్యండి” అంటూ పార్టీ పెద్దలు చేసిన హితబోధను అనుసరించి అబద్ధాలను నిజాలుగా చూపటం దాని పని. దానికి మెయిన్ స్ట్రీమ్ గోదీ మీడియా సైతం తన వంతు సహకారం అందించటంతో ఏది కరెక్టు న్యూసో ఫేక్ న్యూసో తెలీని కన్ఫ్యూజన్ ప్రజల్లో ఏర్పడిపోతుంటుంది.
ఉదాహరణకు కరోనా పట్ల పూర్తి అవగాహన, ఎటువంటి నిబంధనలు లేని సమయంలో ఢిల్లీ లో తబ్లిక్ జమాత్ సభ్యులు ఒక ఆధ్యాత్మిక సభ ఏర్పాటు చేసుకున్నారు. అది ముస్లిములు కుట్రపూరితంగా కరోనాను వ్యాపింపజేయ్యటానికి పెట్టుకున్న సభ అన్న ఒక ఫేక్ న్యూస్ నిముషాల్లో దేశమంతా చక్కర్లు కొట్టింది. పైగా ముస్లిములు ‘కరోనా జిహాద్’కు పూనుకున్నారని చెబుతూ ముస్లిమేతరుల్లో ముస్లిముల పట్ల ధ్వేషాన్ని రగిలించటానికి ఈ ఐ.టి సెల్ ఫేస్ బుక్, ట్విట్టర్లలో వందల కొద్దీ మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ వార్తల్ని వదలగా అవి వేలల్లో షేర్ అయ్యాయి. అవన్నీ అబద్ధాలని తేలేలోపు సామాన్యులు సైతం నిజమని నమ్మేసే పరిస్థితి వచ్చింది. ముస్లిముల దగ్గర ఏదీ కొనకూడదని మతోన్మాదవాదులు ఒక క్యాంపెయిన్ నడిపే స్థాయి వరకు వెళ్లింది.
ఈ విధంగా రోజు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్స్ యాపుల్లో హిందూ, ముస్లిముల మనోభావాలను రెచ్చగొట్టటానికి ఫార్వార్డ్ అయ్యే మతోన్మాదంతో నిండిన వార్తల వెనుక ఐ.టి సెల్ నిత్యం పని చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని సామాన్య హిందూ, ముస్లిం ప్రజానీకం గమనించాలి.
ముస్లిములను ఒక బూచిగా చూపటానికి పాకిస్తాన్ ను మాటిమాటికీ తెరమీదకు తీసుకొస్తుంటారు. మరోప్రక్క చైనా ఇండియా బోర్డర్స్ దాటి అరుణాచల్ ప్రదేశ్ ను ఆక్రమించుకుని అక్కడి ప్రాంతాల పేర్లు మార్చే వరకూ వచ్చినా, గాల్వాన్ లోయలో చైనా జండాను పాతేసినా మీడియాలో దానిపై ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే హిందుత్వవాద రాజకీయాలు నడపాలంటే ముస్లిములే ముడి సరుకు కాబట్టి.
“ముస్లిములు ప్రమాదకారులు” అన్న భావజాలంతో హిందువుల్లో లేని భయాలు సృష్టించటానికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియాలలో జరిగే అంతర్గత గొడవల్ని తెరమీదకు తెస్తుంటారు. ప్రపంచంలో ఇంకా 50 ముస్లిం దేశాలు ఎంతో ప్రశాంతంగా ఉంటూ పర్యాటక స్థలాలుగా కూడా ఉన్నాయి. ఆయా దేశాల్లో లక్షల కొద్దీ ముస్లిమేతరులు సైతం ఉద్యోగాలు చేసుకోవటానికి వెళుతుంటారు. వారిలో 65% హిందువులే. కానీ దాని ఊసు ఎవరూ ఎత్తరు. ఎందుకంటే హిందుత్వ రాజకీయాలు నడపాలంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లే ముడి సరుకు కాబట్టి.
“ముస్లిములు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అక్కడ హిందువులు ప్రమాదంలో నెట్టబడతారు” అన్న ఒక విషపూరిత భావజాలాన్ని మీడియాలో హిందుత్వ వేర్పాటువాదులు ప్రచారం చేస్తుంటారు.
అదే నిజమైతే ఇండోనేషియాలో ముస్లిములు దాదాపు 87% ఉంటే, హిందువులు ఉన్నది కేవలం 1.7% మాత్రమే ఉన్నారు. మలేషియాలో ముస్లిములు 63% ఉంటే హిందువులు కేవలం 7% మాత్రమే ఉన్నారు. గల్ఫ్ లో హిందువులు ఉన్నది 1% మాత్రమే. అంతేకాక, అరబ్, కువైట్, దుబాయ్ వంటి దేశాల్లో లక్షలకొద్దీ హిందువులు ప్రశాంతంగా జీవిస్తూ సంపాదించుకుని ఈ దేశానికి వస్తుంటారు.
ముస్లిములు మెజారిటీగా, హిందువులు మైనారిటీలుగా ఉన్న ఆయా దేశాల్లో మరి హిందువులు ఎందుకు ప్రమాదంలో లేరు? దీని ప్రస్తావన మీడియాలో ఎప్పుడూ ఎందుకు రాదు? కానీ, పాకిస్తాన్ లో అప్పుడప్పుడూ హిందూ, ముస్లిముల మధ్య జరిగే గొడవల్నే భూతద్దంలో చూపుతూ ముస్లిములను హిందువుల పాలిట శత్రువులన్నట్టు చూపటం జరుగుతుంది.
ఆవు మాంసం ఒక్క ముస్లిములే తింటారన్న చందంగా ప్రచారం చెయ్యటమే కాక, హింసలు హత్యాలు కూడా జరుగుతుంటాయి. నిజానికి గోమాంస ఎగుమతుల్లో భారత దేశం ప్రపంచంలో నెం.1 స్థానం. పైగా గోమాంస ఎగుమతులు చేసే ఎక్స్ పోర్ట్ కంపెనీలు అధికశాతం హిందువులవే. కానీ, దాని ప్రస్తావన ఎక్కడా జరగదు. ఎందుకంటే హిందుత్వ రాజకీయాలు నడపాలంటే ముస్లిములే ముడి సరుకు కాబట్టి.
ఈ క్లిష్ట పరిస్థితుల నుండి దేశాన్ని కాపాడేది ఎలా?
“మన మాతృభూమి కొరకు వేదాంతం, ఇస్లాం – ఈ రెండిటి విధానాల కలయిక – అంటే వేదాంతమే మేధస్సుగాను, ఇస్లాం శరీరంగాను జోడింపబడినదే శరణ్యమనిపిస్తుంది. భారతదేశం ఉన్న క్లిష్ట కల్లోల పరిస్థితుల నుండి వేదాంతమే పుష్కలంగాను, ఇస్లాం దేహంగాను భాసిస్తూ ‘విజయవంతమైన, ప్రతిష్టాత్మకమైన సంపూర్ణ దేశం’గా భవిష్యత్తులో వెలువగలదని నాకు స్పష్టంగా గోచరిస్తుంది” – స్వామీ వివేకానంద (నా భారతం అమర భారతం పేజీ. నెం. 113)
ఇప్పుడున్న హిందూ, ముస్లిం రాజకీయాలు సాగుతున్న నేపథ్యంలో భారతదేశాన్ని మతోన్మాద రాజకీయ విషపు కోరల నుండి కాపాడాల్సిన బాధ్యత ఈ దేశపు ఆలోచనాపరులైన హిందూ, ముస్లిముల పైనే ఉంది. వేదాంతం మేధస్సుగా, ఇస్లాం శరీరంగా జోడింపబడిన భారతదేశాన్ని ‘విజయవంతమైన, ప్రతిష్టాత్మకమైన సంపూర్ణ దేశం’గా స్వామీవివేకానంద అభిలషించాలు.
కాబట్టి వాట్స్ యాప్, ఫేస్బుక్కుల్లో మత ఉన్మాదులు సృష్టించే ఫేక్ వార్తలు, మార్ఫింగ్ వీడియోల ప్రభావానికి గురై ముందుగా సామాన్య హిందూ, ముస్లిం ప్రజానీకం అనవసరంగా ఉద్వేగాలకు లోనై ఒకరిపట్ల ఒకరు ధ్వేషాన్ని పెంచుకోవటాన్ని వదులుకోవాలి. ప్రతీ మతవర్గంలో మంచివారే కాక, దౌర్జన్యపరులు, దుర్మార్గులు కూడా ఉంటారు తప్ప దుర్మార్గులంతా కాపీరైట్స్ తీసుకుని ఒకే మతంలో ఉండరు అన్నది గమనించాలి. అటు వైదికం, ఇటు ఇస్లాం ధర్మాలు పరమత సహనాన్ని మెండుగా బోధిస్తున్నాయి.
ఈ దేశ స్వతంత్రం పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వంతో హిందువులతో భుజం కలిపి పొరాడి ప్రాణాలు వదిలిన వారిలో అధికశాతం ముస్లిములు సైతం ఉన్నారు. కాబట్టి ఈ దేశంపై అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడి హిందూ, ముస్లిములంతా ఇండియాను ఇస్లామిక్ స్టేట్ గా చెయ్యాలనో, హిందూ రాష్ట్రగా మార్చాలనో కలలు కనటం కాదు ‘విజయవంతమైన, ప్రతిష్టాత్మకమైన సంపూర్ణ దేశం’గా మార్చటానికి ప్రయత్నించాలి. వారిరువురూ కలిసి పటిష్ట ఐక్యతతో దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి. దానికోసం ముందు ఫాసిస్ట్ రాజకీయ సిద్ధాంతాల నుండి, ఫాసిస్టుల కుట్రలు, ఎత్తుగడల నుండి తప్పించుకుని దేశాన్ని రక్షించుకోవాలి.
దేశానికి ప్రమాదకరమైన- “మతోన్మాదం”
