బుల్లిబాయ్/ సుల్లీడీల్స్ యాప్ – పైశాచికత్వానికి పరాకాష్ట

“బుల్లి బాయ్” “సుల్లీ డీల్స్” ఈ జుగుప్సాకరమైన పదాలు ఎప్పుడైనా విన్నారా. బహుశా విని ఉండరు. ఇవి కొందరు దుర్మార్గులు ముస్లిం స్త్రీలను అవమాన పరచటానికి తయారుచేసిన యాప్ ల పేర్లు. కానీ ఇలాంటి దారుణమైన సంఘటనలపై మీడియాలో పెద్దగా చర్చ ఉండనే ఉండదు గనుక. పైగా ఈ సంఘటనలో బాధితులు ముస్లిం మహిళలు కనుక.

“సుల్లీడీల్స్” ఇదొక యాప్ పేరు. 1 జులై 2020 న మతోన్మాద పైత్యం బాగా తలకెక్కి తమ పైశాచిక ఆనందాన్ని తీర్చుకోటానికి గిట్ హబ్ హోస్టింగ్ సర్వీస్ ప్లాట్ ఫామ్ ఆధారంగా ఒక యాప్ తయారు చేసి అందులో దాదాపు ఎనబై మంది ముస్లిం స్త్రీలు, అమ్మాయిల ఫోటోలను అసహ్యకరంగా మార్ఫింగ్ చేసి వారిని వేలానికి పెట్టేయటం జరిగింది. ఈ దారుణ సంఘటన గురించి మీలో ఎంతమందికి తెలుసు?

అప్పట్లో ఆ సంఘటనపై నిరసనలు వెల్లువెత్తటంతో ఢిల్లీ పోలీసులు దానిపై F.I.R రిజిస్టర్ చేసి నేరస్తులెవరో తెలుసుకోటానికి ఇన్వెస్టిగేషన్ మొదలెట్టామని ఒక సినిమా డైలాగ్ చెప్పేసి చాన్నాళ్లైపోయింది.

నేరస్తులు దొరక్కపోగా… సరిగ్గా క్రొత్త సంవత్సరం ప్రారంభ రోజు 1 జనవరి 2022 న మరలా “బుల్లిబాయ్” పేరుతో అచ్చం అలాంటిదే మరొక యాప్ దర్శనమిచ్చింది. ఈ సారి వంద మంది ముస్లిం స్త్రీలు, అమ్మాయిల ఫోటోలు పెట్టి వేలానికి పెట్టేయటం జరిగింది. వారంతా తమ ఫోటోలు అంతదారుణంగా మార్ఫింగ్ కి గురై వేలానికి పెట్టబడటం చూసి నివ్వెరపోయారు.

ఇంతకాలం తరువాత మరలా అలాంటి దారుణానికి పాల్పడగలిగారంటే ఈ మధ్య కాలంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎంత చక్కగా, బలంగా జరిగి ఉంటుందో అంచనా వెయ్యవచ్చు.

పైగా ఆ వంద మంది ముస్లిం మహిళలు సామాన్యులు కారు. ప్రముఖ సోషల్ యాక్టివిస్టులు, పోలిటికల్ ఇష్యూలపై గొంతెత్తి ప్రశ్నించే స్త్రీలు, లాయర్లు, ప్రముఖ జర్నలిస్టుల నుండి ప్రముఖ నటీమణి షబానా ఆజ్మీ, ఢిల్లీ హైకోర్ట్ సిట్టింగ్ జడ్జ్ భార్య ఫోటోల వరకు ఆ యాప్ లో అప్లోడ్ చెయ్యటం గమనార్హం.

“బుల్లి” “సూల్లి” అనేవి అతినీచమైన అర్థం వచ్చే జుగుప్సాకరమైన పదాలు. ఇవి ముస్లిములకు పర్యాయ పదాలుగా వాడటం ఈ యాప్ తయారు చేసిన వ్యక్తుల మతోన్మాదానికి, పైశాచికత్వానికి అద్దం పడుతుంది.

ఈ పదాలు సాధారణంగా మీడియాలో ఎవరు ఉపయోగిస్తుంటారో వేరేగా చెప్పనక్కర్లేదు. ఇంత ధైర్యంగా అలాంటి యాప్ లు తయారు చేసి ముస్లిములను టార్గెట్ చేస్తూ మతోన్మాదాన్ని పైశాచికత్వాన్నీ, ప్రదర్శించే వారెవరై ఉంటారో ఈజీగా అంచనా కట్టవచ్చు.

ఇది కేవలం మతోన్మాద పైత్యం తలకెక్కి పాల్పడ్డ దారుణమే అయి ఉండవచ్చు, ముస్లిం సమాజ స్త్రీలను టార్గెట్ చేసి ఇలాంటి యాప్పుల ద్వారా తమ పైశాచిక ఆనందం తీర్చుకునే ప్రయత్నమే కావచ్చు. బలుపెక్కి ఇలాంటి దిక్కుమాలిన చర్యలకు పాల్పడినంత మాత్రాన ముస్లిం స్త్రీలు భయపడిపోయే ప్రసక్తీ ఉండదు. వారేమీ మౌనం వహించి ప్రశ్నించటమూ మానేయ్యరు.

కానీ, అసలు భయం ముస్లిం సమాజం పట్ల ఇన్ని దారుణాలు జరుగుతున్నా, బహిరంగ వేదికలు నిర్వహించి వారిపై సామూహిక జనహనాలకు పిలుపునిస్తున్నా మౌనం వహిస్తున్న ప్రభుత్వ పోకడలు గమనిస్తుంటేనే భయమేస్తుంది. భవిష్యత్తులో దేశం ఎంత ప్రమాదకమైన మలుపు తీసుకోబోతుందో ఊహించుకుంటుంటేనే భయం కలుగుతుంది.

Links:
https://www.aljazeera.com/…/bulli-bai-muslim-women…

https://www.outlookindia.com/…/india-news-bulli…/408040

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *