అశ్లీలాన్ని నిషేధించటమే పరిష్కారం

ఒకప్పుడు ఊరి చివర సినిమా హాళ్లలో, వీడియో క్యాసెట్లలో, సీడీల్లో రహాస్యంగా ఉండే అశ్లీల చిత్రాల ఉనికి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక చవక ధరల్లోనే స్మార్ట్ ఫోన్లు లభించటం, వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాలు అతి చవక ధరలకే లభించటం వెరసి అశ్లీలం అలవోకగా అందరి అరచేతిలో ఇమిడిపోయింది. భారతదేశంలో పోర్న్ చూసేవారి సంఖ్య వెల్లువలా పెరిగిపోతుంది.

మద్యం, మట్టుపదార్థాల సేవనం, సెగరెట్ల తరువాత మనిషిని సర్వనాశనం చేసే భయంకరమైన వ్యసనం ‘పోర్న్’ చూడటమే! ఈ నీలి చిత్రాలను చూడటం అన్న రుగ్మత సమాజంలో పెరిగిపోవటమే నేడు ఆరేళ్ల పసి పాపల నుండి అరవయ్యేళ్ల మహిళల వరకూ లైంగిక దాడులకు గురికావటానికి ప్రధాన కారణమవుతుంది.

ఎందుకంటే పదే పదే నీలిచిత్రాలను చూడటంతో విపరీతమైన లైంగిక కోరికలతో రెచ్చగొట్టబడే మనిషి మనస్తత్వం ఎంతకైనా తెగించేలా అతన్నో పశువుగా మార్చుతుంది. విచ్చలవిడితనాన్ని పెంచుతుంది. వివేకం, విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. దానితో వావివరుసలు మరచిపోయి మనిషి మృగంలా మారిపోయి వయసు, లింగబేధంతో సంబంధం లేకుండా అత్యాచారాలకు తెగబడతాడు. అలాంటి దారుణాలు ఇప్పుడు భారతదేశంలో ఏదో ఒక మూల నిముషానికొకటి చొప్పున నమోదవుతున్నాయి. ఒకప్పుడు కేవలం నీలి చిత్రాల్లో మాత్రమే ఉండే అశ్లీలం ఇప్పుడు సినిమాలు, సీరియళ్లలోనూ వినోదంగా మారిపోయి సర్వసామాన్యం అయిపోవటం మరొక కారణం.

అంతేకాక న్యూస్ పేపర్లలో అర్ధనగ్న చిత్రాలు, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే అశ్లీల వార్తలు, ద్వందర్థాలు, ఎక్స్ పోజింగ్ తో కూడిన పాటలు, ఒక్క క్లిక్ తో వెల్లువలా వచ్చిపడే పోర్న్ సైట్లు కలగలసి యువత భావోద్రేకాలను తీవ్రంగా రెచ్చగొట్టటంతో నేర ప్రవృత్తికి దారి తీస్తుంది. ఈ మధ్యకాలంలో పసిపిల్లల్ని రేప్ చేసిన అనేక మంది నేరస్తులకు విపరీతంగా పోర్న్ చూసే అలవాటు ఉండటం గమనార్హం.
ఏ సమాజంలో అయితే అశ్లీలం, హింస, వెకిలితనం వినోదంగా మారిపోతాయో సిగ్గుమాలిన పనులు సరదా విషయాలుగా మారిపోతాయో అలాంటి సమాజం నాశనపుటంచుల్లో ప్రయాణిస్తున్నట్టే లెక్క.

ఇక ఈ పోర్న్ విషయంలో చట్టాలను పరిశీలిస్తే.. పోక్సో చట్టం 2012 ప్రకారం ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడడం, వీడియోలు కలిగి ఉండడం, వాటిని డౌన్‌లోడ్‌ చేయడం నేరం. 2015 జులైలో భారతదేశంలో వ్యక్తిగతంగా ఆశ్లీల చిత్రాలు చూడటం నేరం కాదని.. వాటిని షేర్‌ చేయటం మాత్రం నేరమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ భారతదేశంలో నూటికి నూరు శాతం పోర్న్ ను బ్యాన్ చేసే చట్టం ఇప్పటి వరకూ ఒక్కటి కూడా రాలేదు.

ఎన్ని చట్టాలు తెచ్చినా ఇప్పటికీ ఒక్క క్లిక్ తో కుప్పలుతెప్పలుగా పోర్న్ సైట్లు అంతర్జాలంలో స్వైరవిహారం చేస్తుండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 2.80 కోట్ల పోర్న్ సైట్లు ఉన్నాయంటే, ప్రపంచవ్యాప్త పోర్న్ పరిశ్రమ విలువ 6.70 లక్షల కోట్ల రూపాయలంటే, ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులో పోర్న్ సైట్లలో అశ్లీల విడియోలను వెదికేవారి సంఖ్య 6.80 కోట్లంటే ప్రపంచం ఏ దిశగా ప్రయాణిస్తుందో అంచనా వెయ్యవచ్చు. అందులో 89 శాతం మంది పోర్న్ చూస్తున్నవారు భారతదేశంలోనే ఉండటం శోచనీయం. అంతేకాదు భారతదేశంలో వినియోగించబడుతున్న ఇంటర్నెట్ డేటాలో మూడవ వంతు పోర్న్ చూడటానికే వినియోగించబడుతుందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? అరచేతిలో అశ్లీలం వినోదంగా మారిపోయిన అలాంటి మార్గబ్రష్ట సమాజాలలో నిముషానికో రేప్ చొప్పున జరగటం పెద్ద వింతేమీ కాదు.

సినిమాల రూపంలో, పోర్న్ రూపంలో ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని ఉప్పెనలా ముంచెత్తుతున్న అశ్లీలత నుండి ప్రజలను ఎలా బయట పడవెయ్యాలి? అన్నదిప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్న కంటే చాలా పెద్దది.
****

ఈ సమస్యకు పరిష్కారమార్గాలు:

1. పోర్న్ చూస్తే జైలు శిక్షలు ఉంటాయనో, భారీ జరిమానాలు ఉంటాయనో భయపెట్టటం కంటే, ఆచరణ సాధ్యంకాని రూల్స్ పెట్టటం కంటే ఇంటర్నెట్ లో పోర్న్ సైట్లను ఒక్కటికూడా లేకుండా సంపూర్ణంగా బ్యాన్ చెయ్యాలి.

2. విపరీతమైన అశ్లీలం, విచ్చలవిడితనం, హింస మాత్రమే ప్రధాన పెట్టుబడిగా నిర్మితమవుతున్న సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీసులను మరింతగా నియంత్రించాలి.

3. రెడ్ హ్యాండెడ్ గా రేప్ చేసి పట్టుబడే నేరస్తులు ఏ వయసువారైనా వారికి తక్షణం కఠినమైన శిక్షలు అమలుపరిచేలా చట్టాల్ని సవరించాలి. సవరించటమే కాక నూటికి నూరుశాతం శిక్షలు అమలు చెయ్యాలి.

ఇవి మాత్రమే కాక సామాజిక మార్పు తీసుకురావాలి. అదెలా అంటే…
సమాజంలో మార్పు తీసుకురావటం అంటే సమాజంలో వ్యక్తుల వ్యక్తిత్వాలలో మార్పు తీసుకురావటమే! ఎందుకంటే ఉత్తమ సమాజ నిర్మాణం ఉత్తమ వ్యక్తుల నిర్మాణంతోనే సాద్యమవుతుంది. ఉత్తమ వ్యక్తులను తయారు చెయ్యటం అన్నది బాధ్యతాయుత దృక్పథాల నిర్మాణంతోనే సాధ్యమవుతుంది.

‘మనిషి వ్యక్తిత్వం’ అన్నది.. ‘బాహ్యవ్యక్తిత్వం’ ‘అంతర్వ్యక్తిత్వం’ అని రెండు విధాలుగా వర్గీకరించబడుతుంది. ప్రస్తుత సమకాలీన ఆధునిక విద్యావిధానం, వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల ద్వారా మనిషి ‘బాహ్య వ్యక్తిత్వం (External Personality)’ మాత్రమే అభివృద్ధి చెందుతుంది. అతను భౌతికంగా మాత్రమే అభివృద్ధి చెందగలుగుతున్నాడు.

కానీ, అతని మనో వాంచలపై అదుపు సాధించే నైతిక విలువలను మటుకు సాధించలేకపోతున్నాడు. నేడు ఆధునిక యువతలో నేర ప్రవృత్తి పెరిగిపోవటానికి ఇదే ప్రధాన కారణం.

కాబట్టి ఆధునిక విద్య, భౌతికాభివృద్ధితో పాటు మనిషి అంతర్వ్యక్తిత్వాన్ని (Internal Personality) ప్రక్షాళన చేసే బాధ్యతాయుత దృక్పథాలు ఇప్పుడు ఎంతైనా అవసరం. అలాంటి దృక్పథాలు కేవలం ధార్మిక గ్రంథాల్లో మాత్రమే దొరుకుతాయి. హిందూ, క్రైస్తవ, ముస్లిం వర్గాలు కలిగి ఉండే వేదోపనిషత్తులు, బైబిల్, ఖురాన్ గ్రంథాల్లో దొరుకుతాయి.

ఈ గ్రంథాలు మనిషి జీవిత లక్ష్యాన్ని తెలుపుతాయి. అతని జీవితం కేవలం పుట్టి కొన్నాళ్లు తిని, త్రాగి, చనిపోవటానికి మాత్రమే కాదు.. కానీ అతను తన సృష్టికర్త అయిన దైవాన్ని యథార్థంగా గుర్తించాలని చెబుతున్నాయి.

మనిషి భౌతికంగా అభివృద్ధి చెందుతూనే భౌతిక జీవనంలో ఉన్నత నైతిక విలువలతో ఎలా నడవాలో నేర్పుతున్నాయి.

పరాయి స్త్రీల వైపు వెకిలి వికార చూపులు చూడకూడదని స్త్రీలను ఉత్తమోత్తమ రీతిలో గౌరవించమని చెబుతున్నాయి.

మీరు చేసే ప్రతీ మంచీ-చెడు పనులు పర్యవేక్షించబడుతున్నాయని, వాటి నివేదిక ఒకరోజు దైవ న్యాయస్థానంలో ఉంచబడుతుందని.. అక్కడ ప్రతీ మనిషి చేసుకునే మంచీ చెడు పనులను బట్టి శాశ్వత శిక్షా-బహుమానాలు ఇవ్వబడతాయని తెలుపుతున్నాయి. ఈ లోకంలో భౌతిక చట్టాల కళ్లుగప్పి తప్పించుకోవచ్చేమో గానీ దైవ న్యాయస్థానంలో తప్పించుకోవటం అసాధ్యమని చెబుతున్నాయి. ఈ ధార్మిక గ్రంథ దృక్పథాలు వ్యక్తుల్లో భయాన్నీ-బాధ్యతను పెంపొందించుతాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే అధికశాతం హిందూ, క్రైస్తవ, ముస్లిం వర్గాల వారి తమ గ్రంథాల్లో ఉన్న ఈ బాధ్యతాయుత దృక్పథాలను ప్రక్కనపెట్టేయటంతో వారిలోనే ఎందరో మార్గం తప్పిపోయారు.

ప్రజల నుండి డబ్బు సంపాదించటమే ధ్యేయంగా సాగే ప్రభుత్వాలు, వాటిని అదుపు చేసే కార్పొరేట్ కంపెనీలతో నడుపబడే దేశంలో నిజానికి ఇన్ని సంస్కరణలు తీసుకురావటం కల్లోనే కాదు పీడకల్లో సైతం ఊహించుకోవటం అసాధ్యమే.

కాబట్టి కనీసం సమాజంలో కొందరు బాధ్యత కల వ్యక్తులు కనీసం ధార్మిక గ్రంథాలలో చెప్పబడ్డ బాధ్యతాయుత దృక్పథాలను చదివి అర్థం చేసుకుని వాటిని సర్వ సామాన్యం చేసి సమాజాన్ని ప్రక్షాళన చెయ్యటానికి ప్రయత్నించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *