వాటిలో ఒకటి సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ ‘నీలి చిత్రాలు చూస్తే జైలుకు పంపి పది లక్షల జరిమానా’ విధించటం అన్న నిర్ణయం తీసుకోవటం. ఈ రూల్ పాస్ చెయ్యటానికి కారణం- చిన్నారులు, మైనర్లపై అత్యాచారాలూ, అకృత్యాలు పెరుగుతుండడంతో కేంద్ర హోంశాఖ ఈ అంశంపై దృష్టి సారించిందంట.
మంచిదే! కానీ, అదేదో అంతర్జాలం (Internet) లో నీలి చిత్రాలను (పోర్న్) బ్యాన్ చేస్తే సరిపోతుంది కదా. ఒక సర్వే ప్రకారం ఇంటర్నెట్ లో ‘పోర్న్’ అంటే నీలిచిత్రాలను చూసే వారి సంఖ్య గమనిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సెకనుకు పోర్న్ చూస్తున్నవారు సుమారు 28,258 ఉంటే.. అందులో 89 శాతం మంది భారతదేశంలోనే చూస్తున్నారంట!
అంతేకాదు ప్రస్తుతం సగటున దేశంలోని స్మార్ట్ ఫోన్లు వాడేవారి ద్వారా నెలకు ఒక్కో స్మార్ట్ ఫోనుకు సగటున 9.5 గిగాబైట్ల డేటా వాడబడుతూ ఉండగా అందులో మూడొంతుల డేటా కేవలం పోర్న్ చూడ్డానికే వినియోగించబడుతున్నట్టు తేలింది.
దీనిని బట్టి ఒకవేళ నిజంగా భారతదేశంలో పోర్న్ చూస్తున్న వారందరినీ జైళ్లకు పంపటం మొదలు పెడితే… ప్రతీ ఊళ్లో కొన్ని వందల ఎకరాల్లో జైళ్లను పెద్ద పెద్ద కాలనీల మాదిరిగా నిర్మించాల్సి ఉంటుంది.
ఇది సాధ్యం కాని పని. అలాంటప్పుడు ఆచరణ సాధ్యం కాని రూల్స్ ఆమోదించటం వల్ల ఒరిగేదేమీ ఉండదు. మరో ప్రక్క పోర్న్ ఇండస్ట్రీ ఆరు పువ్వులు పన్నెండు కాయలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. దాని కారణంగా సమాజంలో యువకులు ఎంత చెడిపోవాలో అంతా చెడిపోయి అత్యాచారాలకు, లైంగిక నేరాలకు పాల్పడుతూ చెలరేగిపోతుంటారు.
మరి ప్రభుత్వం పోర్న్ ను ఎందుకు బ్యాన్ చెయ్యటం లేదు? ఎందుకంటే.. పోర్న్ బ్యాన్ చేస్తే స్మార్ట్ ఫోన్ల వ్యాపారం పడిపోతుంది.. ఇంటర్నెట్ వాడకం దారుణంగా పడిపోతుంది. అలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే.. ఒక ప్రక్క పోర్న్ పరిశ్రమను చూసీ చూడనట్టు వదిలి పెట్టేసి, మరో ప్రక్క “పోర్న్ చూస్తే జైలుకు పంపి పది లక్షల జరిమానా విధించబడుతుంది” అంటూ ఆచరణ సాధ్యం కాని కొన్ని రూల్స్ పాస్ చేస్తూ.. ఓహో! స్త్రీలపై అత్యాచారాలు జరక్కుండా ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్న అపోహను ప్రజల్లో కలగజేస్తూ ఉండాలన్న మాట!
కొన్ని చిత్రవిచిత్రమైన రూల్సు ఒక్క భారత దేశంలోనే ఆమోదించబడుతూ ఉంటాయేమో!
