సంక్షిప్తంగా ధార్మిక పరిభాషలో ‘హలాల్’ అన్న అరబీ పదానికి అర్థం…
తినుటకు/వాడుటకు ‘శుద్ది (Purify) చేయబడిన’ లేక ‘పరిశుద్ధ పరచబడిన’ అని అర్థం. “హలాల్” చెయ్యటం అంటే- 1. హానికర పదార్థాలను తొలగించి.. 2. తినటానికి/వాడుటకు యోగ్యమైనదిగా చేయటం అని అర్థం.
తినటానికి/వాడుటకు “యోగ్యమైన” లేదా “అనుమతి” ఉన్న (Permissible) వాటిని ‘హలాల్’ అని అంటారు. తినటానికి/వాడుటకు “యోగ్యంకాని” లేదా “అనుమతి లేని” (Forbidden) వాటిని ‘హరామ్’ అంటారు.
ఉదాహరణకు: ఆల్కహాల్, చచ్చిన జంతువు, పంది మాంసం, రక్తం వగైరా సేవించటానికి యోగ్యం కానివి ధార్మిక గ్రంథాల ప్రకారం ‘నిషేధింపబడ్డాయి’. అంటే ‘హరామ్ (Forbidden)’ అన్న మాట. వీటికి భిన్నంగా పరిశుభ్రమైన ‘తినటానికి యోగ్యమైన ఆహారం’ (Permissible food) ను ‘హలాల్’ అంటారు. అలాగే వ్యభిచారం “హరామ్ (నిషేధం)”.. పెళ్లి చేసుకోవటం “హలాల్ (ధర్మబద్ధం)”. అక్రమంగా సంపాదించటం “హరామ్ (నిషేధం)”.. సక్రమంగా సంపాదించటం “హలాల్ (ధర్మబద్ధం)” ఇలా చాలా విషయాల్లో ధర్మా-అధర్మాలను విశ్లేషించవచ్చు.
***
ధార్మిక పరిభాషలో జంతుమాంసాన్ని ‘హలాల్’ ఎందుకన్నారు?
సృష్టికర్త అయిన దేవుని స్మరణ చేస్తూ జంతు కంఠాన్ని, మెడ నాళము (Jugular Vein) ను కత్తిరించి పూర్తి రక్తాన్ని బయటకు తీయటం ద్వారా ‘శుద్ది (Purify)’ చేయబడిన దానిని ‘హాలాల్’ మాంసము అని అంటారు. నిజానికి దైవ నామస్మరణ చేసి తినాలని హిందూ శాస్త్రాల్లోనూ చూడగలం. అయితే ఆ విధంగా తినటాన్ని ముఖ్యంగా ముస్లిములు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు.
కొన్ని ఆహార పదార్థాలపై ‘హలాల్ సర్టిఫై” అని ఎందుకు ఉంటుంది?
“హలాల్ సర్టిఫై ఫుడ్స్ (Halal Certified Foods)” అంటే – “అత్యుత్తమ ప్రమాణాలతో శుద్ది (Purify) చెయ్యబడిన ఆహార పదార్థాలు అని అర్థమన్నమాట!
‘ప్రాసెస్ ఫుడ్’ ‘ఫ్రొజెన్ ఫుడ్’ డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరగటం, పైగా ముస్లిం సమాజమంతా “హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్”కు ప్రాధాన్యత ఇవ్వటం వలన ఇంటర్నేషనల్ ఫుడ్ ఎక్స్పోర్ట్ కంపెనీలన్నీ ‘హలాల్ సరిఫికేషన్’ను అదనంగా తీసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు: ITC, Mc Donald’s, KFC వగైరా కాంపెనీలేవీ ముస్లిములవి కావు. కానీ, దాదాపుగా ఈ కంపెనీలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎగుమతి చేసే ఫుడ్ ప్రోడక్ట్స్ ను ‘హలాల్ సర్టిఫికేషన్’ తో ఎగుమతి చెయ్యటం ఎప్పటి నుండో జరుగుతుంది.
‘హలాల్ సర్టిఫికేషన్’ మత విశ్వాసాలు రుద్దే ప్రయత్నామా?
ఎంత మాత్రం కాదు! యూరప్, ముస్లిం దేశాల్లో హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్ కు డిమాండ్ ఉండటమే ఇంటర్నేషనల్ ఫుడ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు హలాల్ సర్టిఫికేషన్ తీసుకోవటానికి కారణం. హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్ విక్రయించటం అన్నది ‘వ్యాపారాత్మకమే’ తప్ప అందులో బలవంతంగా ఎవరి మీదా మత విశ్వాసాలు రుద్దే ప్రయత్నం కాదు. ఏ మతస్తులనూ కించపరిచే ప్రయత్నమూ కాదు.
ఇంటర్నేషనల్ మార్కెట్లో హలాల్ ఫుడ్స్ కు ఉన్న డిమాండ్ ఎంత?
ప్రపంచ వ్యాప్త ముస్లిముల సంఖ్య దాదాపు 1.9 బిలియన్లు. అంటే ప్రపంచ జనాభాలో 24.1% అన్న మాట! పైగా ఇంటర్నేషనల్ ఫుడ్ మార్కెట్ లో 19% హలాల్ ఫుడ్స్ కు మార్కెట్ షేర్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2.3 ట్రిలియన్ డాలర్ల హలాల్ ఫుడ్ టర్నోవర్ జరుగుతూ ఉంటుంది.
ఇండియాతో సహా అంతర్జాతీయంగా మార్కెట్లో “హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్“ కు అంత భారీ డిమాండ్ ఉండటం వలన ఇండియాలోనే కాక ఫారిన్ కంట్రీస్ కు ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి చేసే చాలా ఇండియన్ కంపెనీలు హలాల్ సర్టిఫికేషన్ అదనంగా తీసుకుంటూ ఉంటాయి. భారత దేశంలో అమ్మకాల వరకు ఫుడ్ ప్రొడక్ట్స్ పై ‘FSSAI (Food Safety and Standards Authority of India)’ లైసెన్స్ సరిపోతుంది. ఇక ఇండియాలో హలాల్ సర్టిఫికేషన్ FSSAI గానీ, గవర్నమెంట్ గానీ ఇవ్వదు. హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చే ప్రైవేట్ సంస్థల ద్వారానే పొందవలసి ఉంటుంది.
హలాల్ సర్టిఫికేషన్ తీసుకోవటం వెనుక ప్రధాన ఉద్దేశం?
మనం గమనిస్తే మాంసాహార ఎగుమతులపైనే కాక బిస్కెట్లు, కేకులు, ఐస్ క్రీమ్స్, పిజ్జాలు ఇంకా కాస్మోటిక్స్ కొన్ని రకాల మెడిసిన్స్ వగైరా వాటి మీద కూడా ‘హలాల్’ సర్టిఫికేషన్ ఉంటుంది. ఎందుకంటే వాటిలో ‘ఆల్కహాల్’ కలిగి లేదని అలాగే ‘గ్లిసరిన్’ ‘జిలాటిన్’ ‘కొవ్వు పదార్థాలు కలిపినా అవి ‘పంది’ నుండి సేకరించినవి కాదని, ఒకవేళ కొవ్వు పదార్థాలు వాడినప్పటికీ మేక, గొర్రె, ఆవు వగైరా హలాల్ జంతువుల కొవ్వును ఉపయోగించబడిందని నిర్ధారించటానికి మాత్రమే ‘హలాల్’ సర్టిఫికేషన్ తీసుకోవటం తప్పనిసరి అవుతుంది.
అలాగే ‘హలాల్ టూరిజం’ ఎప్పుడైనా విన్నారా? ‘హలాల్ టూరిజం’ ప్యాకేజ్ లను కూడా కొన్ని కంపెనీలు మార్కెట్టింగ్ చేస్తున్నాయి. అంటే వాటి హాలిడే ప్యాకేజ్ లో అవి ఆల్కహాల్ సప్లై చేయకుండా, పూర్తిగా హలాల్ ఫుడ్ ను మాత్రమే అందించటం జరుగుతుంది.
మహారాష్ట్రకు చెందిన ‘P.P FOODS’ అనే సంస్థ నిజానికి ‘బియ్యం’ ఎక్స్ పోర్ట్ చేసే కంపెనీ. ఈ కంపెనీ ఎటువంటి మాంసాహార ఉత్పత్తులు ఎగుమతి చెయ్యదు. కానీ ఈ సంస్థ సైతం బియ్యం ప్యాకట్లపై హలాల్ సర్టిఫికేష్ తీసుకుంటుంది. అలాగే ప్రముఖ “ITC” కంపెనీ ఇండియా నుండి ముస్లిం దేశాలకు ఎగుమతి అయ్యే గోధుమ ప్యాకెట్లపై సైతం ‘హలాల్’ సర్టిఫికేషన్ తో ఎగుమతి చేస్తుంది. ఇవి మాంసాహార ఉత్పత్తులు కాకపోయినప్పటికీ.. ముస్లిం దేశాల్లో హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్ కు డిమాండ్ ఉండటం మూలనా అంతర్జాతీయ మార్కెట్ లో లాభాలు ఆర్జించటానికి ‘హలాల్’ సర్టిఫికేషన్ తో ఈ కంపెనీలు ఎగుమతి చేస్తున్నాయి.
‘హలాల్ సర్టిఫికేషన్’ తీసుకోవటం హలాల్ మాఫియానా?
కొందరు అరమెదడు మేధావులు ‘హలాల్’ సర్టిఫైడ్ ఫుడ్స్ ను హలాల్ మాఫియాగా అభివర్ణిస్తుంటారు. నిజానికి ‘హలాల్’ సర్టిఫైడ్ ఫుడ్స్ అమ్ముతున్న లేక ఎగుమతి చేస్తున్న కంపెనీలు కేవలం ముస్లిములకు చెందినవి మాత్రమే కావు. అంతర్జాతీయంగా ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి చేసే ఎన్నో ముస్లిమేతర కంపెనీలు కూడా హలాల్ సర్టిఫికేషన్ తీసుకుంటాయని మనం పై వివరణలో గమనించాం.
ప్రపంచవ్యాప్తంగా హలాల్ ఫుడ్స్ తాలూకు డిమాండ్ మరియు టర్నోవర్ తాలూకు అవగాహన లేని వారే ‘హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్’ను హలాల్ మాఫియా అని భ్రమ పడుతుంటారు. అలాంటి మిడి మిడి జ్ఞానం ఉన్నవారే… ముస్లిమేతరులపై బలవంతంగా రుద్దటానికే ఆహార పదార్థాలపై “హలాల్ సర్టిఫికేషన్” తీసుకోవటం జరుగుతుందని తెగ బాధపడిపోయి .. మాకు అన్యాయం జరిగిపోతుందని హలాల్ ఫుడ్స్ ను బాయ్ కాట్ చెయ్యాలని సోషల్ మీడియాలో చిల్లర పోస్టులు, చావకబారు కామెంట్లూ పెడుతుంటారు.
‘హలాల్’ సర్టిఫికేషన్ ఉంటే అది బలవంతంగా ముస్లిమేతరులపై రుద్దటం అవుతుందా?
మార్కెట్ లో ఎన్నో వస్తువులు విక్రయించబడుతూ ఉంటాయి. అలాగే హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్ మీద ఎక్కడా “ఇది మీరు కచ్చితంగా తినాల్సిందే” అన్న నిర్బంధం ఏమీ ఉండదు కదా! ‘హలాల్ సర్టిఫై ఫుడ్స్’ తినటం ఇష్టం లేనప్పుడు తినమని ఎవరూ బలవంతం కూడా చెయ్యరు! ఇష్టం లేనప్పుడు అది మానేసి ఇంకొకటి కొనుక్కునే వ్యక్తి స్వేచ్చ అందరికీ ఉంది. ‘హలాల్’ సర్టిఫికేషన్ ఉన్న ఫుడ్స్ తినే వారు అవి తింటారు.
ధార్మిక గ్రంథాలు జంతువులను దైవనామ స్మరణ చేసి తినాలి, శుద్ది చేయబడిన వాటినే తినాలి, పంది మాంసం, చచ్చిన వాటిని, రక్తాన్ని తినకూడదు, మధ్యం త్రాగకూడదు, వ్యభిచరించకూడదు వగైరా అంటూ ఎన్నో విధి-నిషేధాలు ఆదేశిస్తున్నాయి. అబ్బే! నా ఇష్టమొచ్చినట్టు నేను నిషేధించబడినవి తాగుతాను, తింటాను వ్యభిచారం కూడా చేస్తాను అని ఎవరైనా అంటే తప్పులేదు అది అతని ఇష్టం. ధర్మం ఎవరినీ ఏదీ పాటించాలని బలవంత పెట్టదు.
ధార్మిక గ్రంధాలు నిషేధించిన వాటిని తినే, త్రాగేటోల్లు అన్ని మతాల్లోనూ ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ‘హలాల్’ ఫుడ్స్ తినటం మాకు ఇష్టం లేదు అన్నప్పుడు మానేయ్యవచ్చు తప్పితే దానికి వేరేగా స్టేట్ మెంట్ ఇచ్చి వ్యతిరేకించాల్సిన అవసరం అస్సలు లేదు.
ఉదాహరణకు: మార్కెట్ లో ‘గో మూత్రం’ సీసాలు కూడా అమ్మబడుతుంటాయి. దానర్థం వాటిని అందరూ కచ్చితంగా కొనుక్కుని త్రాగాలన్న నిర్బంధం ఉన్నట్టు కాదు కదా! పైగా వాటిని అమ్మటం ఇతర మతస్తుల విశ్వాసాలను కించపరచటం కూడా అవ్వదు. ‘గో మూత్రం’ ఇష్టం ఉన్నోల్లు కొనుక్కుని తాగుతారు ఇష్టం లేనోల్లు మానేస్తారు. అలాగే హలాల్ సర్టిఫికేషన్ ఉన్న వస్తువులు ఇష్టం ఉన్నోల్లు తింటారు, ఇష్టం లేనోల్లు మానేస్తారు. ఏ ఒక్క మతవర్గానికో ఇష్టం లేదని అంతర్జాతీయ ఎక్స్ పోర్ట్ కంపెనీలు కోట్లలో జరిగే వ్యాపారాలు మానేసి ఇంట్లో కూర్చోలేవు కదా!
అలాగే చాలా చోట్ల చికెన్/మటన్ షాపులపై “హలాల్ మాంసం అమ్మబడును” అని రాసి ఉండటాన్ని చూడగలం. అది కూడా వ్యాపార టెక్నిక్కే! కారణం మనది హిందూ, ముస్లిములు కలిసి ఉన్న సమాజం. హలాల్ మాంసాహారం తినే ముస్లిం కస్టమర్లను ఆకర్షించటానికి అటు ముస్లిం వ్యాపారస్తులే కాక.. ముస్లిమేతర వ్యాపారస్తులు సైతం కోళ్లూ, మేకల్నీ హలాల్ చెయ్యించి మాంసం షాపుల్లో అమ్ముతుంటారు. దానికి కారణం ముస్లిమేతరుల మత విశ్వాసాలను కించపరచటం కాదు. ఒకవేళ హలాల్ వద్దు అనుకుంటే మానేసి హలాల్ లేనిదే కొనుక్కోవచ్చు అందులో ఏ ఇబ్బందీ లేదు బాధపడిపోవాల్సిన పనికూడా లేదు.
