ప్రకృతిలో కొన్ని జీవులు శాఖాహారులైతే.. కొన్ని జీవులు మాంసాహారులు. కానీ ఒక్క మనిషి మాత్రమే అటు శాఖాహారాన్నీ ఇటు మాంసాహారాన్ని కూడా ఏకకాలంలో జీర్ణం చేసుకోగలిగే ప్రత్యేక జీవి. అందుకే అతని దంత నిర్మాణంలోనే అటు శాఖాహారాన్ని, మాసాహారాన్ని తినటానికి అనువుగా రెండు రకాలా పళ్లూ ఉంటాయి. అంతేకాదు మనిషి తినే మాంసాహారం సులువుగా జీర్ణమవటానికి అనువుగా మనిషి పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో పాటు ప్రోటీసెస్ అనే ప్రత్యేక ఎంజైమ్ కూడా విడుదల అవుతుంది. అయితే కొందరు వ్యక్తులు శాఖాహారంతో పాటు మాంసాహారాన్నీ ఇష్టపడతారు. కొందరు కేవలం శాఖాహారాన్ని మాత్రమే ఇష్టపడతారు.
ఈ విధంగా ఎవరి ఆహారపు అలవాట్లు వారికి ఉన్నప్పటికీ… మేకలు, కోళ్లు, గొర్రెలు, చేపలు వగైరా జీవులను కోసుకుని తినేయటం ఎంత అన్యాయం ఎంత పాపమండీ! జీవులను కోసుకుని వాటి మాంసాన్ని తినటం ‘జీవహింస కదా?’ అన్నది కొందరు అభినవ శాఖాహారుల వాదన.
ఈ వాదన ఎంతవరకు అర్థవంతమైందన్నది చూసే ముందు అసలు ప్రకృతిలో మనిషి స్థానం ఏమిటి? అన్నది చూడాల్సి ఉంటుంది. అంతకంటే ముందు అసలు ‘ప్రకృతిలో ఏవి జీవులు?’ ‘అసలు జీవ హింస అని దేనిని అంటారు?’ అన్నది పరిశీలించాల్సి ఉంటుంది.
ప్రకృతిలో ఏవి జీవులు?
ప్రకృతిలో ఉన్న చెట్లు-మొక్కలూ, పశువులూ-పక్షులూ, క్రూర మృగాలూ-జలచరాలూ, క్రిమి-కీటకాలూ వగైరా… వీటన్నిటికీ ప్రాణం ఉందా? లేదా? ఇవన్నీ జీవులా? జీవులు కావా? అని ప్రశ్నించుకుంటే.. ఇవన్నీ ప్రాణులూ లేదా జీవులే అన్న సమాధానం వస్తుంది!
కాకపోతే… చెట్లు-మొక్కలూ- “మూగ జీవులు” లేదా “నిశ్చల జీవులు”. జంతువులు, పక్షులు, క్రిమి- కీటకాలు వగైరా కూడా “మూగజీవులే” కాకపోతే అవి “చలన జీవులు” అంతే తేడా
ఇక ఈ జీవుల్లో ఉన్న తేడా.. కొన్ని కదిలేవీ.. కొన్ని కదలనివి కొన్ని అరిచేవి… కొన్ని అరవనివి.. కొన్నిటికి రక్తం ప్రసరణ ఉంటుంది.. కొన్నిటికి రక్తం ప్రసరణ ఉండదు అంతే! ఈ వర్గీకరణ (Classification) చేసింది ఎవరో కాదు ఆధునిక ప్రకృతి శాస్త్రం చేసిందే.
సరే, ఇంతకూ ‘జీవహింస’ అంటే ఏమిటి?
జంతువులను కోసుకుతినటం ‘జీవహింస’ అని మీరు ఎందుకు అంటున్నారు? అని ప్రశ్నిస్తే… దానికి మాంసాహార వ్యతిరేకులు ఇచ్చే నిర్వచనం (definition)-“ఒక జీవి దానికదే కాక, దాని ప్రాణాన్ని బలవంతంగా తీసేయటం లేదా చంపేయటం జీవహింస అవుతుంది” ఎందుకంటే బలవంతంగా చంపేస్తున్నాం కాబట్టి అది హింసించబడి చనిపోతుంది కాబట్టి అన్నది.
సరే ప్రకృతిలో.. 1. చలన జీవులు 2. నిశ్చలన జీవులు అని రెండు రకాల జీవులు ఉంటాయి.. వాటిలో కొన్ని తమ భావాలు/బాధను వ్యక్త పరిచేవి కొన్ని తమ భావాలు/బాధను వ్యక్తపరచలేనివి ఉంటాయన్నది మనం గమనించి ఉన్నాం.
అయితే జీవహింస అన్న పదానికి పై నిర్వచనాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. ఈ జీవుల్లో ఏ జీవుల్ని చంపవచ్చు? ఏ జీవుల్ని చంపకూడదు? ఇవన్నీ జీవులే అయినప్పుడు వీటిలో వేటిని కోసినా/చంపినా అది జీవహింసే అవుతుందా? అవ్వదా? అన్నది రెండు ప్రశ్నలు మన ముందుకొస్తున్నాయి.
మొక్కలూ జీవులే – వాటిని కోసుకుతినటం జీవహింస కాదా?
మొక్క ‘మూగజీవి’ అది ‘అరవలేదు’, ‘కదలలేదు’! అయినప్పటికీ మొక్కలకు ‘శ్వాసక్రియ’ ‘పరాపరాగ సంపర్కం’ జీవక్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థాలను తిరిగి ఉపయోగించుకునే శక్తి’ ‘పెరుగుదల’ ‘ప్రత్యుత్పత్తి’ వగైరా అన్ని రకాల జీవక్రియలను మొక్కల్లో చూడగలం. కాబట్టి వాటిని కోసుకు తినటం జీవ హింస కాదా? అని ప్రశ్నిస్తే…
అబ్బే! చెట్లూ, చేమలు ప్రాణులే/జీవులే అయినప్పటికీ వాటిని కోసినప్పుడు అవి అరవవు/ తమ బాధ వ్యక్త పరచలేవు కాబట్టి అది జీవహింసలోకి ఎలా వస్తుంది? అని ఎవరైనా వాదిస్తే గనుక..
అప్పుడు ఒక మనిషికి ముందు మత్తు మందు ఇచ్చేసి నొప్పితెలియకుండా చంపేసినా నేరం కాదు… లేక బాధను వ్యక్తపరచేలేని కోమా స్థితిలో ఉన్న వ్యక్తిని చంపేసినా లేదా మూగ-చెవిటి అయిన వ్యక్తిని చంపేసినా కూడా అది జీవ హింసకాదు.. నేరం కూడా కాదు అని ఒప్పుకోవాల్సి ఉంటుంది
అలాగే ఊపిరి పీల్చుకున్నప్పుడు కొన్ని కోట్ల సుక్షజీవులు చనిపోతున్నాయి.. దోమలను, బొద్దింకలను, విషపురుగులను క్రిమికీటక సంహార మందులు వాడి చంపేస్తున్నాం మరి అది జీవ హింస కాదా? అని ప్రశ్నిస్తే… అబ్బే, అవన్నీ వదిలేయండి… అవన్నీ కాదు మీరు ఆవుల్నీ, మేకల్నీ కోసుకు తినేయటం ఏమిటండీ? అని తమ వాదనే పై చెయ్యిగా ఉండాలనుకునే వారికి కేవలం మేకలు, కోళ్లు వగైరా వాటిని కోసుకు తినటమే జీవహింసలా కనపడుతుంటుంది!
నిజంగా ఏదైనా జీవి ప్రాణాన్ని బలవంతంగా తీసేయటం లేదా చంపేయటం జీవహింస అవుతుందన్నప్పుడు ఒక్క జంతువులే కాదుకదా జీవులు… పైన చెప్పుకున్నట్లు చెట్లు-మొక్కలూ, పశువులూ-పక్షులూ, క్రూరమృగాలూ-జలచరాలూ, క్రిమి-కీటకాలూ వగైరా అన్నీ జీవులే అవుతాయి. వీటిలో వేటిని చంపినా జీవహింసే కదా?
ఈ ప్రశ్నకు మాంసాహారమే జీవహింస అని వాదించేవారు ఎప్పటికీ సూటైన సమాధానం ఇవ్వలేరన్నది అతిశయోక్తికాదు.
ప్రకృతిలో మనిషి స్థానం ఏమిటి?
అసలు మనిషి ప్రకృతి కొరకా? ప్రకృతి మనిషి కొరకా? అన్నది గమనిస్తే.. రకరకాల మొక్కలు, చెట్లు, ఫలాలు వగైరా వనరులతో కూడిన ప్రకృతి నిర్మాణం ఉన్నదే మనిషి ప్రశాంత మనుగడ కొరకు అన్నది నిర్వివాదం. మనిషి రుచికరమైన ఆహారం నుండి అతని ఆరోగ్య సంరక్షణ వరకు అతని మనస్సు, జిహ్వా కోరుకునే ప్రతీదీ కూడా ప్రకృతిలో ఏర్పాటు చేయబడి ఉంది. అందులో భాగంగానే అతని చక్కటి ఆరోగ్యం కోసం, రుచికరమైన ఆహారం తినటం కోసం మేసే చతుష్పాద జంతువులు, జలచరాలు కూడా ఏర్పాటు చెయ్యబడ్డాయి.
అందుకే ఈరోజు డాక్టర్లు సైతం గర్భిణీ స్త్రీలకు, రోగులకూ రోగనిరోధక శక్తి పెరగటానికి గుడ్లు, చేపలు, మాంసం తినమని చెబుతున్నారు. ‘రోగనిరోధక శక్తి (Immunity power)’ బలపడటానికి గుడ్లు, చేపలు, కోడిమాంసం తినమని సకల వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ప్రకృతి పరిరక్షణ ప్రకృతి కొరకా? లేక ప్రకృతి పరిరక్షణ మనిషి కొరకా? అంటే… మనిషి పరిరక్షణ కొరకే ప్రకృతి పరిరక్షణ అన్నది సమాధానం అవుతుంది.
అంటే దీనిని బట్టి ఇక్కడ అర్థమవుతున్న విషయం సకల ప్రాకృతిక శక్తుల/జీవుల అంతిమ లక్ష్యం- మనిషి మనుగడను కాపాడటం కొరకు మాత్రమే అని అర్థమౌతుంది.
దీనికో గొప్ప ఉదాహరణ మనిషి తినటానికి అతని ఆరోగ్యం కోసం మేసే చతుష్పాద జంతువులు అంటే కొరపళ్లు లేని మేకలు, గొర్రెలు, ఆవులు వగైరా కొన్ని కోట్ల మంది తింటున్నప్పటికీ ఆయా జాతులు ఎప్పటికీ అంతరించిపోవటం లేదు. ప్రకృతిలో ఆయా జంతువుల ఉత్పత్తి (Production) ప్రపంచ జనాభాకు తగ్గట్టుగా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. మనిషి ఆరోగ్యానికి హాని కలిగించే కొరపళ్లు ఉండే క్రూరమృగాలు వగైరా కొన్ని జంతువులకు అవసరమైన వన్యప్రాణుల పరిరక్షణ మనుషులు తినదగ్గ జంతువులకు అవసరం లేదు. ఇది ప్రకృతిలో మనిషి కోసం చేయబడ్డ మహత్తర ఏర్పాటు మాత్రమే.
అందుకే మనిషి ఆరోగ్యానికి ప్రకృతిలో లభించే.. రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, మాంసం తినమని చెబుతుంటారు. దీనిని బట్టి అర్థమయ్యే విషయం మనిషి మనుగడకు ప్రకృతిలో లభించే సమస్త వృక్షసంపదా, జంతువులు, జలచారాలు కూడా భాగాలే అని తేటతెల్లమవుతుంది.
మరి అన్నీ జీవులే అయితే వేటిని తినాలి? వేటిని తినకూడదు?
దీనికి సంక్షిప్త సమాధానం- ప్రకృతిలో ఏ జీవులను తినటం వలన మనిషికి నష్టం కలుగుతుందో అది మనిషికి నిషేధం. ఏ జీవులను తినటం వలన మనిషికి మేలు కలుగుతుందో అది హింసకాదు అంతే. ఉదాహరణకు.. కొరపళ్లు ఉన్న మృగాలు, పాములు, పంది వగైరా వాటిని తినటం వల్ల మనిషికి హాని కలుగుతుంది కాబట్టి అవి మనిషికి నిషిద్ధం. ప్రకృతిలో రాకరకాల మొక్కలూ, చెట్లు అవి ఉత్పత్తి చేసే ఫలాలు, కాయగూరలు, కోరపళ్లు లేని మేసే జంతువులులు (మేక, గొర్రె, ఒంటె, ఆవు వగైరా), జలచరాలు తినటం వల్ల మనిషికి మేలే తప్ప నష్టం చేకూరదు. కాబట్టి వాటిని తినటం మనిషికి నిషేధం కానే కాదు. పైగా వాటిని తినటం జీవహింసగా పరిగణించటం అర్థరహితం అవుతుంది కూడా
మాంసాహారమే జీవహింసా?
