“హిందూస్థాన్ ఖత్రే మే హై”

నిజానికి ఈ దేశంలో హిందూ కాదు.. “హిందూస్థాన్ ఖత్రే మే హై”! ఆ విషయం హిందూ ఖత్రే మే హై నినాదాలు చేసే వారికి, వారి వెనకుండి నడిపే రాజకీయ నాయకులకు కూడా బాగా తెలుసు. కాకపోతే హిందుస్తాన్ ఖత్రే మే హై అన్న అసలు విషయాన్ని మరుగుపరచాలంటే.. లేదా దాని నుండి ప్రజల దృష్టి మరచాలంటే వేరే ప్రత్యామ్నాయం తీసుకొచ్చి పెట్టాలి. దాని కోసం ప్రజల్లో మూర్ఖత్వాన్నీ, మూఢ భక్తినీ పెంపొందించుకుంటూ పోయి మూఢ భక్తుల గ్యాంగ్ ఒకటి తయారు చెయ్యాలి.. దేశంలో ముస్లిముల వల్ల హిందువులు ప్రమాదంలో ఉన్నారు వారు జనాభా పెంచేసుకుని ఈ దేశాన్ని ముస్లిం స్టేట్ గా మార్చేసుకుంటారు కాబట్టి మన హిందూత్వాన్ని కాపాడుకోవాలి అనే ఓ పనికిమాలిన ఫోబియాను క్రియేట్ చెయ్యాలి.. ముస్లిములను విలన్ల మాదిరి చిత్రీకరించాలి.. జీ.డీ.పీ అధమ స్థాయికి దిగజారిపోయినా, దేశంలో నిరుద్యోగం పెరిగిపోయినా, ఆర్థిక సంక్షోభాలు, ఆకలిబాధలు విలయతాండవం చేస్తున్నా, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతూ ప్రజల జీవితాలు రోడ్డునపడిపోయే పరిస్థితులు వచ్చినా అవేమీ పట్టించుకోకుండా మైనారిటీల నుండి అతిపెద్ద మెజారిటీ అయిన హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే భయాన్ని సృష్టించి, హిందూత్వాన్ని కాపాడుకోవటమే లక్ష్యం తప్ప వేరే లక్ష్యం ఏదీ పెట్టుకోకుండా గొర్రెల్లా మార్చిపరేసి, గుడ్డి భక్తుల సంఖ్యను పెంచుకుంటూ పోవాలి.

ప్రతీ ఐదు నిముషాలకో స్త్రీ అత్యాచారం చెయ్యబడుతున్న ఈ దేశంలో స్త్రీ సంరక్షణ కంటే గో సంరక్షణే ప్రధానంగా మార్చిపరేయ్యాలి..

ఆకలి సూచిలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ కంటే ఎంతో వెనుకబడిన దేశంగా అధమ స్థితిలో ఉన్నప్పటికీ.. స్త్రీలకు అత్యంత ప్రమాదకర దేశంగా పరిగణించబడినప్పటికీ..

ఈ దేశ సంపద అయిన ట్రిలియన్ల కోట్ల రూపాయాలు బ్యాంకుల నుండి కొల్లగొట్టి వ్యాపారవేత్తలు విదేశాలకు పారిపోతున్నప్పటికీ..

లాభాల్లో ఉన్న బ్యాంకులు దివాళా తీస్తున్నప్పటికీ, లాభాల్లో ఉన్న సంస్థలను అమ్మేస్తున్నప్పటికీ..

వ్యాపారులకే అర్థం కాని ట్యాక్సుల భారం వేస్తున్నప్పటికీ, నల్ల చట్టాలు తీసుకొచ్చి సామాన్య శ్రామికుల సంపద నుండి రైతుల కష్టార్జితం వరకు కొల్లగొట్టి ఆదానీ, అంబానీల వంటి కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తున్నప్పటికీ.. అలాంటివేమీ పట్టించుకోకుండా గుడ్డిగా తమకే చక్క భజన చేస్తూ.. హిందూస్థాన్ ఖత్రేమే హై అన్న ఆలోచన సైతం రాకుండా మెదడును మొద్దుబారిపోయేలా చేసిపరేసి “హిందూ ఖత్రే మేహై” “లవ్ జిహాద్” లాంటి పనికిమాలిన స్లోగన్లతో సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తూ కూర్చోనే ఐటం గాళ్ల మాదిరిగా తయారుచేసి పరేయ్యాలి. ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టు అదే.

కానీ, వాస్తవం ఏమిటంటే.. ఈ దేశంలో హిందూ వల్ల ముస్లిం గానీ.. ముస్లిం వల్ల హిందూ గానీ ఏ ప్రమాదంలోనూ లేరు. దానికి గత చరిత్రే సాక్ష్యం. నిజానికి మతాన్ని రాజకీయంతో ముడిపెట్టేసి మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న మతోన్మాద రాజకీయ నాయకుల వల్లే దేశం ప్రమాదంలో ఉంది. దానికి ప్రస్తుత సామాజిక నేపథ్యమే సజీవ సాక్ష్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *