ఫ్రాన్స్ లో ‘శామ్యూల్ పాటీ’ అనే టీచర్ హత్యకూ.. ఇక్కడి గౌరీ లంకేష్ హత్యకూ పెద్ద తేడా ఏమీ లేదు. రెండు సందర్భాల్లోనూ పనిచేసింది ఉన్మాదమే!
కాకపోతే మీడియా ముస్లిమేతరులు చేసే దౌర్జన్యానికి “దాడి లేక హత్య చేశారు” అని చెబితే.. అదే ముస్లిం పేరు పెట్టుకుని చేసే దౌర్జన్యానికి “ఇస్లామిక్ టెర్రరిజం” అని పేరుపెడుతుంది. అదే గమ్మత్తు.
ప్రపంచంలో ప్రతీ నిముషం ఏదో ఒక చోటా ఏదో ఒక మతానికి చెందిన వ్యక్తుల ద్వారా అనేక అరాచకాలు.. నేరాలు జరుగుతూనే ఉన్నప్పటికీ..
వాటిలో ముస్లిం పేరు పెట్టుకుని ఎవడైనా నేరం చేస్తే మటుకు అది ప్రపంచ సమస్యగా మారిపోతుంది. ముస్లిం సమాజం మొత్తం బోనులో నిలబడిపోతుంది. ఇస్లాం శాంతిని బోధిస్తే అరాచకాలు ఎలా జరుగుతున్నాయి? అన్న ప్రశ్నలు బయలుదేరిపోతాయి.
* * *
ఇప్పుడు మీడియాలో సరికొత్త హాట్ టాపిక్ ఫ్రాన్స్ లో ‘శామ్యూల్ పాటీ’ అనే టీచర్ హత్య గురించి. “పాపం అతని తప్పేమీ లేదు అతని ఏదో “ఫ్రీడం ఆఫ్ స్పీచ్” ను వినియోగించుకోవటంలో భాగంగా తన క్లాసులో విద్యార్థులకు ప్రవక్త ముహమ్మద్ (స) ‘కారికేచర్’ అంటే.. ‘కార్టూన్లు’ చూపించాడు! అంతేకాదా ఆమాత్రం దానికే సహనం కోల్పోయి చంపేయాలా? ఇస్లాం శాంతిని బోధించినప్పుడు ఇలాంటి అరాచకాలు ఎలా జరుగుతాయి? ఇదేనా శాంతి మతం అంటే?”.. వగైరా కామెంట్లు ఆల్రెడీ సోషల్ మీడియాలో హల్ చెయ్యటం మొదలైపోయాయి.
నిజానికి ఫ్రాన్స్ లో జరిగిన టీచర్ హత్యను ఆదేశ ముస్లిములంతా ఏకగ్రీవంగా ఖండించటమే కాదు ఆదేశ ముస్లిములంతా చంపబడిన ఆ టీచరుకు నివాళులు సైతం అర్పించారు. ఎవరో చేసే ఉన్మాదానికి ఇస్లాంతో ముడిపెట్టి మాట్లాడవద్దని నినదించారు కూడా.
* * *
క్లాస్ రూముల్లో విద్యార్థులకు ప్రవక్తల కార్టూన్లు చూపి విమర్శించటం అదేం దిక్కుమాలిన “ఫ్రీడం ఆఫ్ స్పీచ్” ను వినియోగించుకోవటమో అర్థం కాదు!
సరే, అతను చూపించినప్పటికీ అతన్ని చంపినోడు చేసింది ఘనకార్యం అనేమీ చెప్పటం లేదు. ప్రవక్త ముహమ్మద్ (స) పై నిజంగా ప్రేమున్నోడు, ఆయన ఆదర్శాలు పాటించే మనిషే అయితే నిజంగా ఖురాన్ అవగాహన ఉండే వ్యక్తే అయితే..
ప్రవక్త ముహమ్మద్ (స) కార్టూన్లు వేసి వెక్కిరించటం ఏం ఖర్మ.. ఆయన ఉన్నప్పుడైతే ఆయన సందేశాన్ని ఆనాడు తిరస్కరించిన మక్కా అవిశ్వాసులు ఆయనను ఓ సందర్భంలో రక్తమోడేలా రాళ్లతో కొట్టారు. ఆయన నడిచి వెళుతుంటే ఆయనపై ఓ స్త్రీ అశుద్ధం సైతం పడవేసింది.
ఆయన వీధుల్లో నడుస్తూ ఉంటే ఆయనను హేళన చేస్తూ ఆయన పట్ల వెకిలితనంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఆయన ఎంతో సహనం వహిస్తూ అందరినీ క్షమిస్తూపోయారే తప్ప ఎవరినీ పల్లెత్తు మాట అనేవారు కాదు.
పైగా తనను బాధించినోల్లు, తనపై అశుద్ధం సైతం వేసినోల్లు సైతం అనారోగ్యానికి గురైతే వారి ఇళ్లకు వెళ్లి ఎంతో దయాభావంతో పరామర్శించి వచ్చేవారు.
మక్కాపై విజయం సాధించి ఆయన మదీనా నుండి మక్కాకు మహా సైన్యంతో ప్రవేశించినప్పుడు తనను తన శిష్యులను హింసించి క్రూరంగా చంపినోల్లను పగ తీర్చుకునే అవకాశం మెండుగా ఉన్నప్పటికీ వారందరినీ క్షమించేశారు.
ఆవిధంగా ఆయన హృదయాల విజేతగా మారిపోయారు.
ఈ అవగాహన ఉండి ఉంటే ఆ టీచర్ని హత్య చేసినోడు.. కార్టూన్లు చూపి అవహేళన చేసినప్పుడు పద్ధతిగా మాట్లాడగలిగేవాడు. లేదా సహనం వహించగలిగేవాడు.
ఈ నేపథ్యంలో ఖురాన్ ఏమి చెబుతుందంటే..
.
“ప్రవక్తా! మంచీ, చెడు ఒకటి కావు. నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణ స్నేహితుడైపోవటాన్ని నీవు గమనిస్తావు. ఈ సుగుణ యోగం సహాన శీలురకు తప్ప మరెవరికీ లభ్యం కాదు. ఈ స్థానం మహా అదృష్టవంతులకు తప్ప మరెవరికీ లభ్యం కాదు. – 41:34-35
ఈ విధంగా ఖురాన్ శత్రువుల పట్ల సైతం మంచిగానే వ్యవహరించి వారిని ప్రాణ స్నేహితులుగా మార్చుకోమంటుంది.ఇది అసలు ఇస్లాం. నిజ ఇస్లాంను చూడాలంటే అది ప్రవక్త ముహమ్మద్ (స) చరిత్ర ఆయన బోధల్లో ఖురాన్ లో చూడాలి.
కానీ, ఈనాడు అంతర్జాతీయ ఇస్లామిక్ క్రిటిక్స్ నుండి అరుగుల మీద కూర్చొని ఇస్లాంను విమర్శించే వాళ్లంతా ముస్లిం సమాజాన్ని అందులో అనవగాహనాపరులైన ముస్లిములను చూసి విమర్శించేవారే!
ఉదాహరణకు ప్రముఖ ఇస్లామిక్ క్రిటిక్ అయిన “అయాన్ హిర్సీ అలీ” తో జరుగుతున్న ఇంటర్యూలో “మీరు ఇస్లాంలో స్త్రీ వివక్ష ఉందని ఎలా చెబుతున్నారు?” అనడిగిన ప్రశ్నకు ఆమె చాలా చిత్రంగా- “ఈరోజుకీ అరబ్ దేశాల్లో స్త్రీలకు కారు నడిపే హక్కు కలిగి లేరు. దీనిని బట్టి ఇస్లాంలో స్త్రీ వివక్షకు గురవుతుందని చెప్పవచ్చు” అంటూ సమాధానం ఇవ్వటమే కాదు…
“ఈనాడు ముస్లిం సమాజంలో కొందరు టెర్రరిజం వైపు ఆకర్షించబడుతున్నారు. అలాంటప్పుడు ఇస్లాం శాంతి మతం అని ఎలా అంటారు?” అంటూ ఆ ఇంటర్యూలో చెప్పుకొచ్చిందామే. అంటే ఇస్లాంను విమర్శించటానికి ఆమె ఇస్లాంను ఎక్కడ చదివింది? ముస్లిం సమాజాన్ని చూసి ఆమె ముస్లిములు ఇలా అయిపోవటానికి కారణం ఇస్లాం అన్న నిర్ధారణకు వచ్చింది.
ఇలాంటి అర్థంపర్థం లేని క్రిటిక్స్ ఆమె మాత్రమే కాదు.. ఇస్లాం అవగాహన లేని ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో చేసేవే. నిజానికి ఇస్లాంలో స్త్రీలను వాహనాలు నడపొద్దని ఎక్కడా చెప్పలేదు. అది సౌదీ ప్రభుత్వ సమస్య.
అలాగే ఇస్లాంలో ఎక్కడా అన్యాయంగా ప్రజల్ని చంపనీ లేదు. విశ్వాసులపై కొందరు దౌర్జన్య పరులు యుద్ధానికి కాలు దువ్విన సందర్భంలో ప్రాణ రక్షణ నిమిత్తం తాత్కాలికంగా అప్పటి పరిస్థితుల్లో యుద్ధం చెయ్యమన్న ఆజ్ఞలు వచ్చాయి తప్ప.
* * *
ఉగ్రవాదులు లేదా తీవ్రవాదం చేసేవారంతా ఏ ఒక్క మతవర్గంలోనూ ప్రత్యేకంగా పుట్టరు. ఏ మతమూ, ఏ ధార్మిక గ్రంథమూ ఉగ్రవాదం చెయ్యమని చెప్పాదు. కాకపోతే ప్రతీ మతవర్గంలో సంస్కారులు మర్యాదస్తులతో పాటు మూర్ఖులు కూడా తప్పనిసరిగా ఉంటారు. వారు ప్రదర్శించే ఉన్మాదాన్ని బట్టి మత వర్గం మొత్తాన్ని బోనులో నిలబెట్టేసి విమర్శించటం మటుకు మూర్ఖత్వమే అవుతుంది.
గోరక్షణ పేరుతో జరిగిన హత్యలను బట్టి.. కల్బుర్గీ, గౌరీలంకేష్ ల హత్యలను బట్టి హిందూత్వం ఉగ్రవాదం నేర్పుతుందనటం ఎంత మూర్ఖత్వమో.. అమెరికా, ఇరాక్ పై బాంబుల వర్షం కురిపించి లక్షల మందిని చంపటాన్ని బట్టి క్రైస్తవం ఉగ్రవాదం నేర్పుతుందనటం ఎంత మూర్ఖత్వమో… ముస్లిం పేరు పెట్టుకుని ఒకడు నేరం చేసినంత మాత్రానా ‘ఇస్లామిక్ టెర్రరిజం’ అనటం కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది.
కొందరు మూర్ఖులు ప్రతీ మతవర్గంలోనూ ఉంటారు కాబట్టి వారిని జూ ల్లో జంతువుల్లా స్వేచ్ఛగా వదిలిపెట్టేయమని కాదు నా ఉద్దేశం.
కచ్చితంగా ఆయా మత వర్గాల వారు ధార్మిక గ్రంథాలలో రాయబడి ఉన్న ఉన్నత నైతిక విలువలను బోధించి వారిని సంస్కరించటానికి ప్రయత్నించాలి.
ఇస్లాంను విమర్శించాలనుకునేవారు ముందు ఖురాన్ ను, ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్రను కూడా అధ్యయనం చేయటానికి ట్రై చెయ్యాలి.
