తనిష్క్ యాడ్ – లవ్ జిహాద్ !?

“ఏకత్వ” పేరుతో తనిష్క్ సంస్థ లాంచ్ చేసిన జ్యూలరీ యాడ్ లో ఏకత్వం అన్న దృక్పథం ఫోకస్ చేసేందుకు.. ఓ హిందూ అమ్మాయి ముస్లిముల ఇంటిలో కొడలిగా ఉండటం పైగా ఆ ముస్లిం ఫ్యామిలీ ఆమెను సీమంతం వేడుక చెయ్యటం వగైరా అంశాలను చూపించటం కారణంగా సోషల్ మీడియాలో అతి పెద్ద దుమారమే రేగింది. ప్రతీ అంశానికీ హిందూ vs ముస్లిం రంగు పూసి వారి మధ్య విరోధాన్ని పెంచటానికి ప్రతీ అవకాశాన్నీ వదలకుండా ఉపయోగించుకునే హిందుత్వ వేర్పాటు వాదులకు ఈ యాడ్ బ్రహ్మాండంగా పనికొచ్చింది.
ఈ యాడ్ పట్టుకుని ఒకరకంగా హిందుత్వ వేర్పాటు వాదులు చెలరేగిపోయారని చెప్పొచ్చు. ఆ యాడ్ కారణంగా చివరకు తనిష్క్ ఆ యాడ్ ను తొలగించి క్షమాపణా పత్రం రాసిచ్చేవరకు వరకువెళ్లింది.

ఈ యాడ్ కరెక్టా? కాదా? అన్నది నేను చర్చ చెయ్యటం లేదు అసలు కొందరు హిందుత్వ వేర్పాటువాదులు అంతలా వ్యతిరేకించటానికి చూపుతున్న రెండు కారణాలు గమనిస్తే నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మొదటి కారణం- తనిష్క్ పరోక్షంగా “లవ్ జిహాద్” ప్రమోట్ చేస్తుందన్నది. ఈనాడు బయట పరిస్థితి తనిష్క్ యాడ్ లో చూపినట్లుగా లేదు! ఏ హిందూ అమ్మాయి కూడా ముస్లిముల ఇంట అంత ప్రశాంతంగా లేదు.. ఓ ముస్లిముల అమ్మాయిని ప్రేమించినందుకు ఓ హిందువుల అబ్బాయిని పట్టుకు కొట్టారు, మరోచోట ఓ ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని వేధింపులకు గురిచేశాడు.. అలాంటప్పుడు హిందూ అమ్మాయి ముస్లిముల ఇంట ప్రశాంతంగా ఇమడగలదని ఎలా చూపుతారు? హిందూ-ముస్లిములు కలిసికట్టుగా ఉన్నట్లు ఎలా చూపుతారు? హిందూ అమ్మాయిలపై జరుగుతున్న దాడులను తనిష్క్ సెక్యూలరిజాన్ని వలగబోసి నార్మలైజ్ చేయటానికి ప్రయత్నిస్తుంది! ఇది వారు చూపుతున్న రెండవ కారణం.

ఈ వేర్పాటువాదుల లాజిక్ ప్రకారం చూస్తే.. హిందూ సమాజంలోనే ‘వరకట్నం పేరుతో వివాహిత హత్య’.. ‘భర్త వివాహేతర సంబంధం కారణంగా వివాహిత హత్య’.. లేక అదేదో కారణం వల్ల వివాహిత హత్య అన్న హెడ్డింగులతో హిందూ సమాజంలోనే మహిళలపైనే జరుగుతున్న వేధింపులు, దౌర్జన్యాల తాలూకు ఏదో ఒక వార్త లేనిదే ఏరోజూ పేపర్ ప్రింటవ్వదు. కొన్ని లక్షల హిందూ జంటల విడాకుల కేసులు కోర్టుల్లో మగ్గుతున్నాయి.
అలాంటప్పుడు హిందూ అమ్మాయిలు ఒక్క ముస్లిముల ఇళ్లలోనే సేఫ్ గాలేరు, ఒక్క ముస్లిముల ద్వారానే హిందువులు వేధించబడుతున్నారని చెప్పటం నిజంగా హాస్యాస్పదం.
అలాగని ఇక్కడ నేను ముస్లిం సమాజం మొత్తాన్ని వెనకేసుకు రావటం లేదు. వారు నూటికి నూరుశాతం అస్సలు తప్పే చెయ్యరని చెప్పటం నా ఉద్దేశం కాదు. ఏ మతవర్గంలోనూ అందరూ మంచోళ్లూ ఉండరు, అందరూ చెడ్డోళ్లూ ఉండరు. హిందూ సమాజంలో సంస్కారవంతులతో పాటు కొందరు మూర్ఖులు ఉన్నట్టే.. ముస్లిం సమాజంలోనూ సంస్కారవంతులతో పాటు కొందరు మూర్ఖులు కూడా ఉన్నారన్నది ఒప్పుకుతిరాల్సిన నిజం. అన్ని మత వర్గాల పరిస్థితి కూడా అంతే.

ఎక్కడో జరిగిన కొన్ని సంఘటనలను పట్టుకుని ముస్లిముల ఇంట హిందూ అమ్మాయిలు సేఫ్ గా లేరని వాదించేవారికి మరి బీ.జే.పీ కి చెందిన ప్రముఖ లీడర్ల అల్లుళ్లు ముస్లిములు! మరి ఆయా ముస్లిముల ఇళ్లల్లో తమ హిందూ అమ్మాయిలు సేఫ్ గా లేరా? దీనిని కూడా “లవ్ జిహాద్” అనే అంటారా? అని ప్రశ్నిస్తే సమాధానం ఏమిటి? వారిని ప్రక్కన పెడితే.. రివర్స్ లో హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిల్ని ప్రేమించి, పెళ్లాడినట్టు కొన్ని వందల సినిమాలున్నాయి. వాటిని ఏమనాలి? ఇక ఎందరో హిందూ వర్గానికి చెందిన ప్రముఖుల అమ్మాయిలు ముస్లిం అబ్బాయిల్ని హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిల్ని పెళ్లిల్లు చేసుకుంటున్న సంఘటనలు సమాజంలో కోకొల్లలు మరి వాటి సంగతి ఏంటి?. సామాన్య ప్రజానీకంలోనూ అలాంటి ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు ఎన్నో జరుగుతుంటాయి.
””””””””
పైగా హిందువుల అమ్మాయిని ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకుంటే “లవ్ జిహాదా?” ఒకవేళ హిందువుల అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దానినేమనాలి? “హిందుత్వ లవ్ జిహాద్” అనాలా? లేక హిందుత్వ తీవ్రవాదం అనాలా? ఏం పేరు పెట్టాలి?
అసలు “లవ్ జిహాద్” అనే పదప్రయోగమే ఒక దిక్కుమాలిన పదప్రయోగం! కాస్త బుర్రున్నోడు “జిహాద్” అన్న అరబీ పదానికి అర్థం తెలుసుకుంటే.. జీవితంలో “లవ్ జిహాద్” అనే పేరు నోటితో పలకడు.
“జిహాద్” అన్న అరబీ పదానికి చెడు ఆలోచనలపై పోరాటం చెయ్యటం, చెడును అణచటానికి తీవ్రంగా కృషి చెయ్యటం అంతే! ఖురాన్ లో “జిహాద్” అన్న పదం కేవలం నాలుగే నాలుగు సార్లు కనపడుతుంది. ఆ నాలుగు సందర్భాల్లోనూ ఈ అర్థాల్లోనే వాడబడినట్లు చూడగలం.
కాకపోతే హిందుత్వ ఏజండా తాజాగా ఉండాలంటే ముస్లిముల, ఇతర మైనార్టీల భావోద్రేకాలను రెచ్చగొడుతూ ఉండాలి. ప్రతీ సంఘటననూ హిందూ vs ముస్లిం గా మార్చి పడేయ్యాలి.
సంక్షిప్తంగా చెప్పాలంటే హిందూ ధర్మం అన్నది హిందూ శాస్త్రాల ఆధారంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కానీ, ముస్లిములు ఇతర మైనారిటీలు లేనిదే హిందుత్వవాదానికి అసలు ఉనికే ఉండదు.
కేవలం యాడ్స్ లో హిందూ, ముస్లిములు కలిసి ఉన్నట్లు చూపితేనే ఓర్చుకోలేని నేటి పరిస్థితులు చూస్తుంటే ఎప్పటి నుండో సోదరుల్లా కలిసిమెలసి ఉంటున్న హిందూ, ముస్లిముల మధ్య బీటలు తేవటానికి కొందరు మతోన్మాద వేర్పాటువాదులు ఎంతకు దిగజారుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
***
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రక్క హిందూ సమాజంలో, మరో ప్రక్క ముస్లిం సమాజంలో ఆలోచనాపరులూ, విధ్యావంతులూ అంతా ఏకమై మతోన్మాద శక్తులు ఎంతగా ప్రజల భావోద్రేకాలను కావాలని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ ఇరువర్గాల ప్రజలను కలిపి ఉంచటానికి ప్రయత్నించాలి. ప్రజలలో ఆలోచించగలిగే స్థాయిని పెంచగలగాలి. హిందూ-ముస్లిముల ఇతర వర్గాల మధ్య ఐక్యతను కాపాడగలగాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *