శాస్త్రీయ అభివృద్ధి చెందితే చాలు దానికదే నైతికంగా, నాగరికంగానూ అభివృద్ధి సాధించేసినట్లే అని అపోహపడే చాలా మందికి బహుశా ఒక్క భారతదేశంలోనే సంవత్సరానికి లింగ వివక్ష కారణంగా 2 లక్షల మంది ఆడపిల్లలు చంపబడుతున్నారని తెలియదు.
United Nations ద్వారా 2012 లో ప్రతీ సంవత్సరం October 11 న “International Day of the Girl Child (అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం)”గా నిర్ధారించింది. లింగ అసమానతలు రుపుమాపటం, ఆడపిల్లల పట్ల దౌర్జన్యాలను అరికట్టి వారిని కాపాడటం అన్నది దాని మౌలిక ఉద్దేశం.
సైంటిఫిక్ గా, భౌతికంగా అన్ని రకాలుగా మేము అభివృద్ధిని సాధించేశాం అని చెప్పుకునే ఈ 20 వ శతాబ్దపు నాగరికులకు ఇంకా ఆడపిల్లల ప్రాముఖ్యత తెలియజేస్తూ వారిని చంపొద్దంటూ చట్టాలు చేసి… “Save Girl” స్లోగాన్స్ తో “అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం” నిర్వహించుకునే దుస్థితిలో ఇంకా ఉంది నేటి సమాజం అన్న విషయాన్ని ఇక్కడ గుర్తించాలి.
ఒక్క లింగ వివక్ష కారణంగా అటు ప్రతీ సంవత్సరం 2 లక్షల మంది ఆడపిల్లలు చంపబడుతుంటే.. ఇటు ప్రతీ 15 నిముషాలకొక యువతి అత్యాచారం చెయ్యబడుతుంది.
దీనికి పరిష్కారం కేవలం సంవత్సరానికోసారి “అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం” అని నిర్ధారించటం ద్వారానో ఆరోజును పురస్కరించుకుని ఫెస్బుక్కుల్లో, వాట్స్ యాపుల్లో కొటేషన్లు రాసి పెట్టటం ద్వారానో, డీ.పీలు మార్చుకోవటం ద్వారానో సాధ్యమయ్యే పనికాదు. పైగా సమస్య పెరుగుతూ పోతుంది.
అలాంటప్పుడు “అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం” నిర్వహించటం వల్ల ఏమిటి లాభం? ఒకప్రక్క హాస్పిటల్స్ లో “లింగ నిర్ధారణ చట్టరీత్యానేరం” అని దానికి 50 వేలు జరిమానా, 3 సం.లు జైలు శిక్షా అని కఠిన చట్టాలు చేసినప్పటికీ.. సంవత్సరానికి వేల కొద్దీ ఆడపిల్లలు చంపబడుతున్నారు.
అచ్చం ఇలాగే 1400 సం.లకు పూర్వం అరేబియా అనాగరిక సమాజంలోనూ లింగ వివక్ష చూపుతూ ఆడపిల్లలను ఘోరంగా చంపేసేవారు. ఆడపిల్ల పుట్టటం అరిష్టంగా, అశుభంగా భావిస్తూ పురిటిలోనే చంపేయటం, సజీవంగా పాతిపెట్టేయటం చేసేవారు.
అది ముహమ్మద్ (స) ప్రవక్తగా నియమించబడక పూర్వం అజ్ఞాన యుగమని చెబుతారు. అలాంటి అజ్ఞానయుగంలో అప్పటివారు ఆడపిల్లల్ని చంపేసేవారంటే వారు అనాగరికులు కాబట్టి వినటానికి కొంతవరకు సబబుగా ఉన్నప్పటికీ.. సైంటిఫిగ్గా మేము అభివృద్ధిని సాధించేశామని కాలరెగరేసే కాలంలోనూ అధ్యాత్మికతకు పుట్టినిల్లని చెప్పుకునే ఒక్క భారతదేశంలోనే ఆడపిల్లలంటేనే ఇంటికి భారమని భావించి, లింగ వివక్ష కారణంగా సంవత్సరానికి లక్షల్లో చంపుతున్నారు. సైంటిఫిగ్గా అభివృద్ధి సాధించిన మన సమాజం నైతికంగానూ అభివృద్ధి సాధించిందని ఇప్పుడు మనం చెప్పే స్థితిలో ఉన్నమా?
ఒకనాడు ఆడపిల్ల పుడితే చాలు సజీవంగా తీసుకెళ్లి పాతిపెట్టి చంపేసే అరేబియా అనాగరిక సమాజాన్ని ప్రవక్త ముహమ్మద్ (స) కేవలం 23 కాలంలో ఎలాంటి స్థితికి తెచ్చేశారంటే ఆనాటి అరేబియా సమాజంలో ప్రతి ఇల్లూ ఆడపిల్ల పుట్టాలని ప్రార్ధనలు చేస్తూ రోదించేది, ఆడపిల్ల పుడితేచాలు దానికి మించిన మహాద్భాగ్యం లేదన్న స్థితికి వచ్చేసిందా సమాజం. ఆడపిల్ల పుట్టుక ఇహలోకంలో సకల సౌభాగ్యాలకు నెలవుగా పరలోకంలో నిత్య స్వర్గానికి మార్గంగా భావించే స్థితికి వచ్చేసింది ఆనాటి సమాజం.
అత్యాచారాలూ వ్యభిచారం అతి సర్వసామాన్యమైపోయిన అనాగరిక సమాజాన్ని పరాయి స్త్రీల వంక ఉద్దేశపూర్వకంగా చూడటం కూడా తప్పుగా భావించే ఉన్నత నైతిక స్థితికి ఎలా మారిపోయిందా సమాజం? ప్రవక్త ముహమ్మద్ (స) ఆనాటి సమాజంపై ఎలాంటి ప్రభావం వెయ్యగలిగారు?
ఆయన చేసిందల్లా ఆడపిల్లల శిశు హత్యలను ఆపటానికి ఆయన ఎలాంటి “ఆడపిల్లల దినోత్సవాలూ” పెట్టలేదు. చేసిందల్లా వ్యక్తుల ఆలోచనా విధానంలో ప్రవర్తనలో మార్పు తెగలగటమే!
ఒక తండ్రికి ప్రపంచంలో అత్యంత విలువైన బహుమతి అతనికి ఆడపిల్ల పుట్టటమే ఆయన బోధించారు. ఎవరైతే ఇద్దరు ఆడపిల్లలు ఉండి వారికి మంచి విధ్యాబుద్ధులు నేర్పి ధార్మికంగా తీర్చిదిద్ధి పెళ్లి చేస్తారో వారు నేను స్వర్గంలో కలిసి ఉంటామన్న శుభవార్తను చెప్పారు.
ఆడపిల్ల పుట్టుకే భారంగా భావించటానికి ప్రధాన కారణమైన “కట్నం” తీసుకోవటం అన్న దురాచారాన్ని రుపుమాపటమే కాక, పైగా పురుషులు స్త్రీలను వివాహమాడేటప్పుడు ఎదురు కట్నం (మహార్) ఇచ్చి మరీ పెళ్లి చేసుకునే విధంగా సమాజాన్ని మార్చేశారు. పెళ్లి తంతును అతి సులభతరం చేసేశారు, వ్యభిచారాన్ని రూపుమాపారు.
చివరకు ఆయనపై అవతరించిన దైవగ్రంథమైన ఖురాన్ గ్రంథం సైతం అన్యాయంగా చంపబడే ఆడపిల్లలు బహుశా ఈలోకంలో వారు నోరుతెరచి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పలేరేమో, తాము మాట్లాడలేని స్థితిలో హత్యచెయ్యబడ్డారు కాబట్టి తమ బాధను వెళ్లగక్కలేరేమో.. కానీ అన్యాయంగా హత్య చేయబడి మట్టిలో పాతిపెట్టబడ్డ ఆడపిల్లలు ఏ తప్పువల్ల మమ్మల్ని హత్యచేశారని ప్రశ్నించే ఒక రోజు రాబోతుందని ఈ క్రింది విధంగా హెచ్చరిస్తుంది.
“సజీవంగా పాతిపెట్టబడిన బాలికను, నీవు ఏ తప్పువల్ల హత్య చెయ్యబడ్డావని అడిగినప్పుడు.. అప్పుడు ప్రతీ మనిషికి తెలిసిపోతుంది తానేమీ తీసుకువచ్చాడో” – 89:9
కాబట్టి ఎంత శాస్త్రీయంగా అభివృద్ధి సాధించినప్పటికీ నైతికంగానూ అభివృద్ధి సాధించనంతవరకూ అలాంటి సమాజం “భౌతికంగా అభివృద్ధి సాధించిన అనాగరిక సమాజం”గానే పరిగణించబడుతుంది.
