ఈ నేర ప్రవృత్తిని నిరోధించే “వ్యాక్సిన్” ఏదైనా ఉందా?

గంటకో మనిషి చనిపోయే అంటురోగాలకు సైన్స్ టెక్నాలజీతో వ్యాక్సిన్ కనిపెట్టగలుగు తున్నప్పుడు.. అదే గంటలో అనేక అత్యాచారాలకూ, దౌర్జన్యాలకూ గురై ఎందరో చనిపోతున్నప్పుడు మరి వ్యక్తుల స్వభావాల్లో క్రమేణా పెరిగిపోతున్న నేర ప్రవృత్తిని నిరోధించే “వ్యాక్సిన్” ఏదో కనిపెట్టగలగాలి కదా.

ఎందుకంటే భౌతిక శరీరాలకు వ్యాపించే వైరస్ కొన్నాళ్లకు చతికిలపడిపోతుంది, అంతరించి పోతుంది. కానీ వ్యక్తుల వ్యక్తుల స్వభావాల్లో పేరుకుపోతున్న నేరప్రవృత్తి అనే వైరస్ ఉండేకొద్దీ బలపడుతూపోతుంది. దానికి ప్రతీ సంవత్సరం పెరుగుతూపోతున్న నేర గణాంకాలే ప్రత్యక్ష సాక్ష్యం.

ప్రపంచం సైంటిఫిగ్గా డవలప్ అయితే వ్యక్తుల ప్రవృత్తిలో నైతిక విలువలు వాటికవే జనిస్తాయి అనుకోవటం ఎటువంటిదంటే.. ఈత బాగా నేర్చుకుంటే కారు డ్రైవింగ్ సులువుగా చేసెయ్యవచ్చని ఊహించుకోవటం లాంటిదన్నమాట!

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ ను నిరోధించటానికి ప్రస్తుతం ఆ వైరస్ ఎలా పుట్టింది, దానికి గల కారణాలు ఏమిటి? అది ఎలా అభివృద్ది చెందుతుంది. దాని ప్రభావాన్ని తగ్గించటానికి దాని జెనెటిక్ కోడ్ ను కనిపెట్టి, ఆ వైరస్ ను చంపి మానవాళిని రక్షించటానికి ప్రయోగశాలల్లో వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే నేడు వ్యక్తుల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న నేర ప్రవృత్తి అన్నది కరోనా వైరస్ కంటే అతి ప్రమాదకర వైరస్ లాంటిది. దానికి గల కారణాలు ఏమిటి? వ్యక్తుల స్వభావాల ప్రక్షాళన చెయ్యటం ఎలా? తద్వారా నేరప్రవృత్తిని నిరోధించటం ఎలా? అన్నది ఆలోచన చెయ్యక కేవలం మీరు సైంటిఫిక్ గా డవలప్ అవ్వండని.. మీరు హేతువాద ఆలోచనలు పెంచుకోండని సలహాలు ఇవ్వటం ద్వారనో.. ఏవో కొన్ని నీతి సూత్రాలు వల్లంచటం ద్వారనో సాధ్యం కాదు. అది కడుపులో అల్సర్ కు అసలు మందు ఇవ్వటానికి బదులు కేవలం పైపూతగా ఆయింటుమెంటు రాసుకోమనటం లాంటిదన్నమాట.

ఈమధ్య హత్రాస్ లో ఓ దళిత అమ్మాయి అత్యాచారం జరిగాక ఫేస్ బుక్ లో చాలా మంది తమ తమ అభిప్రాయాలను రాశారు. అందులో కొందరు స్త్రీల వస్త్రాధారణ, బయటతిరిగే విషయంలో ఎన్నో ఆంక్షలు పెట్టి, సంప్రదాయాల పేరుతో పెంపుడు జంతువుల్లా వారిని కట్టుబాట్లతో పెంచటమే కారణమని, ఏకట్టుబాటు మీరినా బరితెగించిన స్త్రీలుగా ముద్రపడి రేపులకు గురవుతుంటారని.. స్త్రీలు బట్టలు సరిగ్గా ధరించకపోవటం వల్లే నేడు రేపులు జరుగుతున్నాయని.. స్త్రీలు అర్ధరాత్రుళ్లు రోడ్లపై తిరగటం వల్లే రేపులు జరుగుతున్నాయని ఇలా రకరకాలుగా తమ అభిప్రాయాలూ రాసుకొచ్చారు. తప్పితే ఇటు పురుషుల్లోనూ పెరిగిపోతున్న నేరప్రవృత్తికి అసలు ‘root cause’ ఏమిటి? సార్వత్రిక సమాజంలో పెరిగిపోతున్న అనైతికతను వ్యక్తుల్లో నేర ప్రవృత్తిని ఏ విధంగా ప్రక్షాళన చెయ్యాలి? అన్నదానికి సరైన వివరణ ఏ ఒక్కరూ ఇవ్వలేదు. ఎందుకంటే వారి వద్ద వ్యాసాలు రాయదగ్గ రచనాపటిమ ఉంది తప్ప సమస్యకు సరైన్ సొల్యూషన్ తెలీదు కాబట్టి.

“ప్రభావాత్మక ప్రేరకాలే” నేరప్రవృత్తిని నిరోధించే “వ్యాక్సిన్లు!”

అత్యాచారాలు, హత్యలు, ఘోరపాతకాలు సృష్టిస్తున్నవారంతా వేరే గ్రహాల నుండి రావటం లేదు. వారు మానవ సమాజంలో మనలోని వారే. పైగా విద్యావంతులు కూడా. నేడు దారుణంగా రేపులు చేసేవారు సైతం బాగా చదువుకుని, తలిదండ్రులూ, అక్కా చెల్లెళ్లు కలిగిన కుటుంబాలలో ఉంటూ చిన్నప్పటి నుండి స్కూళ్లలో ఎన్నో నీతి సూత్రాలు వింటూ సమాజంలో మంచీ-చెడులు చూస్తూ పెరిగిన వారే.

వారే చెడు చేసే తమ వంతు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకుని వికృత చేష్టలను, విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. తమ పైత్యానికి క్షణికావేశంలో జరిగిపోయిన తప్పనే అందమైన పేరు పెడుతుంటారు.

విచిత్రం ఏమిటంటే ఈ నేరాలకు పాల్పడేవారిలో అధికులు ఆస్తికులు ఏదో ఒక మతాన్ని ఆచరించేవారే. ఇది చూసే చాలా మంది మతం వల్ల ఏదీ ఒరగదు పైగా మతాన్ని అనుసరించే సమాజాల్లోనే నేరాలు అధికంగా ఉంటాయి.. మత వ్యవస్థ లేని దేశాల్లోనే నేరాలు నమోదు కాలేదు కాబట్టి మతాన్ని వదిలేసి నాస్తికులు మారిపోతే మంచిదని చెబుతుంటారు. నిజానికి మతాన్ని ఆచరించని సోవియట్ రష్యా, యూరప్, చైనా, క్యూబా, సౌత్ కొరియా, వియత్నాం వగైరా కమ్యూనిస్ట్ దేశాల్లో ఘోరమైన జనహననాలు (Genocides) జరిగిన చరిత్ర ఉంది. వారికి మతానికీ, ధర్మానికీ మధ్య ఉన్న తేడా తెలీదు కాబట్టి వారలా మాట్లాడటంలో తప్పులేదు ఆ విషయాన్ని ప్రక్కనపెడితే..

మనిషి ఒంటరిగా ఉన్నాకూడా తనలో రగిలే చెడు కోరికలనూ, చెడు ఆలోచనలనూ “నియత్రించుకోవటం”.. మనస్సుపై “అదుపుసాధించటం” మంచి ఆలోచనలను “పెంపొందించుకోవటం” అన్న ప్రక్రియ నేడు మాతావలంబీకులు, ఉన్నత విద్యావేత్తలూ, సైన్స్ పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్న వారి ద్వారా సైతం ఎందుకు సాధ్యం కావటం లేదు? భౌతికంగా శరవేగంగా ఎదుగుతున్న మనిషి అంతే వేగంగా నైతికంగా ఎందుకు పతనమవుతున్నాడు అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి సైన్స్ ఎప్పటికీ పరిష్కారం చూపలేదు.

కానీ, దీనికి సరైన పరిష్కారం (Solution) ధార్మిక గ్రంథాలు చూపుతున్నాయి. అవి- మానవ జీవితం మిగతా జీవుల్లా సంపాదించుకోవటం, తినటం, చనిపోవటం మాత్రమే కాదు మీకు ఎంతో అర్థవంతమైన జీవితం ఇవ్వబడింది అని చెబుతున్నాయి. మంచీ-చెడుల విచక్షణా జ్ఞానం ఇవ్వబడింది మీరు ఆ సృష్టికర్త అయిన దేవుని పరిశీలించి తెలుసుకుని ఆయన ఆజ్ఞల ప్రకారం అటు భౌతికంగా అభివృద్దిని సాధిస్తూనే ఇటు ఎంతో ఉన్నతమైన నైతిక విలువలతో కూడిన ఉత్తమ జీవితం గడపటానికి అన్న విషయాన్ని వివరిస్తున్నాయి.

అంతేకాదు, మనిషి నిత్యం పర్యవేక్షణలో ఉన్నాడని అతని ప్రతీ మంచీ-చెడు పనులు రికార్డు కాబడుతున్నాయని, అతను చేసే పనులకు ఒక రోజు తన సృష్టికర్త ముందు నిలబడి జావాబు చెప్పుకోవలసి ఉంటుందని, ఈ లోకంలో రహస్యంగా నేరాలు చెయ్యవచ్చు, సాక్ష్యాలు లేకుండా చెయ్యవచ్చు కానీ సృష్టికర్త న్యాయస్థానంలో తాను రహస్యంగా, బహిరంగంగా చేసిన ప్రతీ నేరం తీర్పులోకి తేబడుతుంది. చివరకు ఆడపిల్ల పుట్టిందని నోరు నొక్కి చంపేసిన పసిపాప సైతం ఆ రోజు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుంది, అతని ద్వారా అన్యాయానికి గురికాబడిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చెయ్యబడుతుందని, అతని నేరాలకు తగ్గట్టు “శాశ్వత నష్టమైన” నిత్యనరకం విధించబడుతుందన్న హెచ్చరికనూ… అలాగే రహస్యంగా ఉన్నా బహిరంగంగా ఉన్నా ఆ సృష్టికర్త అయిన దేవునికి భయపడుతూ నైతికంగా ఉంటూ ఏ తప్పుకూ పాల్పడనివారికి “శాశ్వత లాభమైన” నిత్య స్వర్గం ఇవ్వబడుతుందన్న శుభవార్తనూ ఇస్తున్నాయి.

ధార్మిక గ్రంథాలు ఇస్తున్న ఈ “ప్రభావాత్మక ప్రేరకాలే” నేరప్రవృత్తిని నిరోధించే “వ్యాక్సిన్లు”లాంటివి. మూఢ నమ్మకాలతో కూడిన మతవ్యవస్థను దాటి ధార్మిక గ్రంథాలు ప్రబోధిస్తున్న ధర్మం లోనే అవి లభిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *