హిందూ ముస్లిముల గొడవల వల్ల లాభం ఎవరికి?

ఒక్క మాటలో చెప్పాలంటే అటు హిందువులకు గానీ, ఇటు ముస్లిములకు గానీ కించిత్తు లాభంలేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప హిందూ-ముస్లిముల మధ్య ఏవైతే గొడవలు రగులుతున్నాయో వాటికి వ్యక్తిగత వైరాలైతే కారణం కానే కావని చెప్పాలి. అటు బాబ్రీ మసీదు గొడవ నుండి నిన్నామొన్నటి గుజరాత్, ఢిల్లీ, బెంగళూరు గొడవల వరకు నడిపిస్తుంది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపే కొందరు మతోన్మాద రాజకీయ నాయకులు మాత్రమే అన్నది సామాజిక విశ్లేషణ చేసేవారికి తెలిసిన విషయమే. అయితే హిందూ-ముస్లిముల గొడవలు ఎందుకు ప్రతీ సారి ఏదో ఒక మూల రగులుతూ ఉన్నాయి? అన్నది చూస్తే మటుకు ప్రతీ మతవర్గంలోనూ ధర్మాన్ని లాజిక్ గా అనుసరించేవారితో పాటు మతతత్వవాద పైత్యం తలకెక్కినవారు కూడా తప్పనిసరిగా కొందరుంటారు. వీరిని రెచ్చగొట్టటానికి చాలా స్వల్పమైన పనికిమాలిన విషయాలే ప్రధానపాత్ర పోషిస్తూ ఉంటాయి.

ఉదాహరణకు: అటు హిందువుల్లో కొందరు మతతత్వవాదులు తమతోటి వారిని ముస్లిములకు వ్యతరేకంగా రెచ్చగొట్టటానికి.. అప్పుడెప్పుడో మధ్యయుగాలలో ముస్లిం పాలకులు భారతదేశంపై దండెత్తారు.. వారు హిందూ దేవాలయాలను పడగొట్టేశారు.. హిందువులను బలవంతంగా మతం మార్చేశారు.. ఉగ్రవాదం చేసేవారంతా ముస్లిములే.. వారు పాకిస్తాన్ విడగొట్టుకుని పోయారు.. వారు పాకిస్తాన్ ప్రేమికులు.. వారు జాతీయ జెండాకు వందనం చెయ్యరు.. భారతమాతకు జై చెప్పరు వగైరా అంశాలను లేవనెత్తి .. మరో ప్రక్క ముస్లిములను రెచ్చగొట్టటానికి ప్రవక్త ముహమ్మద్ (స) ను కించపరిచే విధంగా ఇస్లాంను దిగజార్చే విధంగా ముస్లిం సమాజాన్ని తక్కువ చేసి మాట్లాడటం.. జైశ్రీరామ్ అని చెప్పించటానికి కొట్టటం.. రకరకాలుగా హింసలు పెట్టటం వగైరా పనులు చేస్తుంటారు.

నిజానికి ఇలాంటి చిల్లపనులు చేసేది యదార్థంగా ధర్మజ్ఞానం లేని మూర్ఖులు మాత్రమే అనటం అతిశయోక్తి కాదు. నిజానికి హిందూ సమాజంలో నిజ హిందుత్వాన్ని యదార్థంగా గీత, వేదోపనిషత్తుల ద్వారా అర్థం చేసుకున్న ఉత్తములు ఎందరో ఉన్నారు… అలాగే ఇస్లాంను యదార్థంగా ఖురాన్-హదీసుల ఆధారంగా అర్థం చేసుకున్న ఎందరో ముస్లిములూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఖురాన్-హదీసుల ఆధారంగా ఇస్లాంను అర్థం చేసుకున్న హిందువులూ ఉన్నారు.. అలాగే.. గీత, వేదోపనిషత్తుల ద్వారా నిజ హిందుత్వాన్ని యదార్థంగా అర్థం చేసుకున్న ఎందరో ముస్లిములూ ఉన్నారు. అలాంటి ఉన్నత వ్యక్తిత్వమున్న సంస్కారవంతులైన హిందూ-ముస్లిములు ఎప్పటికీ కలిసే ఉంటారు.

కాబట్టి తమను రెచ్చగొట్టినంత మాత్రానా రెచ్చిపోయే హిందువులైతే ఆలోచించవలసింది..

అప్పుడెప్పుడో మధ్యయుగాల నాటి ముస్లిం పాలకుల దాడులకు మాతో పాటు కలిసిమెలసి జీవించే ముస్లిములు ఎలా బాధ్యులు అవుతారు? ముస్లిం సమాజంలో ఎవరో ఎక్కడో కొందరు చేసిన ఉగ్రవాదానికి మొత్తం ముస్లిం సమాజాన్ని బాధ్యులుగా చెయ్యటం ఎంతవరకు న్యాయం? భారత జాతీయ జెండాను రూపొందించిందే ఓ ముస్లిం.. జై హింద్ నినాదం ఇచ్చిందే ఓ ముస్లిం.. స్వతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసినవారిలో అరవైశాతానికి పైగా ఉన్నది ముస్లిం సమాజం అటువంటప్పుడు ముస్లిముల జాతీయత మీద వేలెత్తి చూపటం ఎంతవరకు న్యాయం? ప్రపంచంలో ప్రతీ మతవర్గంలోనూ ఎన్నో ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి.. ప్రపంచవ్యాప్త ఉగ్రవాద ఘటనల్లో చనిపోయినవారిలో ముస్లిములే అధికంగా ఉన్నారు అటువంటప్పుడు మొత్తం ముస్లిం సమాజాన్ని బోనులో నిలబెట్టటం ఎంత వరకు న్యాయం? అన్న కనీస ఆలోచన చెయ్యగలగాలి

ఇటు తమను రెచ్చగొడితే రెచ్చిపోయే ముస్లిములు గమనించాల్సింది..

ముస్లిమేతరుల్లో అధికశాతం మంది ఖురాన్-హదీసులను స్టడీ చేసి ఇస్లాంను తెలుసుకున్నవారుండరు.. వారు ముస్లిం సమాజాన్ని బాహ్యంగా చూసే ఇస్లాం పట్ల ఒక ఆచనాకు వస్తుంటారు. కాబట్టి ముస్లిములు తమ ప్రవర్తన ఎప్పుడూ ప్రవక్త ముహమ్మద్ (స) బోధలకు అనుగుణంగా ఉత్తమంగా ఉండేలా చూసుకోవాలి. ప్రత్యక్షంగా ప్రవక్త ముహమ్మదే ఎన్నో విమర్శలు, దూషణలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వారుగానీ వారి అనుచరులు గానీ ఎప్పుడు ఎదురు గొడవలకు, ఘర్షణలకు దిగలేదు దాడులకు పాల్పపడలేదు, వ్యక్తిగత దూషణలకు దిగటం గానీ బూతులు మాట్లాడటం కానీ చేయలేదు కానీ సహనం వహించేవారు. పైగా తమపై శతృత్వం చూపేవారిని అత్యధికంగా ప్రేమించేవారు. దానితో వారి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోయేవారు. ఈ తత్వాన్ని ప్రతీ ముస్లిం అలవర్చుకోవాలి.

***

“మన మాతృ భూమి కొరకు వేదాంతం, ఇస్లాం – ఈ రెండిటి విధానాల కలయిక, అంటే వేదాంతమే మేధస్సుగానూ, ఇస్లాం శరీరంగానూ జోడింపబడినదే శరణ్యం అనిపిస్తుంది. భారతదేశం ఉన్న క్లిష్ట పరిస్థితుల నుండి వేదాంతమే మస్తిష్కంగానూ, ఇస్లాం దేహంగానూ భాసిస్తూ ‘విజయవంతమైన, ప్రతిష్ఠాత్మకమైన సంపూర్ణ దేశంగా’ భవిష్యత్తులో వెలవగలదని నాకు స్పష్టంగా గోచరిస్తుంది” – స్వామీ వివేకానంద (నా భారతం అమర భారతం, పేజి నెం.113)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *