‘హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్’ను ‘హలాల్ మాఫియా’ గా అభివర్ణిస్తూ… ‘హలాల్ ఫుడ్స్’ను మాపై బలవంతంగా రుద్దుతున్నారు అది మా మతానికి వ్యతిరేకం, ‘హలాల్ ఫుడ్స్ బాయ్ కాట్’ చెయ్యాలంటూ ఈ మధ్య కొందరు ఓ క్రొత్త వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
అసలు ‘హలాల్ సర్టిఫికేషన్’ అంటే ఏమిటి? అన్నది తెలుసుకునే ముందు సంక్షిప్తంగా ధార్మిక పరిభాషలో ‘హలాల్’ అన్న అరబీ పదానికి అర్థం…
తినటానికి/వాడుటకు యోగ్యమైన లేదా అనుమతి ఉన్న (Permissible) వాటిని ‘హలాల్’ అని అంటారు.
తినటానికి/వాడుటకు యోగ్యంకాని లేదా అనుమతి లేని (Forbidden) వాటిని ‘హరామ్’ అంటారు.
ఉదాహరణకు: ఆల్కహాల్, చచ్చిన జంతువు, పంది మాంసం, రక్తం వగైరా సేవించటానికి యోగ్యం కానివి ధార్మిక గ్రంథాల ప్రకారం ‘నిషేధింపబడ్డాయి’. అంటే ‘హరామ్ (Forbidden)’ అన్న మాట. వీటికి భిన్నంగా పరిశుభ్రమైన ‘తినటానికి యోగ్యమైన ఆహారం’ (Permissible food) ను ‘హలాల్’ అంటారు. ధార్మిక పరిభాషలో జంతుమాంసాన్ని ‘హలాల్’ ఎందుకన్నారు?
సృష్టికర్త అయిన దేవుని స్మరణ చేస్తూ జంతు కంఠాన్ని, మెడ నాళము (Jugular Vein) ను కత్తిరించి పూర్తి రక్తాన్ని బయటకు తీయటం ద్వారా ‘శుద్ది (Purify)’ చేయబడిన దానిని ‘హాలాల్’ మాంసము అని అంటారు. ఈ ప్రక్రియ అటు హిందూ శాస్త్రాల్లోనూ చూడగలం. అయితే ‘హలాల్’ చేయబడిన మాంసమును తినటాన్ని ముస్లిం సమాజం ప్రత్యేకంగా ప్రాముఖ్యత నిస్తుంది. ‘హలాల్ సర్టిఫికేషన్’ తీసుకునేది ముస్లిమేతరుల కోసమా?
ఎంత మాత్రం కాదు. యూరప్, ముస్లిం దేశాల్లో హలాల్ ఫుడ్స్ కు డిమాండ్ ఉండటమే ఫుడ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు హలాల్ సర్టిఫికేషన్ తీసుకోవటానికి కారణం. హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్ విక్రయించటం అన్నది ‘వ్యాపారాత్మకమే’ తప్ప అందులో బలవంతంగా ఎవరి మీదా మత విశ్వాసాలు రుద్దే ప్రయత్నం కాదు. ‘హలాల్ సర్టిఫిక్షన్’ తీసుకోవలసిన అవసరం ఏమిటి?
‘ప్రాసెస్ ఫుడ్’ ‘ఫ్రొజెన్ ఫుడ్’ డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరగటం, ముస్లిం సమాజమంతా హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్ కు ప్రాధాన్యత ఇవ్వటం వలన అంతర్జాతీయ ఫుడ్ ఎక్స్పోర్ట్ కంపెనీలన్నీ ‘హలాల్ సరిఫికేషన్’ తీసుకోవటం తప్పనిసరి అవుతుంది. ITC, Mc Donald’s, KFC లాంటి కాంపెనీలేవీ ముస్లిం సంస్థలు కావు. కానీ, ఇవి ఎగుమతి చేసే ఫుడ్ ప్రోడక్ట్స్ ‘హలాల్ సర్టిఫికేషన్’ తో ఎగుమతి చేస్తుంటాయి. పైగా ‘హలాల్ సర్టిఫికేషన్’ ఈ మధ్య కాలంలో మొదలవ్వలేదు ఎప్పటి నుండో ఉంది. అంతర్జాతీయంగా హలాల్ ఫుడ్స్ కు ఉన్న డిమాండ్ ఎంత?
ప్రపంచ వ్యాప్తంగా ముస్లిములు 1.9 బిలియన్లు ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో 24.1% ముస్లిములే ఉన్నారు. దాదాపు 50 ముస్లిం దేశాలున్నాయి. పైగా అంతర్జాతీయ ఫుడ్ మార్కెట్ లో 19% హలాల్ ఫుడ్స్ కు మార్కెట్ షేర్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2.3 ట్రిలియన్ డాలర్ల హలాల్ ఫుడ్ టర్నోవర్ జరుగుతుంది.
భారత దేశంలో అమ్మకాల వరకు ఫుడ్ ప్రొడక్ట్స్ పై ‘FSSAI (Food Safety and Standards Authority of India)’ లైసెన్స్ సరిపోతుంది. అయితే అంతర్జాతీయంగా మార్కెట్ లో హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్ కు అంత పెద్ద డిమాండ్ ఉండటం వలన అంతర్జాతీయంగా ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలన్నీ సేల్స్ పెంచుకోవటం కోసం తాము ఎక్స్పోర్ట్ చేసే ఫుడ్ ప్రొడక్ట్స్ పై హలాల్ సర్టిఫికేషన్ అదనంగా తీసుకుంటూ ఉంటాయి. ఇక ఇండియాలో హలాల్ సర్టిఫికేషన్ FSSAI గానీ, గవర్నమెంట్ గానీ ఇవ్వదు. హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చే ప్రైవేట్ సంస్థల ద్వారానే పొందవలసి ఉంటుంది. అనేక వాటిపై హలాల్ సర్టిఫికేషన్ తీసుకోవటం వెనుక ప్రధాన ఉద్దేశం?
మాంసాహార ఎగుమతులపైనే కాక బిస్కెట్లు, కేకులు, ఐస్ క్రీమ్స్, పిజ్జాలు ఇంకా కాస్మోటిక్స్ కొన్ని రకాల మెడిసిన్స్ వగైరా వాటి మీద కూడా ‘హలాల్’ సర్టిఫికేషన్ ఉంటుంది. దేనికి అంటే వాటిలో ‘ఆల్కహాల్’ కలపలేదని, లేదా ‘గ్లిసరిన్’ ‘జిలాటిన్’ ‘కొవ్వు పదార్థాలు కలిపినా అవి ‘పంది’ నుండి సేకరించినవి కాదని, ఒకవేళ కొవ్వు పదార్థాలు వాడినప్పటికీ మేక, గొర్రె, ఆవు వగైరా హలాల్ చేయబడిన జంతువుల కొవ్వును ఉపయోగించబడిందని నిర్ధారించటానికి మాత్రమే ‘హలాల్’ సర్టిఫికేషన్ తీసుకోవటం తప్పనిసరి అవుతుంది.
అలాగే ‘హలాల్ టూరిజం’ ప్యాకేజ్ లను కూడా కొన్ని కంపెనీలు మార్కెట్టింగ్ చేస్తున్నాయి. అంటే వాటి హాలిడే ప్యాకేజ్ లో అవి ఆల్కహాల్ సప్లై చేయకుండా, పూర్తిగా హలాల్ ఫుడ్ ను మాత్రమే అందించటం జరుగుతుంది.
మహారాష్ట్రకు చెందిన ‘P.P Foods’ అనే సంస్థ నిజానికి ‘బియ్యం’ ఎక్స్ పోర్ట్ చేసే కంపెనీ. ఈ కంపెనీ ఎటువంటి మాంసాహార ఉత్పత్తులు ఎగుమతి చెయ్యదు. కానీ ఈ సంస్థ సైతం హలాల్ సర్టిఫికేష్ తీసుకుంటుంది. అలాగే ITC కంపెనీ ఇండియా నుండి ముస్లిం దేశాలకు ఎగుమతి అయ్యే గోధుమ ప్యాకెట్లపై సైతం ‘హలాల్’ సర్టిఫికేషన్ తో ఎగుమతి చేస్తుంది. ఇవి మాంస కృతులు కాకపోయినప్పటికీ… ముస్లిం దేశాల్లో ఉన్న అతిపెద్ద మార్కెట్ లో లాభాలు ఆర్జించటానికి ‘హలాల్’ సర్టిఫికేషన్ తో ఎగుమతి చేస్తుంది. ‘హలాల్ సర్టిఫికేషన్’ హలాల్ మాఫియానా?
‘హలాల్’ సర్టిఫైడ్ ఫుడ్స్ అమ్ముతున్నవి లేక ఎగుమతి చేస్తున్నవి కేవలం ముస్లిములకు చెందిన కంపెనీలు మాత్రమే కావు. అంతర్జాతీయంగా ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి చేసే ఎన్నో ముస్లిమేతర సంస్థలు కూడా హలాల్ సర్టిఫికేషన్ తీసుకుంటాయని మనం పై వివరణలో గమనించాం. అలాంటప్పుడు ‘హలాల్’ సర్టిఫైడ్ ఫుడ్స్ ను హలాల్ మాఫియా అనటంలో అర్థమే లేదు.
ప్రపంచవ్యాప్తంగా హలాల్ ఫుడ్స్ టర్నోవర్, అంతర్జాతీయ ‘హలాల్ ఫుడ్ ప్రొడక్ట్స్ మార్కెట్ వ్యాల్యూ’ వగైరా పై సమాచారం తాలూకు అవగాహన లేని వారే ‘హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్’ను హలాల్ మాఫియా గా భ్రమ పడుతుంటారు. అలాంటి మిడి మిడి జ్ఞానం ఉన్నవారే… ఈ మధ్య హిందువుల పై బలవంతంగా రుద్దటానికే హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్ చాలామణీ అవుతున్నట్టు తెగ ఫిలైపోయి… ‘హలాల్ ఫుడ్స్’ బాయ్ కాట్ చెయ్యాలని క్రొత్త వాదనలు తెరమీదికి తెచ్చారు. ‘హలాల్’ సర్టిఫికేషన్ ఉంటే అది బలవంతంగా ముస్లిమేతరులపై రుద్దటం అవుతుందా?
మార్కెట్ లో ఎన్నో వస్తువులు విక్రయించబడుతూ ఉంటాయి. అలాగే హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్ మీద ఎక్కడా “ఇది మీరు కచ్చితంగా తినాల్సిందే” అని ఏమి ఉండదు కదా! ‘హలాల్’ తినటం ఇష్టం లేనప్పుడు తినమని ఎవరూ బలవంతం కూడా చెయ్యరు! ఇష్టం లేనప్పుడు అది మానేసి ఇంకొకటి కొనే స్వేచ్చ అందరికీ ఉంది. ‘హలాల్’ సర్టిఫికేషన్ ఉన్న ఫుడ్స్ తినే వారు అవి తింటారు.
ఉదాహరణకు: మార్కెట్ లో ‘గో మూత్రం’ కూడా అమ్మబడుతూ ఉంటుంది. దాని అర్థం అది అందరూ కొనుక్కుని త్రాగాల్సిందే అనీ కాదు… ఇతర మతస్తులను బలవంతంగా త్రాగించటానికి కూడా కాదు! ‘గో మూత్రం’ ఇష్టం ఉన్నోల్లు కొనుక్కుని తాగుతారు ఇష్టం లేనోల్లు మానేస్తారు. హలాల్ సర్టిఫికేషన్ ఉన్న వస్తువులు ఇష్టం ఉన్నోల్లు తింటారు, ఇష్టం లేనోల్లు మానేస్తారు. ఏ ఒక్క మతవర్గానికో ఇష్టం లేదని సంస్థలు వ్యాపారం చెయ్యటం మానెయ్యరు కదా
ధార్మిక గ్రంధాల్లో సైతం జంతువును దైవ నామ స్మరణ చేసి తినాలి, శుద్ది చేయబడిన వాటినే తినాలి, పంది మాంసం, చచ్చిన వాటిని, రక్తాన్ని తినకూడదు, మధ్యం త్రాగకూడదు, వ్యభిచరించకూడదు వగైరా అంటూ ఎన్నో విధి-నిషేధాలు ఆదేశించబడ్డాయి. అవి కూడా ఎవరైనా ఇష్టం ఉంటేనే ఆచరించటం తప్ప, ధర్మం ఎవరినీ అవి పాటించాలని బలవంత పెట్టదు. ధార్మిక గ్రంధాలు నిషేధించిన వాటిని తినే, త్రాగేటోల్లు అన్ని మతాల్లోనూ ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ‘హలాల్’ ఫుడ్స్ తినటం ఇష్టం లేనప్పుడు మానేయ్యవచ్చు తప్పితే దానికి వేరేగా స్టేట్ మెంట్ ఇచ్చి వ్యతిరేకించాల్సిన పనే లేదు
పై విషయాలను దృష్టిలో పెట్టుకుంటే కొందరు హలాల్ సర్టిఫికేషన్ హలాల్ మాఫియాగా అభివర్ణించటం, దానిని తమపై బలవంతంగా రుద్ద బడుతున్నట్టు ఫిలైపోవటం, ‘హలాల్’ ఫుడ్స్ ను వ్యతిరేకించటం కేవలం అర్థరహితం మాత్రమే అవుతుందన్నది తేలిపోయింది
హలాల్_సర్టిఫికేషన్ అంటే ఏమిటి?
