“తబ్లిక్” అన్న పదానికి అర్థం “సందేశ ప్రచారం” అని. “తబ్లిక్ జమాత్” అంటే- “ఇస్లాం సందేశాన్ని చేరవేసే సంస్థ” అని మాత్రమే అర్థం తప్పితే “సమాజంలో తీవ్రవాదం చేసే సంస్థ” అని కాదు.
పైగా ఆ ఇస్లామియా సందేశాన్ని కూడా ముస్లిమేతరులకు ఇచ్చే సంస్థ అస్సలు కాదు. ఈ సంస్థ మూల లక్ష్యం- ముస్లిం సమాజంలో ఉన్నప్పటికీ ఇస్లామియా ఆచరణలకు దూరమైన ముస్లిములకు ఇస్లాం సందేశాన్ని, ఖురాన్, హదీసులు నేర్పటం, అరబ్బీ నేర్పటం, ఆచరణలు, ప్రార్ధనలు నేర్పటం మాత్రమే! కాబట్టి వీరి టార్గెట్- కేవలం ముస్లిం సమాజంలో ఉంటూ ఇస్లాం ఆచరణలకు దూరమైన ముస్లిములను ఇస్లాంకు దగ్గర చెయ్యాటమే తప్ప కనీసం వీరు ముస్లిమేతరుల్లో మత ప్రచారం సైతం చెయ్యరు.
వీరి దినచర్య- కొంత మంది సమూహంగా ఏర్పడి స్వంత డబ్బులతో చందాలు వేసుకుని కొన్ని పట్టణాలు, కొన్ని గ్రామాలను ఎన్నుకుని అక్కడకు వెళ్లటం అప్పటికే ఆయా ఉళ్లలో ఉండే తమ వారి ద్వారా స్థానిక ముస్లిములను మసీదుకు పిలిపించటం, వారికి నమాజులు ఎలా చెయ్యాలి, ఖురాన్ ఎలా చదవాలి, ప్రవక్త ఆచరణలు, ఇస్లామియా క్రతువులు ఎలా నిర్వర్తించాలి అన్నవి నేర్పుతూ కొన్ని రోజులు అక్కడే తిని అక్కడే పడుకుని తమ స్వంత ఊళ్లకు వస్తుంటారు అంతే వీరికి తెలిసింది.
వీరు రాజకీయాలలోకి రారు. అందుకే వీరు పెద్దగా ఎప్పుడూ వార్తల్లోనూ ఉండరు. దురదృష్టవశాత్తు వీరు ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన “తబ్లిక్ జమాత్” సంస్థాగత కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరవటంతో అక్కడకు విదేశాల నుండి కొందరు సభ్యులు రావటంతో కొందరికి కరోనా సోకటం, దాని లక్షణాలు 14 రోజులు తరువాత వారిలో బయటపడటంతో వీరు ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.
గత వంద సంవత్సరాల నుండి కంటిన్యూగా ప్రతీ సంవత్సరం ఢిల్లీ మర్కజ్ లో జరుగుతూ వస్తున్న “తబ్లిక్ జమాత్” సంస్థాగత కార్యక్రమం ఓ ప్రక్క జనజీవన వ్యవస్థ యథావిధిగా సాగుతున్న నేపథ్యంలో, ఏ ప్రత్యేక ఆంక్షలు లేని సందర్భంలోనే ప్రభుత్వ అనుమతితో పైగా లాక్ డౌన్ కు చాలా రోజుల ముందు కార్యక్రమం పెట్టుకున్నారు అన్నది అందరికీ తెలిసిందే!
కానీ ముస్లిం సమాజాన్ని సందు దొరికినప్పుడల్లా తమ ధ్వేషాన్ని వెళ్లగక్కే మతోన్మాదులకు మటుకు కావలసినంత సరుకు దొరికింది. ఇస్లాం ధ్వేషకులైన మతోన్మాదులు ఎంత దూరం వెల్లారంటే- ఢిల్లీలో జరిగిన ఆ సభ కేవలం ఒకరికొకరు కరోనాను పులునుకుని దేశవ్యాప్తంగా కరోనాను అంటించెయ్యటానికే ఉద్దేశపూర్వకంగా పెట్టిన సభ అని, వారు అక్కడ తుమ్ములు, దగ్గులు ప్రాక్టీస్ చేసుకుని, ఊళ్ల మీద పడిపోయారని అభాండాలను సృష్టించటమే కాదు…
వారిని ఏదో మతిస్థిమితం కోల్పోయిన సైకోల జాతికి చెందిన వింత మనుషుల మాదిరిగా చిత్రీకరిస్తూ వారు పరీక్షలకు రావటం లేదని, జనాలపై ఉమ్ముతున్నారని, తమను పట్టుకోవటానికి వచ్చిన వారిపై కుక్కలు వదిలారని, వైధ్య సిబ్బంది ముందు నగ్నంగా తయారయ్యారని, ప్లేట్లు, స్పూన్లు నాకేసి కరోనాను అంటించేస్తున్నారని వగైరా అంటూ వీరిపై తయారైనన్ని ఫేక్ వీడియోలు బహుశా ఎవరి విషయంలోనూ ఇంతవరకూ తయారై ఉండవు. ఇదొక్కటే మతోన్మాదులకు మూర్ఖత్వం తప్ప బుద్ధి పనిచెయ్యదని చెప్పటానికి సంకేతం
ఇప్పుడు వీరు అమాయకులు, అందరిలానే జనజీవనంలో ఏవో చిన్న ఉధ్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ సామాన్య జీవనం గడుపుతుంటారు, అవగాహనా రాహిత్యంతోనే మర్కజ్ లో కార్యక్రమం పెట్టుకున్నారు అన్నది సర్వసామాన్యమైతే ముస్లిం సమాజం పట్ల తమకున్న ధ్వేషాన్ని వెళ్లగక్కే ఏకైక అవకాశం ఎక్కడ కోల్పోవలసి వస్తుందో అని… వారిని కుట్రదారులుగా మీడియాలో సృష్టించటమే కాదు, చివరకు వీరికి పాకిస్తాన్ కు చెందిన ‘హర్కతుల ముజాహిదీన్’ సంస్థతో సంబంధాలు ఉన్నాయని, వారంతా తబ్లిక్ జమాత్ వ్యక్తులే అని వార్తలు సృష్టించే వరకు దిగజారిపోయారు.
ఉగ్రవాదం చేసే వారు ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకోవచ్చు. కానీ, ఎంత గెడ్డాలు పెంచేసి, కళ్లలో సుర్మా రాసుకుని, తలపై టోపీ, లాల్చీ పైజామా ధరించినా ఎవరిలో అయితే ఖురాన్ ఆచరణ ఉండదో అతను ముస్లిమే కాజాలడు అన్నది ఖురాన్ చదివిన వారికే తెలుస్తుంది. అలాగే తోటి ప్రాణులు, మనుషులను హాని కలుగజేసేవాడు ప్రవక్త ముహమ్మద్ (స) అనుచరుడే అవ్వలేడన్నది ఆయన జీవిత చరిత్ర చదివిన వారికే తెలుస్తుంది.
ఢిల్లీ నిజాముద్దీన్ వెళ్లొచ్చిన వారి విషయంలో దేశవ్యాప్తంగా మీడియా భీబత్సం సృష్టించటం, సోషల్ మీడియాలో మతోన్మాదులు విమర్శలు గుప్పించి, వారిలో ఓ రకమైన అభద్రతాభావం సృష్టించి వారి పరువును బజారు కీడ్చెయ్యటంతో వారిలో కొందరు కరోనా పరీక్షలకు రాలేకపోయారన్నది నిజం. చివరకు దాన్ని కూడా చక్కటి అవకాశంగా మలచుకుని సోషల్ మీడియాలో “చూసారా వారు పరీక్షలకు రావటం లేదంటే వారి టార్గెట్ కరోనాను వ్యాపి చెయ్యాటమే” అంటూ ప్రచారాలు మొదలెట్టారు. సరిగ్గా తెలుగే మాట్లాడటం రాని తబ్లిక్ జమాత్ తాలూకు ముస్లిములను డిబేట్లలో కూర్చోబెట్టి కొందరు తెలుగు యాంకర్లు విరుచుకు పడిపోయి నీతిని కూడా బూతుగా చూపించే తమకున్న చక్కటి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
ఇక్కడ ఒక విషయం గమనించాలి- ప్రతీ వర్గంలో, ప్రతీ జాతిలో చివరికి ప్రతీ కుటుంబంలో సైతం అందరూ ఒకలా ఉండరు. కొందరు మంచివారు ఉంటే కొందరు మూర్ఖులు కూడా ఉంటారన్నది వాస్తవం.
అలాగే పరీక్షలకు వెళ్ళిన వారు కలిసి నమాజులు చేసినట్లు, తన విషయంలో సరిగ్గా వ్యవహరించలేదని ఒకతను డాక్టర్ పై తిరగబడ్డాడని కొన్ని వార్తలు మీడియాలో వచ్చాయి. వాటిలో కొంత శాతం నిజాలుంటేఎక్కువశాతం కల్పిత వార్తలు అల్లబడ్డాయి.
అయితే తప్పు ఎవరు చేసినా తప్పే! నిజంగా తబ్లిక్ జమాత్ కు చెందిన ముస్లిముల్లో ఎవరైనా ఏ డాక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించినా లేక మరే తప్పు చేసేనా అది తప్పే కాదు అలాంటి వారిని వెనకేసుకు రావటం ఇంకా కూడా తప్పు అవుతుంది. అలాగే ఒక సంస్థలోనో, ఒక వర్గంలోనో ఒకడు చేసే తప్పుకు ఆ మొత్తం సంఘాన్ని, సమాజాన్ని, వర్గాన్నీ బాధ్యులు చెయ్యటం కూడా అంతే తప్పు అవుతుంది. ఈ విషయం కేవలం మానవత్వం, నీతి, న్యాయం, మర్యాద, సంస్కారం వంటి గుణాలు సహజంగా ఉన్నోళ్లకు మాత్రమే తెలిసిన విషయం.
కానీ, ఇలాంటి లక్షణాలు కించిత్తు కూడా లేని కొందరు మూర్ఖులు మటుకు తబ్లిక్ జమాత్ సంస్థలో ఎవడో చేసిన తప్పుకు ఆ సంఘ సభ్యులందరినీ బాధ్యులుగా చెయ్యటమే కాదు, మొత్తం ముస్లిం సమాజాన్నే బాధ్యులుగా చేసి, ముస్లిమేతరుల దృష్టిలో ముస్లిములంటే ఏదో దుర్మార్గులు, దేశద్రోహులు, అన్నట్టు చిత్రీకరించటం, వాట్స్ యాప్ మీడియాలో నిరాధారంగా తబ్లిక్ జమాత్ సంస్థ ఒక తీవ్రవాద సంస్థ అని నిందలు మోపేవరకూ వెళ్లిపోయారు.
కానీ సంస్కారవంతులైన ముస్లిమేతర సోదరుల్లో అధికశాతం నిజాన్ని నిస్పక్షపాతంగా పరిశీలన చేసేవారున్నారు. కాబట్టి కొందరు మీడియాలో ఖాళీగా కూర్చుని సృష్టించే ఇస్లాం వ్యతిరేక వార్తలను బట్టి ఇస్లాంను అంచనా వెయ్యటం కాకుండా ఇస్లాంను ఖురాన్, ప్రవక్త ముహమ్మద్ జీవిత చరిత్ర ఆధారంగానే తెలుసుకుంటారని…
అలాగే ముస్లిములు అంటే వారేమీ దేవదూతల జాతికి చెందిన ప్రాణులేమీ కారు వారూ మనుషులే వారిలోనూ బుద్ధిమంతులతో పాటు కొందరు మూర్ఖులు కూడా ఉంటారన్న విషయాన్ని గ్రహించి, వారిలో ఏ కొందరో చేసే తప్పులకు ఆ మొత్తం సమాజాన్ని బాధ్యులుగా చేసే అనాగరిక ధోరణికి దూరంగా ఉంటారని అందరికీ నా మనవి
“తీవ్రవాద” రంగు పులుముతున్న మతోన్మాదం
