హిందూ ముస్లిముల భావోద్రేకాలు రెచ్చగొట్టి వారి మధ్య ఎలా కుంపటి రాజేయాలా అని నిత్యం గుంటకాడ నక్కల్లా కాచుకుని కూర్చునే కొందరు మతోన్మాదులు కొత్తగా మొదలెట్టిన అత్యంత ప్రమాదకరమైన ప్రాజెక్టు అత్యాచారాలకు సైతం మతపు రంగు పులమటం. ఒకప్పుడు హిందూ ముస్లిముల మధ్య అగాధాన్ని సృష్టించటానికి మాత్రమే పులమబడుతూ ఉండే ఈ మతపు రంగు ఇప్పుడు కొందరు కాషాయ వాదుల ద్వారా ఒక అడుగు ముందుకు వేసి అత్యాచారాలకు కూడా పులమబడటం ప్రారంభం అయింది. ఎందుకంటే హిందూ, ముస్లిములు ఏదోలా కొట్టుకు చావటం మీదే ప్రస్తుత మతతత్వ వాదుల రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది కాబట్టి! ఇన్నాళ్లూ హిందూ, ముస్లింల మధ్య వైరాన్ని సృష్టించటానికి ఉపయోగిస్తూ వచ్చిన మతోన్మాదాన్ని అత్యాచారాలకు కూడా పులుముతూ కొందరు కాషాయ వాదులు చేసిన కొన్ని ట్వీట్లు, స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయో ఈ క్రింది గమనించండి.
“మినిస్టర్, రేప్ చేసిన ప్రధాన నిందితుడు ముహమ్మద్ పాషా. ఇప్పుడు చూద్దాం ఆ అమ్మాయికి న్యాయం చేయటంలో మీరేమీ చెయ్యగలరో” ఇది BJP, IT సెల్ చీఫ్ అమిత్ మాల్వీ తెలంగాణా హోమ్ మినిస్టర్ అయిన ముహమ్మద్ మహమూద్ అలీతో ట్విట్టర్ లో చేసిన ట్వీట్!
“ఈ అత్యాచారం వెనుక ఎవరో ముహమ్మద్ ఉంటాడనే అనుకున్నాం” ఇది “BJP MLA రాజా సింగ్ మీడియాలో చేసిన కామెంట్!
“ఖురాన్ లో హిందూ అమ్మాయిలను బలాత్కారం చేసి హత్య చెయ్యమని ఉంది, హిందూ అనేవాడు ఎవడూ ఇలాంటి పని చెయ్యాడు. బలాత్కారాలు చేస్తుందే ముస్లిములే” ఇది స్వామీ ఓం బాబా మీడియాలో చేసిన కామెంట్!
ప్రపంచంలో అత్యాచారం చేయాలనుకునే ఏ వెధవా తాను రేప్ చేసే ముందు ఫలానా మతం అమ్మాయినే రేప్ చెయ్యాలని కండిషన్ పెట్టుకోడు. అసలు ఏ మతం అమ్మాయిని రేప్ చేస్తున్నాడో కూడా చూడడు. అటువంటప్పుడు ఆ రేప్ చేసినోడి మతాన్ని చూసి మత రాజకీయాలు నడిపే వారు ఆ రేప్ చేసేటోల్లకంటే కంటే హీనమైన జాతికి చెందిన వారనటం అతిశయోక్తి కాదు!
నిమిషానికి ఓ రేప్ చెయ్యబడుతున్న ఈ దేశంలో ఏ రేప్ కేస్ విషయంలోనూ లెగని నోళ్లు రేప్ చేసినోళ్లలో ఒకవేళ ఏ ముస్లిం పేరున్నోడో ఉంటే మటుకు కచ్చితంగా చాలా మంది నోళ్లు లేవటం మొదలవుతాయి. ఎందుకంటే ఎవరు ఎంత పెద్ద క్రైమ్ చేసినా పెద్ద సమస్య కాదు కానీ మతోన్మాదులకు మతాల మధ్య చిచ్చు రేపాలన్న శాడిజాన్ని చల్లార్చుకోవాలంటే కచ్చితంగా క్రైమ్ చేసినోళ్ళలో ఒక ముస్లిం పేరు పెట్టుకున్నోడు ఉండి తీరాలి. దీనికి గొప్ప ఉదాహరణ ఇటీవల బీహార్ లోని నలంద జిల్లాలో కొందరు మెళ్ళో కాషాయ కండువాలు ధరించి మరీ ఓ అమ్మాయిని రేప్ చేసి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో సైతం పోస్టు చేసేశారు. ఆ టైంలో అత్యాచారాలకు హిందూ, ముస్లిం మత రంగు పులుముతున్న వీరంతా ఏమైపోయారు? గతనెలలోనే జార్ఖండ్ లో ఓ అమ్మాయిని పన్నెండు మంది ఎత్తుకెళ్లి రేప్ చేశారు అత్యాచారాలకు హిందూ, ముస్లిం మత రంగు పులుముతున్న వీరంతా ఆటైం లో ఏమైపోయారు?
ఇవి మాత్రమే కాక, ఈ మధ్య కాలంలో ప్రత్యక్షంగా వరుసగా కాషాయ వాదులు చేస్తున్న అత్యాచారాలు గమనిస్తే బీ.జే.పీ ఎం.ల్.ఏ కుల్దీప్ సింగ్ రేప్ కేసు ఘటన, కన్న కూతురినే రేప్ చేసేసిన అమృత్సర్ లోకల్ బీ.జే.పీ లీడర్ ఘటన, డిల్లీ బీ.జే.పీ లీడర్ యోగేశ్ అట్ట్రే రేప్ చేసిన సంఘటనలు మాత్రమే కాక తాజాగా గోవా బీజేపీ ఎంఎల్‌ఏ ఆటానాసియో మోన్సేర్రేట్ ఓ పదహారేళ్ల బాలికను లాక్కెళ్లి రేప్ చేసిన సంఘటనలు మాత్రమే కాక ఆశారామ్ బాపూ, స్వామీ చిన్మయానంద, డేరా బాబా వగైరా చాలామంది కాషాయ రేపిస్టుల లిస్టు రాస్తూ కూర్చుంటే ఓ పది పేజీలైనా సరిపోవు. ఇన్ని జరుగుతూ ఉంటే అత్యాచారాలకు హిందూ, ముస్లిం మత రంగు పులుముతున్న వీరంతా ఏమైపోయారు? అప్పుడు గప్చిప్ గా ఉన్న వీరంతా నిన్నా మొన్న జరిగిన “దిశా” హత్యాచార కేసు అనంతరం ఒక్కసారిగా ఎందుకు విరుచుకుపడ్డారు? కారణం పైన పేర్కొనబడిన అత్యాచారాలన్నిటిలో ఒక్కడు కూడా ముస్లిం పేరున్నోడు లేక పోవటమే. పైగా స్వయంగా కాషాయ వాదులే ఇన్వాల్వ్ అయి ఉండటం!
అణు బాంబు కంటే అత్యంత ప్రమాదకమైన వెపన్ మతోన్మాదం. అణు బాంబ్ ఒక్కసారిగా జనాల్ని చంపేస్తే మతోన్మాదానికి స్లో పాయిజన్ లా పనిచేస్తూ జాతుల్నే నాశనం చేసే శక్తి ఉంది. ఒకప్పుడు ఎక్కడైనా అత్యాచార సంఘటన జరిగితే హిందూ, ముస్లిములంతా కలిసి ప్రతిఘటించే వారు. ఇప్పుడు మతోన్మాదులు అత్యాచారాలకు సైతం పులుముతున్న మత రంగును బట్టి ఎక్కడైనా ఏదైనా అత్యాచార సంఘటన జరిగితే ఆ రేప్ చేసినోడి మతాన్ని బట్టి మత సంఘర్షణలు ప్రారంభమవుతున్నాయి. ఇది మతోన్మాదానికి ఉన్న పవర్.
మతోన్మాదుల అతిపెద్ద కుట్ర ఏమిటంటే ఒక్కసారి అత్యాచారాలకు హిందూ ముస్లిం అన్న మతపు రంగు పులిమి, ఏదోలా ప్రజల మెదళ్లలో విషపు బీజాలు నాటాలి. అవి మెల్లగా కొన్నాళ్లకు పెరిగి పెద్దవై సమాజాన్ని విచ్చిన్నంచేసే మహా వృక్షాలుగా మారతాయి. దీనిని ఒకరకంగా అత్యంత ప్రమాదకరమైన అంతర్గత ఉగ్రవాదం అనటంలో సందేహం లేదు.
చివరిగా చెప్పుకోవాల్సిన విషయం- భావోద్రేకాలను రెచ్చగొట్టినంత మాత్రానా ఉద్రేకపడి రెచ్చిపోవటం, ఒకరిపై ఒకరు పడి కరుచుకోవటం జంతు లక్షణం. ఎవరు ఎంత రెచ్చగొట్టినా విచక్షణతో వ్యవహరించటం మానవ లక్షణం. కాబట్టి ఎవరెంత రెచ్చగొట్టినా హిందూ ముస్లిములు కలిసి నివసిస్తున్న ఈ సమాజంలో ప్రతీ ఒక్కరు ఎంత విచక్షణతో వ్యవహరిస్తున్నారు అన్న దానిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది
మతపు రంగు పులమబడ్డ అత్యాచారం!
