కనీస ఆలోచన, విచక్షణ లాంటివి కోల్పోయినప్పుడు మనిషి జంతువు కంటే హీనంగా దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్న సూక్తుల్ని మనం చాలా చోట్ల చదువుతుంటాం. ఇలాంటి సూక్తుల్ని లైవ్ లో చూసే అవకాశాన్ని కొందరు కల్పిస్తుంటారు.
నీలేష్ కృష్ణ డైరెక్ట్ చేసిన మూవీ “అన్నపూర్ణి” పేరుతో నయనతార లీడ్ రోల్ లో డిసెంబర్ 1 న రిలీజ్ అయింది. తరువాత జీ స్టూడియో, నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమా రిలీజ్ చెయ్యటం జరిగింది.
అంతేకాదు, డిసెంబర్ 29 న ఈ రెండు ఓ.టి.టి. ప్లాట్ ఫామ్స్ నుండి ఈ సినిమాను తొలగించేయటం కూడా జరిగిపోయింది. కారణం వినటానికి చాలా సిల్లీగా, పరమ కామెడీగా ఉంటుంది. అదెలాగంటే…
జనవరి 6 వ తారీకున ముంబాయ్ లో రాకేష్ సోలంకి అనే వ్యక్తి పెట్టిన కేసు ఆధారంగా ఈ సినిమాపై ముంబైయ్ పోలీసులు ఆ సినిమా ప్రొడ్యూసర్లపై ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చెయ్యటం జరిగింది.
రాకేష్ సోలంకి ఎవరంటే ‘హిందూ ఐ.టి. సెల్’ వ్యవస్థాపకుడు! అంటే ఒకరకంగా ‘వాట్స్ యాప్ యూనివర్సిటీ’కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అన్నట్టు. ఆ సినిమాలో పాపం ఆయన్ను బాధ పెట్టిన అంశం ఏమిటంటే… సినిమా మొత్తం హిందూ సెంటిమెంట్స్ ను హర్ట్ చేసే విధంగా ఉండటమే కాదు, పైగా ఆ సినిమా “లవ్ జిహాద్”ను సైతం ప్రమోట్ చేస్తుంది అన్నది. అంతేకాదు అంతకంటే పెద్ద సమస్య ఏమిటంటే ఆ సినిమా హీరోయిన్ క్లైమాక్స్ లో బిర్యానీ వండే ముందు నమాజ్ చేసి బిర్యానీ వండటం!!
ఈ సినిమాలో హిందూ సెంటిమెంట్స్ ను హర్ట్ చేసేంత పాయింట్ ఏముంది? అసలు ‘లవ్ జిహాద్’ యాంగిల్ ఎక్కడుంది? అనుకుంటే అంతపెద్ద వాట్స్ యాప్ యూనివర్సిటీని నడుపుతున్నప్పుడు ఆ మాత్రం “మతోన్మాదం” ప్రదర్శించకపోతే ఎలా చెప్పండి?
ఇంతకూ ఆ సినిమాలో హీరోయిన్ ‘అన్నపూర్ణి’ క్యారక్టర్ కు చిన్నప్పటి నుండే మంచి రుచులతో కుకింగ్ చెయ్యటం ఇంట్రెస్ట్. పెద్దయ్యాక ఓ మంచి ‘చెఫ్’గా రాణించాలన్నది లక్ష్యం. కాకపోతే హీరోయిన్ ప్యూర్ వెజిటేరియన్ హిందూ బ్రాహ్మిణ్ కుటుంబానికి చెందినదే కాక, పైగా ఆమె తండ్రి గుళ్లో ప్రసాదం వండే బ్రాహ్మణుని కూతురు కూడా.
మరి ఈ సినిమాలో అసలు సమస్య ఏమిటంటే… అదే ‘వెజ్ & నాన్ వెజ్’ తిండి మధ్య గొడవన్న మాట. తండ్రి బ్రాహ్మణుడు, అతని కూతురు చెఫ్ అవ్వాలంటే నాన్ వెజ్ ఫుడ్ వండక తప్పదు.
ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉన్న ఈ సినిమా కథ మొత్తం ‘అన్నపూర్ణి’ మరియు ఆమె స్నేహితుడైన ‘ఫర్హాన్’ అనే రెండు క్యారక్టర్ల చుట్టూ తిరుగుతుంది. చెఫ్ గా రాణించాలనుకున్న ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయికి ఆమె కుటుంబ మత నమ్మకాలు అడ్డుగా నిలబడుతాయి. ఇది ఈ మొత్తం సినిమాలో మేయిన్ పాయింట్.
నాన్ వెజ్ తినటం పాపంగా భావించటమే కాదు, నాన్ వెజ్ కూర ఎక్కడో వండబడుతుంటే ముక్కుమూసుకునే భావజాలం ఉన్న కుటుంబానికి చెందిన ఓ స్త్రీ చెఫ్ గా రాణించాలనుకున్నప్పుడు రుచికరమైన బిర్యానీ వండటం పెద్ద సమస్యే. ఎంత బిర్యానీ రెసిపీని నేర్చుకున్నప్పటికీ తన ఫ్రెండ్ ఫర్హాన్ ఇంట్లో అతని తల్లి వండే బిర్యానీలో ఓ ప్రత్యేక కమ్మదనం ఉండటంతో ఒకానొక సందర్భంలో అన్నపూర్ణి డైరెక్టుగా ఫర్హాన్ ఇంటికి నేరుగా వెళ్లి అతని తల్లినే మీరు చేసే వంటకంలో ఏం కలుపుతారు? ఎలా వండుతారు? అంత రుచికరంగా ఉంటుంది నేను కూడా అవే మసాలాలు వాడినప్పటికీ మీరు వండే బిర్యానీ టేస్ట్ రాదు అని. అతని తల్లి “నేను చేసేదేమీ లేదు వంటకం చేసే ముందు నమాజ్ చదువుకుని మనస్ఫూర్తిగా వంటకం చేస్తాను ఆ తర్వాత మిగతాదంతా ఇన్షా అల్లాహ్” అని అమాయకంగా జవాబిస్తుంది ఆ మనిషి.
చివర్లో ఫర్హాన్ తల్లి అవలంబించే మొత్తం ప్రక్రిను అనుసరించే అన్నపూర్ణి కూడా ఒకానొక సందర్భంలో బిర్యానీ వండే ముందు నమాజ్ చదువుతుంది. సినిమాల్లో ఎమోషనల్ మెలోడ్రామా ఇలానే ఉంటాయి. కానీ ఇందులో ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చెయ్యాల్సినంత నేరం ఏముంది ఈ సినిమా స్టోరీలో?
ఉంది! గుడ్డు మీద ఈకలు పీకాలనుకున్నప్పుడు ఎన్నైనా వంకలు వెతకొచ్చు. ముందు ఈ సినిమాలో “లవ్ జిహాద్” యాంగిల్ వెతకటం. అసలు అన్నపూర్ణి క్యారక్టర్ కు ఫర్హాన్ అనే స్నేహితుడు ఉండటం కారణంగా ఈ సినిమా “లవ్ జిహాద్” ప్రమోట్ చేస్తుందని కేస్ పెట్టటం మతోన్మాదానికి పరాకాష్ట.
ఎందుకంటే ఈ సినిమాను ఫ్యాక్ట్ చెక్ చేస్తే… సినిమా మొత్తం మీద అన్నపూర్ణి, ఫర్హాన్ క్యారక్టర్లకూ మధ్య ఫ్రెండ్షిప్ తప్ప ఎక్కడా ‘లవ్’ అనే ప్రస్తావనే ఉండదు. పైగా ఆ ఫర్హాన్ హిందూ బ్రాహ్మీణ్ అమ్మాయిని నాన్ వెజ్ తినమని బ్రెయిన్ వాష్ చెయ్యటం లవ్ జిహాద్ కాకపోతే మరేమిటి? అన్నది ఆ వాట్స్ యాప్ ప్రొఫెసర్ వాదన.
ఇంతకూ ఆ సినిమాలో ఒకచోట ఫర్హన్ హిందూ శాస్త్రాల్లో కూడా నాన్ వెజ్ తిన్నట్టు లేదా? అని ప్రశ్నిస్తాడు. “కాబట్టి నేను నాన్ వెజ్ తినటం పాపం అవ్వదా?” అని అన్నపూర్ణి ప్రశ్నిస్తుంది. దానికి అతనిచ్చే సమాధానం “తినటం తినకపోవటం నీ స్వంత అభీష్టం! నా తల్లి కూడా మాంసాహారం తినదు, కానీ మాంసాహార వంటకం బ్రహ్మాండంగా చేస్తుంది. కాబట్టి నీ స్వంత సెంటిమెంట్లను ప్రొఫెషన్ తో కలపవద్దని” చెబుతాడు. ఇందులో బ్రేయిన్ వాషింగ్ ఎక్కడుందో, అసలు లవ్ జిహాద్ ఏ రకంగా అవుతుందో ఎంత జుట్టు పీకేసుకున్నా అర్థం కాదు.
ఈ సినిమాలో ఫర్హాన్ క్యారెక్టర్ అన్నపూర్ణిని నాన్ వెజ్ తినాల్సిందిగా బలవంత పెట్టినట్టుగానీ, లవ్ ట్రాక్ నడిపినట్టు గానీ ఉంటే బ్రేయిన్ వాషింగ్, లవ్ జిహాద్ బ్లా బ్లా బ్లా లాంటి మసాలాల్ని కలిపి కేస్ పెట్టటానికి కాస్తో కూస్తో అవకాశం ఉండేది. ఇన్ఫాక్ట్, చాలా సినిమాల్లో హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి… వాటిని మరి ‘హిందూ లవ్ జిహాద్’ అనో, ‘హిందూ లవ్ ట్రాప్’ అనో అంటే ఒప్పుకుంటారా? అన్నది మరో వాదన.. బట్, కానీ, ప్రస్తుతం మనం ఆ ట్రాక్ లో వెళ్లటం లేదు.
మొత్తానికి ఈ సినిమా స్టోరికి హిందూ-ముస్లిం రంగు పూసి కేస్ ఫైల్ చేసి నెట్ ఫ్లిక్స్ లాంటి ఓ.టి.టి ప్లాట్ ఫామ్స్ నుండి తొలగించేంత వరకు వచ్చిందంటే దేశంలో ముస్లిం వ్యతిరేకతతో కూడిన మతోన్మాదం ఏ స్థాయిలో పిచ్చెక్కి రంకెలేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక నుండి సినిమాలో హీరోయిన్ హిందువై ఉండి ఆమె ఫ్రెండో లేక ఆమె ఇంటి వానరో ముస్లిమై ఉంటే చాలు “లవ్ జిహాద్” జరిగిపోయినట్టే అన్నమాట!
నిజానికి జీ స్టూడియో, నెట్ ఫ్లిక్స్ సంస్థలు కూడా ఈ సిల్లీ కేస్ ఫైల్ చేసిన వ్యక్తిపై ఎదురు తిరగి కేసు నేగ్గొచ్చు. కానీ కేసు ఫైల్ చేసింది ‘హిందూ ఐ.టి. సెల్’కు చెందిన వ్యక్తి! అతని వెనుక ఎలాంటి ‘పెద్ద చేతులు’ అండగా నిలబడతాయో తరువాత జరిగే పరిణామాలేమిటో వారికి బాగా తెలుసు.
ఎందుకొచ్చింది ఎదురు తిరిగిన మరుక్షణమే ఐ.టి దాడులు, సోషల్ మీడియాలో నెట్ ఫ్లిక్స్ బ్యాన్ క్యాంపేయినింగులు వగైరా తలనొప్పులు తగిలించుకుని జండూ బామ్ రాసుకునేకంటే విశ్వ హిందూ పరిషద్ కు క్షమాపణలు చెప్పుకుని సైలెంటుగా సినిమా తొలగించేయటం బెటర్ అని తీసిపరేశాయి.
“మతోన్మాదం” పీక్ స్టేజ్ కు వెళ్ళిపోయినప్పుడు…
