ముగ్గురు భార్యల్ని, ఎనిమిది మంది పిల్లల్ని కనే విలన్ ను ముస్లింగా చూపించాల్సిన పనేంటి? ఇస్లామోఫోబియాను ప్రదర్శించటానికి కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి డైరెక్ట్ యాంటీ ముస్లిం సినిమాలే తీయక్కర్లేదు… యానిమల్ లాంటి కమర్షియల్ సినిమాలోనూ ఎంతో చాకచక్యంగా ముస్లిములను క్రూరులుగా, ముస్లిం స్త్రీలను సిగరెట్లు త్రాగే వ్యసనపరులుగా చూపవచ్చని సందీప్ రెడ్డి వంగ తన సినిమా ద్వారా నిరూపించాడు.
అంతేకాదు, తన సినిమా రెండవ పార్ట్ ‘యానిమల్ పార్క్’లో నైతే రాబోయే యానిమల్ క్యారక్టర్స్ అన్నీ ఎంత క్రూరంగా ఉండబోతున్నాయో హింట్ ఇచ్చి వదిలిపెట్టాడు. సో, యానిమల్ పార్క్ అంటే క్రూరులైన ముస్లిం క్యారక్టర్లకు, గోమూత్రం తాగే హిందువైన హీరో క్యారక్టర్ కు మధ్య సాగే యుద్ధం అన్నమాట!
మొత్తానికి మతోన్మాదాన్ని చక్కటి కమర్షియల్ ఫార్మెట్ లో కూర్చోబెట్టి జనాల మెదళ్లలో స్లోపాయిజనింగ్ చేసే ప్రక్రియను ఎంతో అందంగా తీసుకెళతాడన్న మాట.
ఇప్పటి వరకు అనేక సినిమాల్లో విలన్లుగా చూపే ముస్లిం క్యారక్టర్లకు టోపీ, గెడ్డం, భుజాలపై గళ్ల తువాలు, కళ్లకు సుర్మా పెట్టి యాక్ట్ చెయ్యిస్తే… సందీప్ రెడ్డి కాస్త డిఫరెంట్ విలన్ను మోడ్రన్ లుక్ లోనే ఉంచి అతన్ని మాత్రం ముస్లింగా చూపెడుతూ అతనితో, అతని అడోళ్లతో అన్ని గలీజు పనులూ చేయించాడు. ఇది కొత్తగా ట్రెండ్ సెట్ చెయ్యటం అన్నమాట!
నిజానికి బల్బీర్ విజయ్ సింగ్ అనే హీరో క్యారక్టర్ ఫ్యామిలీ మొత్తం సిక్కులైనప్పుడు అతని తోడబుట్టిన సోదరుడిని విలన్ గా చూపటానికి అతన్ని ముస్లింగా మార్చిపరేసి అతని పేరును అబ్రార్ గా, అతను మూడు పెళ్లిళ్లు చేసుకుని ఎనిమిది మంది పిల్లల్ని కన్న వాడిగా ఓ క్రూరుడైన మనిషిగా చూపించటం దేనికి? ఆ పాత్ర పోషించిన బాబీడియోల్ ను సిక్కు మతానికి చెందిన వాడిగానే ఉంచేసి సినిమాను తీసినా సరిపోతుంది కదా?
బలవంతంగా ఇక్కడ మూడు పెళ్లిళ్లు చేసుకునే విలన్ను ముస్లింగా మార్చటంలో ఉద్దేశం బహుశా బహుభార్యత్వం కలిగి ఉండేది ఒక్క ముస్లిములే అనుకుంటే అది సందీప్ రెడ్డి వంగా అజ్ఞానం అనుకోవాలి. లేదా ఇది అతనిలో ఏ మూలో దాగున్న మతోన్మాదం అనుకోవాలి. లేదా ముస్లిం కమ్యూనిటీ పట్ల సామాన్య జనానికి అతను ఎక్కిస్తున్న స్లో పాయిజన్ అనుకోవాలి.
కారణం సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో పనిచేసే ఐ.ఐ.పి.ఎస్ అనే ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలో బహుభార్యత్వం అత్యధికంగా కలిగి ఉన్న వర్గం క్రైస్తవులు అంట! అవును ఈ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో బహుభార్యత్వం కలిగి ఉన్నవారిలో క్రైస్తవుల రేటు 2.1 శాతం ఉంటే, ముస్లిముల రేటు 1.9 శాతం ఉన్నారు. హిందువ రేటు కాస్త అటుఇటుగా 1.3 శాతం ఉంది. దీనిని బట్టి బహుభార్యత్వం కలిగి, బహుసంతానం కంటున్న వారిలో మొదటి స్థానంలో క్రైస్తవులు, మూడవ స్థానంలో హిందువులు ఉన్నారు. ఈ విషయం ముస్లిములు నాలుగేసి పెళ్లిళ్లు చేసేసుకుని, పది మంది పిల్లల్ని కనేస్తున్నారని గోల పెట్టేవారికి అస్సలు తెలీదు.
అలాంటప్పుడు సందీప్ రెడ్డి వంగ బహుభార్యత్వం ఉన్న విలన్ను పనికట్టుకుని ముస్లింగా చూపాల్సిన పనిలేదు. లేదా హత్యలు, దౌర్జన్యాలు, రేపులు చేస్తుంది ఒక్క ముస్లిములే కాబట్టి విలన్ క్యారక్టర్ కు పనికట్టుకుని ముస్లిం రంగు పులిమితే దేశంలో నేర గణాంకాల ప్రకారం ప్రతీ గంటకు, రోజుకు జరుగుతున్న అనేక అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు, దౌర్జన్యాలు చేస్తున్న వారంతా ఎవరు అన్నది గమనిస్తే సరిపోతుంది.
పైగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అదే విలన్ను తిలకం దిద్దినప్పుడు ఎవరూ ప్రశ్నించలేదని కవర్ చేసుకుంటున్నాడు. అదేదో సినిమా పాటలో హీరోయిన్ ఆరెంజ్ కలర్ బికినీ వేసుకుందని దేశం మొత్తం మీద మతోన్మాదులు రెచ్చిపోయింది ఇతనికి తెలీదా? అలాంటప్పుడు ఇంత డబ్బు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు అదే హిందూ హీరో తమ్ముడైన విలన్ను మూడు పెళ్లిళ్లు చేసుకునేవాడిగా చూపెడితే ఏం జరుగుతుందో మతోన్మాదులు ఎలా రెచ్చిపోతారో తెలుసు. కాబట్టి చాకచక్యంగా అతన్ని ముస్లిం చేసిపరేస్తే ఏ గొడవా ఉండదని ఊహించుకున్నాడు కాబోలు.
కొందరు సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు తమ సినిమాల ద్వారా ముస్లిం క్యారక్టర్లను ఉగ్రవాదులుగా, క్రూరులుగా, దౌర్జన్య పరులుగా చూపుతున్న ఇలాంటి సినిమాల పై దేశవ్యాప్తంగా ముస్లిం పెద్దలు, సంఘాల వారు చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సినిమాలు రిలీజ్ కాకుండా నిరోధించటం మొదలెడితే కనీసం భవిష్యత్తులో కొందరు డైరెక్టర్లు తమ సినిమాల్లో క్యారక్టర్ల పట్ల జాగ్రత్త వహిస్తారు.
ముస్లిం పెద్దలు, అధికారం ఉన్నవారు అలాగే చలనం లేకుండా చూస్తూ ఊరుకుంటే సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్లు తమలో దాగున్న ముస్లిం వ్యతిరేకతతో కూడిన మతోన్మాదాన్ని చక్కగా తమ సినిమాల్లో ప్రదర్శిస్తూ జనాల మెదళ్లలో విషాన్ని నింపుతూ చక్కగా డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు.
స్లో పాయిజన్
