నాకు ఇప్పటికీ బాగా గుర్తు. మొట్టమొదటి సారి ఖురాన్ ను పరిశీలనగా చదవటం మొదలెట్టాక ఖురాన్ లో మద్యం త్రాగటాన్ని మొట్టమొదటిసారిగా పూర్తిగా నిషేధించబడిన వాక్యం 5 వ అధ్యాయం 90 వచనంలో కనపడుతుంది. నిజానికి ఈ అధ్యాయం పేరు సురహ్ అల్-మాయిదా. అందులో వాక్యాలు కూడా ప్రవక్త ముహమ్మద్(స) మదీనాకు వలస వెళ్లాక అంటే ఆయన ప్రవక్తగా నియమించబడ్డాక 13 ఏళ్ల తరువాత అవతరించబడిన వాక్యాలు. అంతకు ముందు మద్యపానానికి సంబంధించి ఖురాన్ లో ఓ రెండు సందర్భాలో కేవలం అయిష్టత మాత్రమే ప్రకటించటం జరుగుతుంది.
నా మనసులో మెదిలిన ప్రశ్న ఏమిటంటే ముహమ్మద్(స) ప్రవక్తగా నియమించబడిన తరువాత కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ కు ఓ మంచి విషయాన్ని ప్రజలకు ఆదేశించటానికి దాదాపు 13 ఏళ్ళ ఎందుకు పట్టింది? ప్రారంభంలోనే మీరు మందు త్రాగటం నిషిద్ధం అని చెప్పెయ్యవచ్చుకదా? అని.
రీసెర్చ్ చేస్తే నాకు తేలింది ఏమిటంటే… ఓ మంచి విషయం చెప్పటానికైనా, తప్పును తప్పని ఖండించటానికైనా ఓ సందర్భం ఉంటుంది. ప్రజల సైకాలజీని సైతం దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాలను ఓ క్రమంలో మోతాదులో చెప్పాల్సి ఉంటుంది. ఒక విషయం తప్పని ఖండించే ముందు ప్రజలకు అవగాహన పర్చాల్సిన విషయాలు మరికొన్ని ఉంటాయన్నది.
ఆ ముఫ్తీ స్వరభాస్కర్ అనే సినీ నటి ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు “ఆమె భర్త ముస్లిం అయి ఉండి, ఆమె ముస్లిం కానప్పుడు ఆ వివాహం చెల్లదు, ఒకవేళ వివాహం కోసం ఆమె ముస్లింగా మారినా అలాంటి వివాహం చెల్లదు” అని పబ్లిక్ డొమైన్ లో బహిరంగంగా చెప్పిన విషయంలో తప్పు లేకపోయినా చెప్పిన సందర్భం సైరైంది కాదు.
ఒకప్రక్క ఇస్లాంను ఎలా తప్పుపట్టాలా, ఎలా విమర్శించాలా అని కొందరు నాస్తిక, కాషాయ, క్రైస్తవ మేధావుల వరకు వెయ్యి కళ్లతో మాటు వేసుకుని ఎదురు చూస్తున్న తరుణంలో.. “ఆ నటి ముస్లిం కాకపోయి ఆమె ఓ ముస్లింను పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదు” అని ఆ ముస్లిం ముఫ్తీ గారు ట్వీట్ పెట్టటంతో వారందరికీ ఇస్లాంను విమర్శించటానికి చక్కటి ఛాన్స్ దొరికింది. ఇస్లాం అవగాహన కించిత్తు కూడా లేని ఇస్లాం విమర్శకులకు “ఇస్లాం మతాంతర వివాహాలను ప్రోత్సహించటం లేదని, ఇస్లాం ఛాందసవాద మతమని, మతం అలాంటి ఛాందస భావాలనే నేర్పుతుందని” ఏది పడితే అది వాగటానికి, బుర్రతక్కువ పోస్టులు, కామెంట్లు పెట్టటానికి, తమలోపల దాగున్న ఇస్లాం విద్వేషపు పైత్యాన్ని కక్కటానికి మంచి అవకాశం లభించింది.
వ్యభిచారం దరిదాపులకు కూడా పోవద్దని, పరాయి స్త్రీలను కనీసం చెడు దృష్టితో కూడా చూడవద్దని, పరాయి స్త్రీలతో రహస్య సంబంధాలు పెట్టుకోవద్దని, వారితో గౌరవంగా, ప్రేమగా మెలగాలని, స్త్రీల పట్ల దయ కలిగి ఉండాలని, వారిని పెళ్లి చేసుకోటానికి కట్నకానుకలు ఆశించకూడదని ముస్లిం పురుషులకు ఖురాన్ అనేక ఆదేశాలిస్తూనే.. అటు స్త్రీలకు సైతం పరాయి పురుషుల విషయంలో తమ చూపుల్ని కాపాడుకోవాలని, నిండుగా వస్త్రాలు ధరించాలని, అణకువతో మెలగాలని చెబుతుంది. ఇంకా విశ్వాసులైన పురుషులు విశ్వాసులైన స్త్రీలను, విశ్వాసులైన స్త్రీలు విశ్వాసులైన పురుషులను వివాహం చేసుకోవాలన్న ఒక కనీస అర్హతను నిర్ణయిస్తుంది. ఇవన్నీ సంకుచిత భావజాలానికి చెందిన ఆదేశాలో, ఛాందస భావాలు రేకెత్తించే ఆజ్ఞలో కావు. ఒక ఆరోగ్యకరమైన సుందర సమాజాన్ని నిర్మించటానికి ఇస్లాం ఇస్తున్న ఆదేశాలు.
ఇలాంటి ఎన్నో విధి-నిషేధాలను ఖురాన్ ఒక క్రమంలో, సందర్భానుసారంగా చెప్పుకుంటూ రావటం జరిగిందన్న విషయాన్ని ఖురాన్ చదివేవారు ఎవరైనా కనిపెట్టవచ్చు. స్వయంగా ప్రవక్త ముహమ్మద్(స) ఉన్న కాలంలోనే ఏక దైవత్వపు భావన, ధార్మిక అవగాహన ప్రజల్లో దాదాపుగా వచ్చిన తరువాత నాటి సమాజపు ప్రజల్లో ఉన్న చెడులను ఖురాన్ ఒకొక్కటిగా ఖండిస్తూ, విశ్వాసులైన స్త్రీ, పురుషులు ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో క్రమ పద్ధతిలో చెప్పుకుంటూ రావటం జరిగింది.
ఇన్ని ఆదేశాలను చెప్పిన ఖురానే ఒకవేళ ఈ ధార్మిక ఆదేశాలు పాటించటం మీకు ఇష్టం లేకపోతే మానెయ్యవచ్చు ధర్మంలో ఎలాంటి బలవంతం లేదని కూడా చెబుతుంది.
అయితే ఇస్లాం ఆదేశాలను ఈనాడు ప్రజలలో తీసుకెళ్లాలని ఉవ్విళ్లూరే కొందరు ముస్లిం మేధావులు/పండితులు సమయాన్ని, సందర్భాన్ని, జనాల సైకాలజీని కూడా కాస్త దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలి. ఒక క్రమంలో ఏ విషయాలు ముందు ప్రజలకు అవగాహన పరచాలి, ఏవి చెప్పకూడదు అన్నది దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే క్రమం, మోతాదు తప్పినప్పుడు మంచి మెడిసిన్ కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇస్లాం అవగాహన ప్రజలకు కల్పించకుండా ఇస్లాం నిర్దేశించే విధి-నిషేధాలను, కొన్ని సెన్సిటివ్ విషయాలను ప్రజల్లో ప్రకటించేయటం వల్ల ఇస్లాం అభాసుపాలవుతుందన్న కనీస జ్ఞానం ఈనాటి కొందరు ముస్లిం పండితులకు/బోధకులకు లేకపోవటం బాధాకరం.
ఒకప్పుడు సీ.ఏ.ఏ, ఎన్.ఆర్.సీ. లాంటి చట్టాలకు వ్యతిరేకంగా ముస్లిములకు అనుకూలంగా గళం విప్పిన ఆ సినిమా నటి ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవటం అంత బాధ కలిగిస్తే ఆ ముఫ్తీ గారు ట్విట్టర్ లో ట్వీట్లు, ఫేస్బుక్ లో కామెంట్లు పెట్టటం లాంటి చవకబారు పనులు చెయ్యకుండా డైరెక్టుగా ఆమెతో, ఆమెను పెళ్లిచేసుకున్న వ్యక్తిని కూర్చోబెట్టి మాట్లాడాల్సింది. ఒకవేళ పబ్లిగ్గా ఇలాంటి ట్విట్లు పెడితే భవిష్యత్తులో ఇస్లాం పట్ల, ముస్లిం సమాజం పట్ల ఆమెకు వెగటు పుట్టి పూర్తిగా ఇస్లాంకు దూరమైపోయే ప్రమాదం ఉంటుందేమో అన్న కనీస అవగాహన కలిగి ఉండాల్సింది.
ముస్లిమేతర సమాజానికి ముందుగా ఇస్లాం గురించి అవగాహన పరచాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కొందరిలో కనపడే చెడులను, తప్పుల్ని సంస్కరించాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు పబ్లిగ్గా కాకుండా ఎదుటివారి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని సంస్కరించాల్సిన విధంగా సంస్కరించాలి.
ఏదైనప్పటికీ ఇస్లాం గురించి ముస్లిమేతరులతో ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా చెప్పాలనుకునే ముస్లిం మేధావులు/పండితులు తాము ప్రస్తావించే విషయాలు, తాము పెట్టే పోస్టులు, కామెంట్లు, ట్వీట్ల వల్ల ప్రజల్లో ఇస్లాం అవగాహన కలుగుతుందా? లేదా ఇస్లాం పట్ల మరిన్ని అపార్థాలు పెరగటానికి కారణమవుతుందా? అన్న జాగ్రత్త కలిగి వ్యవహరించాలి. ఇస్లాం తాలూకు విశాల దృక్పథాల అవగాహన ప్రజల్లో కలిగించకుండా కొన్ని విషయాలు చెప్పటం వల్ల తిరిగి ఇస్లామే విమర్శల పాలవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి.
అసందర్భ ప్రేలాపన ప్రమాదకరం
