“యాంటీ ఇస్లాం” పుస్తకం రాస్తూ ముస్లింగా మారిపోవటం ఏంటి? ఇది చదవటానికి, వినటానికి ఆశ్చర్యంగా అనిపించటం లేదూ?
ఆ యాంటీ ఇస్లామిక్ పుస్తకం రాయటాన్ని మొదలెట్టిన “జోరం వాన్ క్లావెరెన్” ఆ పుస్తకాన్ని చక్కగా పూర్తి చెయ్యొచ్చుకదా! జిహాద్ లక్ష్యం ఉగ్రవాదం, ఇస్లాం ఉగ్రవాదాన్ని నేర్పుతుంది, ఖురాన్ కాఫీర్లను చంపేయమంటుంది, ఇస్లాం కత్తితో వ్యాపించింది వగైరా ఇస్లామోఫోబిక్ కంటెంట్ తో పుస్తకాన్ని పూర్తి చేసుంటే బహుశా ఆ “జోరం వాన్ క్లావెరెన్” కూడా సల్మాన్ రష్దీ అంత ఫేమస్సై ఉండేవాడు.
ప్రపంచవ్యాప్తంగా వేల కాపీలు అమ్ముడైపోయుండేవి.
అచ్చం ఇదే ఇస్లామోఫోబిక్ కంటెంట్ తో పుస్తకాన్ని మొదలెట్టిన ఆ మనిషి మధ్యలోనే ముస్లిమైపోయాడు. ఇంతకూ అలా మార్చేసింది ఎవరు? కారణం ఏమిటి?
*****
పుట్టుకతోనే ప్రొటెస్టంట్ క్రిస్టియన్, మరియు నెదర్లాండ్స్ కు చెందిన ప్రముఖ పొలిటీషియన్, అంతేకాక “ఫార్-రైట్ పార్టీ ఫర్ ఫ్రీడం (PVV)” తరఫున 2010 నుండి 2014 వరకు “మెంబర్ ఆఫ్ పార్లమెంట్ (MP)”గా కూడా పని చేసిన “జోరం వాన్ క్లావెరెన్” గురించి ఇస్లామోఫోబియాలో మునిగితేలే వారికి బాగా పరిచయం ఉన్న పేరే. ఎందుకంటే ఒకప్పుడు “జోరం వాన్ క్లావెరెన్” అంటేనే కరుడుకట్టిన ఇస్లాం ద్వేషి కాబట్టి.
సాధారణంగా తప్పు చేసే వ్యక్తులు రెండు రకాలుంటారు. ఒకరు అజ్ఞానం కొద్దీ తప్పు చేస్తారు. మరొకరు నిజనిజాలు ఏమిటన్నది తెలుసుకుని మరీ ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తారు. ఇస్లాం పట్ల ద్వేషం వెళ్లగక్కేవారిలో అధికశాతం మంది ఇస్లాం గురించి గాసిప్పుల్లోనో గాలి వార్తల్లోనో విన్నవారే తప్ప ఖురాన్ ను, ప్రవక్త ముహమ్మద్(స) జీవిత చరిత్రను లోతుగా అధ్యయనం చేసి కూడా ఉద్దేశపూర్వకంగా స్వార్థ ప్రయోజనాల కోసం ఇస్లాం పట్ల ద్వేషం వెళ్లగక్కే సల్మాన్ రష్దీ లాంటి ఇస్లామోఫోబులు అతి కొద్ది మందే ఉంటారు.
“జోరం వాన్ క్లావెరెన్” గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే “గీర్ట్ విల్డెర్స్ (Geert Wilder)” ఆధ్వర్యంలో స్థాపించబడిన ఓ డచ్, “యాంటీ-ఇస్లామిక్” సంస్థలో అతనికి కుడి భుజంగా ఉంటూ, ఇస్లాం వ్యతిరేక ఉద్యమం (Anti-Islamic Movement) లో చురుకైన కార్యకర్త. పైగా ఒకప్పుడు డచ్ పార్లమెంట్ లో సైతం ముస్లిములను, హిజాబ్ ను, మస్జిద్ లను దాని మీనార్లను నిషేధించాలని తన గళాన్ని బాహాటంగా లేవనెత్తాడు కూడా. ఒకానొక సమయంలో “ఇస్లాం ఓ అబద్ధం, ఖురాన్ ఓ విషపూరిత పుస్తకం!” అన్న పదజాలంతో ప్రసంగాలు కూడా చేసున్నాడు.
అప్పటివరకూ ఇస్లాంను అంటేనే ఉగ్రవాదాన్ని ప్రేరేపించే మతమని, జిహాద్ లక్ష్యం ముస్లిమేతరుల పట్ల దౌర్జన్యం చెయ్యటమని గాసిప్పుల్లో విన్న సమాచారాన్నే బాగా బుర్రకెక్కించుకున్న “జోరం వాన్ క్లావెరెన్” ఈ విషయాలను ఖురాన్ నుండే నిరూపిస్తూ ఓ యాంటీ-ఇస్లాం బుక్ ను రాస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది పైగా ఇస్లామోఫోబియాను అంతర్జాతీయ స్థాయిలో మరింతగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లవచ్చన్న ఆలోచన చెయ్యటం మొదలెట్టాడు.
దానికి ముందు చెయ్యాల్సింది ఖురాన్ ను, ప్రవక్త ముహమ్మద్ జీవిత చరిత్రను బాగా లోతుగా అధ్యయనం చెయ్యటం. అప్పటివరకూ ఖురాన్ ను చదవని ఆ మనిషి వెంటనే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్న తన స్నేహితుడైన అబ్దుల్ హకీం మురాద్ తో చర్చించటానికి వెళ్లాడు.
“నువ్వు మీడియాలో వింటూ వచ్చిన ఇస్లాం వేరు, ఖురాన్ చెబుతున్న ఇస్లాం వేరు. ఈ విషయం తెలియాలంటే ఖురాన్ ను, ప్రవక్త ముహమ్మద్ జీవిత చరిత్రను లోతుగా చదివి అప్పటికి కూడా నువ్వు భావిస్తున్నదే కరక్టనిపిస్తే నువ్వు మొదలెట్టిన ‘యాంటీ-ఇస్లాం పుస్తకాన్ని పూర్తి చెయ్యవచ్చు” అని సలహా ఇచ్చిన అతని స్నేహితుడు మాటను కొట్టి పరెయ్యకుండా ఎలాగైనా తన పుస్తకాన్ని పూర్తి చెయ్యాలన్న లక్ష్యంతో జోరం వాన్ క్లావెరెన్” కొన్నాళ్ల పాటు ఇస్లాంను అధ్యయనం చెయ్యటంలో మునిగిపోయాడు.
అలా కొన్నాళ్ల పాటు ఇస్లాంను అధ్యయనం చేసిన “జోరం వాన్ క్లావెరెన్” ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే…
“ఇస్లాం కు వ్యతిరేకంగా ఏవైతే అనేక పుస్తకాలు వ్రాయబడ్డాయో వాటికి ఏ ఆధారమూ (base) లేదు! నేను ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్(స) జీవిత చరిత్ర చదవటం ప్రారంభించానో అప్పుడు నాకు ఎంతో సౌమ్యుడు, మృదుస్వభావి మరియు ముస్లిములకు ముస్లిమేతరులకైనా ఎంతో సహాయపడే ఓ ముహమ్మద్ అనబడే వ్యక్తి నాకు పరిచయం అయ్యారు. అప్పటివరకూ నేను ఏదైతే ఇస్లాం గురించి ఊహించుకుంటూ ఉండేవాడినో అది అసలు ఇస్లామే కాదన్న విషయం అర్థమయ్యింది” అని చెప్పాడు.
మీడియాలో జరుగుతున్న ఇస్లాం వ్యతిరేక ప్రచారం కేవలం ప్రజల దృష్టిలో ఇస్లాంను దిగజార్చటానికి చెయ్యబడుతున్న ఓ ఆధారరహిత సమాచారం మాత్రమే అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్ర, ఖురాన్ అధ్యయనం అతనికి ఇస్లాం పట్ల ఉన్న అపార్థాలన్నిటినీ ఒక్కొక్కటిగా తుడిచిపెట్టేశాయి. కొన్నాళ్ల తరువాత… 2019 లో “జోరం వాన్ క్లావెరెన్” ఇస్లాం స్వీకరించి ముస్లింగా మారిపోయాడు. అజ్ఞానం కొద్దీ ఒకప్పుడు యాంటీ-ఇస్లాం పుస్తకం రాయటం మొదలెట్టినా మనిషి “I Became Muslim while writing Anti-Islam Book” అని చెప్పుకొచ్చాడు.
నేను పైన రాసిందంతా అతని నోటితోనే వినాలనుకునేవారు ‘Why Joram van Klaveren embraced Islam?’ అని టైప్ చేస్తే యూట్యూబ్ లో అతను ఇస్లాం గురించి, ఇస్లాం పట్ల అతను ఎలా ఆకర్షితుడయ్యాడో వివరిస్తూ మాట్లాడిన పదుల కొద్దీ వీడియోలను స్వయంగా వినవచ్చు.
మలుపు తిప్పిన “యాంటీ ఇస్లాం” బుక్
