ఇస్లాం, ఖురాన్ ల పట్ల ధ్వేషం కక్కాలనుకునే ఇస్లామోఫోబుల నుండి, హిందూ-ముస్లిం వర్గాల మధ్య వేర్పాటు వాద రాజకీయాలు నడిపే మతతత్వ వాదుల వరకు “కాఫీర్లను చంపమని ఖురాన్ చెబుతుంది” అన్న మాటను ఏదో ఒక స్లోగన్ లా వాడుతుంటారు. పైగా ఖురాన్లో అలా రాయబడి ఉన్న కారణంగానే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెరిగిపోతుందని డిక్లరేషన్లు కూడా పాస్ చేసేస్తుంటారు. ఇలాంటి అపార్థాల పుట్టలో నుండి బయటపడిన మరొక విమర్శే “ఇస్లాం కత్తి ద్వారా వ్యాపించిందన్నది”.
పైగా ఇలాంటి అర్థరహిత వాదనలకు ఆధారంగా ఖురాన్ లో “కనుక నిషిద్ధ మాసాలు గడచిపోయిన తరువాత ముష్రిక్కులను ఎక్కడ కనపడితే అక్కడ చంపండి (9:5)” అన్న వాక్య భాగాన్ని చూపుతుంటారు. ఈ వాదన ఎలాంటిదంటే “ధర్మాతులు అధర్మాతులను నాశమొనర్చుటలో వెనుదీయరాదు (అధర్వవేదం12:5:62)” అన్న వేదమంత్రాన్ని బట్టి హిందూయేతరులందర్నీ చంపేయమని హిందూ శాస్త్రం చెబుతుందని వాదించటం లాంటిదే!
ఒక్క ఖురాన్ లోనే కాదు అటు హిందూ శాస్త్రాల్ని, బైబిల్ గ్రంథాల్ని గమనించినా వాటిలో ‘యుద్ధం’ చెయ్యమని, ‘చంపమని’ ఆదేశించబడ్డ అనేక వాక్యాలు చూడగలం. ఆ వాక్యాల ఉద్దేశం సమాజంలో హింసను ప్రేరేపించటమా?
——-
ముస్లిమేతరులంతా కాఫీర్లా?
‘కాఫిర్’ అన్న పదానికి అర్థం ‘సత్య తిరస్కారి’ అని అర్థం తప్ప దాని అర్థం ముస్లిమేతరులని కాదు! ఖురాన్, బహుదైవారాధన చేసే ముస్లిమేతరులందర్నీ ‘ముష్రిక్కులు’గా పరిగణిస్తుంది. కానీ, దైవధర్మాన్ని అర్థం చేసుకునీ, దేవుడు ఎవరన్నది అవగాహన చేసుకున్న తరువాత కూడా ఉద్దేశపూర్వకంగా సత్యాన్ని తిరస్కరించే వ్యక్తులు మాత్రమే కాఫీర్లుగా పరిగణించబడ్డారు. చివరకు అలాంటి వ్యక్తులు ముస్లిం ఇళ్లల్లో పుట్టినవారైనా సరే!
మరి ఖురాన్ అవిశ్వాసులను చంపేయమంటుంది కదా?
ఖురాన్ లో చాలా చోట్ల ‘యుద్ధం’ చెయ్యమని, చంపమని ఆదేశిస్తున్న వాక్యాలను చూడగలం. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన రెండు విషయాలు: 1). ఈ ఆదేశాలు ఇవ్వబడింది సామాన్య ముస్లిములందరికీ కానే కాదు. 2). ఈ ఆదేశాలు ఇవ్వబడింది సామాన్య ముస్లిమేతరులందరిపై యుద్ధం చేసి చంపటం గురించి అస్సలు కాదు అన్నది.
మరి ఖురాన్లో ‘యుద్ధం’ చెయ్యమని, ‘చంపమని’ వ్రాయబడి ఉన్న వాక్యాలు ఎవరి విషయంలో ఆదేశించబడ్డాయి?
దీనికి సంక్షిప్త సమాధానం: విశ్వాసులపై దాడి చేసి, వారిని హతమార్చి ధర్మాన్ని అణచాలన్న కుట్రతో యుద్ధానికి కాలు దువ్విన అవిశ్వాసుల్లో ఉండే దౌర్జన్య పరులకు వ్యతిరేకంగా ఆత్మరక్షణ నిమిత్తం, ధర్మసంరక్షణ కోసం యుద్ధం చెయ్యమని, చంపమని ఆనాటి పీడితులైన విశ్వాసులకు ఇవ్వబడ్డ వాక్యాలు అవి.
అలాగని ప్రతీ అవిశ్వాసీ దౌర్జన్య పరుడూ అవ్వడు. విశ్వాసులతో కలిసిమెలసి సఖ్యతతో ఉంటూ వారికి వ్యతిరేకంగా దౌర్జన్యానికి పాల్పడని సామాన్య అవిశ్వాసులతో న్యాయంగా, మంచితనంతో వ్యవహరించమని ఖురానే ఆదేశిస్తుంది (60:8).
నిజంగానే నేడు కొందరు ఖురాన్ విమర్శకులు చెబుతున్నట్లు ప్రతీ అవిశ్వాసిని లేక ముస్లిమేతరుడిని నిర్దాక్షణీయంగా తెగనరకమని ఖురాన్ లో వ్రాయబడి ఉంటే అంతకు మించిన అన్యాయంగానీ, దుర్మార్గంగానీ, ఉన్మాదంగానీ మరొకటి ఉండదు! అలాంటి ఆజ్ఞలే గనుక ఖురాన్ లో ఉండి ఉంటే గడచిన 1400 సంవత్సరాలలో మనిషి పుట్టుక పుట్టిన వాడెవడూ కూడా ఖురాన్ ని దైవగ్రంథంగా అంగీకరించటం ప్రక్కనపెడితే, కానీస విజ్ఞత ఉన్న ఏ ఒక్క మనిషీ ఇస్లాం స్వీకరించి ఉండేవాడు కాదు అనటం అతీయోశక్తి కాదు! ప్రపంచ వ్యాప్తంగా నేడు 250 కోట్ల మంది ద్వారా అనుసరించబడుతున్న ఇస్లాం నిజంగా అలాంటి ఆదేశాలు ఇస్తే అది ఎప్పుడో కనుమరుగైపోయి ఉండేది.
ఇక ఈనాడు ‘జైషే ముహమ్మద్’ ‘అల్-ఖైదా’, ‘ఐఎస్ ఐఎస్’ వగైరా పేర్లతో కంపెనీలు నడుపుతున్న టెర్రరిస్టులంతా అమెరికా, యూరప్, ఇశ్రాయేల్ దేశాల పెంపుడు కుక్కలే తప్ప ముస్లిములు కారు. వారికి ఇస్లాంతో సంబంధం లేదన్నది గమనించాలి.
——-
అన్యాయంగా ఏ వ్యక్తినైనా చంపటం ఘోర పాపంగా పరిగణిస్తున్న ఖురాన్!
“ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడిన వాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే” – ఖురాన్ 5:32
అన్యాయంగా ఏ మనిషినైనా చంపటాన్ని ఖురాన్ ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నప్పుడు మరి ఖురాన్ అవిశ్వాసులను, బహుదైవారాధకులను చంపమని ఎందుకు ఆదేశించింది? అన్న ప్రశ్నకు సూటైన సమాధానమే ఖురాన్ లోని ఈ క్రింది వాక్యాలు. పరిశీలనగా చదవగలరు.
A). “మీతో పోరాడేవారితోనే మీరూ పోరాడండి” – 2:190
B). “వారు యుద్ధం చేయటం మానుకుంటే అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు అనే విషయం తెలుసుకోండి” – 2:192
C). “దౌర్జన్యపరులను తప్ప మరెవ్వరినీ శిక్షించకూడదు” – 2:193
D). “ప్రవక్తా! శత్రువు గనుక సంధీ శాంతులవైపు మొగ్గు చూపితే, నీవు కూడా దానికి సిద్ధపడు. అల్లాహ్ పై భారం వెయ్యి” – 8:61
C) “వారు మీతో యుద్ధం చెయ్యనంత వరకు, మీరూ వారితో యుద్ధం చెయ్యకండి. కానీ వారు యుద్ధానికి కాలు దువ్వితే, మీరు వారిని చంపటానికి వెనుదీయకండి” -2:191
E). “ఒకవేళ ఒడంబడిక కుదుర్చున్న తరువాత, వారు మళ్లీ తమ ప్రమాణాలను భగ్నం చేస్తే, మీ ధర్మంపై దాడులు చేయటం ప్రారంభిస్తే, అవిశ్వాస పతాక ధారులతో యుద్ధం చెయ్యండి” – 9:12
F). “వారు యుద్ధం చెయ్యటం మానివేస్తే, సంధి కొరకు, శాంతి కొరకు చెయ్యి చాపితే అప్పుడు వారిపై దాడి చేయటానికి అల్లాహ్ మీకు మార్గం తెరచి ఉంచలేదు” – ఖురాన్ 4:90
పై వాక్యాలన్నిటిలో కామన్ గా కనపడుతున్న అంశం- అమాయకులైన విశ్వాసులకు వ్యతిరేకంగా కుట్రపన్ని, ధర్మాన్ని అణచటానికి, వారిని హతమార్చటానికి అవిశ్వాసుల్లో కొందరు దౌర్జన్యపరులు యుద్ధానికి కాలు దువ్విన సందర్భంలో అలాంటి దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా ఆత్మరక్షణ నిమిత్తం యుద్ధం చెయ్యాలన్నది. ఒకవేళ వారు గనుక యుద్ధం మానుకుంటే వారిని క్షమించమని ఆదేశించటాన్ని బట్టి ఇవి కేవలం యుద్ధ నేపథ్యంలో ఆనాటి పీడితులైన విశ్వాసులకు ఇవ్వబడిన తాత్కాలిక ఆదేశాలు తప్ప అన్ని కాలాల్లో ఉండే సామాన్య ముస్లిములందరికీ ఇవ్వబడ్డ వాక్యాలు కావన్న విషయం ఇట్టే కనిపెట్టవచ్చు.
కానీ, ఈ సందర్భాన్ని తప్పించేసి “ముష్రిక్కులను ఎక్కడ కనపడితే అక్కడ చంపండి” అన్న ఒక ముక్కను పట్టుకుని.. “చూశారా ఖురాన్ అవిశ్వాసులను చంపేయమని ఎలా చెబుతుందో” అంటే అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు.
——-
భగవద్గీత, బైబిల్ గ్రంథాల్లో సైతం దౌర్జన్య పరులను చంపమనే ఆజ్ఞలు ఉన్నాయి!
ధర్మాన్ని అణచాలన్న ఉద్దేశంతో అన్యాయంగా అమాయకులైన విశ్వాసులకు వ్యతిరేకంగా యుద్ధానికి కాలు దువ్వే దౌర్జన్య పరులు అన్ని కాలాల్లోనూ ఉన్నారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో స్వయంగా సృష్టికర్త అయిన దేవుడే ప్రవక్తలకు వారి అనుచరులకు దౌర్జన్య పరులకు వ్యతిరేకంగా యుద్ధం చెయ్యమని, చంపమని ఆదేశించటాన్ని చూడగలం. ఒక్క ఖురాన్ లోనే కాదు భగవద్గీత, బైబిల్ గ్రంథాలు గమనించినా అలాంటి అనేక వాక్యాలను మన చూడగలం. వాటిలో కొన్నిటిని ఈ క్రింది గమనించగలరు.
“సమస్త కర్మలను నా యందు ఆధ్యాత్మచిత్తముతో సమర్పించి, ఆశగాని, మమకారము లేని వాడవై, నిశ్చింతగా యుద్ధము జేయుము” – గీత 3:30
“నా చేత (ఇది వరకే) చంపబడిన ద్రోణా చార్యుని, భీష్మాచార్యుని, జయద్రథుని, కర్ణుని అట్లే ఇతర యుద్ధ వీరులను కూడా నీవు చంపుము. భయపడకుము. యుద్ధము చేయుము. శత్రువును గెలవగలవు” – గీత 11:34
“ఇక నీవు ధర్మయుక్తమగు ఈ యుద్ధమును నిర్వహింపనిచో దానిచే నీవు స్వధర్మమును నిరసించిన వాడవై కీర్తిని పోగొట్టుకుని, పాపమును పొందగలవు” – గీత 2:33
“అర్జునా! ఒకవేళ నీవీ ధర్మయుద్ధము నందు శత్రువుచే చంపబడినచో స్వర్గమును బొందెదవు. అట్లు గాక నీవే జయించినచో భూలోక రాజ్యమును అనుభవించెదవు. ఈ ప్రకారముగా రెండువిధాలా మేలే. కావున లెమ్ము. యుద్ధమునకు సంసిద్ధుడు కమ్ము” – గీత 2:37
“యూదా వారలారా, యేరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరునూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి” – 2 దిన 20:15-17
“అది మీతో సమాధానపడక యుద్ధమే మంచిదని యెంచిన యెడల దాని ముట్టడి చేయుడి. మీ దేవుడైన యెహోవా దాని నీ చేతికప్పగించినప్పుడు దానిలో మగవారీనందరినీ కట్టివాత హతము చేయవలెను” – ద్వితీ 20:13, 14
అచ్చం పై గీతా, బైబిల్ వాక్యాల సందర్భం వంటిదే ఖురాన్ ఇస్తున్న ఈ క్రింది ఆదేశాలు:
“విశ్వసించిన ప్రజలారా! మీ స్వజనులైన సత్యా తిరస్కారులతో పోరాడండి. వారు మీలో కాఠిన్యాన్ని చూడాలి. భయభక్తులు కలవారితో అల్లాహ్ ఉంటాడని తెలుసుకోండి” – ఖురాన్ 9:123
“కనుక వారితో యుద్ధం చెయ్యండి; అల్లాహ్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు” – ఖురాన్ 9:1
ఈ విధంగా ఖురాన్ ని మాత్రమే కాక, గీతా శాస్త్రాన్ని పరిశీలించినా, బైబిల్ ని చదివినా అనేక వాక్యాల్లో “యుద్ధము జేయుము” “చంపుము” అన్న పదప్రయోగాలు కనిపిస్తాయి. వాటిని బట్టి భాగవద్గీతా, బైబిల్ శాస్త్రాలు ఉగ్రవాదం బోధిస్తున్నాయనో, హిందూ యేతరులను, క్రైస్తవేతరులను చంపమంటున్నాయనో చెప్పటం ఎంత అవివేకమో దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా యుద్ధం చెయ్యమన్న కొన్ని ఖురాన్ వాక్యాలను పట్టుకుని ఖురాన్ ఉగ్రవాదాన్ని బోధించమని చెబుతుంది, ముస్లిమేతరులను చంపమని చెబుతుంది అనటం కూడా అంతే అన్యాయం అవుతుంది.
ఉదాహరణకు బోర్డర్ లో ఉండే ఓ కమాండర్ తన సైనికులపై యుద్ధానికి తెగబడే శత్రువులకు వ్యతిరేకంగా యుద్ధం చెయ్యమని, శత్రువులు ఎక్కడ కనపడితే అక్కడ చంపమని చెబుతుంటాడు. ఎందుకు అతను క్రూరుడు కాబట్టా? అక్కడ అలా చెప్పటం అవసరం కాబట్టా?
ఆ కమాండర్ క్రూరుడు, ఉగ్రవాద భావాలు కలవాడు కాబట్టే అతను “యుద్ధం చెయ్యమని, శత్రువులు ఎక్కడ కనపడితే అక్కడ చంపమని” చెప్పాడని అతని గురించి ప్రచారం చెయ్యటం ఎంత అవివేకమో… వాక్యాల అర్థాన్ని, సందర్భాన్ని తప్పించేసి “ఖురాన్ కాఫీర్లను చంపమంటుంది” అని చెప్పటం కూడా అంతే మూర్ఖత్వం అనిపించుకుంటుంది.
కాఫీర్లను చంపేయమని ఖురాన్ చెబుతుందా?
