ఇకనైనా మసీదు, మదర్శాలకు ఆహ్వానిద్దాం!

అవును, ఇకనైనా ముస్లిం సమాజం విస్తృత స్థాయిలో తమ పరిధిలో ఉన్న తమ ముస్లిమేతర మిత్రులను మసీదులు, మదర్శాలకు ఆహ్వానించాలి. అక్కడ ఏమి జరుగుతుందో వారికి పరిచయం చెయ్యాలి.

ఈ పని నేటి ముస్లిం సమాజం చెయ్యకపోవటం వలనే మసీదుల్లో, మదర్శాలలో ఉగ్రవాదం నూరిపోస్తారని, ముస్లిమేతరులపై ఎలా దౌర్జన్యం చెయ్యాలో అక్కడ నేర్పుతుంటారని ఇస్లామోఫోబులు చేస్తున్న విమర్శలు సామాన్యులు కూడా అవును నిజమేనేమో అని నమ్మేంతగా సర్వసామాన్యం అయిపోయాయి.

కానీ మసీదులలో “ఏకేశ్వరోపాసన” మాత్రమే జరుగుతుంటుందని, ఏ విగ్రహం పెట్టకుండా బీద, ధనిక, నల్లవారు, తెల్లవారు అన్న బేదభావాలు లేకుండా అందరూ ఒకే వరుసలో నిలబడి “ప్రత్యక్ష దైవారాధన” అక్కడ చేస్తుంటారని, ఒకనాటి ‘నిరాకారోపాసన (ఏ విగ్రహమూ లేకుండా ఆరాధించే విధానం)’ అయిన ‘వైదిక ఆరాధన’ వంటిదే ముస్లిములు ఏ విగ్రహం లేకుండా అల్లాహ్ ను ఆరాధించే ‘నమాజ్’ విధానం అన్న విషయాన్ని హిందూ మిత్రులను మసీదులకు ఆహ్వానించి తెలియజేయాలి.

బైబిల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యేసులు పరిచయం చేసిన ‘యెహోవా’ దేవుడినే ‘అల్లాహ్’ అన్న పేరుతో ముస్లిములు ఆరాధిస్తుంటారని క్రైస్తవ మిత్రులను మసీదులకు ఆహ్వానించి తెలియజేయాలి.

ఆ ఒక్క దైవాన్ని ఎలా ఆరాధించాలో, ఖురాన్, హదీసుల ప్రకారం ఉత్తమోత్తమ నైతిక విలువలతో ఎలా నడవాలో మదర్శాలలో నేర్పుతుంటారని ముస్లిమేతరులకు చూపించి వారికి ఇస్లాం గురించి స్థానిక భాషలో అవగాహన కల్పించాలి.

అంతేకాక, మసీదు నిర్వాహకులు ముస్లిమేతరులను ఆహ్వానించి మసీదు ప్రాంగణాల్లో ఫ్రీ మెడికల్ క్యాంపులు, ఆన్నదాన కార్యక్రమాలు, విందులు ఏర్పాటు చెయ్యాలి. ముఖ్యంగా ఉన్న మసీదులను అభివృద్ధి చేస్తూనే మసీదులకు కేటాయించబడిన స్థలాలలో మదర్శాలే కాక, ముస్లిం-ముస్లిమేతరుల విద్యార్థులు కలిసి చదువుకునేలా విద్యాసంస్థలను, కాలేజీలను కూడా ఏర్పాటు చెయ్యాలి.

ముస్లిమేతరులను మసీదుకు ఆహ్వానించే బృహత్తర ప్రక్రియను ప్రారంభించింది ఎవరో కాదు స్వయంగా ప్రవక్త ముహమ్మద్(స) వారే! నజ్రాన్ నుండి కొందరు క్రైస్తవులు మదీనాను సందర్శించి మస్జిదే నబవీలో బస చెయ్యటానికి, ప్రార్ధనలు చేసుకోటానికి ఆయన వద్ద అనుమతి కోరతారు. దానికి ప్రవక్త ముహమ్మద్(స) వారికి అనుమతినిస్తారు కూడా. దానికి కారణం ముస్లిమేతరులను మసీదులకు ఆహ్వానిస్తేనే కదా అక్కడ ముస్లిముల ఆరాధనా విధానం ముస్లిమేతరులకు తెలిసేది. వారికి ఏ విగ్రహం లేకుండా ప్రత్యక్షంగా ఆ నిజ దైవాన్ని ఎలా ఆరాధించవచ్చో తెలిసేది. వారికి ఇస్లాంను పరిచయం చెయ్యటం సాధ్యపడేది.

నిజానికి ముస్లిములు, ముస్లిమేతరుల ఐకమత్యానికి వారు ఒకచోట గుమిగూడటానికి మసీదులే వేదికలుగా మారిపోవాలి.
కానీ దృరదృష్టవశాత్తు నేడు మసీదులకు బదులు ‘దర్గా’లు ముస్లిములు, ముస్లిమేతరులు ఒకచోట కలవటానికి వేదికలుగా మారి ఉన్నాయి.

అందుకే నేడు చాలా మంది సామాజిక అభ్యుయదయవాదులు, రచయితలు కొందరు రాజకీయ వేత్తలు “మనం దర్గా కల్చర్ ను కాపాడుకోవాలని, అవి హిందూ-ముస్లిములు ఒక్కచోట కలిసి ప్రార్ధనలు చేసుకోటానికి చక్కటి వేదికలని” చెబుతుంటారు. ఇది సరైన సలహా కాదు.

భారతదేశంలో అజ్మీర్ దర్గా నుండి అమలాపురం కొత్తలంక వలీబాబా దర్గా వరకు అనేక దర్గాలకు పోటెత్తున్న ముస్లిమేతర జనానికి కొదువలేదు. మరోప్రక్క అదే ముస్లిమేతరుల్లో ఇస్లాం పట్ల అనవగాహన, అనేక అపార్థాలు సైతం విపరీతంగా పెరిగిపోతున్నాయనటం అతిశయోక్తి కాదు.

ఎందుకంటే దర్గాలకు వచ్చే ముస్లిమేతరులు వారానికో విగ్రహాన్ని, రోజుకో ఇష్టదైవాన్ని పూజిస్తూ ఏ పుట్టలో ఏ పాముందో అన్న చందంగా ఓసారి దర్గాలకు కూడా వెళ్లొచ్చేస్తే పోలా అన్న మూఢత్వ భావంతోనే వచ్చి పూజలు చేసుకుని హుండిలో డబ్బులు సమర్పించుకుని వెళ్లిపోతుంటారు.

ఆల్రెడీ విగ్రహారాధన చేసే ముస్లిమేతరులతో దర్గాల్లో సమాధి ఆరాధన చేయించటం పెద్ద కష్టతరమైన పనేమీ కాదు. ఎందుకంటే వారితో దర్గాలో ‘సమాధి ఆరాధన’ చేయించటం అన్నది వారు చేసే విగ్రహారాధనకు ప్రత్యామ్నాయమే (Alternative) అవుతుంది తప్ప వారు ఇస్లాంను లోతుగా అర్థం చేసుకోటానికి లేదా నిజ దైవారాధన చెయ్యటానికి అక్కడ ఏమాత్రం అవకాశం ఉండదు.

‘దర్గా కల్చర్’ కాపాడుకోవటం వల్లో, ముస్లిమేతరులు దర్గాలకు రావటం వల్లో వారికి కించిత్తు ఇస్లాం అవగాహన పెరగదు సరికదా వారికి ముందు నుండీ ఉన్న మూఢత్వ విశ్వాసాలను, విగ్రహారాధననే సరికొత్త రీతిలో పరిచయం చెయ్యటం అవుతుంది అంతే.

హిందూ-ముస్లిం ‘ఐక్యత (Unity)’ తప్పనిసరే! కానీ దానికి మూఢత్వ విధానాలు, ధర్మ విరుద్ధమైన బహుదైవారాధనా విధానాలు, ఆచారాలు కేంద్రకాలుగా చేసుకోకూడదు. ప్రస్తుత ముస్లిం సమాజం హిందూ-ముస్లిం ఐక్యతకు అభివృద్ధి చెయ్యాల్సింది ‘దర్గా కల్చర్’ను కాదు, కానీ మస్జిద్, మదర్సా కల్చర్ ను డవలప్ చెయ్యాలి. ముస్లిమేతరుల్ని మనస్ఫూర్తిగా మస్జిద్, మదర్సాలకు ఆహ్వానం పలకాలి. తద్వారా జరిగే లాభాలు…

1. మసీదు, మదర్శాలలో ఎలాంటి ఉన్నత భావాలను, ఉత్తమ నడవడికను, హేతుబద్ధమైన విశ్వాలను, ధర్మాన్ని నేర్పుతుంటారో వారికి తెలుస్తుంది.

2. వారిని మసీదు, మదర్శాలను సందర్శింపజేయటం వల్ల వారికి స్థానిక భాషల్లో ఇస్లాం సందేశాన్ని వివరించటం వల్ల, వారికి కరపత్రాలు, పుస్తకాలు, ఖురాన్ లు పంచటం వల్ల ఇస్లాం పట్ల వారిలో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి.

3. ముస్లిములు ఆరాధిస్తుంది ఎవరినో కాదు “సర్వేశ్వరుడు” “అక్షర పరబ్రహ్మ” “యెహోవా”గా పిలువబడిన దేవుడినే ‘అల్లాహ్’ అన్న పేరుతో ఆరాధిస్తున్నారు అన్న విషయం వారికి అవగాహన అవుతుంది.

4. అన్నిటికంటే ముఖ్యంగా నేడు మీడియాలో మసీదు, మదర్సాల పట్ల చెయ్యబడుతున్న అనేక విమర్శల కారణంగా సామాన్య ముస్లిమేతరుల్లో ఏర్పడి ఉన్న అపార్థాలన్నీ వీగిపోతాయి.

ఇంకా ఇస్లామోఫోబియా కొన్నాళ్లకు తుడిచిపెట్టుకుని పోతుంది. ముఖ్యంగా ముస్లిం-ముస్లిమేతరుల మధ్య ఎన్నటికీ బీటలువారని గట్టి సోదరభావం పెరుగుతుంది.

ఇవన్నీ జరగాలంటే చెయ్యాల్సింది.. ముస్లిములు తమ పరిధిలో ఉన్న ముస్లిమేతరుల కోసం మసీదు, మదర్సాల తలుపులను వారి కోసం తెరవటమే. ఈ విధంగా Visit my mosque పేరుతో కొందరు ముస్లిములు ఈ పనిని ప్రారంభించారు. కానీ విస్తృత స్థాయిలో దేశవ్యాప్తంగానే కాక, ప్రపంచవ్యాప్తంగా ఈ పని ముస్లిం సంఘాలన్నీ చెయ్యాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *