స్వమత సంస్కరణే ఇస్లాం స్వీకరణ అంటే

ప్రపంచంలో పుట్టే ప్రతీ మనిషి ఏదో ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటూ తనకు నచ్చిన మతాన్ని అనుసరిస్తుంటాడు. చివరకు ఏ దేవుడూ లేడన్న విశ్వాసాన్ని కలిగి ఉండే నాస్తికులు సైతం “దేవుడు లేడని నమ్మే విశ్వాసులు”గానే పరిగణించబడతారు.

ఈ విధంగా అనేక నమ్మకాలు, విశ్వాసాలు, మతాలున్న నేపథ్యంలో కొందరు స్వమతాన్ని విడిచిపెట్టి వేరే మతాలను స్వీకరించేవారిని చూడగలం. ఉదాహరణకు కొందరు బుద్ధిజాన్ని స్వీకరిస్తుంటారు. మరికొందరు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తుంటారు. ‘ఘర్ వాపసీ’ అన్న పేరుతో ఈ మధ్య కొందరు హిందూ మతాన్ని కూడా స్వీకరిస్తున్నారు. అలాగే చాలామంది ఇస్లాం స్వీకరిస్తుంటారు.

కొన్ని గణాంకాల ప్రకారం నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా స్వీకరించబడుతున్న ధర్మం ఇస్లాం అని తెలుస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో అసలు ఇస్లాం స్వీకరించటం అంటే ఏమిటి? అన్నది తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది.

ఇస్లాం అంటే..!?

ఇస్లాం అంటే చాలా మందికి తెలిసిందల్లా అది పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం అరేబియాలో ప్రవక్త ముహమ్మద్(స) స్థాపించిన ధర్మం అన్నది! నిజానికి ఈ భావన నూటికి నూరు శాతం తప్పు అని చెప్పవచ్చు.

ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్(స) ‘ఇస్లాం పునః స్థాపకుడే’ తప్ప ‘వ్యవస్థాపకుడు’ ఎంతమాత్రం కాదు. అదెలాగన్నది తెలియాలంటే సంక్షిప్తంగా ఇస్లాం అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సృష్టికి ఒకేఒక్క దైవం ఉన్నాడని గ్రహించి ఆయన ఆదేశాలకు లోబడిపోవటమే ఇస్లాం అంటే. అనేక మంది మహనీయులైన రాముడు, కృష్ణుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే, యేసు, ముహమ్మద్(స) వగైరా సకల రుషులూ, ప్రవక్తలను దైవాలుగానో, దైవాంశ సంభూతులుగానో నమ్మక వారిని ఆదర్శ పురుషులుగా,ప్రవక్తలుగా నమ్ముతూ వారంతా కలిసి అనేక పేర్లతో పరిచయం చేసిన ఒకే ఒక్క దైవాన్ని నమ్ముతూ నైతికంగా జీవిస్తూ మంచి పనులు చెయ్యటమే ఇస్లాం అంటే.

దీనిని బట్టి అన్ని కాలాల్లోనూ సకల మహనీయులు, రుషులు, ప్రవక్తలూ బోధించిన “ఏక దైవారాధన ధర్మం” ఇస్లామే అని చెప్పవచ్చు. “దేవుడు ఒక్కడే రుషులు ఆయనను అనేక పేర్లతో పిలిచారు” అని వేదం చెబుతుంది. దాని ప్రకారం కొందరు రుషులు స్వర్వేశ్వరుడని, కొందరు ప్రవక్తలు హెబ్రూ భాషలో యెహోవా అని, అరబ్బీలో అల్లాహ్ అని ఒకే ఒక్క అస్తిత్వాన్ని పరిచయం చెయ్యటం జరిగింది.

ఆ విధంగా ఏక దైవారాధనా విధానాన్ని బోధించే ఒకనాటి వైదిక ధర్మమే అరబ్బీలో ఇస్లాం అని పిలువబడింది. తన సువార్తలో యేసు “దేవుడు ఒక్కడే” అన్న విషయాన్ని బోధించారు. అలాగే యేసు, ఆయనకంటే ముందు వచ్చిన మోషే, ఇస్సాకు, యాకోబు, అబ్రాహాం, నోవహ్, ఆదామ్ వగైరా సకల ప్రవక్తలంతా బోధించిన “ఏక దైవారాధనా విధానం” ఇస్లామే!

గత ప్రవక్తలంతా పరంపరగా బోధిస్తూ వచ్చిన “ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు” అన్న విశ్వాసాన్నే ఇస్లాం పేరుతో చివరిగా ప్రవక్త ముహమ్మద్ (స) పునః స్థాపించటం జరిగింది. కాబట్టి ప్రవక్త ముహమ్మద్(స) ను ఇస్లాం పునః స్థాపకుడు అని మాత్రమే చెప్పాలి.

కాలక్రమేణా దైవిక విశ్వాసాల్లో తమ స్వకల్పిత విశ్వాసాలను ప్రవేశపెట్టి మతాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చుకున్న కొందరు వంచకులు మత బోధకులు, పండితుల రూపంలో బయలుదేరారు. వారే ‘పవిత్ర ఏకదేవుని ఆరాధన’ నేర్పే ‘వైదిక ధర్మం’లో ‘అనేక దైవాల ఆరాధన’ను ప్రవేశపెట్టారు.

‘దేవుడు ఒక్కడే’ అని బోధించిన యేసు సువార్తలో ‘అపరిశుద్ధ అన్య త్రిత్వదైవాల ఆరాధన’ను కుట్ర పూరితంగా చొప్పించారు. ‘అల్లాహ్ ఒక్కడే దేవుడ’న్న విశ్వాసం కలిగి ఉండే ముస్లిం సమాజంలో ‘సమాధి ఆరాధన’ను ప్రవేశ పెట్టారు. ఈ విధంగా ధర్మ శాస్త్రాలు బోధిస్తున్న శాస్త్రీయ ధర్మానికి దగ్గరగా ఉండే స్వకల్పిత విశ్వాసాలతో కొందరు వంచకులు ‘మూఢత్వ మత వ్యవస్థ’ను రూపొందించారు.

వారిని విగ్రహారాధనను ఖండించే వేద మంత్రోచ్ఛారణ వెలుగులో విగ్రహ ప్రతిష్ట చెయ్యాలని బోధించే పండితుల రూపంలో చూడవచ్చు. దేవుడు అద్వితీయుడని రాసున్న బైబిల్ చేతపట్టి త్రిత్వాన్ని బోధించే క్రైస్తవ బోధకుల రూపంలో వారిని చూడవచ్చు. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడని రాసున్న ఖురాన్ గ్రంథాన్నిచేతపట్టి సమాధి/వలియల్లాల ఆరాధనలు నేర్పే కొందరు ముస్లిం మత గురువుల రూపంలో చూడవచ్చు.

ఇంతకూ ఇస్లాం స్వీకరించటం అంటే ఏమిటి?

ఒక వ్యక్తి అజ్ఞానంతో తాను అప్పటివరకూ చేస్తూ వచ్చిన అనేక దైవాల ఆరాధనను, సృష్టితాల ఆరాధనను విడిచిపెట్టి ఈ విశ్వాన్నంతటికీ ఒకే సృష్టికర్త ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించి తన విశ్వాసాన్ని సంస్కరించుకోవటమే ఇస్లాం స్వీకరించటమంటే!

ఆ విధంగా ఒక హిందువైతే విశ్వాన్నంతటికీ ఒకే సృష్టికర్త ఉన్నాడు అన్న విషయాన్ని బోధిస్తున్న వేదోపనిషత్తుల సారాన్ని గ్రహించి బహుదైవాల ఆరాధన నుండి ఏక దైవారాధనా ధర్మమైన ‘వైదిక ధర్మాన్ని’ అతను అనుసరించాలి. పుట్టి చనిపోయే మనుషులను, జంతువులను, చెట్లను పుట్లను పూజించకుండా ఒకే సృష్టికర్త ఆరాధన చెయ్యటం మొదలెట్టాలి. అలా వేదసారమైన ఏకదేవుని ఆరాధనా విధానాన్ని అంగీకరించటమే ఇస్లాం స్వీకరించటమంటే.

అదే క్రైస్తవుడైతే త్రిత్వ సిద్ధాంతాన్ని విడిచిపెట్టి బైబిల్ బోధిస్తున్న ‘ఏక దైవారాధనా విధానాన్ని’ అనుసరించాలి. స్వయంగా సృష్టికర్త అయిన దేవుణ్ణి పరిచయం చెయ్యటానికి వచ్చిన యేసునే రివర్సులో దేవుడని ఊహించేసుకుని ఆయన్ని పూజించకుండా ఆయన పరిచయం చేసిన ఏకైక దేవుణ్ణి ఆరాధించాలి. అలా బైబిల్ సారమైన ఏకదేవుని ఆరాధనా విధానాన్ని అంగీకరించటమే ఇస్లాం స్వీకరించటమంటే అంటే.

అదే ఒక నాస్తికుడైతే నాకు కనబడలేదు కాబట్టి ఏ సృష్టికర్తా లేడని గుడ్డిగా కొట్టిపరేయ్యక విశ్వం అనే ఇంతపెద్ద కర్మాగారం వెనుక ఎవరూ లేకుండా ఎంతో క్రమబద్ధతతో నడవటం అసాధ్యమని బుద్ధిని ఉపయోగించి మొత్తానికి ఈ విశ్వం వెనుక ఏదో ఒక శక్తి ఉండి ఉండాల్సిందే అన్న విషయాన్ని గ్రహించటమే ఇస్లాం స్వీకరించటమంటే!

అదే ముస్లిముల్లో కొందరు తెలుసుకోవలసింది- ఒక్క అల్లాహ్ కు తప్ప సృష్టిలో దేనికీ/ఎవరికీ మంచీ చెడులు చేసే దైవత్వపు శక్తి కలిగి ఉండదన్న విషయాన్ని గ్రహించి నిజ ముస్లిములుగా మారాలన్నది. ఈ విధమైన వాస్తవ దైవిక భావనను కలిగి ఉండటమే ఇస్లాం స్వీకరించటమంటే!

అలాంటి వాస్తవ దైవిక భావన కలిగి ఉండే హిందువైనా, క్రైస్తవుడైనా ఇంకెవరైనా సరే అతను ముస్లిం (అంటే ఏకైక దేవుని విధేయుడు) గానే పరిగణించబడతాడు.

ఇక్కడ తెలుసుకోవలసింది ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకుని ముస్లిం ఇళ్లలో పుట్టి ఖురాన్ ఆదేశాలకు భిన్నంగా ప్రవర్తించే సోకాల్డ్ ముస్లిములు సైతం ఇస్లాంకు వెలుపల ఉన్నట్లే! ఉదాహరణకు తోటి వ్యక్తులను అన్యాయంగా చంపకూడదని బోధించే ఖురాన్ చదువుతూ టెర్రరిజం చేసే కొందరు ఉన్మాదులు చూడ్డానికి ముస్లిములుగా కనపడినప్పటికీ వారు నిజానికి ఇస్లాం వ్యతిరేకులు. ఒక్క అల్లాహ్ ను తప్ప దేన్నీ/ఎవరినీ ఆరాధించకూడదని ఖురాన్ బోధిస్తున్నప్పటికీ వలియల్లాల ముందు మోకరిల్లేవారు, షియా, ఖాదియానీ వర్గీయులు అంతా సోకాల్డ్ ముస్లిములుగానే పరిగణించబడతారు. అలాంటి ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకున్నవారంతా ఖురాన్ అర్థం చేసుకున్నప్పుడు వారు ఇస్లాం స్వీకరించిన వారవుతారు.

కాబట్టి ఇస్లాం స్వీకరించటమంటే ఉన్న మతాన్ని విడిచిపెట్టి వేరే కొత్త మతాన్ని స్వీకరించటం కాదు స్వమతంలో తాను అనుసరిస్తూ వస్తున్న ‘బహుదైవాల ఆరాధనా’ విధానాన్ని ధార్మిక గ్రంథాల వెలుగులో సంస్కరించుకుని ‘ఏక దైవారాధనా విధానాన్ని’ అనుసరించటమే ఇస్లాం స్వీకరించమంటే! ఈ విధంగా చేసుకునే ‘స్వమత సంస్కరణే ఇస్లాం స్వీకరణ’ అంటే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *