ఇస్లాం మహిళలను అణచివేస్తుంది..
ఇస్లాం మహిళల పట్ల వివక్ష చూపుతుంది వారి స్వీచ్చను హరించివేస్తుంది..
ఇస్లాం స్త్రీలకు పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించటం లేదు..
ఇస్లాం స్త్రీలను విద్య, వైజ్ఞానిక రంగాల్లో అభివృద్ధి చెందనివ్వటం లేదు..
ఇస్లాం మహిళలను కొన్ని పరిమితుల్లో బంధించి వ్యక్తిగత, సామాజిక జీవనంలో ఎదగనివ్వటం లేదు.. వగైరా ఎన్నో అపోహలను, అబద్ధాలనూ సర్వసామాన్యం చెయ్యటం వెనుక ఇస్లామోఫోబుల తాలూకు ఎంతో శ్రమ, కృషి ఉందనటం ఏమాత్రం అతిశయోక్తి కాదేమో!
అబద్ధం నాలుగ్గోడల మధ్య కూర్చున్న కొందరు ఆజ్ఞానుల ద్వారా అల్లబడుతుంది. అది వారికున్న ద్వేషం ద్వారా ప్రజల్లో వ్యాపిస్తుంది. కానీ వాస్తవం వేరేగా ఉంటుంది.
వాస్తవం ఏమిటంటే ప్రపంచంలో మహిళల ద్వారా అత్యధికంగా అంగీకరించబడుతున్న ధర్మం ఒకటుంది! అదేమిటో తెలుసా? ఇస్లాం!
****
నిజంగా నేడు కొందరు కరుడుకట్టిన ఇస్లామోఫోబులు ప్రచారం చేస్తున్నట్టు “ఇస్లాం స్త్రీలను అణచివేసే, వారి స్వేచ్ఛను హరించివేసే ధర్మం” అన్న విమర్శే నిజమైతే ప్రపంచంలో మహిళల ద్వారా అత్యధికంగా ద్వేషించబడే ధర్మం ఇస్లామే అయి ఉండాలి. కానీ దానికి పూర్తి భిన్నంగా యూరప్ దేశాలు, అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇస్లాం స్వీకరిస్తున్న వారిలో అత్యధికంగా విద్యావంతులైన ఆధునిక మహిళలే ఉన్నారన్న విషయం ఎంత మందికి తెలుసు?
అవి బలవంతపు మత మార్పిళ్లా?
‘ప్యూ రెసెర్చ్ సెంటర్’ చేసిన రీసెర్చ్ ప్రకారం US లో అత్యంత వేగంగా అమెరికన్లు ఇస్లాం స్వీకరిస్తున్నారు. ఎంత అంటే 2000 నుండి 2010 మధ్య కాలంలో 1 మిలియన్ నుండి 2.6 మిలియన్ల ముస్లిములు పెరిగారు. ‘ద కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్’ చేసిన సర్వే ప్రకారం అమెరికాలో ప్రతీ సంవత్సరం 20,000 మంది ఇస్లాం స్వీకరిస్తుంటే అందులో అత్యధిక శాతం మంది మహిళలున్నారని చెప్పటం జరిగింది. పాశ్చాత్య దేశాల్లో, అగ్రరాజ్యాల్లో అతి వేగంగా ఇస్లాం స్వీకరించటానికి కారణం వారిని బలవంత పెట్టటమో, ప్రలోభ పెట్టటమో కాదు.
మరి కారణం ఏమిటి?
యునైటెడ్ స్టేట్స్ లో సెప్టెంబర్ 11, 2001 న ట్విన్ టవర్స్ పై దాడులు జరిగిన అనంతరం అత్యధిక శాతం అమెరికన్ క్రైస్తవులు, యూదులు ఇస్లాం స్వీకరించటం ప్రారంభించారు. ఎందుకు అంటే అప్పటివరకు ఇస్లాం అంటే పెద్దగా పరిచయం లేని అమెరికన్స్ కు ఇస్లామోఫోబులు తమ విమర్శల ద్వారా వారికి ఇస్లాంను పరిచయం చెయ్యటమే!
ట్విన్ టవర్స్ కూల్చివేత సంఘటన తరువాత ఇస్లాంపై మీడియా, ఇస్లామోఫోబులు కలిసికట్టుగా లేవనెత్తిన విపరీతమైన విమర్శలు, ప్రదర్శించిన ద్వేషం చాలా మంది అమెరికన్స్ ను ఇస్లాంను అధ్యయనం చేసే దిశగా తీసుకెళ్లింది.
ఆ అధ్యయనం ద్వారా వారు ఖురాన్ లో రాయబడి ఉన్న ఇస్లాంకు, ముస్లిం పేర్లు పెట్టుకుని కొందరు చేస్తున్న టెర్రరిజానికి సంబంధంలేదని, ఇస్లాం ఒక శాంతియుత జీవన విధానాన్ని నేర్పుతుందన్న విషయాన్ని తెలుసుకున్నారు. పైగా ఇస్లాం స్త్రీలకు కల్పిస్తున్న హక్కులు, ఉన్నత గౌరవానికి అక్కడి చాలా మంది స్త్రీలు ఆకర్షింపబడి పురుషుల కంటే స్త్రీలు అత్యధికంగా ఇస్లాంను స్వీకరించటం ప్రారంభించారు.
అనుమానం ఉన్నవారు “Millions in the U.S. converted to Islam after 9/11” అని యూట్యూబ్ లో టైప్ చేస్తే కొన్ని వందల మంది ఇస్లాం స్వీకరించిన మహిళలకు సంబంధించిన వీడియోలు చూడవచ్చు.
పైగా పాశ్చాత్య దేశాల్లో, అగ్రరాజ్యాల్లో ఆధునిక మహిళలు అత్యధికంగా ఇస్లాం స్వీకరించటం చాలా మందికి ఆశ్చర్యానికి గురిచేసింది.
అనేక విమర్శలున్నప్పటికీ కూడా ముఖ్యంగా మహిళలు ఎందుకు ఇస్లాంను స్వీకరిస్తున్నారు? ఏ విషయం వారిని ఆకర్షిస్తుంది? అన్నది నిజానికి సామాన్య విషయం కాదు. కాబట్టే ఈ విషయంపై కొందరు చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు ఒక సర్వే సైతం నిర్వహించటం జరిగింది.
స్వయంగా ఇస్లాం స్వీకరించిన ఎందరో యూరప్, అమెరికన్, బ్రిటన్, ఆఫ్రికా దేశాల మహిళలతో స్వయంగా మాట్లాడి వారు ఇస్లాం స్వీకరించటానికి గల కారణాలు, వారి జీవితానుభవాలను క్రోడీకరించి పుస్తకాల రూపంలో సైతం తేవటం జరిగింది.
వాటిలో చదవాల్సిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు 1. “Why Women are accepting Islam?” 2. “Women Embracing Islam: Gender and Conversion in the west” 3. Becoming Muslim: Western Women’s Conversions to Islam” 4. “Daughters of another path: Experience of American women choosing Islam”
ఒక ప్రక్క ఇస్లాం స్త్రీలను అణచివేస్తుందని, వారి స్వేచ్ఛను హరించివేస్తుందని అనేక విమర్శలున్న నేపథ్యంలో కూడా యూరపియన్ దేశాలు, అమెరికా, స్వీడన్, దక్షిణాఫ్రికా, బ్రిటన్ వగైరా దేశాల్లో ఒక ప్రక్క క్రైస్తవం మరో ప్రక్క లౌకిక వాదాలకు అతీతంగా ఇస్లాంలో ఏ విషయం అంతమంది మహిళలను ఆకర్షిస్తుంది? ఆయా దేశాల్లో అత్యధికశాతం మహిళలు ఇస్లాంను స్వీకరించటం ద్వారా పొందుతున్న ప్రయోజనాలేమిటి? వగైరా ఎన్నో అంశాలకు సంబంధించిన సమాహారమే పై పుస్తకాలన్నీ. ఆశక్తి ఉన్నవారు అమెజాన్ లో ఈ పుస్తకాలను కొనవచ్చు మరియు ఈ పుస్తకాల సంక్షిప్త సమాచారాన్ని చదవవచ్చు కూడా.
ఒకప్రక్క హిజాబ్ అణచివేతకు గుర్తని, ఇస్లాం స్త్రీ స్వేచ్ఛను అణచివేస్తుందని మీడియా విమర్శలు, మరోప్రక్క సోకాల్డ్ ఇస్లామిక్ దేశమైన ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసనల మధ్య ఫ్రెంచ్ మోడల్ మరియు ప్రఖ్యాత టీవీ స్టార్ అయిన ‘మరైన్ ఎల్ హిమర్’ తాను ఇస్లాంను స్వీకరిస్తున్నానని ప్రకటించటమే కాక ఆమె హిజాబ్ లో హజ్ కు వెళ్లి తాను ఇస్లాం స్వీకరించాక తాను ఎనలేని ఆనందాన్ని, గొప్ప అనుభూతిని పొందుతున్నానని చెప్పటం మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇస్లాంలో ఏ విషయం వారిని ఆకర్షించింది?
స్త్రీ అంటే కించిత్తు గౌరవం లేని, చివరకు అమ్మాయి పుడితే సజీవంగా పూడ్చిపెట్టేస్తూ, ఆడవాళ్లంటే అంగట్లో ఆటవస్తువుగా భావిస్తూ, వారిని నీచంగా చూస్తూ వారికి ఎలాంటి హక్కులు కానీ, గౌరవం కానీ కల్పించని ఓ అనాగరిక జాతిలో నుండి ప్రవక్తగా ఎన్నుకోబడిన ముహమ్మద్(స) ఆ జాతి ప్రజలను కేవలం ఇరవై మూడేళ్లలో అమ్మాయి పుట్టుకను ఎంతో అదృష్టంగా భావించేవారిగా, పరస్త్రీ వైపు చెడు దృష్టితో చూడటమే పాపంగా భావించేవారిగా, తమ తల్లి, భార్య, తోబొట్టువుల పట్ల, పరాయి స్త్రీల పట్ల ఎంతో గౌరవ మర్యాదలతో మెలిగేవారిగా ప్రపంచానికి ఉన్నత నాగరికత నేర్పే గురువులుగా మార్చివేయటమే కాక, ఇస్లాం స్త్రీలకు ఆస్తి హక్కును, విడాకుల హక్కును, పురుషులతో సమానంగా చట్టబద్ధమైన సకల హక్కులను ఆనాడే కల్పించటం జరిగిందన్న వాస్తవాలను వారు చదివి తెలుసుకోవటమే!
తల్లి పాదాల క్రింద స్వర్గం ఉందని, ఆడపిల్లలను చదువూ-సంస్కారాలు నేర్పి వారికి వివాహం జరిపించే తండ్రులకు స్వర్గంలో అత్యుత్తమ స్థానం లభిస్తుందన్న శుభవార్తను చెప్పటమే కాక, స్త్రీల నుండి కట్నకానుకలను తీసుకోవటాన్ని నిషేధించి, పైగా వారిని వివాహం చేసుకొదలిస్తే వారికి ఎంతోకొంత ధనాన్ని బహుమానంగా ఇచ్చి సులువైన పద్ధతిలో వివాహం చేసుకునే ఉత్తమ పద్దతిని నేర్పి సమాజంలో స్త్రీ యొక్క స్థానం ఎంత ఉన్నతమైనదో తెలియజేశారన్న విషయాన్ని చదివి గ్రహించటమే.
వ్యభిచారాన్ని నిషేధించి, వివాహాలను సులభతరం చేస్తూ ఒక సుందర సమాజాన్ని 1400 సం.ల క్రితమే ప్రవక్త ముహమ్మద్(స) నిర్మించటం జరిగింది. అది నేడు నైతికంగా దిగజారిపోతున్న సమాజాలకు భిన్నమైన ఉత్తమ సమాజం. ఇది ఇస్లాం విమర్శకులకు సైతం ఆకర్షించిన విషయం.
అయినప్పటికీ, స్త్రీ, పురుషుల సమాన హక్కుల గురించి, సమ న్యాయం గురించి ఎన్నో బోధలు ఇస్లాంలో ఉన్నప్పటికీ నేటి కొందరు సోకాల్డ్ స్త్రీ జనోద్ధారకులు, అభ్యుదయవాదులు ఇస్లాం పట్ల అనేక విమర్శలు లెవనెత్తటానికి రెండు మౌలిక కారణాలున్నాయి. అవి. 1. వారు ఇస్లాంను ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ (స) బోధల ఆధారంగా అధ్యయనం చెయ్యకపోవటం.
‘అమెరికన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్’ కోర్టు కు చెందిన ప్రముఖ జడ్జ్ ‘Pierre Crabites’ తాను రాసిన ‘Things Muhammad did for women’ అన్న ఆర్టికల్లో “ముహమ్మద్ నిస్సందేహంగా మహిళా హక్కులను సాధించిన గొప్ప విజేత (Champion of women rights). ఇస్లాం మహిళలకు ఆస్తిహక్కును కల్పిస్తుంది మరియు పురుషులతో సమానంగా చట్టపరమైన సమానాత్వాన్నీ ఇస్తుంది. ఆమె తన ఆస్తిని తనకిష్టం వచ్చినట్టు ఖర్చుపెట్టుకునే స్వేచ్ఛను ప్రసాదిస్తుంది” అని పేర్కొనటం జరిగింది.
ఇస్లాం స్త్రీల గురించి, స్త్రీ పురుషుల సమాన హక్కుల గురించి చెబుతున్న కొన్ని ముఖ్యమైన విషయాలు గమనిద్దాం.
“మీ భార్యలతో సద్భావంతో జీవితం గడపండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే, బహుశా మీకు ఒక వస్తువు నచ్చకపోవచ్చు కానీ, అందులోనే దేవుడు ఎంతో మేలు పెట్టి ఉండవచ్చు” – ఖుర్ఆన్ 4:19
“నిశ్చయంగా స్త్రీలు పురుషులు సమాన భాగాలు” [తిర్మిజి 113]
“పురుషులకు మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా పురుషులపై వున్నాయి. కానీ పురుషులకు స్త్రీలపై కొంచెం ఆధిక్యత ఉంది” – ఖుర్‌ఆన్ 2:228
”మీ కొరకు (స్త్రీ పురుషులిరువురికీ) సమ న్యాయం నిర్ణయించడం జరిగింది.” -ఖుర్‌ఆన్-2: 178
