ఏ జీవికీ లేని మరియు మనిషికి మాత్రమే ఉన్న ఒక అద్వితీయమైన ప్రత్యేకత ఏమిటంటే- మనిషి తనకు అందుబాటులో ఉన్న కొన్ని ప్రత్యక్ష ప్రమాణాల ఆధారంగా పరిశీలన, ప్రయోగాలు చేసి వాటి ఫలితాల ద్వారా “పరోక్షం”గా ఉన్నవాటి స్థితిగతులను అంచనా వెయ్యగలడు.
ఉదాహరణకు అద్భుతమైన బిల్డింగ్ నిర్మాణాన్ని బట్టి దాని ఇంజినీర్ ఎంత గొప్ప నైపుణ్యం కలవాడో అతన్ని చూడకపోయినా అంచనా వెయ్యగలడు. అతనికి త్రవ్వకాల్లో దొరికే కొన్ని వస్తువులను బట్టి అక్కడ ఎలాంటి జాతి ప్రజలు నివసించేవారో కచ్చితంగా అంచనాకట్టి చెప్పగలడు. ఒక గొప్ప ప్రాచీన కళాఖండాన్ని చూసి దాని చిత్రకారుడు ఎంత నైపుణ్యం కలవాడో కూడా అతన్ని కళ్లతో చూడకుండానే అంచనా వెయ్యగలడు.
కాకపోతే పొగరావాలన్నా ‘నిప్పు’ అన్నది కనపడినా, కనపడకపోయినా కచ్చితంగా ఎక్కడో చోట ఉండి తీరాల్సిందే అన్న కనీస లాజిక్ ను ప్రక్కన పెట్టేసి, నిర్దిష్టమైన గణిత సూత్రాలతో, సమతుల్యత, క్రమబద్ధతతో నడుపబడుతున్న విశ్వంలో అనేక గ్రహాలూ, భూమీ దానిపై అనేక జీవులూ, గొప్ప మేధస్సు కలిగిన మనిషి వరకు ఏ సృష్టికర్తా లేకుండానే వాటికవే ఉనికిలోకొచ్చేశాయని హేతువిరుద్ధంగా తీర్మానించటాన్నే హేతువాదం అంటారనే గమ్మత్తైన ఫిలాసఫీ మాట్లాడేవారు కూడా కొందరున్నారు.
గొర్రెలు కాచుకునే కాపరైనా “నిప్పు లేనిదే పొగరాదు” అనే చెబుతాడు. పొగరావటానికి నిప్పు ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పటం ఎలాంటిదో విశ్వం ఉనికిలోనికి రావటానికి సృష్టికర్త అవసరం లేదని చెప్పటం కూడా అచ్చం అలాంటిదే అవుతుంది.
స్మార్ట్ ఫోన్లు, సూపర్ స్పీడ్ కంప్యూటర్ల నుండి రాకెట్ల వరకు దేన్నైనా సృష్టించగలిగే మేధస్సు కలిగిన మనిషి ఉనికిలో ఉండటమే అతనిని ఉనికిలోకి తెచ్చిన మరొక అద్భుతమైన మేధస్సు కలిగిన సృష్టికర్త ఉనికిలో ఉన్నాడనటానికి గుర్తు.
అంతరాత్మ ఏమని సాక్ష్యామిస్తుంది?
అతి సుక్ష్మాతి సూక్ష్మమైన అణువు నుండి బ్రహ్మాండం వరకు చివరకు ఆకు అంతర్నిర్మాణం నుండి మనిషి శరీర నిర్మాణం వరకు విశ్వంలో ఆయా వ్యవస్థలను వాటి పనితీరును గమనిస్తే వాటి వెనుక ఒక అద్భుతమైన ఇంజినీరింగ్, గొప్ప టెక్నాలజీ కనపడుతుంది. అవన్నీ పరిశీలించినప్పుడు సహజ సిద్ధంగానే మనిషి అంతరాత్మ ఇచ్చే సాక్ష్యం “ఇలాంటి అద్భుతాలను ఉనికిలోకి తేవటం వెనుక గొప్ప మేధస్సు కలిగిన ఏదో ఒక మహా శక్తి కచ్చితంగా ఉనికిలో ఉండి తీరాల్సిందే” అన్నది!
ఆ శక్తి ఉనికిలో ఉంటే కనిపించవచ్చు కదా!
అనేక జీవుల్ని ఉనికిలోకి తెచ్చిన సృష్టికర్త మనిషిని రెండు కాళ్లపై నడిచే జంతువు మాదిరిగా తయారు చెయ్యదలుచుకోలేదు. అతనికి బుద్ధీ, విచక్షణా జ్ఞానాలను అదనంగా ఇచ్చి జంతువుల నుండి వేరుగా ప్రత్యేక జీవులుగా తయారు చెయ్యదలిచాడు.
నిప్పు లేనిదే పొగరాదనే కనీస ఇంగిత జ్ఞానాన్ని అతనికి ప్రసాదించి తన ముందున్న అద్భుతమైన సృష్టిని కళ్లు తెరచి చూసి దానివెనుక మహా నిపుణుడైన ఒక సృష్టికర్త ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోమంటున్నాడు.
నేనొచ్చి మీ కళ్ల ముందు ప్రత్యక్షమవటానికి మీరు జంతువులు కారు కాబట్టి మీ ముందున్న అద్భుతమైన సృష్టిని బుద్ధీ, జ్ఞానాలను ఉపయోగించి పరిశీలన, ప్రయోగాల ఆధారంగా తన శక్తి-సామర్థ్యాలను గుర్తించమంటున్నాడు.
“భూమిపై తిరగండి ఆయన సృష్టిని ఏ విధంగా ప్రారంభించాడో చూడండి” – ఖురాన్ 29:20
నిప్పు లేనిదే పొగరాదు! సృష్టికర్త లేనిదే సృష్టి ఉండదు!
