అల్-ఖైదా, ఐ.ఎస్.ఐ.ఎస్, లష్కరే తోయిబా, జైషే ముహమ్మద్, తాలిబాన్ వగైరా సంస్థల లక్ష్యం ఏమిటి? ఈ ప్రశ్నకు ఇస్లామోఫోబియాను పెంచిపోషించే మీడియా ప్రభావానికి గురైన ఏ సామాన్య ముస్లిమేతరులైనా ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చే సమాధానం- ఈ ర్యాడికల్ గ్రూప్స్ యొక్క లక్ష్యం ‘జిహాద్’ చేసి (అంటే వారి ఉద్దేశంలో టెర్రరిజం చేసి) ఇస్లాంను స్థాపించటమే అన్నది.
ఈ విధంగా అమెరికా, యూరప్, ఇస్రాయీల్ దేశాల పెంపుడు కుక్కలైన ఈ ఉగ్రవాద సంస్థలన్నీ ముస్లిముల ద్వారా నడుపబడుతుంటాయని, వాళ్లు చేసే ఉగ్రవాదాన్నే ‘జిహాద్’ అంటారని, వారినే జిహాదీలంటారనే చాలా పెద్ద అపోహ ముస్లిమేతర వర్గాల్లో ఏర్పడిపోయింది. ఇదే నేటి ఇస్లామోఫోబులకు “ఇస్లాం అంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపించే మతం అని, వారు చేసే తీవ్రవాదానికి కారణం ఖురాన్ ఆదేశాలే” అని పనికిమాలిన విమర్శలు చెయ్యటానికి అడ్వాంటేజ్ గా మారిపోయింది.
“ఇస్లామిక్ జిహాద్” అంటే టెర్రరిజమా?
ఒక్క మాటలో చెప్పాలంటే “మనిషి చెడు తలంపులతో పోరాడటాన్ని, సమాజంలో చెడు నిర్మూలనకు చేసే ప్రయత్నాన్నే “ఇస్లామిక్ జిహాద్” అంటారు. పూర్తి ఖురాన్ లో “జిహాద్” అనే పదం నాలుగు సార్లు కనపడుతుంది. ఆ నాలుగు సందర్భాల్లోనూ “తీవ్రమైన కృషి” “ప్రయత్నం” అణచివేతకు, అన్యాయానికి వ్యతిరేకంగా చేసే “ధర్మపోరాటం” అన్న అర్థాల్లోనే తప్పా ఎక్కడా కూడా ఈ పదం “ఉగ్రవాదం” లేదా “తీవ్రవాదం” అన్న అర్థాలలో వాడబడలేదు. పైగా “జిహాద్” దృక్పథానికి వ్యతిరేక పదం “టెర్రరిజం”
“జిహాద్” కు వ్యతిరేకపదం ఉగ్రవాదం” లేదా “టెర్రరిజం!”
“జిహాద్” అన్న అరబీ భాషా పదానికి ధాతువు జ.హ.దా. అంటే దానర్థం- “శ్రమించటం (To struggle)” “కృషి చెయ్యటం (To strive)” మాత్రమే! “టెర్రరిజం (Terrorism)” అన్న పదాన్ని అరబ్బీలో “ఇర్హాబ్ (إرهاب) అంటారు తప్పితే “జిహాద్” అనరు. అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చెయ్యటం (Terrorize) అన్న మాట! అలాగే “టెర్రరిస్ట్ లేక ఉగ్రవాది (Terrorist)” అన్న పదాన్ని అరబ్బీలో “ఇర్హాబి”(إرهابي) అంటారు తప్పితే జిహాదీ అనరు.
ప్రవక్త ముహమ్మద్(స) చెయ్యమంటున్న అత్యుత్తమ ‘జిహాద్’
“ఏ వ్యక్తి అయితే దైవం కొరకు తన హృదయంలో మెదిలే చెడులతో పోరాడతాడో అతడే వాస్తవంగా జిహాద్ చేసిన వాడు” – సహీహ్, ఇబ్నె హిబ్బన్ 4862
*****
మరి టెర్రరిజం చేస్తున్న ‘ఉగ్రవాదులు’ ‘జిహాదీలు’ కారా?
అల్- ఖైదా, ఐ.ఎస్.ఐ.ఎస్ వగైరా ఉగ్రవాదుల సంస్థల్లో టోపీలు గెడ్డాలు పెట్టుకుని, ఉర్దూ/అరబిక్ పేర్లను తగిలించుకుని ముస్లిం వేషాల్లో ఉండే సోకాల్డ్ ముస్లిములను చూసి వారిని ఖురాన్ ను అనుసరించే ముస్లిములేనని భావించటం ఎటువంటిదంటే.. దూరం నుండి కంచర గాడిదలను చూసి అరేబియన్ గుర్రాలని అపార్థం చేసుకోవటం లాంటిదన్నమాట!
ఈ ఉగ్రవాదుల దాడుల్లో బాధితులు అధికశాతం ముస్లిములే!
“National Consortium for the Study of Terrorism and Responses to Terrorism (START)“. అన్నది ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం, టెర్రరిస్టు సంఘటనలపై పరిశోధన చేసే సంస్థ. ఇది యునైటెడ్ స్టేట్స్ లో ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్’లో ప్రపంచంలోని 1970 నుండి జరిగిన దాదాపు 125000 తీవ్రవాద సంఘటనల తాలూకు అత్యంత సమగ్రమైన డేటా బేస్ ను సేకరించి తీవ్రవాదంపై పరిశోధన చేస్తున్న సంస్థ. పరిశోధించి తయారు చేసిన నివేదిక ప్రకారం- “ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉగ్రవాద దాడుల్లో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్స్ లో బాధితులు అధికశాతం ముస్లిములే” అన్నది.
“The French Terror Victims Association (AFVT)” అన్నది ఫ్రెంచ్ కు చెందిన ఉగ్రవాద దాడుల బాధితులను ఆదుకునే సంస్థ. ఈ సంస్థ అధ్యక్షుడు సెయింట్ మార్క్ స్పష్టంగా “ప్రపంచవ్యాప్తంగా 80% మంది తీవ్రవాద బాధితులు ముస్లిములేనని” తేల్చి చెప్పిటం జరిగింది.
స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు అర్పించిన ముస్లిములు “జిహాదీ”లంటే!
సోషల్ మీడియాలో ముస్లిములను “జిహాదీలు” అని పిలుస్తూ హేళన చేసే అర్థ మెదడు విశ్లేషకులకు “జిహాదీ” అంటే “అన్యాయానికి, అధర్మానికి, దౌర్జన్యానికి చెడుకు వ్యతిరేకంగా పోరాడే యోధుడు” అని అంటారన్న విషయం తెలీదు.
అన్యాయంగా ఈ దేశ సంపదను దోచుకొని, ఈ దేశ ప్రజలను అణచివేతకు గురిచేసిన బ్రిటిష్ ప్రభుత్వపు బానిస సంకెళ్ళ నుండి భారత దేశాన్ని విముక్తి చెయ్యటానికి, వారి దౌర్జన్యానికి వ్యతిరేకంగా తమ తోటి హిందూ సోదరులతో భుజం కలిపి పోరాటం చేసిన ఈ దేశపు ముద్దు బిడ్డలైన వేలకొద్దీ ముస్లిం వీరులు నిజమైన జిహాదీలంటే. ఆనాటి బ్రిటిష్ దౌర్జన్య పరుల అన్యాయానికి వ్యతిరేకంగా వారు చేసిన యుద్ధం “జిహాద్” అంటే. ఇంకా వివరంగా చెప్పాలంటే…
సమాజంలో మంచికోసం శ్రమించటం, ప్రజా సేవ చెయ్యటం జిహాద్..
కఠిన సమయాల్లో నవ్వగలగటం, కష్టాల్లో సహనంగా ఉండగలటం జిహాద్..
తన బద్ధ శత్రువునైనా క్షమించగలగటం జిహాద్..
హృదయంలో మెదిలే చెడు తలంపులతో పోరాడటం జిహాద్..
వృద్ధ తలిదండ్రులను అప్యాయతతో చూసుకోవటం జిహాద్..
ప్రజలను నిజాయితీతో పాలించటం జిహాద్..
చెడును రూపుమాపి శాంతి స్థాపనకు కృషి చెయ్యటం జిహాద్..
దేశ ప్రజల కోసం అవసరమైతే ఆత్మబలిదానం ఇవ్వటం జిహాద్.. చివరికి కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా చనిపోయిన ఎందరివో శవాలను కులమతాల కతీతంగా దహన సంస్కారాలు చేసిన ముస్లిం యువకులంతా చేసింది సైతం జిహాదే.
ఆయుధాలు చేతపట్టి దౌర్జన్యాన్ని ప్రధానంగా చేసుకుని కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రదర్శిస్తున్న మతోన్మాదానికి, అతివాదానికి, తీవ్రవాదానికీ మరియు ఖురాన్ బోధించే ఇస్లాంకు సంబంధమే లేనే లేదు. ఈ విషయం ముస్లిమేతరులందరూ స్పష్టంగా అర్థం చేసుకోవలసిన విషయం.
ఖురాన్ చెడును “మారణాయుధాలతో తొలగించమనటం లేదు” కానీ… “నీవు చెడును శ్రేష్ఠమైన మంచి ద్వారా తొలగించు” (41:34) అని చెబుతుంది.
*****
ప్రవక్త ముహమ్మద్ (స) ఇస్లాంను ఇలానే స్థాపించారా?
చెడును రూపుమాపి, మంచిని పెంచి సమాజాన్ని ఎలా ప్రక్షాళన చెయ్యాలి? అన్న దానికి 1400 సం.ల క్రితం ప్రవక్త ముహమ్మద్(స) అవలంబించిన విధానం, చేసిన బోధలే నిజమైన ఆదర్శం. మంచీ, మానవత్వం, మానవీయ విలువలు, నైతికత వంటి వాటిని ఏ మాత్రం ఎరుగని ఒకప్పటి అనాగరిక అరేబియా సమాజాన్ని ప్రవక్త ముహమ్మద్(స) కేవలం 23 ఏళ్లలో ఎలా సంస్కరించగలిగారు? అన్న విషయం నేడు టెర్రరిస్ట్ గ్రూపులు నడుపుతున్న ఉన్మాదులకు తెలియనే తెలీదు. ఎందుకంటే తమను పెంచి పోషించే యజమానులు ఎలా ఆడిస్తే అలా ఆడటమే వీరికి తెలుసు కాబట్టి.
ఆనాటి అనాగరిక అరబ్బుల్ని అతి కొద్ది కాలంలోనే నైతికతకు, మానవతకు పట్టుకొమ్మలుగా మార్చగలిగేంతగా ప్రభావం చూపిన ప్రవక్త ముహమ్మద్(స) వ్యక్తిత్వాన్నీ, ఆయన బోధల్ని పరిశీలించిన ఎందరో ముస్లిమేతర మేధావులు.. “ముహమ్మద్ నేటి ఆధునిక సమాజానికి గనుక నాయకత్వం వహిస్తే ఆయన నేటి ప్రపంచ సమస్యలన్నిటినీ పరిష్కరించి, నేడు కరువైన శాంతిని స్థాపిస్తారని” ప్రకటించటం జరిగింది.
*****
అన్యాయంగా ఏ జీవి ప్రాణాన్నైనా తీసే అనుమతి ఖురాన్ ఇస్తుందా?
ఏ జీవినైనా అన్యాయంగా చంపే హక్కును ఖురాన్ ఇవ్వటం లేదు. ఇదే విషయాన్ని ఖురాన్ ఈ క్రింది విధంగా పేర్కొంటుంది.
“న్యాయ బద్ధంగా తప్ప అల్లాహ్ పవిత్రంగా నిర్ణయించిన ఏ ప్రాణినీ హతమార్చకండి” – ఖురాన్ 6:151
“హత్యకు బదులు హత్యగానీ లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకు గానీ కాక, మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడిన వాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే” – ఖురాన్ 5:32
ముస్లిమేతరుల పట్ల ప్రవక్త ముహమ్మద్ (స) దౌర్జన్యం చెయ్యమని చెబుతున్నారా?
“జాగ్రత్త! ఎవరైతే ముస్లిమేతరుల పట్ల క్రూరంగా కఠినంగా ప్రవర్తిస్తారో వారి హక్కులను కాజేస్తారో వారిపై అధిక భారం మోపుతారో వారిని దోచుకుంటారో అలాంటి వారి గురించి ప్రళయ దినాన నేనే స్వయంగా దేవుని వద్ద ఫిర్యాదు చేస్తాను” – ప్రవక్త ముహమ్మద్(స).
ఇదీ ముస్లిమేతరుల విషయంలో ప్రవక్త ముహమ్మద్(స) ఇచ్చిన ఆదేశం! వాస్తవం ఇదైనప్పుడు.. ముస్లిం వేషాలు ధరించి, ఉర్దూ/అరబిక్ పేర్లు తగిలించుకుని మారణ హోమాన్ని సృష్టిస్తున్న ఉగ్రవాదులు ప్రవక్త ముహమ్మద్ (స) అనుచరులు లేక ముస్లిములు అని చెప్పటం అజ్ఞానం అనిపించుకుంటుంది. కాషాయం ధరించి హిందూ పేర్లు పెట్టుకుని మారణహోమం సృష్టించేవారు నిజ హిందువులూ కారూ.. క్రైస్తవ పేర్లు పెట్టుకుని మారణహోమం సృష్టించేవారు నిజ క్రైస్తవులూ కారు. ఎందుకంటే ఏ మతమూ ఉగ్రవాదాన్ని నేర్పదు, ఉగ్రవాదం వాదం చేసే ఉన్మాదులకు ఏ మతంతోనూ సంబంధం ఉండదు.
మరి ప్రపంచ వ్యాప్త ముస్లిం సమాజం ఈ ఉగ్రవాద సంస్థల్ని ఎందుకు ఖండించటం లేదు?
ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్(స) బోధల అవగాహన ఉన్న ముస్లిములే కాదు ముస్లిమేతరులు సైతం ఈ ఉగ్రవాద సంస్థలను సపోర్ట్ చెయ్యటం జరగదు. ప్రపంచవ్యాప్త ముస్లిం పండిత వర్గం అల్-ఖైదా, ఐ.ఎస్.ఐ.ఎస్ వగైరా ఉగ్రవాద సంస్థలకు ఇస్లాంకు సంబంధం లేదని ఫత్వా (ఉత్తర్వు) ఎప్పుడో జారీ చేశారు.
ఒకప్రక్క అమెరికా, యూరప్ దేశాల ద్వారా పెంచి పోషించబడుతున్న ఈ ఉగ్రవాద సంస్థలు చేసే అనేక తీవ్రవాదాల నేపథ్యంలోనూ అనేక మంది ముస్లిమేతర మేధావులు నేడు ఖురాన్ ను అధ్యయనం చేసి ఇస్లాం స్వీకరిస్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అంగీకరించబడుతున్న ధర్మం సైతం ఇస్లాం అన్న విషయాన్ని గమనించాలి.
నేడు ఇస్లాం స్వీకరిస్తున్న అనేక మంది పరిశీలించి తెలుసుకుంటున్న విషయం నేటి ఈ ఉగ్రవాద సంస్థల లక్ష్యం ఇస్లాం స్థాపించటం కాదని మరియు వారికీ ఇస్లాంకూ ఎటువంటి సంబంధం లేదన్నది.
ఈ సంస్థల లక్ష్యం ఇస్లాం స్థాపించటమా?
