ఉదయ్ పూర్ లో ఇద్దరు సోకాల్డ్ ముస్లిములు ఓ వ్యక్తిని హత్య చెయ్యటమే కాక ఆ అమానుష చర్యను ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆ ఇద్దరు మూర్ఖులను ముస్లిం సమాజం, ముస్లిం సంఘాల పెద్దలు, పండితులంతా అది ఇస్లాం వ్యతిరేక చర్య అని ఖండిస్తున్నారు. చట్ట ప్రకారం కఠిన శిక్ష పడాలని తమ నిరసన తెలియజేస్తున్నారు. కచ్చితంగా ఇది అందరూ ఖండించాల్సిందే.
అసలు సమస్యకు పరిష్కారం వెదకకుండా కేవలం ఖండిస్తే సరిపోతుందా?
ఇక్కడ అసలు సమస్య ముస్లిం సమాజంలో కొందరు ఇస్లాంనో, ప్రవక్త ముహమ్మద్ (స) వారినో ఎవరైనా ఏదైనా విమర్శలు చేస్తే వెంటనే వారిపై దౌర్జన్యానికి, దాడులకు దిగటమో లేదంటే వారిని బూతులు తిట్టేయటమో జరుగుతుందంటే ఆయా విమర్శలకు సరైన పద్ధతిలో సమాధానం చెప్పటం చేతకాక అసహనానికి గురైపోవటమే.
ఆ రకమైన అసహనానికి నేడు కొందరు ముస్లిములు ఎందుకు గురవుతున్నారు? అన్నది లోతుగా విశ్లేషించుకుంటే దానికి మూల కారణం- వారికి ప్రవక్త ముహమ్మద్(స) వారిపట్ల వల్లమాలిన అభిమానం ప్రదర్శించటం తప్ప ఆయన ఆదర్శాల పరిజ్ఞానం లేకపోవటం ఆయన చరిత్రను పూర్తిగా చదవకపోవటం, ఆయన బోధల్ని అవగాహన చేసుకోకపోవటం, ఇస్లాం విమర్శకుల ప్రశ్నలకు ఎంతో హుందాగా ఏ విధంగా సమాధానం ఇవ్వాలన్న కనీస జ్ఞానం లేకపోవటమే.
ప్రత్యక్షంగా ప్రవక్త ముహమ్మద్(స) వారి సమక్షంలోనే నిలబడి ఆయనపై దారుణమైన విమర్శలు చేసేవారి పట్ల ఆయన ఎలా వ్యవహరించేవారు, ఆయన తన విమర్శకులకు ఎలా సమాధానాలు చెప్పేవారు, ప్రవక్త ముహమ్మద్(స)ను విమర్శించే వారిని ఆయన శిష్యులు సహనంతో ఏ విధంగా లాజిగ్గా సమాధానాలు చెప్పేవారు అన్న అవగాహన లేకపోవటమే.
కాబట్టి తీవ్రవాద చర్యలకు పాల్పడే ఇలాంటి కొందరు నామ మాత్ర ముస్లిములు చేసే దిక్కుమాలిన పనుల్ని ఖండించటమే కాదు, ముస్లిం సమాజంలో పెద్దలు, బోధకులంతా సామాన్య ముస్లిం సమాజంలో అందర్నీ కూడా ప్రవక్త ముహమ్మద్(స) వారి పట్ల ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని ఆహ్వానించి వాటికి తగ్గ సరైన సమాధానాలను మర్యాదగా, సహనంతో ఎలా తిప్పికొట్టాలో కూడా నేర్పించి ముస్లిం సమాజాన్ని చైతన్యపరచాలి.
వివిధ జమాతుల్లో (సంఘాల్లో) జరిగే ఇస్లామిక్ ట్రైనింగ్ క్లాసెస్ లో ఇస్లాం విమర్శలకు ధార్మిక పద్ధతిలో లాజిగ్గా ఎలా సమాధానం ఇవ్వాలో, ఇస్లాం విమర్శకుల పట్ల ఎలా వ్యవహరించాలో కూడా ఒక సబ్జెక్ట్ పెట్టి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలి. ముస్లిమేతరుల పట్ల ప్రవక్త ముహమ్మద్(స) వైఖరి ఏమిటి? ముస్లిమేతరుల పట్ల ఖురాన్ వైఖరి ఏమిటి? వగైరా అంశాల్ని సామాన్య ముస్లిం ప్రజానీకంలో సర్వసామాన్యం చెయ్యాలి. శుక్రవారం నాడు మసీదుల్లో జరిగే జుమా ప్రసంగాల్లో సైతం ఇలాంటి టాపిక్స్ పై ముస్లిం పండితులు మాట్లాడాలి.
“ప్రవక్త ముహమ్మద్(స) వారి యొక్క గౌరవం కాపాడబడటం అన్నది ఆయన్ని విమర్శించే వారిపై దాడులూ దౌర్జన్యాలు చెయ్యటం ద్వారానో, వారి పట్ల అమర్యాదగా మాట్లాడటం ద్వారానో ఎంతమాత్రం సాధ్యం కాదు” అన్న అతి ప్రధానమైన విషయాన్ని ముందు అవగాహన పరచాలి.
అలాగని ఈ పనిని ముస్లిం పండితులు, బోధకులు అస్సలు చెయ్యటం లేదన్నది నా ఉద్దేశం కాదు కొందరైతే చేస్తున్నారు కానీ జరగాల్సిన స్థాయిలో జరగటం లేదన్నది నా ఉద్దేశం.
లేదంటే, ఇస్లాం విమర్శకుల పట్ల, ప్రవక్త ముహమ్మద్(స) విమర్శకుల పట్ల సహనం కోల్పోయి కొందరు నామమాత్ర ముస్లిములు చేసే దౌర్జన్యాలను, దాడుల్నీ ఖండించుకుంటూ కూర్చోవటంలోనే ముస్లిం పెద్దలకు సమయమంతా సరిపోతుంది.
అలాగే ముస్లిం సమాజంలో కొందరు ఇలాంటి తీవ్రవాద చర్యలకు,చెడు పనులకు పాల్పడటానికి కారణం వారికి ఖురాన్ అవగాహన ఉండబట్టి కాదు, నిజానికి వారికి ఖురాన్ అవగాహన పూర్తిగా లేకపోవటమే అన్న విషయాన్ని ముస్లిమేతరులకు తెలియజేయాలి.
