ప్రవక్త ముహమ్మద్(స) వారితో హజ్రత్ ఆయిషా(రజి) నిశ్చితార్థం 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగింది, 9 ఏళ్ల వయసులో ఆమె వివాహం అని చెప్పటానికి ఏదైనా ఆధారం ఉందంటే అది బుఖారిలో రికార్డు కాబడిన కొన్ని హదీసులే. ఇదొక రికార్డెడ్ ఫ్యాక్ట్ అని అధిక శాతం ముస్లిములే కాదు ముస్లిమేరులు కూడా బలంగా నమ్ముతుంటారు.
నేటి అభినవ ఇస్లామోఫోబులైతే పనికట్టుకుని ప్రవక్త ముహమ్మద్(స) వ్యక్తిత్వాన్ని ప్రజల దృష్టిలో దిగజార్చటానికి, ఆయనను విమర్శించటానికి “ఆయన 53 ఏళ్ల వయసులో ఉండగా, పైగా ఒక ప్రవక్త అయి ఉండీ కేవలం 6 ఏళ్ల పసిపిల్లను ఎలా వివాహం చేసుకున్నారు?” అన్న ప్రశ్నను పదే పదే ఏదో సందర్భం కల్పించుకుని మరీ లేననెత్తుతూనే ఉంటారు. ఈ అంశంపై మరింత లోతైన వివరణ ఇవ్వాలన్నదే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం.
నిజంగానే ప్రవక్త ముహమ్మద్(స) వారితో హజ్రత్ ఆయిషా(రజి) వారిని 6 ఏళ్లప్పుడు నిశ్చితార్థం చేసుకుని 9 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారా? కొన్ని హదీసులలో రికార్డు కాబడిన ఈ సమాచారం ఎంతవరకు ప్రామాణికం? పైగా ఇది బుఖారీ హదీసులో ప్రవక్త ముహమ్మద్(స)స్వయంగా చెప్పిన సమాచారం కూడా కాదు. ఒక ఉల్లేఖనకర్త ద్వారా చెప్పబడిన సమాచారం మాత్రమే! అందుకే కొందరు ప్రముఖ ముస్లిం పండితులు బలమైన కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా ఈ హదీసుపై లోతైన పరిశీలన చెయ్యటం జరిగింది.
హదీస్ ప్రామాణికతను తేల్చటానికి ఇది అవసరం కూడా. ఎందుకంటే హదీస్ సంకలనం అన్నది ప్రవక్త ముహమ్మద్(స) పరమపదించిన తరువాత దాదాపు 150 సం.ల తరువాత నుండి మొదలైన ప్రక్రియ.
వివిధ వ్యక్తుల ద్వారా సేకరించబడిన హదీసులలో అస్సలు మార్పు జరగలేదా? అని ప్రశ్నించుకుంటే అనేక మంది ఉల్లేఖన కర్తల ద్వారా ‘ప్రామాణిక సమాచారం’ లభించింది. అలాగే ‘కొంత సందేహాస్పదమైన’ సమాచారం లభించింది. కొంత ‘అప్రామాణిక సమాచారం’ కూడా లభించిందన్నది వాస్తవం. అలాగని మొత్తానికి హదీసులను కొట్టిపరెయ్యటం కూడా సరైన పద్దతి కాదు. దానికి అవలంబించాల్సిన పద్ధతి- ఆ హదీస్ లో సమాచారాన్ని 1. ఖురాన్ వెలుగులో పరిశీలించాలి 2. సున్నత్ (ప్రవక్త సాంప్రదాయం) వెలుగులో చూడాలి. 3. చారిత్రక ఆధారాల ద్వారా ఇంకా పూర్తి ఇస్లాం స్వభావం (రుహే ఇస్లాం) వెలుగులో అది హేతుబద్ధంగా అనిపిస్తుందా? లేదా? అన్న వివిధ కోణాల్లో పరిశీలించాల్సి ఉంటుంది. .
ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ప్రవక్త ముహమ్మద్(స) వారితో హజ్రత్ ఆయిషా(రజి) నిశ్చితార్థం 6 ఏళ్ల వయసులో జరిగి, 9 ఏళ్ల వయసులో ఆమె వివాహం జరిగిందని రికార్డు కాబడిన హదీసులలో సమాచారం ఎంతవరకు ప్రామాణికమన్నది తెలుసుకుందాం.
****
1) హజ్రత్ ఆయిషా(రజి) పుట్టిందెపుడు?
నిజంగా హజ్రత్ ఆయిషా(రజి) నిశ్చితార్థం 6 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు జరిగి, 9 ఏళ్ల వయసులో ఆమె వివాహం జరిగిందన్నదే కాస్సేపు నిజమనుకుందాం. దాని ప్రకారం ఆమె కొందరు చెబుతున్నట్టు 614 సం.లో పుట్టి ఉండాలి. ఆదే నిజమైతే అదే బుఖారీ హదీసులోనే రికార్డు కాబడిన మరొక విషయం ఇక్కడ గమనార్హం. ఖురాన్ 54 వ సూరా “అల్-ఖమర్” ప్రారంభ వాక్యాలు ముహమ్మద్ (స) వారు 610 సం. లో ప్రవక్తగా నియమితులయ్యాక 4 సం. ల తరువాత అవతరించాయి. అంటే 614 సంవత్సరంలో అన్నమాట. “ఈ వాక్యాలు అవతరించే నాటికి “నేను ఆడుకునే పిల్లను (I was a child playing)” అని హజ్రత్ ఆయిషా (రజి) చెప్పినట్టు సహీహ్ అల్ బుఖారీ హదీస్ నెం. 4876 కితాబే తఫ్సీర్ లోనే వ్రాయబడి ఉంది.
కాబట్టి హజ్రత్ ఆయిషా(రజి) 614 సం.లో పుట్టారని వాదిస్తే ఆమె తాను పుట్టకముందే పై మాటను చెప్పారని ఒప్పుకోవాల్సి ఉంటుంది. దీనిని బట్టి ముహమ్మద్ (స) వారు 610 సం. లో ప్రవక్తగా నియమితులైనప్పటికే హజ్రత్ ఆయిషా (రజి) వారి వయస్సు 4, 5 సం. లు. మధ్య వయస్కురాలు అన్నది నిర్వివాదం.
దీనిని బట్టి “అల్-ఖమర్” సూరా అవతరించే నాటికి ఆమె వయస్సు 8 సం. ల ఆడుకునే అమ్మాయని తెలుస్తుంది. దీనిని బట్టి ఆమె పుట్టింది 605 సం. లో అన్నది అర్థమవుతుంది. ఇక ప్రవక్త ముహమ్మద్ (స) వారు మక్కా లో ఉన్నది 13 సం. ఆ తరువాత 622 సం. లో ఆయన మదీనాకు హిజ్రత్ చేశారు. హిజ్రత్ అనంతరం దాదాపు 2 రెండు సం. తరువాత హజ్రత్ ఆయిషా వారిని పెళ్లిచేసుకున్నారు. వెరసి అప్పటికి హజ్రత్ ఆయిషా (రజి) వయస్సు 19 లేదా 20 సం. ల మహిళ తప్ప 9 సం. ల చిన్నపిల్ల కాదు!
****
2) ఇస్లాం స్వీకరించిన తొలి వ్యక్తుల్లో హజ్రత్ ఆయిషా (రజి) వారి పేరు!
ఇస్లాం యొక్క ప్రసిద్ధ సాంప్రదాయ చరిత్రకారుడు, ఇబ్న్ జరీర్ తబరి తన ‘తారిఖ్ తబరి Vol 4, p. 50’ లో చెబుతున్నదేమిటంటే..
“ఇస్లాంకు పూర్వం అబూ బకర్ ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకున్నారు. మొదటి ఆమె- ఫాతిలా అబ్దుల్ ఉజ్జా కుమార్తె, ఆమె నుండి అబ్దుల్లా మరియు అస్మా జన్మించారు. రెండవ భార్య అయిన ఉమ్ రుమాన్ నుండి అబ్దుర్ రెహ్మాన్ మరియు ఆయిషా జన్మించారు. ఈ నలుగురు ఇస్లాం కంటే ముందు జన్మించారు”. దీనిని బట్టి 610 సం. లో ముహమ్మద్(స) ప్రవక్తగా నియమితులవటానికి ముందే హజ్రత్ ఆయిషా (రజి) వారు పుట్టి ఉన్నారని అర్థమవుతుంది.
ఇబ్న్ఇషాక్ రచించిన ప్రవక్త యొక్క మొట్టమొదటి మరియు అత్యంత ప్రామాణికమైన జీవిత చరిత్రలో, ఇస్లాం ప్రారంభ రోజుల్లో దానిని స్వీకరించిన వ్యక్తుల జాబితా (సాబికూన్ అల్-అవ్వలూన్) లో హజ్రత్ ఆయిషా (రజి) వారి పేరును ఆమె కంటే వయసులో 10 సం. పెద్ద అయిన అక్క గారైన “హజ్రత్ అస్మా” (రజి) వారితో పాటు పేర్కొనబడి ఉండటం గమనార్హం. ఇక “హజ్రత్ అస్మా” (రజి) వారు 595 సం. లో పుట్టి ఉన్నారు. ఆ జాబితాలో ఉన్నవారు ఇంకా ఉత్మాన్ ఇబ్నె అఫ్ఫాన్, జుబైర్ ఇబ్నె అవ్వామ్, అబ్దుర్రహ్మాన్ ఇబ్నె అవుఫ్, సాద్ ఇబ్నె అబీవక్కాస్, తల్హా ఇబ్నె ఉబయ్ దుల్లహ్, అబు ఉబయ్ దా ఇబ్నె జర్రా, అర్హం ఇబ్నె అబీ అల్ అర్కం, ఉత్మన్ ఇబ్నె మజూన్, ఉమైర్ ఇబ్నె అబీ వక్కాస్, అబ్దుల్లా ఇబ్నె మసూద్ వగైరా మరి కొందరితో పాటు హజ్రత్ ఆయిషా (రజి) వారి పేరు ఇస్లాం స్వీకరించిన ప్రారంభ వ్యక్తుల జాబితాలో వ్రాయబడి ఉన్నట్లుగా చూడగలం. అంటే ముహమ్మద్ (స) వారు 610 సం. లో ప్రవక్తగా నియమితులైనప్పటికే హజ్రత్ ఆయిషా (రజి) వారు పుట్టి ఉన్నారు. దీనిని బట్టి అప్పటికే ఆమె వయసు దాదాపు 5/6 సం. లు.
****
3) ఉహూద్ యుద్ధంలో ఆమె ఎలా పాల్గొన్నారు?
సహిహ్ బుఖారీ వాల్యూమ్ 59, 423 హదీస్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (స) వారు 14 ఏళ్ల కంటే వయసు తక్కువ ఉన్న పిల్లల్ని యుద్ధ రంగంలో పాల్గొనటాన్ని నిషేధించారు.
అదే సహిహ్ బుఖారీ వాల్యూమ్ 58, 156 హదీస్ ప్రకారం హజ్రత్ ఆయిషా (రజి) వారు ఉహద్ ఊహూద్ యుద్ధమైదానంలో ఉన్నట్టు పేర్కొనటం జరిగింది. ఊహూద్ యుద్ధం హిజ్రీ 3 వ సం.లో జరిగింది. కొందరు ముస్లిం పండితులు చెబుతున్నట్టు ఆయిషా (రజి) వారు 614 సం.లో పుట్టి ఉంటే కేవలం పదేళ్ల చిన్న పిల్లను ప్రవక్త వారు యుద్ధమైదానంలో ఎలా అనుమతించి ఉంటారు?
****
4) హజ్రత్ ఆయిషా(రజి) వారి అక్క గారైన “హజ్రత్ అస్మా”(రజి) మధ్య వయసులో తేడా ఎంత?
ప్రఖ్యాత “మిష్కాత్” గ్రంధకర్త అయిన “వలీయుద్దీన్ ముహమ్మద్ అబ్దుల్లా అల్-ఖతీబ్-అల్ అమ్రి తబ్రీజీ” స్పష్టంగా “అస్మా ఉర్రిజాల్” లో చెబుతున్నా విషయం హజ్రత్ ఆయిషా (రజి) వారి కంటే 10 సం. పెద్ద అన్నది. హజ్రత్ అస్మా (రజి) వారు హిజ్రీ శకం 73 సం.లో చనిపోయారు, ఆమె చనిపోయేనాటికి ఆమె వయస్సు 100 సం. లు అని పేర్కొన్నారు.
అందరికీ తెలిసిన విషయమే ఇస్లామిక్ కేలండర్ హిజ్రత్ జరిగిన నాటి నుండి ప్రారంభం అయిందని! 622 సం. లో హిజ్రత్ సంఘటన జరిగింది. ఇప్పుడు ఆమె చనిపోయేనాటికి 100 సం. వయసులో నుండి 73 సం. లు తీసివేస్తే ప్రవక్త ముహమ్మద్ (స) వారు హిజ్రత్ చేసే నాటికి ఆమె వయస్సు 27 సం.లు. ఇక హజ్రత్ ఆయిషా (రజి) వారి కంటే హజ్రత్ అస్మా (రజి) 10 సం. లు పెద్ద! అంటే హజ్రత్ ఆయిషా (రజి) వారి వయస్సు హిజ్రత్ జరిగేనాటికి 17 సం. లు. హిజ్రత్ అనంతరం దాదాపు 2 తరువాత ప్రవక్త ముహమ్మద్ (స) వారు హజ్రత్ ఆయిషా (రజి) వారిని పెళ్లి చేసుకున్నారు అని సకల హదీసు గ్రంధాలలో ఉంది. అంటే అప్పటికి ఆమె వయస్సు 17+2=19. వివరంగా చెప్పాలంటే దాదాపు 19 లేదా 20 సం. ల మహిళ! తప్ప 9 సం. ల అమ్మాయి కాదు!! చరిత్రలో నమోదై ఉన్న ఈ వాస్తవాలను ఎలా కొట్టి పారేయగలం?
****
5) నిజంగా ప్రవక్త ముహమ్మద్(స) వారు ఆరేళ్ల ఆయిషా(రజి) వారితో నిశ్చితార్ధం చేసుకున్నారా?
ప్రవక్త ముహమ్మద్ (స) వారు, 6 యేళ్ల వయసులో ఉండగా హజ్రత్ ఆయిషా (రజి) వారిని నిశ్చితార్థం చేసుకున్నారని చెప్పే చాలా మందికి తెలీని విషయం అంతకు ముందే హజ్రత్ ఆయిషా(రజి) వారికి కొన్ని సం.ల ముందే జాబిర్ ఇబ్నె అల్ మొతిమ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరిగి, ఆ వ్యక్తి ధర్మం స్వీకరించని కారణంగా ఆ వివాహం రద్దు అయిపోతుంది. దీనిని బట్టి ప్రవక్త ముహమ్మద్ (స) వారు పెళ్లి చేసుకోకమునుపే హజ్రత్ ఆయిషా(రజి) వారు వివాహ వయసుకు చేరుకున్న మహిళ తప్ప మానసికంగా పరిపక్వత చెందని 6 సం. చిన్నపిల్ల కాదని చెప్పటానికి ఇదొక బలమైన ఆధారం.
****
ఈ విషయాలను కాస్త కూడా గమనించని కొందరు ముస్లిం పండితులు అరేబియాలో అప్పటి వాతావరణ ఉష్ణోగ్రతలను బట్టి అమ్మాయిలు త్వరగా రజస్వల అయ్యేవారని కథలు వినిపిస్తుంటారు. ఇక్కడ అసలు ఆలోచించాల్సింది ఒక ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ప్రవక్త ముహమ్మద్(స) లాంటి వ్యక్తి ఇంకా మానసికంగా పరిపక్వత లేని 6 ఏళ్ల పసిపిల్లతో ఎలా నిశ్చితార్థం చేసుకుని ఉంటారన్నది? పైగా అప్పటికే పదిహేనేళ్ల వయసున్న (ఫాతిమా(రజి)) అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఆయన 6 ఏళ్ల పసిపిల్లతో ఎలా నిశ్చితార్థం చేసుకుని, పెళ్లి చేసుకున్నారంటే అది నమ్మసక్యమేనా?
పైగా ఖురానే- “విశ్వసించిన ప్రజలారా బలవంతంగా స్త్రీలకు వారసులు కావటం మీకు ధర్మసమ్మతం కాదు (4:19)” అని చెబుతుంది. సరే, అప్పటి వాతావరణ పరిస్థితులను బట్టి స్త్రీలు త్వరగా అయితే రజస్వల కావొచ్చెమో గానీ ఓ ఆరేళ్ల వయసున్న పసిపిల్ల స్వతహాగా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకునేంత మానసిక పరిపక్వత ఎలా ఉంటుంది? అలాంటి మానసిక పరిపక్వత లేని పసిపిల్లను ప్రవక్త ముహమ్మద్(స) మటుకు ఎలా బలవంతంగా పెళ్లిచేసుకోవాలని సంకల్పించుకుని ఉంటారు? ఒకసారి ఆలోచించండి.
****
ఈ సందర్భంలో ఆయన దాదాపు 53 ఏళ్ల వయసులో 20 సం. మహిళను మాత్రం పెళ్లి చేసుకోవటం ఏమిటి? అనే రెండవ ప్రశ్న కొందరు లేవనెత్తవచ్చు. ఈ సందర్భంలో గమనించాల్సిన కొన్ని అంశాలు:
1). దైవసేవకే అంకితమై ఉన్న ప్రవక్త ముహమ్మద్ (స 53 సం. వరకు కేవలం ఒకే భార్యను కలిగి ఉన్నారు. పైగా ఆమె ముహమ్మద్ (స) కంటే వయసులో 15 సం. లు పెద్ద. ఇక ఆ తరువాత ఆయనకు బహుభార్యత్వం అనుమతి ఇవ్వటం వెనుక కారణం అప్పట్లో అరబ్బు సమాజం అనేక వర్గాలుగా విడిపోయి ఏమాత్రం కలవటానికి ఇష్టపడే వారు కాదు. ఆ వర్గాలన్నిటినీ ఏకం చెయ్యగల మార్గం వర్గాంతర వివాహాలను ప్రోత్సహించటం ఒక్కటే! ఆ పని చేయటానికి ఎవరూ ముందుకు రానప్పుడు ఒక ప్రవక్తగా మాదిరి చూపవలసింది ఆయననే కదా! అందుకే ఆయనకు బహుభార్యత్వం అనుమతి ఇవ్వటం జరిగింది.
2). ఆయన పెళ్లిళ్లు చేసుకున్నది సైతం వితంతువులు, విడాకులు పొందిన స్త్రీలనే! ఇక ప్రవక్త ముహమ్మద్(స) ఆయిషా(రజి) వారిని వివాహమాడటానికి కారణం ఆమె ఎంతో చురుకైన వ్యక్తిత్వం, అపారమైన జ్ఞాపకశక్తి కలిగి ఉండేవారు. భార్యాభర్తల సంబంధాల నుండి మహిళా లోకానికి అవసరమైన ధార్మిక అంశాలను, ఆదర్శాలను ఆచరణాత్మకంగా తర్ఫీదునిచ్చే బాధ్యతను నిర్వర్తించటం నిమిత్తం మాత్రమే ఆమెను వివాహమాడారు. అది కూడా ఆయన ఆమె ఇష్ట ప్రకారం మాత్రమే వివాహం చేసుకున్నారు.
అలాగే ఆమె 2210 హదీసులు ఎంతో అనర్గళంగా ఉల్లేఖించి ఉన్నారు. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ (స) సాంప్రదాయాలను, ధార్మికపరమైన గొప్ప సమాచారాన్ని ఆమె మహిళా లోకానికి అందజేశారు. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ (స) వారు హజ్రత్ ఆయిషా (రజి) వారిని పెళ్లి చేసుకోవటం వెనుక ఏ దురుద్దేశమూ లేదు.
కేవలం దైవ సందేశం విడిచిపెడితే చాలు మీకు అపారమైన నిధులు, అందమైన స్త్రీలు, అధికారం కట్టబెడతామని ఆనాటి ఖురైష్ సర్దారులు ఆయనకు ఆశ చూపినప్పుడు సైతం వాటన్నిటినీ తిరస్కరించించి కేవలం దేవసందేశం నిమిత్తమే జీవితాన్ని ధారబోసిన వ్యక్తిని నేటి అభినవ ఇస్లామోఫోబులు ఆయనను స్త్రీ లోలుడని నిందించటం వారి ఎంత తెలివితక్కువతనమో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ప్రవక్త ముహమ్మద్(స) వారిని విమర్శించే ముందు క్యాథలిక్ ఎన్ సైక్లోపీడియా ప్రకారం 12 సం. ల వయసులో ఉన్న కన్య మేరీని యెసేపు పెళ్లి చేసుకునే నాటికి అతని వయస్సు 90 సం. లు అన్న విషయాన్ని గమనించాలి. నిజానికి ఈ మాహిళలు దేవుని సేవకొరకు ఎన్నుకోబడ్డవారు మాత్రమే. కాబట్టి వారి జీవితాలను సామాన్య స్త్రీలతో, ఇప్పుడున్న కుటుంబ వ్యవస్థతో పోల్చి తమకు తోచిన స్టేట్ మెంట్లు ఇవ్వటం అర్థరహితం అవుతుంది.
ఓ ఇరవై మూడేళ్ల స్వల్ప కాలంలో అనాగరికతలో, అజ్ఞానంలో కొట్టుమిట్టాడే ఒక జాతిని ఉన్నత నాగరికులుగా, ఉన్నత నైతిక విలువలకు పట్టుకొమ్మలుగా ఆయన మార్చగలిగారంటే ఆయన ఎలాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వారై ఉంటారన్నదే ఇక్కడ అసలు ఆలోచించాల్సిన విషయం.
ప్రవక్త ముహమ్మద్ (స) వ్యక్తిత్వాన్ని కించపరచటానికి ఆయనలో లోపాలను వెదికే వారికి తెలీని విషయం ఆయన ఒక అనాగరిక జాతిని ఉన్నత నాగరికులుగా మార్చేశారన్న విషయం తేలికపోవటం. అందుకే థామస్ కార్లయిల్ చెబుతున్నదేమిటంటే…
“ఈ మనిషి చుట్టూ పేరుకుపోయిన అబద్ధాలు మనకే తలవంపులు తెచ్చే విధంగా ఉన్నాయి”
ప్రవక్త ముహమ్మద్(స) 9 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా?
