ఎవరా ఉన్మాదులు..?

ప్రవక్త ముహమ్మద్(స) గురించి తప్పుగా మాట్లాడితే, విమర్శిస్తే చంపేస్తారా? ఎవరా గెడ్డాలు, టోపీలు పెట్టుకుని ముస్లిం వేషాలు ధరించి రక్తపాతన్ని సృష్టిస్తున్న ఉన్మాదులు?

కచ్చితంగా ప్రవక్త ముహమ్మద్(స) అనుచరులైతే ఎంతమాత్రం కాదు.

ఆ మూర్ఖులు ప్రవక్త ముహమ్మద్(స) చరిత్ర ఎప్పుడూ చదవలేదా?

స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సమక్షంలోనే ఆయన శత్రువులు ఆయన ముఖం మీదే దుషిస్తున్నప్పటికీ, దుర్భాషలాడుతున్నప్పటికీ, ఎగతాళిగా మాట్లాడుతున్నప్పటికీ ఆయన సహనం వహించేవారని పైగా వారిని క్షమించేసేవారని?

ఆ ఉన్మాదులకు తెలియదా స్వయంగా ప్రవక్త ముహమ్మద్(స) తనపై మలినాన్ని సైతం విసిరిన వారిని, తనపై ఒంటె ప్రేగులను పడవేసిన వారిని, తాను సందేశం ఇవ్వటానికి తాయిఫ్ నగరానికి వెళితే తనను రక్తం కారేలా రాళ్లు విసిరి కొట్టిన తన ద్వేషకులను, తనను చంపటానికి సైతం అనేక ప్రయత్నాలు చేసిన శత్రువుల్ని ఇట్టే క్షమించివేశారని?

పూర్తి అరేబియా భూభాగం తన ఆధీనంలో వచ్చేసినప్పుడు పదమూడు సంవత్సరాలు తనను, తన శిష్యుల్నీ అన్ని విధాలుగా హింసించిన శత్రువుల్ని శిక్షించే అవకాశం మెండుగా ఉన్నప్పటికీ వారందర్నీ అలవోకగా క్షమించివేశారన్న సంఘటన ఆ దుర్మార్గులకు తెలీదా?

ఆ ఆజ్ఞానులకు తెలీదా ఖురాన్ “నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు (41:34)” అని ఆదేశిస్తుందని, ఇంకా “మృదుత్వం, మన్నింపు వైఖరిని అవలంబించు, మంచిని ప్రబోధించు, మూర్ఖులతో వాదానికి దిగవద్దు (7:199)” అని చెబుతుందని ఎప్పుడూ చదవలేదా?

“అన్యాయంగా ఒక మానవుణ్ణి చంపితే సకల మానవాళినీ చంపినట్టే” అన్న ఖురాన్ హెచ్చరికను ఆ సోకాల్డ్ ముస్లిం వేషాలు ధరించిన ఆ హంతకులు చదవలేదా?

ప్రవక్త ముహమ్మద్(స)ను ద్వేషించేవారిపై, ఆయన గురించి తప్పుగా మాట్లాడేవారిపై దాడులకు దిగమని, చంపమని ఇస్లాం ఎక్కడ చెబుతుంది?

ఇలాంటి దరిద్రుల వల్లే నేడు సార్వత్రిక ముస్లిం సమాజం ముస్లిమేతరుల దృష్టిలో తన పరువును పోగొట్టుకుంటుంది. శాంతిని ప్రబోధించే ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందన్న అపార్ధానికి గురవుతుంది.

ప్రవక్త ముహమ్మద్(స) ను ఎవరో ఏదో అన్నందుకే చంపేసేంత ప్రేమ ఆయన ఆదర్శాలను పాటించటంలో చూపి ఉంటే మతోన్మాదులుగా కాక మనవతావాదులుగా మారిపోయేవారు.

ఏ ముస్లిమైనా చెయ్యాల్సింది ప్రవక్త ముహమ్మద్(స) పట్ల వల్లమాలిన అభిమానం పెంచుకోవటం కాదు నిజంగా ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే ఆయన ఆదర్శాలను పాటించాలి. ప్రవక్త ముహమ్మద్(స) ను విమర్శించేవారి పట్ల దాడులకు తెగబడటం కాదు ఆ విమర్శకులు చేసే విమర్శలు ఎంత తప్పో మర్యాదగా వివేకంతో వివరించాలి.

ఇస్లాం అవగాహన లేకుండా ప్రవక్త ముహమ్మద్(స) ను దూషించాడని ఉదయ్ పూర్ లో కన్నయ్య లాల్ అనే వ్యక్తిని అన్యాయంగా హత్య చేసిన ఆ సోకాల్డ్ ముస్లిం యువకులు చేసిన నేరాన్ని సార్వత్రిక ముస్లిం సమాజం ఖండించటమే కాదు వారిని ముస్లిం సమాజం నుండి బహిష్కరించాలి. ఇంకా ఆ దుర్మార్గులకు చట్ట ప్రకారం శిక్ష పడాలని నినదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *