ఆయన బహుభార్యత్వం కలిగుండటమేంటి?
ఆయన తొమ్మిదేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవటమేంటి?
తన స్వంత కోడలిని పెళ్లి చేసుకోవటమేంటి?
ఆయన అవిశ్వాసులపై యుద్ధాలు చెయ్యటమేంటి?
తన శిష్యులకు యుద్ధాలు చెయ్యమని ఆదేశించటమేంటి?
ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషినేనా మీరు ప్రవక్తగా అంగీకరిస్తుంది?
వగైరా విమర్శలను కొందరు ముస్లిమేతర ఆస్తికులే కాక నాస్తికులు సైతం ఏదో సందర్భంలో పనికట్టుకుని మరీ తెరమీదకు తెస్తూ ఉండటం వెనుక వారి అంతర్గత లక్ష్యం- “ప్రవక్త ముహమ్మద్(స) వ్యక్తిత్వం పెద్ద గొప్పదేమీ కాదు, ఆయనకూడా అప్పట్లో అందరూ చేసిన పనుల్నే చేశారు. వాటితో పాటు ఏవో నాలుగు మంచి మాటలు చెప్పిందాన్ని బట్టి ముస్లిములు ఆయన్ని నెత్తిన పెట్టుకుని గౌరవిస్తున్నారంతే” అన్న భావనను సామాన్య ప్రజల్లో కలగజేసి ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చాలన్నదే.
చరిత్రలో ఎంత గొప్ప వ్యక్తినైనా సామాన్య ప్రజల దృష్టిలో చెడు వ్యక్తిగా చిత్రీకరించాలంటే సింపుల్ గా చెయ్యల్సిందల్లా అతని వ్యక్తిగత జీవితంలో అతను కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సదుద్దేశంతో చేసిన పనుల సందర్భాన్ని తప్పించి అతని పట్ల కొన్ని గుడ్డి విమర్శలను సృష్టించి అతని పట్ల ప్రజలలో చెడు భావాలు కలిగేలా చెయ్యటమే.
ప్రవక్త ముహమ్మద్(స) విషయంలో కొందరు ఇస్లామోఫోబులు చేసింది అదే. ఇస్లాం వ్యాప్తిని ఎలాగైనా అడ్డుకోవాలని, ప్రవక్త ముహమ్మద్(స) ప్రతిష్టను దిగజార్చాలని కంకణం కట్టుకున్న కొందరు యూద, క్రైస్తవ పండితులు ఆయన కొన్ని ప్రత్యేక సందర్భాలలో చేసిన పనులనే వక్రీకరించి ప్రజల్లో ఆయన వ్యక్తిత్వం పట్ల అనేక సందేహాలు కలిగే విధంగా కొన్ని విమర్శలను సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాని కోసం వారు కొన్ని అప్రామాణిక హదీసులను ఆధారం చేసుకున్నారు.
ఆ విమర్శల్నే కాపీకొట్టి తరువాతి కాలాల్లో తయారైన కొందరు అభినవ ఇస్లాం ద్వేషకులు ఇస్లామోఫోబియాను వెళ్లగక్కటం కోసం ఉపయోగించటం మొదలెట్టారు. మరోప్రక్క తమ అభ్యుదయవాదాన్ని నిరూపించుకోటానికి తెగ ఉబలాటపడే కొందరు నాస్తికులు వాటినే కాపీకొట్టి ప్రవక్త ముహమ్మద్(స) వారిని విమర్శిస్తూ స్వయంతృప్తి పొందే ప్రక్రియను ఈ మధ్యే మొదలెట్టారు.
***
ఆయన స్త్రీ లోలుడా?
గొప్ప ఆస్తిపరుడై ఉండి, స్త్రీల పట్ల మోజు కలిగిన వాడే బహుభార్యత్వం కలిగి ఉంటాడన్నది నేటి భౌతికవాదుల భావన. ప్రవక్త ముహమ్మద్(స) ఆస్తిపరుడూ కాదు స్త్రీ లోలుడు అంతకన్నా కాదన్న విషయం ఆయన చరిత్రను చదివేవారికే తెలుస్తుంది. తన ఇరవై అయిదవ ఏట తనకంటే ఇరవై సంవత్సరాలు పెద్ద వయస్సు కలిగిన ఓ వితంతువును వివాహమాడి తన యాభై మూడవ ఏట ఆమె చనిపోయే వరకు ఒక భార్యతో సంసారం చేస్తూ సామాన్య జీవితం గడిపే వ్యక్తిని “స్త్రీ లోలుడు” అని అభివర్ణించటం కంటే హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదు.
మరి ఆయన కలిగున్న బహుభార్యత్వం సంగతేంటి?
ఆనాటి అనాగరిక అరబ్బు సమాజం విభిన్న వైరీ వర్గాలుగా విడిపోయి ఉండేది. ఆ అనేక వర్గాల మధ్య జాత్యాహంకారం, అంతరానితనం, ద్వేషంతో ఒకరికొకరు ఎలాంటి సంబంధాలను పెట్టుకునేవారు కాదు. ఆ నేపథ్యంలో ఆ వర్గాలన్నిటి మధ్య అంటరానితనాన్ని దూరం చేసి వారిని ఐక్యం చేసే మార్గం వర్గాంతర వివాహ సంబంధాలను ప్రోత్సహించటం ఒక్కటే. ఆ పని చెయ్యటానికి ఎవరూ సాహసించనప్పుడు ఒక ప్రవక్తగా ఆయనే ఆ పనిని మొదలు పెట్టాల్సి వచ్చింది. అందుకే ఆయన అనేక వివాహాలు చేసుకోవాల్సి వచ్చింది. ఖురాన్ లో సైతం ఈ ఒక్క కారణంగానే ఆయన ఒక్కరికే అనేక వివాహాల అనుమతి ఇవ్వటం జరిగింది.
నిజంగా స్త్రీ లోలుడైన వ్యక్తి అనేక మందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడే గానీ వివాహాలు ఎందుకు చేసుకుంటాడు? పైగా వివాహాలు చేసుకున్నా కన్యలను చేసుకుంటాడే తనకంటే వయసులో పెద్దలను వితంతువులను ఎందుకు వివాహం చేసుకుంటాడు? ప్రవక్త ముహమ్మద్(స) వివాహం చేసుకున్న ఆయా విభిన్న వైరీ వర్గాలకు చెందిన స్త్రీలలో ఒకరు తప్ప దాదాపుగా అందరూ తనకంటే వయసులో పెద్దవారు పైగా వితంతువులే.
చరిత్రలో ఈ వాస్తవాలను తప్పించిన ఇస్లామోఫోబులు ఆయన బహుభార్యత్వాన్ని మాత్రమే పైకి చూపుతూ ఆయన్ని స్త్రీ లోలుడని పేరు పెట్టారు.
***
ఆయన తొమ్మిదేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవటమేంటి?
యాభై మూడేళ్ల ఆ పెద్ద మనిషి తొమ్మిదేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవటమేంటి? ఇది ప్రవక్త ముహమ్మద్(స) గురించి ఇస్లామోఫోబులు లేవనెత్తే రెండవ విమర్శ. వారలా చెప్పటానికి ఏదైనా ఆధారం ఉందంటే అది బుఖారిలో రికార్డు కాబడిన కొన్ని హదీసులే. బుఖారీ హదీసులో ప్రవక్త ముహమ్మద్(స)స్వయంగా చెప్పిన సమాచారం కూడా కాదు. ఒక ఉల్లేఖనకర్త ద్వారా చెప్పబడిన సమాచారం మాత్రమే! అందుకే కొందరు ప్రముఖ ముస్లిం పండితులు బలమైన కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా ఆ హదీసులలో సమాచారం యొక్క ప్రామాణికత విషయంలో లోతైన పరిశీలన చెయ్యటం జరిగింది.
ప్రవక్త ముహమ్మద్(స) జీవిత చరిత్రను ప్రారంభంలోనే రాసిన ఇబ్నె ఇషాక్, ఇబ్నె హిషామ్ లాంటివారు హజ్రత్ ఆయిషా(రజి) వారు ఇస్లాం స్వీకరించిన తొలితరం వారని పేర్కొన్నారు. దీనిని బట్టి అనేక ముస్లిం పండితులు ప్రవక్త ముహమ్మద్(స) హిజ్రత్ చేసిన తరువాత ఆమెను వివాహం చేసుకునే సమయానికి ఆమె వయసు 9 సంవత్సరాలు కాదు సుమారు 20 సంవత్సరాలని బలమైన ఆధారాలతో సహా నిరూపించారు.
ప్రఖ్యాత “మిష్కాత్” గ్రంధకర్త అయిన “వలీయుద్దీన్ ముహమ్మద్ అబ్దుల్లా అల్-ఖతీబ్-అల్ అమ్రి తబ్రీజీ” స్పష్టంగా “అస్మా ఉర్రిజాల్” లో ఆయిషా(రజి) వారి కంటే 10 సం.లు పెద్ద అయిన ఆమె అక్క హజ్రత్ అస్మా(రజి) వారు హిజ్రీ శకం 73 సం.లో చనిపోయేనాటికి ఆమె వయస్సు 100 సం. లు అని, ప్రవక్త ముహమ్మద్(స) వారు 622 సం.లో హిజ్రత్ చేసే నాటికి ఆమె వయస్సు 27 సం.లు అని.. ఆ విధంగా హజ్రత్ ఆయిషా(రజి) వారి కంటే 10 సం. లు పెద్ద అయిన హజ్రత్ అస్మా(రజి) వారి వయస్సు ను బట్టి హిజ్రత్ జరిగేనాటికి హజ్రత్ ఆయిషా(రజి) వారి వయసు 17 సం. లు. అని, హిజ్రత్ అనంతరం దాదాపు 2 తరువాత ప్రవక్త ముహమ్మద్(స) తో పెళ్లి జరిగేనాటికి ఆమె వయసు దాదాపు 19 లేక 20 సం.లని తేల్చి చెప్పారు.
ప్రవక్త ముహమ్మద్ (స) ఆయిషా(రజి) వారిని పెళ్లి చేసుకోక ముందే ‘జాబర్ ఇబ్నె అల్ మోతిమ్’ అనే వ్యక్తితో ఆమె నిశ్చితార్థం జరిగి రద్ధయిపోతుంది. దీనిని బట్టి అప్పటికే ఆమె పెళ్లీడుకొచ్చిన స్త్రీ తప్ప ఆరేళ్ల వయసున్న చిన్న పిల్ల కాదని నిరూపించటం జరిగింది.
ఇలా ముస్లిం పండితుల మధ్యే బేదాభిప్రాయం ఉన్న విషయాన్ని పట్టుకుని కొందరు ఇస్లామోఫోబులు ముహమ్మద్(స) వారు ప్రవక్తే అయితే తొమ్మిదేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవటమేంటి? అంటూ ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా ప్రచారాలు మొదలెట్టారు.
***
తన స్వంత కోడలిని పెళ్లి చేసుకోవటమేంటి?
ప్రవక్త ముహమ్మద్(స) ఆనాటి అనాగరిక అరబ్బు సమాజాన్ని నాగరికులుగా మార్చే క్రమంలో మౌలికంగా చేసిన పనే వారిలో పేరుకుపోయిన మూఢ నమ్మకాలను, మూఢాచారాలను అంతమొందించటం. అప్పటి సమాజంలో ‘దత్త పుత్రుడు’ కూడా ‘కన్న కుమారుడి’తో సమానం అన్న మూఢ నమ్మకం బలంగా పేరుకుపోయి ఉండేది. అది నైతికంగానూ, ప్రకృతిపరంగానూ తప్పే. ఆ నేపథ్యంలో ప్రవక్త ముహమ్మద్(స) దగ్గర నోటి మాటగా పిలువబడే వ్యక్తి ఉండేవాడు. అతనికి తన స్వంత మేనత్త కూతురికిచ్చి వివాహం కూడా చేసిన కొంత కాలానికే వారికి పొసగక విడాకులైపోతాయి. ఆ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ (స) స్వంత కొడుకే కానప్పుడు అతని భార్య ఆయనకు స్వంత కోడలు ఎలా కాగలదు? ఈ విధంగా నోటి మాటగా కుమారుడు అని పిలువబడే వ్యక్తి ‘కన్న కుమారుడు’ ఎప్పటికీ కాలేడన్న దురాచారాన్ని రూపుమాపే క్రమంలో ఆమెను ప్రవక్త ముహమ్మద్(స) వివాహం చేసుకుంటారు.
చరిత్రలో ఈ వాస్తవాలను తప్పించిన ఇస్లామోఫోబులు తన స్వంత కోడలిని పెళ్లి చేసుకోవటమేంటి? అంటూ గుడ్డి విమర్శలు చెయ్యటం మొదలెట్టారు.
***
ఆయన అవిశ్వాసులపై యుద్ధాలు చెయ్యటమేంటి?
ఇస్లాం మత వ్యాప్తి కోసమే ప్రవక్త ముహమ్మద్(స) స్వయంగా యుద్ధాలు చేస్తూ తమ శిష్యులకు యుద్ధాలు చెయ్యమని ఆజ్ఞాపించారని విమర్శించే ఏ ఒక్కరికీ ఖురాన్ యొక్క కనీస అవగాహన లేదనటంలో సందేహం లేదు.
ఆయన జీవిత కాలంలో చేసిన యుద్ధాలు సైతం కేవలం కొందరు దౌర్జన్య పరులు ధర్మాన్ని అణగద్రొక్కి ఆయన్ని, ఆయన అనుచరుల్ని చంపటానికి కుట్రలు పన్ని యుద్ధానికి కాలుదువ్విన నేపథ్యంలో ప్రాణరక్షణ నిమిత్తం యుద్ధాలు చేయాల్సి వచ్చిందే తప్ప సామాన్యులపై ఉద్దేశపూర్వకంగానో మత వ్యాప్తి కోసమో చేసిన యుద్ధాలు కావు.
“న్యాయ బద్ధంగా తప్ప అల్లాహ్ పవిత్రంగా నిర్ణయించిన ఏ ప్రాణినీ హతమార్చకండి (6:151)”
అంటూ అకారణంగా ఏ ఒక్కరినైనా చంపే అనుమతిని స్వయంగా ఖురానే ఇవ్వటం లేదు.
“మీతో పోరాడేవారితోనే మీరు పోరాడండి (2:190)” అని ఆదేశించిన ఖురానే- “శత్రువు గనుక సంధీ శాంతులవైపు మొగ్గు చూపితే నీవు కూడా దానికి సిద్ధపడు (8:61)” అని ఆదేశించటాన్ని బట్టి ఆనాడు దౌర్జన్యపరులు సామాన్య విశ్వాసులపై యుద్ధానికి తెగబడినప్పుడు మాత్రమే విశ్వాసులకు వారికి వ్యతిరేకంగా యుద్ధం చెయ్యమని ఆదేశించటం జరిగిందని ఇట్టే కనిపెట్టవచ్చు.
చరిత్రలో ఈ వాస్తవాలను తప్పించిన ఇస్లామోఫోబులు ప్రవక్త ముహమ్మద్(స) ఇస్లాం మత వ్యాప్తి కోసమే కత్తిపట్టి యుద్ధాలు చేశారని విమర్శలను సృష్టించారు.
కానీ, ఆయన జీవిత చరిత్రను క్షుణ్ణంగా చదివిన వ్యక్తులే కాక అప్పటి వరకూ తీవ్రంగా ఇస్లాంను, ప్రవక్త ముహమ్మద్(స) వారిని ద్వేషించిన ఇస్లామోఫోబులు సైతం ఏదో సందర్భంలో ఆయన చరిత్రను, బోధల్నీ చదివే సందర్భం ఏర్పడినప్పుడు ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించి ఇస్లాం స్వీకరించిన వారు కూడా ఉన్నారు.
ఈ వాస్తవాలను గ్రహించకుండా పైగా అసలు ప్రవక్త ముహమ్మద్ (స) ఆనాడు చేపట్టిన “వ్యక్తి సంస్కరణోధ్యమం” గురించి ఏ మాత్రం ఆలోచన చెయ్యకుండా, ఆయన బోధల్లో హేతుబద్ధతను గురించి ఆయన ప్రభావాత్మక బోధల గురించి ఆలోచన చెయ్యక ఆయన వ్యక్తిగత జీవితంపై కొందరు కల్పించిన ఎందుకూ పనికి రాని విమర్శలను పట్టుకుని ఆయన్ని అపార్థం చేసుకోవటమే నేడు చాలా మంది ముస్లిమేతరులు ప్రవక్త ముహమ్మద్ (స) విషయంలో చేస్తున్న అతి పెద్ద తప్పు.
