అల్-ఖైదాకు ప్రవక్త ముహమ్మద్(స) వారితో సంబంధం ఏమిటి?

“ప్రవక్త ముహమ్మద్(స) ను అవమానించే వ్యాఖ్యలు చేసినవారిని చంపేస్తాం, ఆత్మాహుతి దాడులు చేస్తామని” పైకి ముస్లిం వేషాలు ధరించిన అల్-ఖైదాకు చెందిన కొందరు సన్నాసులు చేసిన దిక్కుమాలిన హెచ్చరికలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.

అల్-ఖైదా అయినా లేదా మరెవరైనా సరే పై విధమైన మాటలు మాట్లాడేవారికీ, హింసాత్మక ధోరణులు అవలంబించేవారికి ప్రవక్త ముహమ్మద్ (స) వారితో ఏ విధమైన సంబంధం లేదని చెప్పటం మాత్రమే కాదు, పైగా అలాంటి తీవ్రవాద భావాలున్నవారు ఆయనకు పూర్తి వ్యతిరేకులు అనటం అతిశయోక్తి కాదు.

ఎందుకంటే స్వయంగా తన ముఖం మీదే బూతులు తిట్టినవారిని, దూషించిన వారిని, రక్తం కారేలా తనను హింసించిన వారిని, చివరకు తన అనుచరులను అతి దారుణంగా హింసించి చంపిన తన శత్రువులను సైతం అలవోకగా క్షమించి వేసిన వ్యక్తిత్వం ప్రవక్త ముహమ్మద్ (స) వారిది.

అంతేకాదు, ఏనాడూ స్వయంగా ఆయన శిష్యులు సైతం ఎవరో తమ ప్రవక్త పట్ల అవమానకరంగా మాట్లాడారనో, దూషించారనో ఏనాడూ “ప్రవక్త ముహమ్మద్(స) ను అవమానించే వ్యాఖ్యలు చేసినవారిని చంపేస్తాం, ఆత్మాహుతి దాడులు చేస్తామని” హెచ్చరించలేదు. పైగా అలాంటి శత్రువులతో స్నేహ హస్తం అందించటానికి సిద్ధంగా ఉండేవారు. చివరకు తమ ఆగర్భ శత్రువులు కష్టాల్లో ఉన్న సందర్భాలలో సైతం వారికి అండగా నిలబడేవారు.

ఇక ప్రవక్త ముహమ్మద్(స) జీవిత కాలంలో చేసిన యుద్ధాలు సైతం కొందరు దౌర్జన్య పరులు ధర్మాన్ని అంతమొందించే ఉద్దేశంతో ప్రవక్త ముహమ్మద్(స)పై మరియు ఆయన శిష్యులపై యుద్ధానికి కాలు దువ్విన సందర్భాలలో ప్రాణ రక్షణ నిమిత్తం చేసినవి మాత్రమే! తప్పితే ఇస్లాం ధర్మ స్థాపన కోసం చేసినవో లేక ఇతర రాజ్యాలను ఆక్రమించుకొటానికి చేసినవో కావు.

శత్రువును సైతం ప్రేమించటం, విమర్శించే వారి పట్ల కూడా దయతో మెలగటం, తన పట్ల శతృత్వం ప్రదర్శించేవారికి సైతం స్నేహ హస్తం అందించటం, తనను దూషించేవారిని సైతం చిరునవ్వుతో క్షమించగలగటం, కష్ట నష్టాల్లోనూ సహనం వహించటం అన్నవి ప్రవక్త ముహమ్మద్ (స) వ్యక్తిత్వం తాలూకు ప్రధానమైన లక్షణాలు.

అలాంటి ఉత్తమోత్తమ నైతక విలువలు ఎవరైతే కలిగి ఉంటారో అలాంటివారే ప్రవక్త ముహమ్మద్(స) ను ప్రేమించే నిజ అనుచరులు (లేదా ముస్లిములు) అవుతారు. తప్పితే ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన ఆదర్శాలను పాటించటం ప్రక్కనపెట్టేసి ఎవరో ప్రవక్త ముహమ్మద్ (స) వారిని దూషించారని వారిపై దాడులు చెయ్యటం, లేదా చంపేస్తాం, ఆత్మాహుతి దాడులు చేస్తామని దిక్కుమాలిన వార్నింగులు ఇవ్వటం అన్నది ప్రవక్త ముహమ్మద్(స) ప్రేమించటం అవ్వదు సరికదా పైగా అది ఆయనను హేళన చెయ్యటమే అవుతుంది. సరిగ్గా అదే ఇప్పుడు అల్-ఖైదా చేస్తున్న పనికూడా.

గతంలో హిజాబ్ పై నిరసనలు వెల్లువెత్తినప్పుడు సైతం అచ్చం ఇలాంటి హెచ్చరికలే చేశారు. పోనీ వారేమైనా భౌతికంగా వచ్చి ముస్లిం సమాజాన్ని కాపాడేదేమైనా ఉంటుందా అంటే వారున్న దేశాల్లోనే బంకర్ లలో దాక్కుని తమ కార్యకాలాపాలను రహాస్యంగా సాగించే దుస్థితి. వారు చేసే చిల్లర పనులు, చవకబారు డైలాగుల వల్ల ముస్లిం సమాజానికి పిసరంత లాభాం కూడా లేకపోగా పైగా నష్టమే జరుగుతుంది.

ఇలాంటి దిక్కుమాలిన హెచ్చరికల వల్ల ఇబ్బంది పడేది సామాన్య ముస్లిం ప్రజానీకమే! ఆ మాత్రం మినిమమ్ లాజిక్ ఆ అల్-ఖైదా సన్నాసులకు ఉండి ఉంటే ఎక్కడో దాక్కుని ఉగ్రవాదం చేస్తూ ఇస్లాం వ్యతిరేక జీవన విధానాన్ని గడిపే దుస్థితి ఉండేది కాదు.

బాధాకరమైన విషయం ఏమిటంటే ముస్లిం పేర్లు తగిలించుకుని, గెడ్డాలూ టోపీలు పెట్టుకుని ఇలాంటి బుద్ధి తక్కువ వెధవలు చేసే పనులు, వారి పనికిమాలిన మాటల వల్ల ముస్లిమేతరులు ఇస్లాంను అపార్థం చేసుకోవటం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *