వందల ఏళ్లు భారతదేశాన్ని పాలించిన ముస్లిం పాలకులు చేసింది హిందూ వ్యతిరేకపాలన కాబట్టే వాళ్లు దేశంలో అనేక దేవాలయాలు కూల్చేశారు ఎన్నో దేవాలయాల్ని దోచుకున్నారన్న భావజాలాన్ని మొట్టమొదటిసారి హిందూ-ముస్లిం విభజనను తీసుకురావాలన్న బ్రిటీషు అధికారుల కుట్రలో భాగంగా ప్రారంభమైనదే! ఆ తరువాత ఇదే భావజాలాన్ని ఆర్.ఎస్.ఎస్, సంఘ్ పరివార్ వగైరా హిందూ మతతత్వ సంస్థలు తరువాతి కాలాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాయి.
హిందూ పాలకులు చేసింది హిందూ వ్యతిరేక పాలన అనుకోవచ్చా?
ముస్లిం పాలకులు అనేక దేవాలయాలు కూల్చేశారు, గుళ్లలోని సంపదను దోచుకున్నారు కాబట్టి వారు చేసింది ముమ్మాటికీ హిందూ వ్యతిరేక పాలనే అని డిక్లేర్ చేసేవారు మరి స్వయంగా అనేకమంది హిందూ పాలకులు దేవాలయాలు కూల్చిన, దేవాలయాల సంపదను దోచుకెళ్లిపోయిన సంఘటనలు కూడా చరిత్రలో అనేకం ఉన్నాయి కాబట్టి ఆయా హిందూ పాలకులు చేసింది హిందూ వ్యతిరేక పాలన అని చెప్పగలరా?
ఎంతసేపు గజనీ, ఘోరీల కథలనే చెబుతూ ఒక్క ముస్లిం పాలకులే హిందూ దేవాలయాలు కుల్చారన్న కథల్నే పదే పదే వండి వార్చుతూ ఉన్న కారణంగా చాలా మందిలో ముస్లిం పాలకులంటే ‘హిందూ దేవాలయాలు కూల్చేసిన హిందూ వ్యతిరేక క్రూరులు’ అనే ఒక భావన ఏర్పడిపోయింది. నిజానికి దేవాలయాలను కూల్చేసిన, దోచుకున్న సంఘటనలు ముస్లిములకన్నా హిందూ పాలకుల కాలంలోనే ఎక్కువగా జరిగిందన్నది చరిత్ర పుటలు తిరగేస్తే తెలుస్తుంది!
దేవాలయాలను దోచుకున్న హిందూ రాజులు!
A). 11 వ శతాబ్దంలో మొదటి లోహర రాజవంశానికి చెందిన కాశ్మీర్ రాజు “హర్ష” హిందూ దేవాలయాలు కూల్చి, వాటిని దోచుకోటానికి ప్రత్యేకంగా ‘దేవోత్పతాన నాయక’ పేరుతో ఒక శాఖనే ఏర్పాటు చేశాడు. అతను ఎన్నో హిందూ మరియు బౌద్ధ దేవాలయాలను ధ్వంసం చేసి, విగ్రహాలను సంపదను దోచుకెళ్లాడు” (కల్హణ, రాజతరంగిణి).. 11 వ శతాబ్ద ప్రారంభంలో దక్షిణ భారతదేశంలో తంజావూరును రాజధానిగా చేసుకుని పాలిస్తున్న రాజేంద్ర చోళుడు బెంగాల్లోని మహిపాల ఆలయం నుండి ఈశ్వరుని కంచు విగ్రహం, ఒరిస్సా నుండి భైరవ, భైరవి కాళీ విగ్రహాలను యుద్ధంలో కొల్లగొట్టి తన రాజ్యానికి తరలించుకుపోయాడు.
C). 12 వ శతాబ్దానికి చెందిన పరమార్ రాజు శుభర్ వర్మన్ తన స్వంత రాజ్యంలో దేవాలయాలు కూల్చి దోచుకోవటంతో పాటు కాంబే మరియు ధబోయ్ లోని జైన దేవాలయాలను ధ్వంసం చేశాడు” (కమ్యూనల్ పాలిటిక్స్: ఫాక్ట్ వర్సెస్ మిత్, పేజ్. 52). అలాగే.. “6 వ శతాబ్దానికి చెందిన శశాంక బుద్ధగయలో బోధివృక్షాన్ని నరికేసి మహాబోధి ఆలయాన్ని శివాలయంగా మార్చివేయటం జరిగింది” (రెలిజియన్ అండ్ గేవాల్ట్, పేజీ. 72).” ఇలాంటి ఎన్నో వాస్తవాలు మరుగున పడిపోయాయి.
*******
హిందూ దేవాలయాల్ని కూల్చేసిన హిందూ పాలకులు!
A). 642 CE లో పల్లవ రాజైన నరసింహవర్మన్ 1 చాళుక్యులను నిర్మూలించి, వారి రాజధాని వతాపిని కొల్లగొట్టి, అలయ ధ్వంసం చేసి గణేశుడి బొమ్మను తమిళనాడులోని తన రాజ్యానికి తీసుకుపోయాడు. యాభై సంవత్సరాల తరువాత అదే చాళుక్యుల సైన్యాలు ఉత్తర భారతదేశంపై దండెత్తాయి మరియు అక్కడ ఓడిపోయిన శక్తుల నుండి దోచుకున్న గంగా మరియు యమునా చిత్రాలను తిరిగి దక్కన్‌కు తీసుకువచ్చాయి.. 10 వ శతాబ్దం ప్రారంభంలో, రాష్ట్రకూట రాజు ఇంద్ర III కళాప్రియ ఆలయాన్ని ధ్వంసం చేశాడు.
C). కళింగరాజ్యాన్ని మగధరాజులు జయించినపుడు రిషభనాథుని విగ్రహాలను ఎత్తుకుపోగా, ఆ తరువాత ఖారవేలుడు అనే కళింగరాజు మగధసామ్రాజ్యంపై దండెత్తి ఆ విగ్రహాలను తిరిగి తెచ్చుకొన్నట్లు క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన హతిగుంఫ శాసనం ద్వారా తెలుస్తున్నది.
D). పదకొండవ శతాబ్దానికి చెందిన రాజేంద్ర చోళుడు దండయాత్రలు చేసి ఓడిపోయిన పాలకుల ఆలయాలు ధ్వంసం చేసి, చాళుక్యరాజ్యం నుంచి సూర్యపీఠం, గణేషుడు, కళింగులనుంచి భైరవ చిత్రం, తూర్పు చాళుక్యుల నుంచి నంది విగ్రహం, బెంగాలు నుంచి శివుని విగ్రహాలను తరలించుకొని వచ్చాడు.
E). 1514 లో కృష్ణదేవరాయలు ఉదయగిరిని జయించి అక్కడ బాలకృష్ణుని విగ్రహాన్ని, పండరిపురాన్ని ఆక్రమించుకొని విట్టలనాథుని విగ్రహాన్ని ఎత్తుకొనిపోయి విజయనగరంలో ప్రతిష్టించుకొన్నాడు.
F). 1579 లో గోల్కొండనవాబు వద్ద పనిచేసే మరాఠి బ్రాహ్మణుడైన మురహరిరావు రాయలసీమ ప్రాంతాలను గోల్కొండరాజ్యంలో కలిపే యత్నంలో అహోబిలం నరసింహస్వామి ఆలయంలోని విగ్రహాన్ని గోల్కొండకు తరలించుకొనిపోయాడు.
G). టిప్పూసుల్తాన్ పాలనలో శ్రీరంగ పట్నం పై మరాఠా రాజులు దాడి చేసి అక్కడ ఉన్న శృంగేరీ దేవాలయాన్ని కూలగొట్టి దేవీ శారదా విగ్రహాన్నీ అందులో సంపదనూ దొచుకెళ్లిపోయారు. తిరిగి ఆ దేవాలయాన్ని టిప్పూసుల్తాన్ పునరుద్ధరించటం జరిగింది.
H). 8వ శతాబ్దం ADలో బెంగాలీ సేనలు కాశ్మీర్ రాజ్యం యొక్క రాష్ట్ర దేవత అయిన విష్ణు వైకుంఠ ప్రతిమను ధ్వంసం చేయడం ద్వారా కాశ్మీర్‌లోని రాజు లలితాదిత్య రాజ్యంపై ప్రతీకారం తీర్చుకున్నారు.
I). 10వ శతాబ్దం ప్రారంభంలో, ప్రతిహార రాజైన హేరంబపాల, కాంగ్రా (హిమాచల్ ప్రదేశ్) సాహి రాజులను ఓడించినప్పుడు విష్ణు వైకుంఠ యొక్క ఘన బంగారు ప్రతిమను స్వాధీనం చేసుకున్నాడు.
J). 1460వ దశకంలో, ఒరిస్సాలోని సూర్యవంశీ గజపతి వంశ స్థాపకుడు కపిలేంద్ర, తమిళ దేశంలోని ఆక్రమణ యుద్ధాల సమయంలో కావేరి డెల్టాలోని శైవ మరియు వైష్ణవ ఆలయాలను కొల్లగొట్టాడు.
K). పదకొండవ శతాబ్దం మధ్యలో, చోళ రారైన రాజాధిరాజు చాళుక్యులను ఓడించి, కల్యాణిని దోచుకున్నాడు, ఒక పెద్ద నల్ల రాతి తలుపు సంరక్షకుడిని తంజావూరులోని తన రాజధానికి తీసుకువెళ్లాడు, అక్కడ అది తన పౌరులకు యుద్ధ ట్రోఫీగా ప్రదర్శించబడింది.
L). 9 శతాబ్దంలో , పాండ్యన్ రాజు శ్రీమార శ్రీవల్లభ శ్రీలంకపై దండెత్తాడు మరియు రాజు సేన I ని ఓడించి అతనితో పాటు నగలు , బంగారం మరియు విలువైన దేవాలయాల సంపదను , ముఖ్యంగా బుద్ధుని యొక్క భారీ బంగారు విగ్రహాన్ని తీసుకువెళ్లాడు. తరువాత, తరువాత శ్రీలంక పాలకుడు సేన II, పాండ్యన్ రాజధాని మదురైపై దాడి చేసి బుద్ధుని విగ్రహాన్ని తిరిగి తీసుకువెళ్లాడు
ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో హిందూ రాజులు కూల్చేసిన, దోచుకున్న అనేక దేవాలయాల చరిత్ర ఉంది.
*******
అటు ముస్లిం పాలకులైనా, ఇటు హిందూ పాలకులైనా దేవాలయాలను ఎందుకు కుల్చారు?
ఆనాటి ప్రతీ హిందూ రాజ్యానికి ఒక రాష్ట్రదైవం ఉండేది. ఆ ఆలయం ఆ రాజ్యలక్ష్మికి, సౌభాగ్యానికి, ప్రతిష్టకు సంకేతంగా కొనసాగేది. అంతేకాక ఆలయాలలో రహస్య మాళిగలలో సంపదలను భద్రపరచుకోవటం జరిగేది. ఆ విధంగా దేవాలయాలు సంపదకు నిలయాలుగా ఉండేవి.
ఒక రాజు మరో రాజ్యాన్ని జయించినపుడు ఓడిపోయిన రాజ్యం యొక్క రాష్ట్ర దైవాన్ని తరలించుకొని తన రాజ్యంలో ప్రతిష్టించుకోవటం అన్నది వేల సంవత్సరాలుగా నడిచిన ఒక సంప్రదాయం. అలా చేయటం ద్వారా మాత్రమే ఆ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవటం పూర్తయినట్లు భావించేవారు.
మధ్య యుగాల్లో ఒక రాజ్యం మరో రాజ్యాన్ని జయించినప్పుడు ఓడిపోయిన రాజ్యం యొక్క రాజ్య దేవతను, ధ్వంశం చెయ్యటమో, తరలించుకుపోయి తమ రాజ్యంలో కలుపుకునేవారు. అలా చెయ్యటం యుద్ధాన్ని నెగ్గటానికి, వారి రాజ్యాన్ని తమ రాజ్యంలో కలుపుకోవటానికి సంకేతంగా (Symbolic) భావించేవారు.
ఆ విధంగా రాజ్యాలకు రాజ్యాలకూ మధ్య జరిగిన అనేక యుద్ధల్లో ఒక్క ముస్లిం రాజులే కాదు అనేక హిందూ రాజులు సైతం ఆలయాలను ధ్వంశం చేసిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. అదంతా కేవలం అప్పటి రాజ్యకాంక్ష తాలూకు యుద్ధోన్మాదమే తప్ప మతోన్మాదం కాదు.
అలాగే ఖుతుబుద్దీన్ ఐబక్ నుండి ఔరాంగ్ జేబ్ వరకు ఎందరో ముస్లిం పాలకులు భారీ విరాళాలు, జాగీర్లు ఇచ్చి దేవాలయాలు కట్టించిన, పునరుద్ధరించిన చరిత్ర సైతం ఉంది. కానీ, ఈ చరిత్ర నేడు మరుగుపరచబడింది.
ఎందరో హిందూ-ముస్లిం పాలకులు ఎన్నో దేవాలయాల్ని కూల్చేయటం జరిగిందన్నది కాదనలేని వాస్తవం. అది కేవలం రాజ్యాల మధ్య యుద్ధ జ్వాలలు రగులుకున్న సమయంలో జరిగిందే తప్ప అందులో ఎటువంటి మత ఉన్మాదమూ లేదు.
కానీ, చరిత్రలో కేవలం ఒక్క ముస్లిం పాలకులు మాత్రమే దేవాలయాలను పడగొట్టేశారని, దోచుకున్నారని సామాన్య హిందువుల ను బ్రెయిన్ వాష్ చేస్తూ అదంతా ‘ముస్లిములు హిందూత్వం పై చేసిన దాడి’గా అభివర్ణించటం జరుగుతుంది. మధ్య యుగాల్లో గతించిపోయిన ముస్లిం పాలకులను హిందూ వ్యతిరేకులని చిత్రీకరిస్తూ.. “ముస్లిములు అంటే హిందూ వ్యతిరేకులు” అన్న భావజాలాన్ని సర్వసామాన్యం చెయ్యటం జరుగుతుంది. హిందూ, ముస్లిముల మధ్య విధ్వేషాన్ని రగిలించే ప్రయత్నం నేడు బాహాటంగా జరుగుతుంది.
ముస్లిం పాలకులది హిందూ వ్యతిరేక పాలనా?
