ముస్లిమేతరుల్లో చాలా మంది ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి చాలా సార్లు చెప్పే కొన్ని మాటలు- “ముస్లిం సమాజంపై పని చేస్తుంది ఖురాన్ భావజాలమే! ఇస్లాం ఆదేశాల ప్రకారమే ముస్లిం సమాజం ఆచరిస్తూ ఉంటుంది! ఖురాన్ ను ముస్లిం సమాజాన్ని వేరు చేసి చూడలేము!” అన్నవి.
మరీ ముఖ్యంగా ప్రపంచంలో ఏ మూలైనా ముస్లిం పేరు పెట్టుకున్నోడు ఏదైనా తప్పు చేసినప్పుడో లేక ఏదైనా నేరానికి పాల్పడినప్పుడో లేక ఏ ఉగ్రవాద సంఘటనకు పాల్పడినప్పుడో లేక సున్నీ షియాల మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడో వెనకా ముందూ ఆలోచించకుండా “ముస్లిములు ఇలాంటి నేరాలకు, ఘోరాలకు పాల్పడటానికి కారణం వారిపై పనిచేస్తున్న ఖురాన్ భావజాలమే” అన్న డిక్లరేషన్ వెంటనే చేసేస్తారు.
ఒక ముస్లిం పేరు పెట్టుకున్నోడు నేరానికి పాల్పడితే అది ఖురాన్/ఇస్లాం భావజాలమైపోతుంది అదే ముస్లిమేతర పేరు పెట్టుకున్నోడు నేరం చేస్తే అది వాడి చెడు స్వభావం కొద్దీ నేరం చెయ్యటం అవుతుంది. ఇదే నేడు కొందరు చేసే గమ్మత్తైన నిర్ధారణ.
దీనికో గొప్ప ఉదాహరణం: ఈ మధ్యే ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుణ్ణి ఆ అమ్మాయి కుటుంబీకులు హత్య చేశారు. దానితో సోషల్ మీడియా అభ్యుదయవాదులంతా ఏకగ్రీవంగా ఆ హత్యేదో ముస్లిం సమాజం దగ్గరుండి ప్లాన్ చేసి హత్య చేయించినట్టు డిక్లేర్ చేసేసి “ముస్లిములపై ఖురాన్ భావజాలం పని చెయ్యటాన్ని బట్టే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని” తమకుతామే నిర్ధారించేసుకుని పొడవాటి వ్యాసాలు రాసిపరేసి నానా భీభత్సం చేసేశారు! సరిగ్గా అలాంటి పరువు హత్యే హైదారాబాద్ బేగం బజార్ లో మరొకటి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా ఓ యువకుణ్ణి చంపేయటం జరిగింది. ఇక్కడ కూడా ఆ యువకుణ్ణి చంపింది అమ్మాయి తరఫు కుటుంబీకులే! కాకపోతే వారు హిందువులు.
వారం క్రితం ముస్లిం అమ్మాయి కుటుంబీకులు నేరానికి పాల్పడిన కారణంగా ఖురాన్ ను, ఇస్లాంను పనికట్టుకుని ఇరికించేసి ఆ నేరానికి మొత్తం ముస్లిం సమాజాన్ని బాధ్యులుగా చేసి తెగ గోలపెట్టిన అభ్యుదయవాదులంతా సరిగ్గా అలాంటి నేరమే మరొకటి జరిగినప్పుడు నేరం చేసింది ముస్లిం కాకపోవటం వల్ల అప్పటివరకూ డ్యాన్స్ కట్టినవారంతా తిరిగి సైలెంటుగా దుప్పట్లలోకి దూరిపోయారు.
ఏ వ్యక్తైనా తప్పు చెయ్యాలి అనుకున్నప్పుడు అతనిలో ఉండే చెడు ఆలోచనలే కారణమవుతాయి తప్పితే చెడు చెయ్యటానికి మత బోధలో, ధార్మిక గ్రంథ ఆదేశాలో కారణమవ్వవు. మరీ ముఖ్యంగా తెలుసుకోవలసింది ధార్మిక గ్రంథ ఆదేశాలు మనిషిని చెయ్యి పట్టుకుని చెడు చెయ్యటం నుండి నిరోధించవు! కానీ వాటి ఆదేశాలను పాటించే వ్యక్తులను చెడు ఆలోచనలను ఎలా నియంత్రించుకోవాలో నేర్పుతాయి, నైతికంగా ఎలా జీవించాలో తర్ఫీదునిస్తాయి. ధార్మిక గ్రంథ ఆదేశాలను నిర్లక్ష్యం చేసే ఏ వ్యక్తైనా మంచి ఆలోచనలను అణచిపెట్టి, సహజంగానే అతనిలో నిత్యం చెలరేగే చెడు ఆలోచనల కారణంగానే తప్పులు/నేరాలు చేస్తాడు.
ఈ విషయం తెలీని కొందరు ప్రపంచంలో ఏ మూల నేరం జరిగినా అందులో నేరస్తుడు ముస్లిం పేరు కలిగి ఉంటే దానికి ఖురాన్/ఇస్లామే కారణమని నిర్ధారణ చేసేసి స్వయంతృప్తి చెందుతుంటారు.
కాబట్టి ఇక్కడ తెలుసుకోవలసింది…
ఒకవేళ ముస్లిం పేరు కలిగిన ఏ ఒక్కడైనా అన్యాయంగా ఎవర్నైనా హత్య చేస్తే… అతను “అన్యాయంగా ఏ ప్రాణినీ హతమార్చకండి” అన్న ఖురాన్ ఆదేశాన్ని ప్రక్కన పెట్టేశాడని అర్థం చేసుకోవాలి.
ఒకవేళ ముస్లిం పేరు కలిగిన ఏ ఒక్కడైనా ఉగ్రవాద చర్యకు పాల్పడితే… అతను “అన్యాయంగా ఒక వ్యక్తిని హత్య చేస్తే అతను సమస్త మానవాళినీ హత్య చేసినట్టే” అన్న ఖురాన్ ఆదేశాన్ని ప్రక్కన పెట్టేశాడని అర్థం చేసుకోవాలి.
ఒకవేళ ముస్లిం పేరు కలిగిన ఏ ఒక్కడైనా తోటి ముస్లిములు/ముస్లిమేతరుల మధ్య ఉచ్చనీచ బేధాభావాలు ప్రదర్శిస్తే అతను “మానవులంతా ఒకే జంట సంతానం దైవం దృష్టిలో అందరూ సమానమే” అన్న ఖురాన్ ఆదేశాన్ని ప్రక్కన పెట్టేశాడని అర్థం చేసుకోవాలి.
ఒకవేళ ముస్లిం పేరు కలిగిన ఏ ఒక్కడైనా స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించటమో, వ్యభిచారానికి పాల్పడటమో, అత్యాచారమో చేస్తే… అతను “పరాయి స్త్రీల విషయంలో తమ చూపులను, మర్మాంగాలను కాపాడుకోవాలని” చెబుతున్న ఖురాన్ ఆదేశాలను ప్రక్కన పెట్టేశాడని అర్థం చేసుకోవాలి.
తప్పితే ముస్లిం పేర్లు పెట్టుకుని నేరాలు చేస్తున్నవారు ప్రత్యేకంగా ఖురాన్ భావజాలం కారణంగా నేరాలు చెయ్యరు. ఇదే సూత్రం ముస్లిమేతర వర్గాలకు కూడా వర్తిస్తుంది.
ముస్లిమేతర వర్గాల్లో మాదిరిగానే ముస్లిం సమాజంలోనూ చాలా మంది ముస్లిములు అనేక చెడుల్లో కూరుకుపోవటానికి కారణం వారు ఖురాన్ ఆదేశాలకు దగ్గరవ్వటం కాదు! వారు ఖురాన్ ఆదేశాలకు చాలా దూరమైపోవటమే! ఇది చాలా మంది ముస్లిమేతరులు నేడు అర్థం చేసుకోవటం లేదు.
దానికి ప్రధాన కారణం ఇస్లాంను అవగాహన చేసుకోవటానికి వారు ఖురాన్ హదీసులను చదవటానికి బదులు ముస్లిం సమాజాన్ని చూడటమే! ఇదే నేడు ముస్లిమేతరుల్లో ఇస్లాం పట్ల అనేక అపార్థాలు ఏర్పడటానికి కారణమయ్యింది.
అందుకే టోపీ, గెడ్డాలు పెట్టుకుని ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకుని ఉగ్రవాదం చేసేవారిని చూసి బహుశా ఖురాన్ వారికి అలా చెప్పబట్టే వారు ఉగ్రవాదం చేస్తున్నారన్న నిర్ణయానికి వచ్చేసి వారు చేసేదానికి “ఇస్లామిక్ టెర్రరిజం” అనే దిక్కుమాలిన పదాన్ని ఉనికిలోకి తెచ్చారు. వారు చేస్తున్నది ఇస్లామిక్ జిహాద్ అనే అపార్థానికి గురైపోయారు.
ఆస్తిక వర్గాల్లోనే కాదు నాస్తిక వర్గంలో సైతం మంచి పనులు చేసే మంచి వ్యక్తులతో పాటు చెడు చేసే చెడు వ్యక్తులూ కొందరుంటారు ఉంటారు. ఆ కొందరు చేసే చెడుకు వారి మతాలు, ధార్మిక గ్రంథాలే అని నిర్ధారించటానికి మించిన మూర్ఖత్వం బహుశా మరొకటి ఉండదు. కానీ చిత్రం ఏమిటంటే చాలా మంది అలాంటి నిర్ధారణలే చేస్తుంటారు. పైగా వారు చదుకున్నవారు అయి ఉండటం కొసమెరుపు.
ఇస్లాం అపార్థానికి గురవ్వటం వెనుక అసలు కారణం?
