ఇస్లాం & హిందుత్వంలో ప్రాథమిక సారూప్యతలు

హిందూ ధర్మానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథాలు వేదోపనిషత్తులు, భగవద్గీతా శాస్త్రాలైతే ఒకనాటి వైదిక ధర్మమే తరువాతి కాలాల్లో హిందూ ధర్మంగా పిలువబడుతూ వచ్చింది. ఇస్లాంకు సంబంధించిన ప్రామాణిక గ్రంథం ఖురాన్ శాస్త్రం అయితే స్వయంగా ఖురాన్ “ఇది పూర్వం వచ్చిన సకల గ్రంథాలకూ ధృవీకరణ” అన్న ప్రకటన చేస్తుంది.

ఇక ఇస్లాం మరియు సనాతన వైదిక ధర్మంలో మౌలికంగా మూడు అంశాల్లో స్పష్టమైన సారూప్యతలను చూడగలం. వాటిలో మొదటిది:

1. మానవాళి అంతటికీ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆయన అనేక పేర్లతో పిలువబడ్డాడు!

“ఆయన ఒక్కడు. ఆయన తప్ప మరొకడు లేడు” – ఛాందోగ్య ఉపనిషత్ 6:2:1

“పరమేశ్వరుడు ఒక్కడే తత్వజ్ఞానులు అనేక గుణ నామముల ద్వారా ఆయనను వర్ణించారు” – ఋగ్వేదము 10:114:5

“మీ దేవుడు ఒక్కడే. ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు” – ఖురాన్ 2:163

“మీరు ఆయనను అల్లాహ్ అని పిలవండి లేదా రహ్మాన్ అని అయినా సరే. ఏ పేరుతో అయినా పిలవండి” – ఖురాన్ 17:110

అటు వేదోపనిషత్తులు, గీతా శాస్త్రాలు చదివినా, ఇటు ఖురాన్ చదివినా మానవాళి అంతటికీ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆయన అనేక భాషల్లో అనేక పేర్లతో పిలువబడ్డాడు అనే విషయం అర్థమవుతుంది. ఇదే విషయం బైబిల్లోనూ చూడగలం. ఇక హిందూశాస్త్రాల్లో ‘పరమేశ్వరుడు’, ‘సర్వేశ్వరుడు’ అన్న పేర్లతో పిలువబడ్డ దేవుడే ఖురాన్ లో ‘అల్లాహ్’ అన్న పేరుతో అలాగే బైబిల్లో ‘యెహోవా’ అన్న పేరుతో పరిచయం కాబడ్డాడు.
******

ఇస్లాం మరియు సనాతన వైదిక ధర్మంలో సారూప్యత కలిగిన రెండవ అంశం:

2. మానవులందరి ధర్మం ఒక్కటే. అది అనేక కాలాల్లో అనేక పేర్లతో పిలువబడింది!

“నాశరహితమగు ఈ నిష్కారమ కర్మయోగమును పూర్వము సూర్యునికి అప్పజెప్పితిని. సూర్యుడు వైవశ్యత మనువుకు, మనువు ఇక్ష్వాకు బోధించెను. ఆ ప్రకారంగా పరంపరగా వచ్చిన ఆ పురాతన నిష్కామ కర్మ యోగమునే ఇప్పుడు తిరిగి నీకు జెప్పితిని” – గీత 4:1-3

“ఏ ఉపదేశమైతే గతంలో నోవహ్ ప్రవక్తకు ఇచ్చి ఉన్నామో అదే ధర్మాన్ని నీకు వహీ (శృతి) ద్వారా తెలియపరిచాము. అదే ధర్మాన్ని గతంలో అబ్రహాముకు, మోషే, యేసుకు కూడా నిర్దేశించాము” – ఖురాన్ 42:13

‘ఏక దేవుని విధేయతా ధర్మమే’ ఆది నుండీ పరంపరగా ప్రవక్తలందరికీ ఇవ్వబడుతూ వచ్చింది. అదే సనాతన ధర్మం, వైదిక ధర్మం, నిష్కామ కర్మ యోగం అని అటు హిందూ శాస్త్రాల్లో, ఖురాన్ లో ‘ఇస్లాం’ అని పిలువబడినట్టు తెలుసుకోగలం. ఇస్లాం అన్న పదానికి శాంతి, సమర్పణ మరియు దైవ విధేయత అని అర్థం. ఇదే బైబిల్లో ‘పురాతన మార్గం’ అని పిలువబడినట్టు చూడగలం.
******

ఇస్లాం మరియు సనాతన వైదిక ధర్మంలో సారూప్యత కలిగిన మూడవ అంశం:

3. మానవులందరూ ఒకే జంట సంతానం. పుట్టుకరిత్యా ఏ ఒక్కరూ ఎక్కువా కారు తక్కువా కారు!

“ఒకే స్త్రీ, పురుషుల జంట ద్వారా మనుష్యులు జన్మించెను” – బృహదారణ్యక ఉపనిషత్తు 3:4:3

“కొందరు పెద్దలు లేరు, కొందరు చిన్నలు లేరు. వీరందరూ పరస్పరం సోదరులే” – ఋగ్వేదం 5:60:5

“మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీ, పురుష జంట నుండి సృష్టించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవ పాత్రుడు” – ఖురాన్ 49:13

ఈ విధంగా అటు హిందూ శాస్త్రాల్ని ఇటు ఖురాన్ శాస్త్రాన్ని చదివినా మానవులంతా ఒకే జంట సంతానం, పుట్టుకను బట్టో, కులాన్ని బట్టో, జాతి-వర్గాన్ని బట్టో, వంశం-రంగును బట్టో ఏ ఒకరూ ఎక్కువా కాదు, ఏ ఒకరూ తక్కువా కాదని తీర్మానిస్తున్నట్టు తెలుసుకోగలం.
ప్రవర్తనరిత్యా ఎవరైతే భయభక్తులతో మెలుగుతారో వారే దేవుని దృష్టిలో గొప్పవారుగా పరిగణించబడతారని ఖురాన్ ప్రకటిస్తుంది.

ఈ విధంగా అటు హిందూ శాస్త్రాల్నీ, ఇటు ఖురాన్ ను పరిశీలనగా చదివితే పై మూడు ప్రధానమైన మౌలిక అంశాల్లో స్పష్టమైన సారూప్యతను మనం గమనించగలం.

ఇక బహుదైవాల ఆరాధన, మతవ్యవస్థలో వ్యక్తుల మధ్య పుట్టుకను బట్టో, కులమతాలను బట్టో, రంగును బట్టో ఉచ్చనీచభావాలను ప్రదర్శించరించటం లాంటి అజ్ఞానపూరితమైన విషయాలు తరువాతి కాలాల్లో మత పండితుల వేషాలు ధరించిన కొందరు స్వార్థపరులు ప్రవేశపెట్టినవే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *