అహింసా, శాంతి, సహనాలు, నైతిక విలువలను నేర్పుతూ ఒక మనిషి వ్యక్తిగత, భౌతిక జీవన రంగాల్లో ఎలా విజయం సాధించాలో ఆచరణాత్మకంగా తర్ఫీదునిచ్చే ధర్మమే ఇస్లాం. అది కేవలం అనేక మతాల్లో ఒక మతం కాదు అదొక సంపూర్ణ “జీవన విధానం”.
చివరకు మనిషి చీకట్లో ఒంటరిగా ఉన్నా అతను ఏ విధమైన చెడులకూ పాల్పడకుండా తన మనోవాంఛల్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో నేర్పుతూ, మనిషిని ఉత్తమ నైతిక విలువలతో నిరంతరం నడిపే ధర్మం ఇస్లాం.
మనిషి తన జీవితంలో ఆత్మహత్యకు పాల్పడేంత తట్టుకోలేని తీవ్ర ఒత్తిళ్లు, ఆందోళనలు, కష్ట-నష్టాలు ఎదురైనప్పుడు సైతం అతన్ని గుండె ధైర్యంతో విజయవంతంగా ఎలా జీవించవచ్చో ప్రాక్టికల్ గా నేర్పే ధర్మం ఇస్లాం.
దైవారాధన అన్నది కేవలం పూజా పునస్కారాలు మాత్రమే కాదు, దేవుని ప్రసన్నత పొందటం కోసం ఇతరుల శ్రేయస్సు కోరుతూ చేసే ప్రతీ పనీ దైవారాధనే అంటుంది ఇస్లాం.
సమతూకంతో వస్తువులను అమ్మటం నుండి తలిదండ్రులను, భార్య-పిల్లలను గౌరవించటం సంరక్షించటం, బీదసాదలను, అన్నార్తులను ఆదుకోవటం, స్త్రీలను గౌరవించటం, చివరకు న్యాయం శత్రువువైపున్నా న్యాయం వైపు నిలబడటం వరకు ప్రతీదీ దైవారాధనే అని చెబుతుంది ఇస్లాం. భార్యాపిల్లల నోటికి అందించే ఓ అన్నం ముద్ద కూడా సత్కార్యంగా పరిగణించబడి దైవం వద్ద దానికి సైతం బహుమానం ప్రాప్తమవుతుందని చెబుతున్న ధర్మం ఇస్లాం.
మత వ్యవస్థలలో పేరుకుపోయిన నీచమైన మూఢ నమ్మకాలు, హేతువిరుద్ధమైన విశ్వాసాలు, విగ్రహారాధన-సృష్టితాల ఆరాధనల నుండి హేతుబద్ధమైన విశ్వాసాల వైపునకు నడుపుతూ, లోతైన శాస్త్రీయ ఆలోచనా విధానాన్నీ, ఉన్నతమైన నాగరికత, విలువలను నేర్పే ధర్మం ఇస్లాం.
ఈ విషయాల్ని ఏ వ్యక్తి అయినా సరే కొంత సమయం తీసి ఖురాన్, హదీసులు చదివితే అతను అతి సులువుగా గ్రహించగలుగుతాడు.
అలాంటి ఉన్నతమైన ధర్మాన్ని కేవలం బోధించటం మాత్రమే కాక, ఆ ధర్మాన్ని వ్యక్తిగత-సామాజిక రంగాల్లో అన్వయిస్తూ ఎలా నడుచుకోవాలో ఆచరణాత్మకంగా చూపి అనాగరికుల్ని ఉత్తమ నాగరికులుగా మార్చిన వ్యక్తే ప్రవక్త ముహమ్మద్ (స).
అవును ముహమ్మద్ (స) ఒకప్పుడు ఆర్ధికంగా-భౌతికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన ఓ నాగరిక సమాజం వద్దకు ప్రవక్తగా పంపబడలేదు. పరమ నీచమైన మూఢ నమ్మకాలతో నైతికత, మానవతా విలువల విషయంలో అధః పాతాళానికి అణిగిపోయి అరేబియా ఎడారి దిబ్బల మధ్య నివసిస్తూ పశుత్వంలో మునిగితేలే అనాగరిక జాతి ప్రజల వద్దకు ప్రవక్తగా పంపబడ్డారు.
ఆయన ద్వారా బోధించబడిన ఇస్లాం కేవలం ఇరవై మూడు సంవత్సరాల కాలంలో శూన్యమైన ఎడారిలో నుండి ఓ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించింది, కొన్ని సంవత్సరాల్లోనే ఆనాటి అనాగరికులైన అరబ్బులను ఉన్నత నాగరికతకు, శాస్త్రీయ విజ్ఞానానికి ధ్వజవాహకులుగా మార్చగలిగింది. యూరప్, ఆఫ్రికా, స్పేయిన్ నుండి అగ్రరాజ్యాల ప్రజల వరకు వారి ఆలోచనా విధానాన్ని లోతుగా ప్రభావితం చేసింది.
****
ఇదీ ఇస్లాం వాస్తవ రూపమైతే.. నేడు ఇస్లాం పట్ల అనేక అపార్థాలు ఎలా పుట్టుకొచ్చాయి!?
ఈ నేపథ్యంలో ఏ ముస్లిమేతరుడైనా తక్షణం అడిగే కొన్ని ప్రశ్నలు-
ఇస్లాం లక్ష్యం సమాజంలో చెడును రూపుమాపి శాంతిని స్థాపించటం అయితే.. నేడు ఇస్లాం అంటే ఉగ్రవాదం ప్రేరేపించే మతం అన్న ప్రచారం దేనికి జరుగుతుంది?
అల్-ఖైదా, ఐ.ఎస్.ఐ.ఎస్ వగైరా ఉగ్రవాద సంస్థలు ముస్లిముల ద్వారా ఎందుకు నడుపబడుతున్నాయి? వారు ముస్లిములు కారా?
వీటికి సమాధానం నేటి మీడియా ఇస్లాంను ఏ కోణంలో అయితే చూపుతుందో దానినే నేడు చాలా మంది చూసి విమర్శించటం! తప్పితే నేడు ఇస్లాంను విమర్శిస్తున్న వారిలో ఏ ఒక్కరూ ఇస్లాం యొక్క వాస్తవ కోణాన్ని ఖురాన్, హదీసుల ద్వారా పరిశీలించి తెలుసుకోకపోవటం లేదు.
కానీ, ఒకప్పుడు ఇస్లాంను తీవ్రంగా విమర్శించిన వారే ఏదో సందర్భంలో ఖురాన్, ప్రవక్త ముహమ్మద్ (స) బోధలు చదివే సందర్భం ఏర్పడినప్పుడు ఇస్లాం యొక్క వాస్తవికతను గ్రహించి ఇస్లాం స్వీకరించిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి.
ఉదాహరణకు నెదర్లాండ్స్ కు చెందిన ప్రముఖ రాజకీయవేత్త, అంతేకాక “ఫార్-రైట్ పార్టీ (PVV)” తరఫున ‘మెంబర్ ఆఫ్ పార్లమెంట్ (MP)’ గా ఎన్నికైన “జోరమ్ వాన్ క్లావెరెన్” ఇస్లాం స్వీకరించిన సంఘటననే తీసుకుంటే..
ఇస్లాంను దారుణంగా విమర్శించే “జోరమ్ వాన్ క్లావెరెన్” ఒకానొకప్పుడు “యాంటీ-ఇస్లామిక్ (Anti-Islamic)” ఉద్యమాన్ని నడపటమే కాక, డచ్ పార్లమెంట్ లో అయితే ముస్లిములను, హిహాబ్, మస్జిద్ లను నిషేధించాలని ఇస్లాంను బ్యాన్ చెయ్యాలని తీవ్రంగా గళమెత్తాడు! అంతేకాక, ఇస్లాం ఓ ప్రమాదకర మతమని, ప్రవక్త ముహమ్మద్ ఓ క్రిమినల్, ఖురాన్ ఓ విషపూరిత పుస్తకమని సైతం ప్రచారం కూడా చేశాడు! ఇస్లాం పట్ల ధ్వేషంతో “ఈవిల్ ఇన్ ఇస్లాం” అన్న పేరుతో పుస్తకం రాయాలని మొదలెట్టిన ప్రయాణంలో అతను ఇస్లాం గురించి లోతైన పరిశీలన చెయ్యటం మొదలెట్టాడు. ఆ క్రమంలో ఖురాన్ ను, ప్రవక్త ముహమ్మద్(స) జీవిత చరిత్ర పూర్తిగా చదివాడు. అతని ఆ పరిశీలనే చివరకు 2015 సం.లో అతన్ని ఇస్లాం స్వీకరించేలా చేసింది. చివరకు “ఫ్రమ్ క్రిస్టియానిటీ టూ ఇస్లాం ఇన్ టైమ్స్ ఆఫ్ సెక్యూలర్ టెర్రర్” అన్న టైటిల్ తో తాను ఇస్లాంలోకి ఎలా మారాడో వివరిస్తూ తన పుస్తకాన్ని పూర్తి చేశాడు.
నేడు కేవలం గాసిప్స్ పై ఆధారపడి ఇస్లాంను విమర్శిస్తున్న చాలా మంది పై సంఘటనలో “జోరమ్ వాన్ క్లావెరెన్” లాంటి వారే.
ఇక తీవ్రవాద సంస్థల విషయానికొస్తే.. 80 వ దశకాల్లో రష్యా, ఆఫ్ఘనిస్తాన్ ను దురాక్రమణ చెయ్యాలనుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో అల్లరి మూకలకు ఆయుధాలిచ్చి టెర్రరిస్టు గ్రూపులను తయారుచెయ్యటం మొదలెట్టిందే అమెరికా. అందులో నుండి పుట్టుకొచ్చిన సంస్థలే.. అల్-ఖైదా, ఐ.ఎస్.ఐ.ఎస్ వగైరా అనేక ఉగ్రవాద సంస్థలు! ఈ ఉగ్రవాద సంస్థల లక్ష్యం ఇస్లాం స్థాపించటమూ కాదు, పైకి ముస్లిం పేర్లు పెట్టుకున్నప్పటికీ ఇస్లాం ప్రకారం వారు నిజ ముస్లిములూ కారు. వారు చేసేది “జిహాద్” అంతకన్నా కాదు. కానీ, వీరు చేసే చిల్లర పనుల్ని మటుకు మీడియా “ఇస్లామిక్ టెర్రరిజం” అనే పనికిమాలిన పదజాలంతో పరిచయం చేస్తూ ఉంటుంది.
ప్రపంచ వ్యాప్త ముస్లిం పండిత వర్గం ఎప్పుడో అల్-ఖైదా, ఐ.ఎస్.ఐ.ఎస్ వగైరా ఉగ్రవాద సంస్థలకు ఇస్లాంకు సంబంధం లేదని ఫత్వాలు సైతం జారీ చేశారు.
మీడియా చూపుతున్న క్రొత్త ఇస్లాం!
అమెరికా, యూరప్ దేశాల పెంపుడు మీడియా కారణంగా ముస్లిం పెట్టుకుని కొందరు చేస్తున్న తీవ్రవాదమే ‘టెర్రరిజం’ అనబడుతుందన్న భావన ప్రజల్లో సర్వసామాన్యం అయిపోయిందన్న విషయాన్ని ఇక్కడ ఒప్పుకోక తప్పదు. నిజానికి రాజకీయ, ఆర్ధిక లబ్ది కోసమో, ఇతరులను దోచుకోవాలనో, దురాక్రమణ చెయ్యాలనో చేసే ప్రతీ దౌర్జన్యమూ టెర్రరిజమే అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే..
అమెరికా హీరోషిమా-నాగసాకిపై అణుబాంబులు వెయ్యటం నుండి.. ఇరాఖ్ పై బాంబుల వర్షం కురిపించి అన్యాయంగా లక్షల మంది ప్రాణాలను తీసుకోవటం నుండి, రష్యాలో కమ్యూనిజం స్థాపన పేరుతో లెనిన్, స్టాలిన్, మావోల కారణంగా మిలియన్ల కొద్ది ప్రజలు చంపబడటం వరకు జరిగింది టెర్రరిజమే! బ్రిటిష్ రెండువందల సంవత్సరాలు భారతదేశంపై చేసింది టెర్రరిజమే, ప్రపంచయుద్ధాల్లో లక్షల మందిని చంపటం టెర్రరిజమే, గుజరాత్ లో జరిగిన దాడులూ టెర్రరిజమే, ఇశ్రాయిల్ పాలస్తీనాపై దాడులు చేసి లక్షల మందిని చంపటమూ టెర్రరిజమే. నిజానికి ప్రపంచవ్యాప్త ఉగ్రవాద దాడుల్లో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన వారిలో అత్యధికంగా ముస్లిములే ఉన్నారని పరిశోధనాత్మక నివేదికలు చెబుతున్నాయి.
అన్యాయంగా ప్రజల ప్రాణాలు తీసుకునేవారు ముస్లిం పేర్లు పెట్టుకున్నా, హిందూ, క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా టెర్రరిజమే అవుతుంది. అది ఘోరమైన నేరమే అవుతుంది.
కానీ మీడియా నేడు ఇలాంటి టెర్రరిస్టు గ్రూపుల్లో ముస్లిం పేర్లు పెట్టుకున్న వారు ఎక్కడైనా తీవ్రవాదం చేస్తే దాన్ని “ఇస్లామిక్ టెర్రరిజం” అనే అర్థం లేని పదజాలం ఉపయోగించటంతో ముస్లిమేతరుల్లో చాలా మంది ఇస్లాంను అదే దృష్టితో చూస్తున్నారు.
కానీ, ఎవరైతే ఖురాన్, ప్రవక్త ముహమ్మద్ (స) బోధల్ని లోతుగా పరిశీలించి చదువుతున్నారో వారు ఇస్లాం యొక్క వాస్తవ కోణాన్ని తెలుసుకోగలుగుతున్నారు.
కాబట్టి “Don’t judge a book by its cover” అన్న ఇంగ్లీషు సామెత మనకు తెలిసిందే. వస్తువులనైనా, మనుషుల్నైనా చివరకు మతాన్నైనా పైపైన చూసి అంచనాకు రాకూడదు.
ప్రతీదీ వాస్తవ రూపంలో పరిశీలించాలి. “ఫ్యాక్ట్ చెక్” అన్ని కోణాల్లోనూ చెయ్యాలి. తప్పితే మన స్వంత భావాలను సంతృప్తి పరిచే వ్యక్తుల రాతలను, మాటలను మాత్రమే తీసుకుని, సత్యాలను ఉద్దేశపూర్వకంగా చూడకుండా దాటవేసి దేన్నైనా విమర్శిస్తే మటుకు అవి గుడ్డి విమర్శలే అవుతాయి. నేడు ఇస్లాంను విమర్శిస్తున్న వారంతా ఈ కోవకు చెందినవారే.
ఇస్లాం విషయంలో విమర్శకులు చూడని కోణం
